భారతదేశ జాతీయ భాషలు
భారత్ లోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడుతారు. కనీసం 800 భాషలు, 2000 వరకు యాసలు గుర్తించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు గాను హిందీ, ఇంగ్లీషు భాషలను వాడాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. వివిధ రాష్ట్రాలు తమతమ అధికార భాషలను వాడుతాయి. కేంద్ర ప్రభుత్వంతో సంపర్కించేందుకు ఇంగ్లీషు వాడుతాయి. ఉదాహరణకు, కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హిందీ, ఇంగ్లీషుల్లో ఉత్తరాలు రాస్తే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషుల్లో రాస్తుంది. హిందీ, ఇంగ్లీషులతో కలిపి భారత్ లో 24 అధికార భాషలు ఉన్నాయి. అధికార భాషా కమిషను వద్ద ఈ భాషలకు ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు పై భాషల్లో దేనిలోనైనా సమాధానాలు రాయవచ్చు.
భారత రాజ్యాంగం లోని 343 వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. 1950 లో రాజ్యాంగంలో పొందుపరచినట్లుగానే 1965 లో ఇంగ్లీషు అధికార భాష హోదాను (హిందీతో సమానంగా) కోల్పోయింది. ఆ తరువాత దాన్ని అదనపు అధికార భాషగా కొన్నాళ్ళపాటు కొనసాగించి, హిందీని పూర్తి స్థాయిలో అమలుపరచాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉండేది. అయితే, హిందీ అంతగా ప్రాచుర్యం పొందని దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడంతో జంట భాషల పద్ధతి ఇంకా కొనసాగుతూ వస్తోంది. శీఘ్ర పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రభావం మొదలైన వాటి కారణంగా ప్రభుత్వంలోనూ, బయటా కూడా దైనందిన కార్యకలాపాల్లో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దాన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అటకెక్కక తప్పలేదు.
విషయ సూచిక |
అధికార భాషలు - కేంద్ర ప్రభుత్వం [మార్చు]
కేంద్ర ప్రభుత్వం రెండు భాషలను ఉపయోగిస్తుంది:
- హిందీ: హిందీ రాష్ట్రాలతో వ్యవహరించేటపుడు హిందీ భాషను వాడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, చండీగఢ్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో కూడా హిందీ యే అధికార భాష.
- ఇంగ్లీషు: ఇతర రాష్ట్రాలతో వ్యవహరించేటపుడు కేంద్రం ఇంగ్లీషు వాడుతుంది.
భారత దేశ అధికార భాషలు [మార్చు]
హిందీ ఇంగ్లీషులు కాకుండా, 22 ఇతర భాషలను అధికార భాషలుగా భారత రాజ్యాంగం గుర్తించింది:
- అస్సామీ — అసోం అధికార భాష
- బెంగాలీ — త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధికార భాష
- బోడో భాష — అసోం
- డోగ్రి — జమ్మూ కాశ్మీరు అధికార భాష
- గోండి — గోండ్వానా పీఠభూమి లోని గోండుల భాష.
- గుజరాతీ — దాద్రా నాగరు హవేలీ, డామన్ డయ్యు, గుజరాత్ రాష్ట్రాల అధికార భాష
- కన్నడ — కర్ణాటక అధికార భాష
- కాశ్మీరీ — జమ్మూ కాశ్మీరు అధికార భాష
- కొంకణి — గోవా అధికార భాష
- మలయాళం — కేరళ, లక్షద్వీపాలు,మాహే రాష్ట్రాల అధికార భాష
- మైథిలి - బీహార్ అధికార భాష
- మణిపురి లేక మైతై — మణిపూర్ అధికార భాష
- మరాఠి — మహారాష్ట్ర అధికార భాష
- నేపాలీ — సిక్కిం అధికార భాష
- ఒరియా — ఒరిస్సా అధికార భాష
- పంజాబీ — పంజాబ్, చండీగఢ్ ల అధికార భాష, ఢిల్లీ, హర్యానాల రెండో అధికార భాష
- సంస్కృతం — ఉత్తరాఖండ్ లో రెండో అధికార భాష
- సంతాలీ - ఛోటా నాగపూర్ పీఠభూమి (జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్) రాష్ట్రాల్లోని భాగాలు) లోని సంతాలు గిరిజనుల భాష
- సింధీ - సింధీ ల మాతృభాష
- తమిళం — తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల అధికార భాష
- తెలుగు — ఆంధ్ర ప్రదేశ్, యానాం అధికార భాష
- ఉర్దూ — జమ్మూ కాశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికార భాష
ముఖ్యమైన ఇతర రాష్ట్రస్థాయి భాషలు [మార్చు]
జాతీయ స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందిన భాషలు ఇవి:
- కోక్‌బోరోక్ - త్రిపుర అధికార భాష
- మిజో - మిజోరం అధికార భాష
- ఖాసీ - మేఘాలయ అధికార భాష
- గారో - మేఘాలయ అధికార భాష
ప్రజాదరణ పొందిన ఇతర భాషలు [మార్చు]
50 లక్షలకు పైగా ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ అధికార హోదా లేని భాషలు ఇవి. వీటిని హిందీ లోని వివిధ రకాలుగా స్థానికులు భావిస్తారు.
బీహారీ భాషలు [మార్చు]
కింది మూడు బీహారీ భాషలకు 50 లక్షల మంది కంటే ఎక్కువ మాట్లాడే వారు ఉన్నప్పటికీ అధికార హోదా లేదు. ఒకప్పుడు వీటిని హిందీ యొక్క వేరువేరు మాండలికాలుగా భావించారు. కానీ బెంగాలీ, అస్సామీ, ఒరియా లాగానే ఇవి కూడా ఇండిక్ భాషల నుండి వచ్చినవేనని ఇటీవల తెలిసింది.
- ఆంగిక — బీహారు లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో మాట్లాడుతారు.
- భోజ్‌పురి — బీహార్
- మాగధి — దక్షిణ బీహార్ లో మాట్లాడుతారు
రాజస్థానీ [మార్చు]
రాజస్థాన్ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా రాజస్థానీ మాట్లాడుతారు. ప్రాంతం నుండి ప్రాంతానికి రాజస్థానీ యాస మారుతూ ఉన్నప్పటికీ, ప్రజలు ఈ భాషలో సంభాషించ గలుగుతారు. చాలా మంది హిందీ కూడా మాట్లాడగలరు. రాజస్థానీ, హిందీ రెండూ ఒకతే అని చాలా మంది అనుకుంటారు. రాజస్థానీలోని ప్రధాన రకాలివి:
- మార్వారీ — మార్వార్ (జోధ్‌పూర్, నాగౌర్, బికనీర్) ప్రాంతపు భాష.
- మేవారీ — మేవార్ (ఉదయపూర్, చిత్తూర్, కోట-బుందీ)ప్రాంతపు భాష.
- షెఖావతీ — షెఖావతి (సీకర్, చురు, ఝుంఝును) ప్రాంతపు భాష
ఇతర భాషలు [మార్చు]
- హర్యానవీ - హర్యానా కు చెందిన హిందీ మాండలికం
- భిలి (భిల్లు తెగవారు)
- గోండి (గోండు తెగవారు)
- కొడవ, కర్ణాటక లోని కొడగు జిల్లాలో మాట్లాడుతారు
- కచ్చి — గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో మాట్లాడుతారు
- తుళు — కర్ణాటక, కేరళ లోని తుళు ప్రజలు మాట్లాడుతారు.
- సంకేతి — కర్ణాటక, కేరళ, తమిళనాడు లలోని సంకేతి ప్రజలు మాట్లాడుతారు.
భారత రాజ్యాంగం 18 ప్రాంతీయ భాషల జాబితాను గుర్తించింది.
అల్పసంఖ్యాక భాషలు [మార్చు]
పది లక్షల కంటే తక్కువ మంది మాట్లాడే భాషలు ఇవి:
బయటి లింకులు [మార్చు]
- అధికార భాషా చట్టానికి సంబంధించి తేదీలవారీగా ఘటనా క్రమాన్ని వివరించే అధికారిక వెబ్సైటు
- భారతీయ భాషల గురించి సవివరమైన సమాచారాన్ని అందించే ప్రభుత్వ వెబ్సైటు
- భాషల జాబితా
- 26 భారతీయ భాషల్లో పదాలు పదబంధాలు
- భారతీయ భాషలు మాట్లాడే ప్రజల వివరాలు
- భారతీయ భాషల కొరకు సాంకేతికాభివృద్ధి
|
|||||||