ఎల్.కె.ఝా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

లక్ష్మీకాంత్ ఝా లేదా ఎల్.కె.ఝా (ఆంగ్లం: L. K. Jha) భారత దేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. ఇతడు 1967 జూలై 1 నుంచి 1970 మే 3 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశాడు. ఈ పదవికి ముందు ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన ఎల్.కె.ఝా ప్రధానమంత్రి కి కార్యదర్శిగా పనిచేశాడు .[1] . ఇతడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే 1969 అక్టోబర్ 2మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా రూ.2, 5, 10 మరియు 100 నోట్లపై గాంధీ బొమ్మతో ముద్రించి ఝా సంతకంతో విడుదల చేశారు. ఇతని తర్వాత ఈ సీరీస్ నోట్లు బి.ఎన్.అదార్కర్ సంతకంతో తిరిగి విడుదల చేయబడ్డాయి. [2] రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తర్వాత ఇతడు ఐక్య రాజ్య సమితి లో భారత రాయబారిగా వ్యవహరించాడు. 1973 జూలై 3 నుంచి 1981 ఫిబ్రవరి 22 వరకు ఇతడు జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశాడు. జనవరి 16 , 1988 న చనిపోయే నాటికి రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. రిజర్వు బ్యాంకు ఈయన స్మారకార్ధం ఎల్.కె.ఝా స్మారకోపన్యాసాలను ప్రారంభించింది.[3]

లక్ష్మీకాంత్ ఝా 1913 నవంబర్ 22న బీహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లాలో జన్మించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొంది ఉన్నతవిద్యకు ట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జికి వెళ్ళాడు. కేంబ్రిడ్జిలో ప్రఖ్యాత ఆర్ధికవేత్తలైన పీజూ, కీన్స్ మరియు రాబర్ట్‌సన్ లు ఈయనకు అధ్యాపకులు. 1936లో భారతదేశం తిరిగివచ్చి ఇండియన్ సివిల్ సర్వీసులో చేరాడు. బీహర్లోని అనేక జిల్లాల్లోనూ, రాష్ట్ర సెక్రటేరియట్లోనూ పనిచేసిన తర్వాత 1942లో ఈయన కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యాడు. పంపిణీ విభాగంలో డిప్యుటీ సెక్రటరీగాను, ఎగుమతులు దిగుమతుల ప్రధాన నియంత్రణాధికారిగానూ, వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగానూ, భారీ పరిశ్రమల శాఖలో సెక్రటరీగానూ అంచెలంచెలుగా పదవోన్నతలు పొందుతూ పనిచేశాడు. 1957-58లో గాట్ ఒప్పందపు సమావేశాలకు భారత ప్రధాన ప్రతినిధిగానూ, దాని ఛైర్మన్ గానూ పనిచేశాడు. 1960లో విత్త మంత్రిత్వ శాఖలోని ఆర్ధిక వ్యవహారాల సెక్రటరీ అయ్యాడు. 1964లో లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండగా అప్పుడే కొత్తగా సృష్టించిబడిన పదవిలో ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆ తరువాత అదే హోదాలో ఇందిరాగాంధీ హయాంలో కూడా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. "List of Governors". Reserve Bank of India. Retrieved 2006-12-08. 
  2. Jain, Manik (2004). 2004 Phila India Paper Money Guide Book. Kolkata: Philatelia. pp. 19,26, 35, and 61. 
  3. "L.K. Jha Memorial Lectures". Reserve Bank of India. Retrieved 2009-05-08. 

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్.కె.ఝా&oldid=1169534" నుండి వెలికితీశారు