చక్రపాణి

వికీపీడియా నుండి
(ఆలూరి వెంకట సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆలూరు వెంకట సుబ్బారావు
రచయిత, నిర్మాత, దర్శకుడు చందమామ చక్రపాణి
జననంఆలూరు వెంకట సుబ్బారావు
ఆగష్టు 5, 1908
గుంటూరు జిల్లా తెనాలి
మరణంసెప్టెంబరు 24, 1975
మరణ కారణంక్షయ
ఇతర పేర్లుచక్రపాణి
ప్రసిద్ధిబహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత , దర్శకుడు
Notable work(s)చందమామ మాస పత్రిక
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి రంగమ్మ
తండ్రిగురవయ్య
తల్లివెంకమ్మ

ఆలూరు వెంకట సుబ్బారావు (ఆగష్టు 5, 1908 - సెప్టెంబరు 24, 1975 ) (కలంపేరు చక్రపాణి) బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు.

జననం,విద్య

[మార్చు]

చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5 న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించాడు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించాడు. 'చక్రపాణి' అనే కలం పేరును ఈయనకు అతనే ప్రసాదించాడు.

సాహిత్యం

[మార్చు]

చక్రపాణి స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందాడు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932 లో మదనపల్లె లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళాడు. అక్కడే కొన్ని నెలలు ఉండి, సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నాడు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగు లోకి అనువదించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా శరత్‌బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌ బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. వాగ్దత్త, సుభద, పల్లీయులు, చంద్రనాథ్, దేవదాస్, పరిణీత, నవ విధాన్, బడాదీది, పతివ్రత, హేమాంగిని, నిష్కృతి, మా వారు, వంటి శరత్ రచనలను తెలుగులో అనువదించారు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టాడు.

చిత్ర పరిశ్రమ లో ప్రవేశం

[మార్చు]

చక్రపాణి మంచి రచయితగా, అనువాదకుడిగా పేరు సంపాదించడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. 1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం ఈయన మాటలు వ్రాసాడు. బి.ఎన్.రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళాడు.[1]

1945లో బి.ఎన్. రెడ్డి, మూలా నారాయణస్వామి కలిసి వాహినీ సంస్థ బ్యానర్ మీద ‘స్వర్గసీమ’ నిర్మిస్తూ కథ, సంభాషణల రచన కోసం చక్రపాణిని పిలిపించారు. చిత్తూరు నాగయ్య హీరోగా, జయమ్మ నాగయ్య భార్యగా, భానుమతి సుజాతాదేవిగా నటించగా ఘంటసాల గాయకుడుగా వెండితెరకు పరిచయమైన చిత్రం స్వర్గసీమ. ఈ సినిమా బహుళ జనాదరణ పొందింది.

దస్త్రం:Charapani2.jpg
ప్రముఖ రచయిత, నిర్మాత చక్రపాణి గారు మార్వాడి వేష ధారణలో

విజయా ప్రొడక్షన్స్

[మార్చు]

1949 లో చక్రపాణి యువ పబ్లిషర్స్ పేరిట శరత్ నవలలు అనువదించి ప్రింటింగ్ కోసం బి.ఎన్.కె ప్రెస్ కు రావడం అక్కడ బి.నాగిరెడ్డి తో స్నేహం కలవడం, జీవితాంతం ఆ స్నేహం అనురాగ బంధంగా బలపడటం చక్రపాణి జీవితంలో చెప్పుకోతగిన సంఘటన. ఇద్దరు కలసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ (1950) చిత్రాన్ని ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించింది. ఈ సినిమాకి కథ, సంభాషణలు చక్రపాణి సమకూర్చారు. ఆరోజుల్లోనే ఈ సినిమా టైటిల్ కు ‘ఇరుగుపొరుగుల కథ’ అనే ట్యాగ్ లైన్ అమర్చారు. అయితే ఈ సరికొత్త భావాలను ప్రేక్షకులు ఆదరించలేకపోవడంతో ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. 1951 లో అఖండ విజయం సాధించిన ‘పాతాళ భైరవి’ చిత్రాన్ని నిర్మించింది.అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు.

విజయా ప్రొడక్షన్స్ క్రింద ఆ తరువాత మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, సి.ఐ.డి. అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు.

చక్రపాణి శైలి

[మార్చు]

సినిమాలలో చక్రపాణి గారిది విభిన్న శైలి. చిత్ర నిర్మాణంలోనూ చక్రపాణి గారిదొక ప్రత్యేకమైన బాణి. సినిమా రంగంలో వారికి పరిచయం లేని శాఖ లేదు. “మనం తీసేది జనం చూడ్డం కాదు జనం కోరేది మనం తీయాలి ” అనే ధోరణి ఆయనది. చిత్ర విజయానికి ఆయనకు కొన్ని కొలమానాలు ఉండేవి. చిన్న పిల్లలకు సినిమా నచ్చితే పెద్దవాళ్ళకూ తప్పకుండా నచ్చుతుందని ఆయన విశ్వాసం. గుండెలు బాదుకుని ఏడ్చే ఏడుపుల మీద గానీ, సినిమా పరిభాష లోని మేలోడ్రామా మీద గానీ ఆయనకు నమ్మకం లేదు. తీవ్రమైన సంఘటనల్లో కూడా సునిశితమైన హాస్యం లేకుండా ఆయన కల్పన ఉండేది కాదు.

చిత్రం లోని ప్రతి శాఖనూ చాలా ప్రత్యేక శ్రద్ధతో గమనించడం, జనాన్ని రంజింపజేసేలా తీర్చి దిద్దడం చక్రపాణి గారి ప్రకృతి. పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రజలని ఆకట్టుకునేలా ఉండాలని మెలొడీ కి ప్రాధాన్యం ఇచ్చేలా సంగీత దర్శకుడితో, రచయితతో చర్చించి, సూచనలిచ్చి పాటల రూపకల్పన ఉండేలా చూసేవారు. అందుకే విజయా వారి పాటలు ఈనాటికీ సంగీత ప్రియుల గుండెల్లో, భద్రంగా ఉన్నాయి.

చందమామ

[మార్చు]

సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డితో కలసి1947 జూలై లో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించాడు. అయితే చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణిదే. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. ఛందమామ హిందీలో ప్రచురించే సమయాన దాని సంపాదక భాధ్యతను తన అన్నకుమారుడు ప్రముఖ రచయిత అయిన ఆలూరి బైరాగి కి అప్పగించారు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి కథల తో ఆబాలగోపాలన్ని అలరించిన చందమామ పత్రికకు 1975లో వారు చనిపోయే వరకూ సంపాదకుడిగా కొనసాగారు.

1934-1935 లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించాడు. ఈ పత్రికను చక్రపాణి 28 సంవత్సరాలు నడపగా కుటుంబరావు దానికి సంపాదకుడుగా వ్యవహరించారు.1960 లో దీనిని హైదరాబాదుకు తరలించారు. సుమారు నాలుగు దశాబ్దాల కాలం తెలుగులో కాల్పనిక సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ఈ మాస పత్రిక గురుతరమైన పాత్ర పోషించింది

మరణం

[మార్చు]

1939 లో సి.పుల్లయ్య గారు ధర్మపత్ని సినిమాకి కథ సమకూర్చారు. .ఈ సినిమా పూర్తవుతుండగానే చక్రపాణి గారి భార్య శ్రీమతి రంగమ్మ మరణించారు. శ్రీరాజేశ్వరి విలాస్ కాఫ్గీ క్లబ్ చిత్రానికి కథ చక్రపాణి రాశారు. ఆ సినిమా విడుదల కాకుండానే సెప్టెంబరు 24, 1975 న చక్రపాణి కన్నుమూశారు. చక్రపాణి కి ఆ సినిమాను అంకితమిస్తూ సంచాలకుడు చక్రపాణి, సహకారం బాపు అని టైటిల్స్ లో క్రెడిట్స్ వేశారు.

చిత్ర సమాహారం

[మార్చు]

రచయితగా

[మార్చు]
  • స్వయంవరం (1980) (కథ)
  • శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (రచయిత)
  • జూలీ (1975) (చిత్రానువాదం)
  • గుండమ్మకథ (1962) (కథ)
  • మనిదన్ మారవిల్లై (1962) (చిత్రానువాదం)
  • రేచుక్క పగటిచుక్క (1959) (చిత్రానువాదం)
  • అప్పుచేసి పప్పు కూడు (1958) (చిత్రానువాదం)
  • మాయాబజార్ (1957/II) (చిత్రానువాదం)
  • మిస్సమ్మ (1955) (రచయిత)
  • మిస్సియమ్మ (1955) తమిళం (రచయిత)
  • చంద్రహారం (1954) (రచయిత)
  • పెళ్లిచేసి చూడు (1952) (రచయిత)
  • షావుకారు (1950) (రచయిత)
  • స్వర్గసీమ (1945) (మాటలు, కథ)
  • ధర్మపత్ని (1941/I) (మాటలు)
  • ధర్మపత్ని (1941/II) (మాటలు)
  • చక్రదత్త (బెంగాలీ నవలకు అనువాదం)

నిర్మాతగా

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.
"https://te.wikipedia.org/w/index.php?title=చక్రపాణి&oldid=4041204" నుండి వెలికితీశారు