ముచ్చివోలు
| ముచ్చివోలు గ్రామం | |
|---|---|
| జిల్లా: | చిత్తూరు |
| మండలం: | శ్రీకాళహస్తి |
| అక్షాంశాలు: | 13°47'56"N |
| రేఖాంశాలు: | 79.635043E |
| జనాభా (2001 లెక్కలు) | |
| మొత్తము: | |
| పురుషులు: | |
| స్త్రీలు: | |
| జనసాంద్రత: | /చ.కి.మీ / చ.కి.మీ |
| అక్షరాస్యత (2001 లెక్కలు) | |
| చూడండి: | |
| ఇతర వివరాలు | |
| పంటలు: | వరి, వేరుశనగ, చెరకు |
| నీటి వనరులు: | బావులు/చెరువులు |
ముచ్చివోలు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలానికి చెందిన అతి పెద్ద పంచాయితీలలో ఒకటి. శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుంచి ఆం.ప్ర.రా.రో.ర.సం. బస్సులలో సుమారు 30 నిమిషాలలో ఈ గ్రామానికి చేరుకొనవచ్చును. గ్రామ దేవత బైకమ్మ. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకీ విద్యావంతుల గ్రామంగా దీనికి పేరుంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. అంగన్ వాడీ నుంచి పదవ తరగతి వరకూ విద్యా సౌకర్యం ఉంది. మూడు ప్రధాన ఆలయాలు, మూడు చిన్న ఆలయాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి మొదలైన పండుగలే కాక పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, బైకమ్మ సంతర్పణ ఘనంగా నిర్వహిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
[మార్చు] బైకమ్మ
గ్రామానికి ప్రధాన గ్రామదేవత బైకమ్మ. ప్రతి యేటా వూరి చెరువుగట్టుపై ప్రతిష్టించబడిన ఈ దేవతకు భక్తి శ్రద్ధలతో సంతర్పణ జరుపుతారు. ఈ సంధర్భంగా గ్రామస్తులు చిన్న-పెద్ద, పేద-ధనిక, కుల-మత బేధాలు లేకుండా చెరువు గట్టునే సహపంక్తి భోజనం చేస్తారు. ఈ వేడుకలలో చిన్నా పెద్దా తేడాలేకుండా గ్రామస్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ దేవత గురించి ఒక ఉదాత్త మైన గాథ ఒకటి ఉంది. ఒకానొక కాలంలో ఈ ఊరి చెరువుకు చిన్న గండి పడి, క్రమేపీ పెద్దదవసాగింది. అది పెద్దదైతే ఊరంతా జలమయం కావడం ఖాయం. పంటలు పండక ఊరి జనం అంతా ఒక సంవత్సరం పాటు పస్తులు ఉండాల్సి వస్తుంది. గ్రామస్తులు తమ శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ గండి మూతపడలేదు. అప్పుడు గ్రామంలోని విజ్ఞుడొకడు ఎవరైనా గంగమ్మ తల్లికి ఆత్మార్పణ కావించుకొంటే శాంతిస్తుందేమోనని సలహా ఇచ్చాడు. ఊరి క్షేమాన్ని పరమావధిగా భావించిన బైకమ్మ ఆ గండికి అడ్డంగా నిలబడి పూడ్చివేయమని కోరింది. గండి మూతపడి పోయింది. అప్పటినుంచీ ప్రజలు ఆమె తమ గ్రామాన్ని కాపాడడానికి వచ్చిన దేవతగా భావించి పూజలు చేస్తుంటారు.
[మార్చు] వివరాలు
గ్రామ జనాభా సుమారుగా 8 నుంచి 10 వేలు. ఇండ్ల సంఖ్య 800 నుంచి 1000. బలిజ కులస్తులు అత్యధిక సంఖ్యలో ఉండగా ఇతర కులాలైన వెలమ, కాపు, గొల్ల చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.శ్రీకాళహస్తి నుంచి బస్సులో వెళ్ళి దిగగానే నిలువెత్తు వీరాంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే కావమ్మ గుడి వస్తుంది. గ్రామం ప్రధాన వీధులన్నీ సిమెంటు రోడ్లే. ఈ ఊరికి దగ్గరే ఉన్న రైల్వే స్టేషన్ అక్కుర్తి. అయితే ఇక్కడ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. రైలులో దూర ప్రయాణం చేయాలంటే శ్రీకాళహస్తికి వెళ్ళాలి.
ఊరికి తూర్పుగా దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ముచ్చివోలు హరిజనవాడ ఉంది. గ్రామస్థులకు నారు నాటడం, కలుపు తీయడం, కుప్ప నూర్చడం వంటి వ్యవసాయ పనుల్లో సహాయకార్లుగా ఉంటారు. హరిజనవాడకు ప్రత్యేకంగా ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే ఉన్నత పాఠశాల మాత్రం ఒకటే.
[మార్చు] జీవనాధారం మరియు వృత్తులు
ఎక్కువ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. రైతులు వరి మరియు వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. ఆవులు, బర్రెల పెంపకం ద్వారా పాలు అమ్మి గ్రామస్తులు చెప్పుకోదగిన ఆదాయాన్ని గడిస్తుంటారు. ఈ పాలు కొనుక్కోవడానికి శ్రీకాళహస్తి పాల సరఫరా సహకార సంఘం వారు, కొన్ని ప్రైవేటు డైరీలు, ప్రైవేటు వ్యక్తులు వస్తుంటారు. ప్రాచీన గ్రామీణ వ్యవస్థ లాగే ఇక్కడ రజకులు, మంగలి వారు, కుమ్మరులు, వడ్రంగులు మొదలైన అన్ని రకాల వృత్తుల వారు నివసిస్తుంటారు. ఇంకా కొన్ని కుటుంబాలు గొర్రెల/మేకల పెంపకం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తారు.
[మార్చు] వ్యవసాయం
గ్రామంలో సాగునీటికి ఎక్కువ మంది ఊరికి పడమటగా ఉన్న చెరువు మీదే ఎక్కువగా ఆధారపడతారు. కొద్ది మంది బావులు, గొట్టపు బావుల మీద ఆధారపడతారు. ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాల చెరువుల్లో కల్లా పెద్ద చెరువు. వర్షాకాలంలో ఇంటికి ఒక మనిషి చొప్పున గ్రామస్తులంతా వెళ్ళి, తిరుమల కొండలపై నుంచి పారే నీటిని చెరువులోకి మళ్ళిస్తారు. దీనినే వరవ కట్టడం అంటారు. ఒక వేళ చెరువు నిండి పోతే అదనపు నీటిని విడుదల చేయడానికి రెండు కలుజులు ఉన్నాయి. చెరువులో చేపలు పట్టుకోవడానికి గ్రామ పంచాయితీ ప్రతి సంవత్సరం వేలం నిర్వహిస్తుంది. అందులో పాడుకున్న వాళ్ళు మాత్రమే ఆ సంవత్సరం చేపలు పట్టి అమ్ముకోవడానికి అర్హులు.
గ్రామంలో మూడు బియ్యం మరలు (రైస్ మిల్లులు) ఉన్నాయి. చాలా మంది గ్రామస్తులు బియ్యం ఇక్కడే మరాడించుకుని వెళుతుంటారు. కొద్ది మంది తమ పంటను ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు. వ్యవసాయానికి ఎక్కువగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వాడతారు. దాదాపు ప్రతీ ఇంటిలోనూ పాడి సంపద ఉండటం వల వాటి వ్యర్థాలను తమ పంట పొలాలను ఎరువుగా వాడుకుంటారు.
[మార్చు] విద్య
గ్రామము నందు ఒక అంగన్‌వాడీ కేంద్రం, ఒక ప్రాథమిక పాఠశాల[1] మరియు ఉన్నత విద్యా పాఠశాల[2] కలవు. ప్రక్క గ్రామాలైన మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికే వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. కళాశాల చదువుకు మాత్రం ఎవరైనా ప్రక్కనే ఉన్న శ్రీకాళహస్తికి వెళ్ళాల్సిందే. అక్షరాస్యాతా శాతం 75%. ఇక్కడి నుంచి చాలామంది ఇంజనీర్లుగా (ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో ఐ.టి) బెంగుళూరు, మరియు అమెరికాలలో పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇంకా బోధన, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, మీడియా, టెలికాం, న్యాయ శాస్త్రం మొదలైన అన్ని రంగాలలోనూ ఈ ఊరి వారు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఊరి ప్రజలకు ఇది గర్వకారణం.
గ్రామ ఉన్నత పాఠశాల 2005 నుంచీ పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని పాఠశాలన్నింటిలోకెల్లా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తోంది. 2008 లో ఒక విద్యార్థిని 600 మార్కులను గాను 562 మార్కులు సాధించి నియోజక వర్గానికి ప్రథమురాలిగా నిలిచింది. [3] ఇంతకు మునుపు గ్రామం లోపల ఉన్న ఈ బడిని 1998 లో ఊరి వెలుపలనున్న కొత్త భవనాలకు మార్చడంతో ఆటస్థలం, లాంటి కొన్ని సౌకర్యాల లేమి ఉంది.
[మార్చు] ఆలయాలు-ఉత్సవాలు
గ్రామంలో నాలుగు దేవాలయాలు ఉన్నాయి.
- శ్రీ పాండురంగ స్వామి దేవాలయం
- శ్రీ రామాలయం
- శ్రీ విజయ గణపతి దేవాలయం
- శ్రీ వేమాలమ్మ దేవాలయం
- కావమ్మ గుడి.
- ఆంజనేయ స్వామి గుడి.
[మార్చు] పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు
.
ప్రతి యేటా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పాండురంగ స్వామి భక్తబృందం దీని నిర్వహణా భాద్యతలు చేపడుతుంది. ఈ భక్త బృందం లోని సభ్యులందరూ తప్పనిసరిగా ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ పండరి భజన లో పాల్గొంటారు. కొన్ని గ్రామాల్లో కోలాటం కూడా ప్రదర్శిస్తారు. చుట్టుపక్కల గ్రామాలనించి కూడా ప్రజలు వచ్చి ఈ ఉత్సవాలను తిలకించడం విశేషం. ఐదురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రధానంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి.
- ప్రారంభోత్సవం
- ధ్వజారోహణం : కాషాయపు జెండాని ప్రతిష్టించడం.
- కంకణ ధారణ : గుండ ప్రవేశం ముందురోజు రాత్రి దీనిలో పాల్గొనే వారంతా కంకణాలు (పసుపు కొమ్ము) కట్టుకోవలసి ఉంటుంది. ఇలా కంకణం కట్టుకున్న వారు గుండ ప్రవేశం చేసేంత వరకు కొన్ని నియమాలు పాటించాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. భోజనానికి సాధారణంగా వాడే కంచాల్ని వాడకుండా విస్తరాకులు, లేదా అరటి ఆకులు మాత్రమే వాడాలి. మంచాల్ని తాకరాదు. కటిక నేల మీద, కుర్చీ మీద లేదా చాప మీద మాత్రమే కూర్చోవాలి లేదా పడుకోవాలి. కాళ్ళకి పాదరక్షలు వేసుకోకూడదు. పసుపు బట్టలు ధరించాలి.
- గుండ ప్రవేశం :
ఈ రోజంతా గుండ ప్రవేశం చేయబోయే భక్తులు పైన చెప్పిన నియమాల్ని పాటిస్తూ. నిర్ణీత కాలవ్యవధిలో గ్రామం చేలల్లో గల వివిధ వ్యవసాయ బావుల్లో స్నానం చేసి వస్తుండాలి. ఇలా ఎన్ని సార్లు చేయలనేది. గుండం ఎన్ని మూరలు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గుండం 13 మూరలదైతే ఆ రోజు మొత్తం 13 సార్లు స్నానం ఆచరించాల్సి ఉంటుంది. గుండ ప్రవేశం ముందు ఆఖరి స్నానం ఉంటుంది. ఈ ఆఖరి స్నానం మంగళ వాయిద్యాలతో, బాణ సంచా కాల్పులతో అట్టహాసంగా జరుగుతుంది. గుండ ప్రవేశం చేసేటప్పుడు పురుషులు చొక్కా, కానీ బనియన్ కానీ వేసుకోకూడదు. సాధారణంగా ఈ ఉత్సవమంతా ఒక భజన గురువు సారధ్యంలో జరుగుతుంది. ముందుగా భజన గురువు ఒక పూల చెండును నిప్పులపై దొర్లిస్తూ ఆయన నడిచిపోతే, మిగతా భక్తులంతా ఆయనను అనుసరిస్తారు. గుండ ప్రవేశం పూర్తయిన తర్వాత కొద్ది సేపు భక్తులందరూ పరవశంతో ఆనందతాండవం చేస్తారు. తరువాత స్వామికి జోలపాడి, భక్తులందరూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతారు.
- వసంతోత్సవం : గుండ ప్రవేశం అయిన మరుసటి రోజు వసంతోత్సవం. ఇందులో భాగంగా రుక్మిణీ సమేత పాండురంగ స్వామిని పురవీధుల్లో ఊరేగిస్తారు. భజన బృందం పాటలు పాడుతుండగా, ఉత్సాహవంతులైన యువకులు వసంతం ( పసుపు, కుంకుమ మొదలైనవి కలిపిన నీళ్ళు) పోసుకుంటుండగా ఇది ఆద్యంతం ఉల్లాసంగా సాగిపోతుంది.
- గుండశాంతి : గుండాన్ని పూడ్చి వేస్తారు.
- పారువేట : ఈ భాగంగా మొదట్లో ఒక కుందేలును తెచ్చి. దానిని విడిచిపెట్టి, గ్రామస్తులంతా దానిని పట్టుకోవడానికి పరుగులు పెట్టేవారు. కానీ ఇప్పుడు కుందేళ్ళు అంత సులభంగా అందుబాటులో లేక పోవడంతో ఒక కొబ్బరి కాయను అలా విసిరేసి దాన్ని దొరకబుచ్చుకుని సరిపెట్టేస్తుంటారు.
గుండ ప్రవేశం రోజు రాత్రి, గ్రామం లోని యువకులందరూ కలిసి ఒక సాంఘిక నాటకం ప్రదర్శించడం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ప్రదర్శన అందరికీ ఉచితమే. ఇంకా ఉత్సవాల్లో భాగంగా, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన హరికథా భాగవతార్ల చే పురాణ కాలక్షేపం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి.
ఇంకా ప్రతి యేటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వేమాలమ్మ తిరునాళ్ళు, నాగుల చవితి నాడు నాగులమ్మకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కావమ్మ గుడి దగ్గర కావమ్మ కథను హరికథా కాలక్షేపం మూడురోజుల పాటు జరిపిస్తారు. ఇక్కడ కూడా మూడవరోజు అగ్నిగుండ ప్రవేశం (నిప్పుల్లో నడవడం) చేస్తారు.
- ఇరుగు-పొరుగు గ్రామాలు
మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి, వేలవేడు, మాదమాల, అక్కుర్తి.
- విశేషాలు
జెమిని టివిలో ప్రసారమౌతున్న మొగిలిరేకులు అనే సీరియల్ ను కొద్దిభాగం ఈ గ్రామంలో చిత్రీకరించడం జరిగింది.
|
|
|
|---|---|
| కొత్తపల్లె చింతల · మన్నవరం · ఇనగలూరు (శ్రీకాళహస్తి) · గొవిందరావుపల్లె · వాంపల్లె · పోలి · భీమవరం · ఎంపేడు · అమ్మచెరువు · పాతగుంట · మంగళగుంట · వేలంపాడు · కలవగుంట · యర్లపూడి · మేలచూరు · పాపనపల్లె · బ్రాహ్మణపల్లె · గొల్లపల్లె వెంకటాపురం · బహదూర్ వెంకటాపురం · కొత్తూరు చెల్లమాంబపురం · రామానుజపల్లె · కుంతిపూడి · వాగవీడు · వెంగళంపల్లె ఎండ్రపల్లె · మాదమాల · వేలవేడు · రెడ్డిపల్లె · ఓబులయ్యపల్లె · ముద్దుమూడి · మంగళపురి · ముచ్చివోలు · ఎర్రగుడిపాడు · బోడవారిపల్లె · ఉడమలపాడు · అక్కుర్తి · పెనుబాక · కమ్మకొత్తూరు · చెరుకులపాడు · నారాయణపురం · గుంటకిందపల్లె · మద్దిలేడు · ఉరందూరు · పనగల్లు (గ్రామీణ) · అరవకొత్తూరు · అప్పలయ్యగుంట · చుక్కలనిడిగల్లు · అమ్మపాలెం · పుల్లారెడ్డి ఖండ్రిగ · తొండమనాడు · దిగువవీధి · ఎగువవీధి · చెర్లోపల్లె · కాపుగున్నేరి · మర్రిమాకులచేను ఖండ్రిగ · రాచగున్నెరి · చల్లపాలెం · బొక్కసంపాలెం · సుబ్బనాయుడు ఖండ్రిగ · రామలింగాపురం · వేడాం · రామాపురం |
[మార్చు] మూలాలు
- ↑ http://projects.cgg.gov.in/dsemis/School.do?&mgtcode=1&schlcode=1014034&count=1
- ↑ http://projects.cgg.gov.in/dsemis/School.do?&mgtcode=1&schlcode=1014603&count=1
- ↑ 2008 మే 16, ఈనాడు దినపత్రిక, చిత్తూరు జిల్లా సంచిక , 4వ పేజీ ఆధారంగా...