రవీంద్రనాథ్ ఠాగూర్

వికీపీడియా నుండి
(రవీంద్రనాధ టాగూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రవీంద్రనాథ్ టాగూర్
FRAS
రచయిత మాతృభాషలో అతని పేరుরবীন্দ্রনাথ ঠাকুর  (Bengali)
పుట్టిన తేదీ, స్థలంరబీంద్రనాథ్ టాగూర్
(1861-05-07)1861 మే 7
కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1941 ఆగస్టు 7(1941-08-07) (వయసు 80)
కలకత్తా, బ్రిటిష్ ఇండియా
కలం పేరుభానుసింహ
వృత్తి
  • కవి
  • నవలాకర్త
  • రచయిత
  • నాటకకర్త
  • వ్యాసకర్త
  • కథారచయిత
  • సంగీత కర్త
  • తత్వవేత్త
  • సంఘ సంస్కర్త
  • విద్యావేత్త
  • భాషావేత్త
  • వ్యాకరణ పండితుడు
  • చిత్రకారుడు
భాష
  • బెంగాలీ
పౌరసత్వంబ్రిటిష్ రాజ్
కాలంబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం
సాహిత్య ఉద్యమంContextual Modernism
గుర్తింపునిచ్చిన రచనలు
పురస్కారాలుసాహిత్యంలో నోబెల్ బహుమతి
1913
జీవిత భాగస్వామి
(m. 1883; died 1902)
సంతానం5, including Rathindranath Tagore
బంధువులుTagore family

సంతకంClose-up on a Bengali word handwritten with angular, jaunty letters.

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, English: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); Bengali: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వంగదేశంలో 1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రెండవ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ , మొట్ట మొదటి ఇండియన్ సివిల్ సర్వీస్ లో నియమితుడైన మొదటి భారతీయుడు.

రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చదివేవాడు. కాళిదాసు, షేక్స్‌పియర్ రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.

రవీంద్రుడు ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత 1883 డిసెంబరు 9 న మృణాలిని దేవీని వివాహమాడాడు.

సాహితీవ్యాసంగం

[మార్చు]

రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన సంధ్యాగీత్ కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు విర్గరేర్ స్వప్న భంగ, సంగీత ప్రభాత అనే కావ్యాలను రచించాడు.

గీతాంజలి

[మార్చు]
టాగూరు రచించిన గీతాంజలి

రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.

శాంతినికేతన్

[మార్చు]

రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలకడం, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 1919 లో కళా భవన్ ను ఆయన స్థాపించాడు. ఇక్కడ విద్యార్థులు విభిన్న కళలను నేర్చుకునేవారు.

నవల, నాటకాలు

[మార్చు]

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు. రవీంద్రుడు మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించాడు. ఆ తరువాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి పోస్టాఫీసు అనే నాటకం వ్రాశాడు. రవీంద్రుడు రచించిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. ప్రకృతి – ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక శ్రేష్టమయిన నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన "గోరా" నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.

చిత్రకళ, సంగీతం

[మార్చు]

రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు.

రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరచిన వాడు రవీంద్రుడు.

స్వాతంత్ర్య సాధన, జనగణమణ

[మార్చు]

రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన "జనగణమణ" ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి "జనగణమన" దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.

రచనలనుండి ఉదాహరణలు

[మార్చు]

గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు తలుపులన్నింటినీ బంధించి ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు? కళ్ళు తెరచి చూడు. నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు! ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో, ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి ఆనేల మీదికి పదా...

విస్తృతంగా జనప్రియమైన మరొక రచన. ఇది చాలా పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చబడింది.
"Where the mind is without fear

Where the mind is without fear and the head is held high;

Where knowledge is free;

Where the world has not been broken up into fragments by narrow domestic walls;

Where words come out from the depth of truth;

Where tireless striving stretches its arms towards perfection;

Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;

Where the mind is led forward by thee into ever-widening thought and action—Into that heaven of freedom, my Father, let my country awake."

దీనికి తెలుగు అనువాదం:

"ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,

ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,

ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,

ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,

ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,

ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,

ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,

తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు"

చివరి రోజులు

[మార్చు]

తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా చెప్పుకొన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యాడు. తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ, చికిత్సకై కలకత్తా నగరానికి వెళ్లాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, 1941 ఆగష్టు 7న మరణించాడు.

క్లుప్తంగా సమాచారం

[మార్చు]
  • జననం: 1861 మే 7.
  • తండ్రి మహర్షి దేవేంద్రనాథ టాగూరు, తల్లి శారదాదేవి.
  • 15 మంది సంతతిలో పధ్నాలుగో బిడ్డ, ఎనిమిదవ పుత్రుడు.
  • రచనారంభం: 1873.
  • ప్రథమ పద్య కావ్య ప్రచురణ: 1878.
  • మృణాళినీదేవి తోవివాహం: 1883.
  • మృణాళినీదేవి మరణం: 1902.
  • శాంతినికేతన్‌ స్థాపన: 1901 డిసెంబరు.
  • గీతాంజలికి నోబెల్ బహుమతి: 1913 నవంబరు.
  • విశ్వభారతి స్థాపన: 1921 డిసెంబరు.
  • మరణం: 1941, ఆగస్టు 7.
  • ఆత్మకథ: మై రెమినిసెన్సెస్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
గీతాంజలి పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. ఇక్కడ చూడండి
  • ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ఆళ్ల నాగేశ్వరరావు వ్యాసం ఆధారంగా