తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము

వికీపీడియా నుండి
NannayyaBaTTu.jpg
తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
తెలుగు సాహిత్యం కాలరేఖ
నన్నయకు ముందు క్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము 1000 - 1100
శివకవి యుగము 1100 - 1225
తిక్కన యుగము 1225 - 1320
ఎఱ్ఱన యుగము 1320 – 1400
శ్రీనాధ యుగము 1400 - 1500
రాయల యుగము 1500 - 1600
దక్షిణాంధ్ర యుగము 1600 - 1775
క్షీణ యుగము 1775 - 1875
ఆధునిక యుగము 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుతెలుగు పదకవిత
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

తెలుగు సాహిత్యంలో క్రీ.శ. 1000 వరకు ప్రాఙ్నన్నయ యుగము అంటారు. తెలుగులో మొదటి కావ్యం మదాంధ్ర మహాభారతం అనీ, అది ఆరంభించిన నన్నయ ఆదికవి అనీ సార్వత్రికమైన అభిప్రాయం. ఒక్కమారుగా అంత పరిణతి చెందిన కావ్యం ఆవిర్భవించడం అసాధ్యమనీ, అంతకు ముందే ఎంతో కొంత సారస్వతం ఉండాలనీ సాహితీ చరిత్రకారులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఏ విధమైన లిఖిత సాహిత్యం గాని, లిఖిత సాహిత్యం ఆధారాలు గాని లభించనందున తెలుగు సాహిత్యావిర్భావానికి నన్నయనే యుగపురుషునిగా అంగీకరిస్తారు. కనుక నన్నయకు పూర్వకాలాన్ని ప్రాఙ్నన్నయ యుగం అని వ్యవహరిస్తున్నారు.


ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది[1].


ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: [2]

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి

ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:

అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

కాళ్ళకూరు నారాయణరావు తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము"లో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు.[3]

  • అజ్ఞాత యుగము: క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు:ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడా ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న కాలం
  • లబ్ధ సారస్వతము: క్రీ.త. 500 నుండి 1000 వరకు.:శాసనాల వంటిని కొన్ని లభించిన కాలం


విషయ సూచిక

[మార్చు] క్రీ.పూ. 28 ముందు

ఈ కాలంలో "ఆంధ్ర" అనే పదం మాత్రం కొద్ది ప్రస్తావనలలో ఉంటున్నది గాని "తెలుగు" అనే పదం ఎక్కడా లభించడంలేదు. అంతే కాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కాని భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు. అయితే ఆంధ్రులు, తెలుగులు కలసిన ఫలితంగా ప్రస్తుత భాష రూపు దిద్దుకొన్నది గనుక "ఆంధ్ర దేశం" ప్రస్తావననే కొంత వరకు తెలుగు భాషకు చెందిన ప్రస్తావనగా భావిస్తున్నారు.


తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే మూడు పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణా గోదావరీ ప్రాంతం తెలుగు దేశమని పిలువబడేదని, ఆంధ్రుల పాలన తరువాత ఆంధ్ర దేశమయ్యిందనీ చరిత్రకారుల అభిప్రాయం. నన్నయభట్టు కాలం నాటికే తెలుగు, ఆంధ్రము అనే పేర్లు ఉన్నాయని నిదర్శనాలున్నాయి. తెలుగుభాష ద్రావిడ జన్యమా, లేక సంస్కృత ప్రాకృత జన్యమా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కాల్డ్‌వెల్ వంటివారి వాదన ప్రకారం తమిళ, మళయాళ, కన్నడ భాషలలాగా తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. క్రమంగా మిగిలినవానికి భిన్నంగా పరిణమించింది. చిలుకూరు నారాయణరావు వంటివారి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష సంస్కృత ప్రాకృత జన్యం. ఏమైనా తెలుగు భాష తక్కిన (మాతృక) భాషలనుండి విడివడి ఏ దశలో పరిణమించిందో చెప్పడం సాధ్యం కావడంలేదు.[4]


మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోనిదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది. అయితే ఇది జాతికి చెందిన ప్రస్తావన మాత్రమే కనుక తెలుగు భాషకు సంబంధం లేకపోవచ్చును. నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు మరియు శబరులవంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా, ప్రధానంగా భాషాపరంగా, కలసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకొంది. మహాభారత యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలనా, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలనా క్రమంగా ఆంధ్రులు దక్షిణాపధానికి వలస వచ్చారు. యక్షులు భట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిరనివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు.[5]


క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలంనుండి ఈ దక్షిణాపధంలో అనన్యమయన ఆదరణ లభించింది. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చినవారుకారు. బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు. అయితే అప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందిఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించినా భాష మాత్రం తెలుగే నిలిచింది[6]. ఈ నేపధ్యంలోనే ఆంధ్రజాతి, తెలుగు భాష రూపు దిద్దుకొన్నాయి. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు.


పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో - భాషనుబట్టి జాతికి పేరు రావడం చరిత్ర ధర్మం కాదు. జాతిని బట్టే భాషకు వారి భాషగా పేరు వస్తుంది. భాష, జాతి, సంస్కృతి అన్యోన్యాశ్రయములు. భాష పుట్టిన కొన్ని శతాబ్దాల తరువాత గాని ఆ భాషలో వాఙ్మయం పుట్టదు. [7] ఇలా చూస్తే క్రీ.శ. 1000 ప్రాంతంలో పరిణత సాహిత్యం ఆవిష్కరింపబడిన తెలుగు భాష అంతకు పూర్వం ఎన్నో శతాబ్దాలనుండి వ్యవహారంలో ఉండి ఉండాలి.


క్రీ.పూ. 3వ శతాబ్ధిలోనిదైన బుద్ధఘోషుని వినయపిటకం వ్యాఖ్యలో "అంధక అట్టకధ" ఆంధ్ర భాషలోనిదైతే అప్పటికే ఆంధ్ర భాష తక్కిన భాషలనుండి వేరుగా గుర్తింపబడి ఉండాలని భావిస్తున్నారు. క్రీ. పూ. (రెండవ శతాబ్దం?) వాడైన భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు శౌరసేనినిని ఉపయోగించాలని వ్రాశాడు. పై కారణాల వలన "ఆంధ్ర భాష" లేదా "తెలుగు భాష" క్రీ.పూ. నాటికి ప్రత్యేకమైన భాషగా ఏర్పడి ఉండాలని ఊహించడానికి వీలవుతుంది కాని ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కావడం లేదు.[4]


[మార్చు] భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం

"తెలుగు భాష వయస్సెంత?" అనే వ్యాసంలో సురేష్ కొలిచాల క్రిందివిధంగా తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేశాడు [8] ---

తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని--

  1. వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
  2. తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
  3. క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.

పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!

ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.

[మార్చు] క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు (అజ్ఞాత యుగం)

క్రీ.పూ. 500 - క్రీ..త. 500 మధ్య కాలంలో జరిగిన జైన బౌద్ధ మతోన్నతులు, పతనాలు అప్పటి సాహిత్యంపై గాఢమైన ప్రభావం కలిగి ఉండాలని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ కాలానికి సబంధించిన కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

  • ఇప్పటికి తెలుగు భాష లిపి ప్రత్యేకంగా (బ్రాహ్మీ లిపినుండి వేరుగా) అభివృద్ధి అయిన తార్కాణాలు లేవు. "లిపికి ముందే సారస్వతము ఉండవచ్చును గాని అది కేవలం గ్రామ్య పదములో, వీరుల పాటలో, యక్షగానములో, మోహపుం గాసట బీసట యల్లికలో యై శృతి పరంపరాగతములై యుండును. లిపి మూలమున వాఙ్మయము విస్తారముగా వర్ధిల్లుటకు వీలున్నది. అందునను తెనుగున వాఙ్మయము లిపి నిర్మాణానంతరమే ఆరంభమై యుండును"[3]. కనుక ఈ కాలంలో తెలుగు సారస్వతం లేదనే భావించవచ్చును.
  • శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషయే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదు. ఆనాటి రాజభాష ప్రాకృతము. పండిత భాష సంస్కృతము. కనుక తెలుగు సాహిత్యం అభివృద్ధి కావడానికి పెద్దగా ప్రోత్సాహం లభించకపోయి ఉండవచ్చును.
  • బౌద్ధ జైన మతాలు విలసిల్లిన కాలలో ఎంతో కొంత సాహిత్యం లిఖితంగా కాని, మౌఖికంగా గాని ఉండి ఉండాలి. అయితే తరువాత విజృంభించిన శంకరవాదము, వీరశైనం కాలంలో మతోద్రేకాల కారణంగా బౌద్ధ జైన మత సంస్థల నాశనంతో పాటు ఎంతో సారస్వతం కూడా దగ్ధమైయుండవచ్చును. మతోద్రేకము ఎంతకైనా దారి తీయగలదు. కాకుంటే నన్నయ భారతం వంటి ఉద్గ్రంధం ఒక్కమారు ఆకసంనుండి ఊడిపడదు కదా? జైనపండితులు ఆ సమయంలో కన్నడ దేశానికి తరలిపోయి ఉండవచ్చును. [3]
  • ప్రాచీనాంధ్ర వాఙ్మయం లభించకున్నాగాని పూజ్యపాదుడు, పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి మొదలైన తెలుగువారు కన్నడ సాహిత్యానికి చేసిన సేవలను బట్టి చూస్తే తెలుగు భాషలో సాహిత్య పరంపర ఉండదనుకోవడం అసహజంగా కనిపిస్తుంది. ఆంధ్రులు కవులుగా నున్నయెడల ఆంధ్రమున కవిత్వము లేదనుట ఆశ్చర్యం. అయితే అప్పటిమత ఘర్షణలలో "విజయం" సాధించిన స్థానిక బ్రాహ్మణులకు సంస్కృతమే ఆదరణీయంగా ఉండేది గనుక తెలుగు లిఖిత సాహిత్యం పూర్తిగా నిరాదరణకు గురై ఉండవచ్చును.[3]
క్రీ.పూ. 28

పూజ్యపాదుడనే కన్నడ(ఆంధ్ర)కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం జైన సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం తెలుగు భాషకు సంబంధించినది కావలెనని కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయం. అందుకనే క్రీ.పూ.28 నుండి ఒక యుగంగా ఆ రచయిత పరిగణించాడు.[3]. అంటే కొన్ని రచనలు అప్పటికే తెలుగులో ఉండి ఉండాలని, తరువాత బ్రాహ్మణ మతదౌర్జన్యాల సమయంలో అవి నష్టమయ్యాయని అనుకోవచ్చును. వేగినాడు వీడిపోవుచున్న జైనులతోపాటు అప్పటికున్న తెలుగు సాహిత్యంకూడా ఆంధ్రావనిని వీడిపోయిందని ఆ రచయిత భావించాడు[9]. పూర్వాంధ్రము "తెళుగు"గా మార్పులను చెందియుండవచ్చును.

క్రీ.శ. 1వ శతాబ్దం

క్రీ.శ. 1వ శతాబ్ధిలో గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. అందులో పైఠాన్ నగరంలో జరిగిన సంవాదంలో అతను సంస్కృత, ప్రాకృత, దేశ్య భాషలను పరిహరించినట్లు ఉన్నది. ఆ దేశ్య భాష ఏదో స్పష్టంగా తెలియడంలేదు కాని అప్పటికి ఆధునిక మహారాష్ట్ర భాష ఏర్పడలేదు. పైఠాన్ అప్పటి ఆంధ్ర సామ్రాజ్యానికి ఒక రాజధానిగా ఉండేది. కనుక ఆ దేశ్యభాష తెలుగు అనుకోవడానికి అవకాశం ఉంది.[4]

క్రీ.శ. 1వ శతాబ్ధిలోనే హాలుడు గాధా సప్తశతి అనే ప్రాకృత కావ్యాన్ని సంకలనం చేశాడు. ఆ గాధలను రచించిన కొందరు ఆంధ్రులై యుండడంవల్లనేమో అందులో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. - అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ వంటివి.

క్రీ.శ. 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు నిర్మాణం జరిగిన అమరావతీ స్తూపంలో ఒక రాతి పలక మీద నాగబు అనే తెలుగు పదం ("నాగంబు" రూపాంతరం) కనిపిస్తున్నది. అది ఒక వాక్యంలో భాగంగా కాక వేరుగా ఉంది. మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదం ఇదే

క్రీ.శ. 200 - 500

శాతవాహనుల తరువాత ఏలిన ఇక్ష్వాకులు (210 - 300), బృహత్పలాయనులు (300 - 350), అనందగోత్రులు (290 - 620), శాలంకాయనులు, విష్ణుకుండినులు (400 - 600) , పల్లవులు (260 - 400 - 550) కాలానికి చెందిన శాసనాలు అన్నీ సంస్కృత, ప్రాకృత భాషలలోనే ఉన్నాయి. కాని వాటిలో తెలుగు భాషలోనివి అనిపించే పేర్లు, పదాలు, ప్రత్యయాలు కనిపిస్తున్నాయి - ఊరు, పర(పఱ్ఱ), కొన్ఱ (కొండ), చెరువు, వంటి పదాలతో ముగిసేవి - ఉదాహరణకు వ్యక్తుల పేర్లు - గోలశర్మ, కొట్టిశర్మ, దొడ్డి స్వామి; గ్రామాల పేర్లు - కురువాడ, చిన్నపురి, చెఞ్చెరువు, తెల్లవల్లి, పెరువాటము వంటివి. దీనినిబట్టి ఆ కాలానికే ఈ ధ్వనులు ఉన్న ద్రావిడ భాష (తెలుగు అనుకొందాము) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.[4]


కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయంలో పూర్వాంధ్రభాష (తెళుగు) లక్షణాలు ఇవి కావచ్చును[3] -

  1. ఆర్యావర్తంలో సామ్రాజ్యం స్థాపించి సప్తశతివంటి ప్రాకృత గ్రంధాలు వ్రాసిన "కర్ల తెల్లంగు" రాజుల మాతృభాష కనుక శుద్ధ సంస్కృతంకంటే ప్రాకృత పదాలే ఎక్కువగా ఉండవచ్చును.
  2. అప్పటికి బౌద్ధ జైన ప్రాబల్యమే తెలుగు సీమలో అధికం గనుక సారస్వతం కూడా వారిదే అయిఉండవచ్చును.
  3. అటువంటి పూర్వాంధ్రం నేటి ఆంధ్రంగా మారేసరికి 14,814 తత్సమ శబ్దాలు చేరాయి. ఉన్న 12,337 దేశ్య పదాలలో తద్భవాలు 2,000. తురక ఇంగ్లీషు పదాలు 1,500. రూపములు మారి వికృతి చెందిన దేశ్యములే అనిపించేవి దాదాపు 4,000. కనుక శుద్ధ దేశ్యపదాలు 4,000 - 5,000 మధ్య ఉండవచ్చును. ఈ నాలుగు వేల పదాలు లోక వ్యవహారానికి చాలు.

[మార్చు] క్రీ.త. 500 నుండి 1000 వరకు (శాసనాధారాలు)

సింధు లోయ నాగరికత లిపి ఇంతవరకు సరిగా చదువబడలేదు. వేదసూత్ర వాఙ్మయం కేవలం మౌఖికమో, లేక అక్షర బద్ధం కూడా అయిందో తెలియరావడంలేదు. కనుక అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది.[10] కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశొకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.


తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) , విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడ తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు. [10]

6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపధ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. [6] వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.[10]


ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము క్రీ.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీస పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.[4] వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.


[మార్చు] కొన్ని ముఖ్యమైన శాసనాలు

ఈ ప్రధమ కాలం (500-1000) వాటి కొన్ని శాసనాలు జాబితా ఇక్కడ ఇవ్వబడింది. [10]

  • ధనంజయుని కలమళ్ళ శాసనము - షుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221
..........
కల్ము[తు]రా
జు ధనంజ
యుదు రేనా
ణ్డు ఏళన్
చిఱుంబూరి
రేవణకాలు [పం]
పు చెనూరుకాజు
అఱి కళా ఊరి [-]
ణ్డవారు ఊరి ... ...
... ....
..... ... పఞ్చ [మ]
హా పాతకస
కు 

ఎరికల్ మహారాజు ధనంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును - అని కావచ్చును.


  • పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
  • సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
  • అరకట వేముల శాసనము - 8వ శతాబ్దం - ప్రొద్దుటూరు తాలూకా -
  • వేల్పుచర్ల శాసనము - జమ్మలమడుగు తాలూకా -
  • గణ్డ త్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము - రాయచోటి తాలూకా -
  • కొండపఱ్తి శాసనం - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
  • కొరవి శాసనం - 935 - వరంగల్ జిల్లా మానుకోట (మహబూబాబాదు)
  • పణ్డరంగుని అద్దంకి శాసనము - 770 - అద్దంకి
  • యుద్ధమల్లుని బెజవాడ శాసనము - 930 - విజయవాడ
  • జినవల్లభుని కుర్క్యాల శాసనము - 945 - కరీంనగర్ జిల్లా కుర్క్యాల
  • బణపతి దీర్ఘాసి శాసనము - 997 - కళింగపట్నం
  • విరియాలవారి గూడూరు శాసనము - 1124 - జనగామ తాలూకా, గూడూరు

[మార్చు] శాసనాలలో భాషా విశేషాలు

అప్పటి శాసనాలలో వాడిన భాషకు, ఇప్పటి భాషకు గణనీయమైన భేదాలున్నాయి. ఇదాహరణకు కొన్ని పదాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.[11] [3] [10]

  • "న" కు బదులుగా "ణ", "ర" కు బదులుగా "ఱ" తరచు వాడేవారు - ఆణతి (ఆనతి), చెఱువుళు (చెరువులు)
  • బహువచనానికి "న్ఱు" తరచు వాడేవారు - మగన్ఱు, ఱచ్చువాన్ఱు
  • కొన్ని పదప్రయోగాలు - రటకుట్టు (రాష్ట్రకూట), రట్టగుడి (రెడ్డి), చంద్రాయత్తకాలము (ఆచంద్రార్కము)
  • "ఱ", అక్షరం బదులు తమిళంలోని అక్షరాన్ని పోలిన మరొక అక్షరం వాడేవారు. 13వ శతాబ్దిలో ఈ అక్షరం అంతరించి కన్నడంలో "ళ"గాను, తెలుగులో "డ"గాను మార్గపు చెందింది.
  • "సున్న" కు బదులు అనునాసికాలు అధికంగా వాడేవారు - కట్టిఞ్చె (కట్టించె), పురమ్బు (పురంబు)
  • నిండు సున్నలే గాని అరసున్నలు లేవు
  • కొన్ని పదాలు రూపు మాసినవి - పంగము, పన్నన
  • కొన్ని పదాలు రూపు మారాయి - ప్రువ్వులు (పుర్గులు), రట్టళ్ళు (రెడ్లు), కుట్రు (గుట్ట)
  • ము"కారాంతం కంటె "బు, ‌బు, వు"లు ఎక్కవగా కనిపిస్తాయి - ప్రధమంబు, నాగబు
  • విభక్తుల వాడకం ఇప్పటికంటె భిన్నంగా ఉండేది. ఒక క్రమపద్ధతి కనిపించదు - నేల యిచ్చిరి (నేలను ఇచ్చారు), నాకు బణి సేసిన (నా కోసం పని చేసిన), అంగంబునన్ (అంగంతో), రాజులాకున్ (రాజులకు, రాజుల కోసం)
  • సంఖ్యా వాచకాలు ఇప్పటికంటే భిన్నంగా, తక్కిన ద్రవిడ భాషలకు దగ్గరగా ఉండేవి - ఒరు, రెణ్డు, మూన్ఱు, మూణ్డు, నాల్కు, ఎణుంబొది, బారస (12), ఇరువాది
  • బహువచనానికి "బుళ్" వంటి ప్రత్యయాలు అధికంగా వాడేవారు - సంవత్సరమ్బుళ్, రాజుల్ ఎవ్వర్
  • వాక్య నిర్మాణం సరళంగా కనిపిస్తుంది. అంతగా సంబంధం లేకుండా వాక్యాలు కలిపేవారు. విరామ చిహ్నాలు లేవు. - ఊరి స్వాముల్ ఇచ్చినస్తితి, వక్రంబు వచ్చునన్ఱు, పాతకం జేసినవారి లోకంబునున్ఱువాన్ఱు, వైదుంబుళచేతంబట్టకట్టబడి యేలి
  • ఏళుచున్ఱి, నడపంగల, రక్షిమ్పనువలయున్, కలరేనియు - వంటి క్రియా పదాలు వాడారు.
  • వూళ్ళపేర్లు - మ్లావిండి, విత్పఱ్ఱు, నన్దిగామ, అమ్మలపూణ్డి, రావిరేవు, పామ్బఱ్ఱు
  • వ్యక్తుల పేర్లు - కొమ్మన, మారయ్య, దేవణ్డి, పడాలు, విద్దమయ్య, మీనమ్మ, ద్రొణశర్మ,
  • మరికొన్ని పదాలు - డఙ్కలపూణ్డి, సమరసఙ్గట్టణ, రాజ్యంఞ్చేయ (రాజ్యం చేయ) , కుఞ్చెణ్డు (కుంచెడు), శ్రీయ్తెయరి కొడుకు మరమ (శ్రీ అయితయూరి కొడుకు మారమ?), నూట్టామ్బది (నూట యాభై), కాద్లివ్ర్యేంగు (కాడ్లవేగు?), సఞ్చుత్తుదిగున్ (సంయుక్తుండగున్), పొడిచి పడియె (పోట్లాడి చనిపోయె), క్ఱిన్ధన్ (క్రిందన్), పులొంబన (పొలములో), మాఱ్పిడగు (శత్రువులకు పిడుగువంటివాడు)
  • వేయి వరకు అంకెలు వాడారు.

[మార్చు] నన్నయకు ముందు పద్య సాహిత్యం?

చాళుక్యులకు పూర్వమే తెలుగు వాడుక భాష అని, నన్నయకు ముందే పద్యం ఉండేదని పైని చెప్పిన శాసనోదాహరణల వల్ల ఖచ్చితంగా భావించవచ్చును. పద్యము, ఛందస్సు ఉన్న భాషకు వ్యాకరణం, సాహిత్యం ఉండవనేది నమ్మరాని విషయం. అయితే లిఖిత సాహిత్యం ఇంతవరకు ఏమీ లభించలేదు. నిశ్చయమైన ఆధారాలు కూడా లేవు. అయితే కొన్ని ప్రస్తావనల ద్వారా అంతకు ముందటి సాహిత్యం గురించి ఊహాగానాలున్నాయి. [4]

నన్నెచోడుడు తన కుమార సంభవంలో ఇలా వ్రాశాడు.

మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవిత పుట్టించి తెనుం
గును నిల్పి రంధ్రవిషయం
బునఁ జన జాళుక్యరాజు మొదలగు పలువుర్

ఈ పద్యంలో మార్గ కవిత ఏమిటి? దేశి కవిత ఏమిటి? అన్న విషయంపై సాహిత్యకారులలో పలు అభిప్రాయాలున్నాయి. ఏమయినాగాని చాళుక్య రాజులకు ముందే ఒకవిధమైన కవిత ఉందని స్పష్టంగా తెలుస్తున్నది.


భక్తులు తుమ్మెద పదములు, వెన్నెల పదములు, ప్రభాత పదములు పాడుచుండిరని పండితారాధ్య చరిత్రములో పాల్కురికి సోమనాధుడు వ్రాశాడు. ఇన్ని రకాలైన పదాలుండడం సంపన్నమైన సాహిత్యానికి ఒక సంకేతం. పాల్కురికి సోమనాధుడే తన బసవ పురాణమునకు "ఆతత బసన పురాతన భక్త గీతార్ధ సమితియే మాతృక" అని వ్రాశాడు. అంటే అంతకు పూర్వమే అనేక విధాలైన గీతాలు ప్రచారంలో ఉండినాయన్నమాట.


11వ శతబ్దంలో రచింపబడిన "యాప్పిరంగలమ్" అనే తమిళ ఛందోగ్రంధంలో ఆ రచయిత "వాంచియార్ వడఘు ఛందవుమ్" (వాంచయ్య వ్రాసిన తెలుగు ఛందస్సు - "వడగు" భాష అనగా తెలుగు భాష) అని పేర్కొన్నాడు. అంటే అప్పటికే తెలుగులో ఒక ఛందోగ్రంధం లేదా ఛందో నియమం ఉండేదన్నమాట.

ఇవన్నీ చూచాయగా తెలుగు సాహిత్యాన్ని సూచించే ప్రస్తావనలే కాని లిఖిత వాఙ్మయానికి ఖచ్చితమైన ఆధారాలు కావు. కనుకనే తరువత వచ్చిన నన్నయ ఆదికవిగా ప్రసిద్ధుడయ్యాడు.

[మార్చు] యుగావలోకన

ప్రాఙ్నన్నయ యుగం అధ్యాయాన్ని ముగిస్తూ ద్వా.వా.శాస్త్రి ఇలా వ్రాశాడు[11] - "మొత్తంమీద నన్నయకు ముందు తెలుగు భాషా సాహిత్యాలున్నాయి. మౌఖిక సాహిత్యం ఎక్కువగా ఉంది. శాసన కవిత వాడుకలో ఉంది. తెలుగు భాష జన వ్యవహారంలో బాగా ఉంది. అయితే గ్రంధ రచనాభాష రూపొందలేదనవచ్చును. అలా రూపొందడానికి అనువైన పరిస్థితులు లేవు. సంస్కృత ప్రాకృతాలపై గల మమకారమే అందుకు కారణం కావచ్చును. క్రీ.పూ. 200 నుండి క్రీ.శ. 600 వరకు తెలుగు భాషకు ఆరంభ దశగాను, 600 నుండి 900 వరకు బాషా వికాస దశగాను, 900 నుండి సాహిత్య వికాస దశగాను చెప్పవచ్చును."


ఇదే యుగాధ్యాయాన్ని ముగిస్తూ, నన్నయ యుగ రచనకు నాందిగా కాళ్ళకూరు నారాయణరావు ఇలా వ్రాశాడు [3] - "సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును "శ్రీవాణీ"యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి "నన్నియభట్టు"ను చూతముగాక రండు." (నందంపూడి శాసనంలో 'నన్నియభట్టు' అని ఉంది).

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. తెలుగు ప్రాచీనత: హిందూలో వ్రాసినది - The Archaeological Survey of India (ASI) has joined the Andhra Pradesh Official Languages Commission to say that early forms of the Telugu language and its script indeed existed 2,400 years ago. D. Jithendra Das, Superintending Archaeologist, ASI, Hyderabad Circle, cited three inscriptions discovered at Bhattiprolu in Guntur district that contained several Telugu roots or words, as “indisputable evidence” in support of the finding. All these inscriptions date back to 400 B.C. Telugu language was found more refined in the inscriptions found at Kantamnenivarigudem, Guntupalli in West Godavari district, and Gummadidurru and Ghantasala in Krishna district.
  2. డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  5. ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర
  6. 6.0 6.1 బి.ఎస్.ఎల్._హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - ప్రచురణ:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  7. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  8. "తెలుగు భాష వయస్సెంత?" - సురేష్ కొలిచాల వ్యాసం ఈమాట వెబ్ పత్రిక - నవంబర్ 2005 సంచికలో ప్రచురితమైంది. ఈ వ్యాసం వ్రాయడానికి రచయిత పేర్కొన్న ఉపయుక్త గ్రంధాలు - (1). Dravidian Languages Bhadriraju Krishnamurti Cambridge University Press (2003) - (2) Comparative Dravidian Linguistics: Current Perspectives Bhadriraju Krishnamurti (2001) - (3) ద్రావిడ భాషలు పి. ఎస్. సుబ్రమణ్యం (1994) - (4) History and Geography of Human Genes Luigi Luca Cavalli-Sforza, Paolo Menozzi, Alberto Piazza (1994) - (5) భాష, సమాజం, సంస్కృతి భద్రిరాజు కృష్ణమూర్తి (2000) - (6) Journey of Man: A Genetic Odyssey Spencer Wells (2002)
  9. కాళ్ళకూరు నారాయణరావు రచన 1936లో ముద్రింపబడింది. తరువాతి రచయితలైన పిగళి లక్ష్మీకాంతం, దివాకర్ల వేంకటావధాని వంటివారు ఈ క్రీ.పూ. 28 అనే మైలురాయిని ప్రస్తావించలేదు.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 తెలుగు శాసనాలు - రచన: జి. పరబ్రహ్మశాస్త్రి - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు (1975) ఇంటర్నెట్ ఆర్చీవులలో లభ్యం
  11. 11.0 11.1 తెలుగు సాహిత్య చరిత్ర - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)

[మార్చు] వనరులు

  • కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె