ఆర్. విద్యాసాగ‌ర్‌రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్ విద్యాసాగర్‌రావు

ఆర్ విద్యాసాగర్‌రావు (14 నవంబరు 1939 – 29 ఏప్రిల్ 2017)[1] నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. విద్యాసాగ‌ర్‌రావు చాలా నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డిపారు. నీళ్లు నిజాలు ఆయన ఇంటిపేరుగా మారింది. నిర్మొహమాటం ఉండే ఆయన వ్యక్తిత్వం.వృత్తిరీత్యా ఇంజనీరు ఐన కొలువులో ఉన్నన్నాళ్లూ మంచి రచయితగా, నటుడిగా పేరొందారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కు చెందిన జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందినవారు. ఆయ‌న తల్లి ల‌క్ష్మమ్మ‌, తండ్రి ఆర్ రాఘ‌వ‌రావు. వారిది విద్యావంతుల కుటుంబం‌. ఆయ‌న తండ్రి అప్పటికే టీచ‌రు అయినందువ‌ల్ల ఆ కుటుంబంలో అంద‌రూ చ‌దువుకున్నారు. ఆ ఊళ్లో ఫ‌స్ట్ మెట్రిక్యూలేట్ వాళ్ల నాన్నన‌ట‌. ఫ‌స్ట్ గ్రాడ్యూయేట్ వాళ్ల అన్న‌. విద్యాసాగ‌ర్‌రావు వాళ్ల ఊళ్లో మొట్టమొద‌టి ఇంజ‌నీరింగ్ ప‌ట్టభ‌ద్రుడు. ఇలా ఆ కుటుంబంలో ఆయ‌న చెల్లెండ్లు కూడ అప్పట్లో ఒకామె సెవెన్త్ క్లాస్‌, ఇంకొకామె మెట్రిక్యులేష‌న్ చేశారు.[2]

ఆయన 1960లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయమునుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. 1979 లో రూర్కీ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ఐఐటి రూర్కీ) లో నీటి వనరుల అభివృద్ది లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన 1983లో యు.ఎస్.ఎ లోని కొలొరాడో స్టేట్ విశ్వవిద్యాలయం నుండి నీటి వనరుల వ్యవస్థ ఇంజనీరింగులో డిప్లొమా పొందారు. ఆయన 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలొ పట్టాను కూడా పొందారు.

ఉద్యోగ జీవితం[మార్చు]

బీటెక్ అయిన వెంట‌నే క్యాంప‌స్‌లోని మ‌హిళా కాలేజీ మెయింటెనెన్స్ ఇంజీనీరుగా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన త‌ర్వాత కూడా రాయ‌టం, నాట‌కాలు వేయ‌డం వంటి హాబీల‌ను ఆయ‌న వ‌దులుకోలేదు. రోజూ సాయంత్రం ఆయ‌న అడ్డా ల‌క్డీకాపూల్లోని ర‌వీంద్రభార‌తి. డ్యూటీ అయిపోయిన వెంట‌నే ఆయ‌న అక్కడికి చేరుకునేవార‌ట‌. హైద‌రాబాద్‌లో ఉద్యోగం అనంత‌రం ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌, నీటిపారుద‌ల శాఖ‌లో ఇంజ‌నీరుగా ప‌నిచేశారు. ఢిల్లీలో ఉండ‌గానే నీళ్ల విషయంలో తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. రిటైర్మెంట్ త‌రువాత తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చారు. అంత‌కు ముందు దాదాపు 34 సంవత్సరాల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గ‌డించారు.

తెలంగాణ ఉద్యమకారుడు[మార్చు]

ఆయన జల సమస్యలపై ప్రజలతో తెలుగులో మాట్లాడేవారు.[3][4] ఆయన వార్త , ఆంధ్రజ్యోతి, ఈనాడు, మరియు నమస్తే తెలంగాణ పత్రికలలో జల సంబంధిత సమస్యలపై సుమారు 100 వ్యాసాలు రాసారు. అంతే కాకుండా "నీరు-నిజాలు" అనే పేరుతో రెండు సంపుటాలను వెలువరించారు. [5] నీటి వనరుల నిపుణునిగా ఆయన విద్యార్థులు, మేథావులు మరియు సాధారన ప్రజలతో నీటి సమస్యలపై అవగాహన కల్పించుటకు సెమినార్లను నిర్వహించేవాడు.[6] ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విధానాలపై మీడియాకు తెలియజెసేవారు. [7] ఆయన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలపై కూడా రాసారు.[8] ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ మరియు తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావులతో కలసి పనిచేసారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల వ్యవసాయం, నీటి వనరులపై సరైన అవగాహన కల్పించాడు. ఆయన అనేక ఉపన్యాసాలను మరియు వ్యాసాలను సులభమైన భాషలో యిచ్చేవాడు. అదే విధంగా సరైన గణాంకాలను కూడా సాధారణ పౌరునికి కూడా తెలియజెసే విధంగా రాసేవాడు. ఆయన వ్యాసాలు వివిధ ఆంగ్ల జాతీయ పత్రికలలో కూడా అచ్చయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు[మార్చు]

ఆయన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల విషయాలపై సరైన ఆలోచనను కలిగి ఉండేవారు.[9] నవంబరు 2016 లో తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ విశ్వవిద్యాలయంచే నిర్వహించబడిన "మిషన్ కాకతీయ" ప్రాజెక్టు కు సంబంధించిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలో వ్యవసాయరంగంలో నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ విధానాలను వివరించారు.[10]

పురస్కారాలు[మార్చు]

2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (భారతదేశం) ఆయనను "లీడింగ్ ఇంజనీరింగ్ పెర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా" గా పురస్కారాన్నందించింది.

మరణం[మార్చు]

గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఏప్రిల్ 29 2017న హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగ‌ర్‌రావుకు ఇద్దరు సంతానం(అమ్మాయి, అబ్బాయి) ఢిల్లీలో సెటిల‌య్యారు.[11][12]

మూలాలు[మార్చు]