అలీ యావర్ జంగ్
నవాబ్ అలీ యావర్ జంగ్ | |||
| |||
పదవీ కాలం 1971 – 1977 | |||
ముందు | పి.వి.చెరియన్ | ||
---|---|---|---|
తరువాత | సాదిక్ అలీ | ||
పదవీ కాలం 1968 – 1970 | |||
ముందు | బ్రజ్ కుమార్ నెహ్రూ | ||
తరువాత | లక్ష్మీకాంత్ ఝా | ||
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపసంచాలకుడు
| |||
పదవీ కాలం 1965 – 1968 | |||
ముందు | బషీర్ హుస్సేన్ జైదీ | ||
తరువాత | అబ్దుల్ అలీం | ||
పదవీ కాలం 1961 – 1965 | |||
ముందు | ఎన్.రాఘవన్ | ||
తరువాత | రాజేశ్వర్ దయాళ్ | ||
పదవీ కాలం 1958 – 1961 | |||
పదవీ కాలం 1954 – 1958 | |||
ముందు | కె.ఎం.పనిక్కర్ | ||
తరువాత | ఆర్.కె.నెహ్రూ | ||
పదవీ కాలం 1952 – 1954 | |||
ముందు | జంషెడ్ వుర్జోర్జీ వెసూకర్ | ||
తరువాత | నెడ్యం రాఘవన్ | ||
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపసంచాలకుడు
| |||
పదవీ కాలం 1948 – 1952 | |||
ముందు | రజీయుద్దీన్ సిద్దిఖీ | ||
తరువాత | సూరి భగవంతం | ||
పదవీ కాలం 1945 – 1946 | |||
ముందు | ఆజం జంగ్ బహదూర్ | ||
తరువాత | వలీ మహమ్మద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు | 1905 ఫిబ్రవరి 16||
మరణం | 1976 డిసెంబరు 11 బొంబాయి | (వయసు 71)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేసు | ||
జీవిత భాగస్వామి | ఆలిస్ ఈఫ్రిగ్ జహ్రా అలీ యావర్ జంగ్ | ||
సంతానం | బిల్కీస్ ఐ. లతీఫ్ ఆదిల్ యార్ ఖాన్ కుల్సుం దుబాష్ మిర్జా అసద్ కరీంఖాన్ | ||
పూర్వ విద్యార్థి | నిజాం కళాశాల ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | దౌత్యవేత్త |
నవాబ్ అలీ యావర్ జంగ్ (ఫిబ్రవరి 16, 1905[1] – డిసెంబరు 11, 1976) హైదరాబాదుకు చెందిన ప్రముఖ భారతీయ విద్యావేత్త, దౌత్యవేత్త. 1971 నుండి 1976 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశాడు. నవాబ్ అలీ యావర్ జంగ్, 1945 నుండి 1946 వరకు, మరలా 1948 నుండి 1952 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపసంచాలకుడిగా పనిచేశాడు. 1965 నుండి 1968 వరకు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపసంచాలకుడిగా పనిచేశాడు. 1950, 60వ దశకాల్లో అర్జెంటీనా, ఈజిప్టు, యుగోస్లావియా, గ్రీసు, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలకు భారత రాయబారిగా పనిచేశాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]అలీ యావర్ జంగ్, హైదరాబాదులో ఒక ప్రసిద్ధ పండితులు, విద్యావేత్తలు, పాలనాధికారుల కుటుంబంలో మిర్జా అలీ యార్ ఖాన్‌గా జన్మించాడు. ఈయన తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్),[2] తల్లి తయ్యబా బేగం భారతదేశపు ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు.[3] ఈయన మాతామహుడు హైదరాబాదులో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడైన ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ.
అలీ యావర్ జంగ్ ప్రాథమిక విద్య నిజాం కళాశాలకు అనుబంధంగా ఉన్న మద్రస్సా-ఏ-ఆలియాలో సాగింది. ఇంటర్మీడియట్ నిజాం కళాశాలలో చదివి, 1922లో 17 ఏళ్ల వయసులో, పై చదువులకు ఇంగ్లాండు వెళ్ళాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని క్వీన్స్ కళాశాల నుండి చరిత్రలో పట్టభద్రుడయ్యాడు.[4] ఆ తర్వాత 1926 - 1927లో పారిస్ విశ్వవిద్యాలయం (సోర్బోన్) లో చదువుకున్నాడు.[5] ఆచార్యులు సిల్వైన్ లెవీ, ఆల్ఫ్రెడ్ మార్టినూ ల సారథ్యంలో భారతదేశంలో ఫ్రెంచివారి చరిత్రపై పరిశోధన చేశాడు.
పారిస్లో చదుతున్న కాలంలో ఆలిస్ ఈఫ్రిగ్ అనే ఫ్రెంచి-జర్మన్ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకొని, భార్యతో పాటు 1927లో హైదరాబాదు తిరిగి వచ్చాడు.[6] వీరికి ఒక కుమార్తె (బిల్కీస్ లతీఫ్), ఒక కుమారుడు (ఆదిల్ యార్ ఖాన్). ఆలిస్ ఈఫ్రిగ్ నుండి విడాకులు తీసుకొని 1939లో జహ్రా అలీ యావర్ జంగ్ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు.
వ్యాసంగం
[మార్చు]అలీ యావర్ జంగ్, విద్యాభ్యాసం పూర్తి చేసుకొని హైదరాబాదు తిరిగి రాగానే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని చరిత్ర శాఖలో ఉపన్యాసకుడిగా చేరి, ఆధునిక చరిత్ర, రాజనీతిశాస్త్రం యొక్క రీడరయ్యాడు. ఆ పదవిలో 1930 దాకా కొనసాగాడు. 1930 నుండి 1935 వరకు ఆధునిక చరిత్ర ఆచార్యుడుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు నిజాం ప్రభుత్వంలో వివిధ పదవుల్లో పనిచేశాడు. 1935 నుండి 1937 వరకు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టరుగా, 1937 నుండి 1942 వరకు రాజ్యాంగ వ్యవహారాలు, సమాచార ప్రసరణ శాఖా కార్యదర్శిగా, 1942 నుండి 1945 వరకు గృహ, న్యాయ మంత్రిత్వ శాఖలకు కార్యదర్శిగా పనిచేసాడు.[7]
నవాబ్ అలీ యావర్ జంగ్, 1945 నుండి 1946 వరకు, మరలా 1948 నుండి 1952 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపసంచాలకుడిగా పనిచేశాడు. 1946 నుండి 1947 వరకు నిజాం ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవహారాలు, గృహ, విద్య, ప్రజాఆరోగ్య, స్థానిక పాలనా శాఖలకు మంత్రిగా ఉన్నాడు. 1947లో ఆ పదవికి రాజీనామా చేశాడు.
దౌత్యవేత్తగా
[మార్చు]అలీ యావర్ జంగ్ భారత రాయబారిగా అర్జెంటీనా (1952–54), ఈజిప్టు (1954–58), యుగోస్లావియా, గ్రీసు (1958–61), ఫ్రాన్స్ (1961–65),, అమెరికా (1968–70) లలో పనిచేశాడు. ఈయనకు హ్వాన్ పెరోన్, గమాల్ అబ్దుల్ నాసర్, జోసిఫ్ బ్రాజ్ టిటో, చార్ల్స్ డి గాల్, లిండన్ బి. జాన్సన్ లతో ఏర్పడిన వ్యక్తిగత సాన్నిహిత్యం, భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానం వారు అర్ధం చేసుకొని, గ్రహించేందుకు అమితంగా దోహదపడింది.
అర్జెంటినాలో ఆయన రాయబారిగా ఉన్న రోజుల్లో ఆ దేశాధ్యక్షుడు హ్వాన్ పెరోన్ నిరంకుశత్వానికి మారుపేరుగా చెలామణిలో ఉండేవాడు. దౌత్యవేత్తలు ఇచ్చే విందులకు హాజరుకావడానికి ఆయన విముఖత చూపేవారు. అలాంటి వ్యక్తి అలీయావర్ జంగ్ ఇచ్చిన విందులో పాల్గొన్నారంటే అది భారత్ ఎడల ఆయనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచింది.
1954లో అలీ యావర్ జంగ్, కైరోలో భారత రాయబారిగా నియమితుడైనప్పుడు జనరల్ నజీబ్ నుంచి గమాల్ నాసర్ పరిపాలన హస్తగతం చేసుకునే రోజులు. తనకు మిత్రులెవరో, శత్రువులెవరో పరీక్షించిన తరువాతనే నాసర్ విదేశీ ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. అలీ యావర్ జంగ్‌కు కైరో కొచ్చిన నెల రోజుల వరకు నాసర్‌కు తన నియామక పత్రాలు సమర్పించుకునే అవకాశం లభించలేదు. దీనితో విసుగెత్తిపోయిన యావర్ జంగ్ "మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వక పోతే నా దేశానికి తిరిగి పోయేందుకైన అనుమతి ఇవ్వండి" అని గట్టిగా ఒక లేఖ రాశారు. వెంటనే అలీయావర్ జంగ్‌కు నాసర్ ఇంటర్వ్యూ లభించింది. వారి మధ్య మొదటి సమావేశమే రెండు గంటలు సాగింది. సూయెజ్ కాలవ సంక్షోభం సమయంలో నాసర్ అడుగడుగున అలీయావర్ జంగ్ సలహాలు తీసుకునేవాడు. ఆయన తన పదవీ కాలం ముగింపుకొచ్చిన రోజున ఇచ్చిన అధికార విందులో నాసర్ భార్య తహియా కజిమ్ కూడా పాల్గొన్నది. ఇది ఆ రోజుల్లో ఎంతో ముఖ్యవార్త అయ్యింది. ఎందుకంటే, అరబ్ దేశాధినేతల సతీమణులు అధికార విందుల్లో పాల్గొనటం అపురూపం. ఆ తరువాత అలీయావర్ జంగ్‌ను బెల్‌గ్రేడ్‌లో భారత రాయబారిగా నియమించారు. బెల్‌గ్రేడ్‌లో ఉన్నప్పుడు ఆయన టిటో – నెహ్రూల మధ్య సంబంధాలు దృఢతరం చేసే చేసే పనిలో విజయం పొంది అలీన విధాన పటిష్ఠతకు తోడ్పడ్డాడు. ఫ్రాన్స్‌లో రాయబారిగా ఉన్నప్పుడు, అలీయావర్ జంగ్ ఫ్రెంచి అధ్యక్షుడు డిగాల్‌తో ఫ్రెంచ్ భాషలో మాట్లాడి ఆయనకు సన్నిహితుడయ్యాడు.[2]
1965లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో సెక్యులర్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు పరిచే సమర్థుడుగా అలీయావర్ జంగ్‌ను భావించి అప్పటి రాష్ట్రపతి ఆయనను ఉపసంచాలకుడిగా నియమించాడు. 1965 నుండి 1968 వరకు విశ్వవిద్యాలయపు ఉపసంచాలకుడిగా పనిచేశాడు.[7] అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించాడు.[8] ఈ పనిలో జంగ్‌కు అనేక ఇబ్బందులేదురైనాయి. ఒక సందర్భంలో ఆయనకు ప్రాణహాని కూడా జరిగింది. కానీ, అలీయావర్ జంగ్ వాటిని లెక్క పెట్టకుండా తనపని విజయవంతంగా పూర్తి చేశాడు.[2]
1971లో ఈయన మహారాష్ట్ర గవర్నరుగా నియమించబడ్డాడు. ఆ పదవీలో ఉండగానే మరణించాడు.[9] ఢిల్లీలో జరుగనున్న గవర్నర్ల సమావేశంలో పాల్గొనడానికి ఆయన శాంతాక్రజ్ విమానాశ్రయానికి రాగానే గుండెపోటు వచ్చింది. ఢిల్లీకి వెళ్లే బదులు ఆస్పత్రిలో చేర్పించారు. అలీయావర్ జంగ్, 1976 డిసెంబరు 11న బొంబాయిలో కన్నుమూశాడు.[2]
పురస్కారాలు , స్మారకాలు
[మార్చు]ఈయనను భారత ప్రభుత్వం 1959లో పద్మభూషణ పురస్కారంతో, 1977లో పద్మవిభూషణ పురస్కారంతో సత్కరించింది.[10] ముంబై శివార్లలోని బాంద్రాలో పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేగా పిలిచే జాతీయ రహదారి 8 యొక్క భాగాన్ని, [11] అక్కడ ఉండే జాతీయ బధిరుల సంస్థకు[12] ఈయన గౌరవార్ధం ఈయన పేరుపెట్టారు. సాంఘిక సేవిక, పద్మశ్రీ పురస్కార గ్రహీత, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఐ.హెచ్.లతీఫ్ భార్య అయిన, బిల్కీస్ ఐ. లతీఫ్, అలీ యావర్ జంగ్ కూతురు.[13]
మూలాలు
[మార్చు]- ↑ Journal of the Asiatic Society of Bombay. Asiatic Society of Bombay. 1977. p. 241. Retrieved 19 November 2017.
- ↑ 2.0 2.1 2.2 2.3 జి., వెంకటరామారావు (February 10, 2016). "రాత్రి వేళల్లో గస్తీ తిరిగిన ఉస్మానియా వి.సి". తెలంగాణ మాసపత్రిక. Retrieved 18 November 2017.
- ↑ "Tyaba Begum Sahaba Bilgrami". HelloHyderabad.com. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 3 November 2014.
- ↑ Shri W.A. Sangma (14 December 1976). Obituary References (Speech). Meghalaya Legislative Assembly. Archived from the original on 9 జనవరి 2009. Retrieved 17 July 2008.
- ↑ "ALI YAWAR JUNG". hellohyd.com. Archived from the original on 7 జూన్ 2018. Retrieved 19 November 2017.
- ↑ Buultjens, Ralph (July 1, 1984). "Book Review: Her India: The Fragrance of Forgotten Years". Worldview Magazine: 29–30. Retrieved 19 November 2017.
- ↑ 7.0 7.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-08. Retrieved 2017-11-13.
- ↑ http://indiatoday.intoday.in/story/aligarh-muslim-university-50percent-quota-for-muslims-creates-a-storm/1/193559.html
- ↑ "Previous Governor Profile-Shri Ali Yavar Jung". Retrieved 19 November 2017.[permanent dead link]
- ↑ "List of Padma Vibhushan Awardees" (PDF). Retrieved 17 July 2008.
- ↑ Chacko, Benita (September 18, 2017). "Western Express Highway: Few know this arterial road honours a former diplomat". The Indian Express. No. Mumbai. Retrieved 18 November 2017.
- ↑ Qureshi, M. U. (2006). Encyclopaedia of Social Problems and Social Welfare. Anmol Publications PVT. LTD. p. 203. ISBN 81-261-2584-5.
- ↑ "A Life of service honoured with the Padma Shri award" (PDF). You and I — eMag. 16 February 2009. Retrieved February 27, 2016.
- All articles with dead external links
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1905 జననాలు
- 1976 మరణాలు
- మహారాష్ట్ర గవర్నర్లు
- పద్మభూషణ పురస్కారం పొందిన తెలంగాణ వ్యక్తులు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన తెలంగాణ వ్యక్తులు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపసంచాలకులు
- భారతీయ దౌత్యవేత్తలు
- నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు
- హైదరాబాదు జిల్లాకు చెందిన గవర్నర్లు