వికీపీడియా నుండి
(
రుద్రమదేవి నుండి దారిమార్పు చెందింది)


రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి[1]. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు[2]. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.
ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడ వివరముగా వ్రాశాడు[3].
- ↑ ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007
- ↑ Rudrama Devi, the Female King: Gender and Political Authority in Medieval India, In: Syllables of Sky: Studies in South Indian Civilization, ed. David Schulman, 1995; pp.391-430, Oxford Unversity Press, Delhi
- ↑ The Travels of Marco Polo: The Complete Yule-Cordier Edition, Translated by Henry Yule, 1993,Courier Dover Publications; ISBN 0486275876