ఐరీన్ జూలియట్ క్యూరీ
ఐరీన్ జూలియట్ క్యూరీ Irène Joliot-Curie | |
---|---|
జననం | పారిస్, ఫ్రాన్‍స్ | 1897 సెప్టెంబరు 12
మరణం | 1956 మార్చి 17 పారిస్, ఫ్రాన్‍స్ | (వయసు 58)
నివాసం | పారిస్, ఫ్రాన్‍స్ |
పౌరసత్వం | ఫ్రెంచి |
జాతీయత | ఫ్రెంచి |
రంగములు | రసాయన శాస్త్రం |
చదువుకున్న సంస్థలు | పారిస్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | పాల్ లాంగ్విన్ |
డాక్టొరల్ విద్యార్థులు | ఆమె కుమార్తెలు |
ముఖ్యమైన పురస్కారాలు | రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి (1935) |
ఐరీన్ జూలియట్ క్యూరీ (Irène Joliot-Curie) (1897 - 1956) సుప్రసిద్ధ వైజ్ఞానికవేత్త. ఈమె మేరీ క్యూరీ, పియరీ క్యూరీ దంపతుల పుత్రిక. ఐరీన్ కు, ఆమె భర్త ఫ్రెడెరిక్ జూలియట్ తో కలిపి సంయుక్తంగా 1935లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ చరిత్రలో క్యూరీ కుటుంబం నోబెల్ పురస్కారాల కుటుంబంగా పేరుపొందింది.[1]
తొలి రోజులు
[మార్చు]ఐరీన్ క్యూరీ 1897 సెప్టెంబరు 12వ తేదీన పారిస్లో జన్మించింది. వైజ్ఞానిక పరిశోధనల్లో మునిగితేలే తల్లిదండ్రుల మధ్య ఆమె బాల్యం గడిచింది. అందువలన వైజ్ఞానిక ప్రతిభ ఆమెకు ఉగ్గుపాలతో అందాయి. ఎంతగా పరిశోధనలో మునిగినా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించేవారు క్యూరీ దంపతులు.
ఐరీన్ ప్రాథమిక విద్య తర్వాత రేడియోగ్రాఫర్ నర్స్ గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఈమె 1925లో ఆల్ఫా కిరణాలపై పరిశోధన జరిపి విజ్ఞానశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను సంపాదించారు.
పరిశోధనలు
[మార్చు]మేరీ క్యూరీ నడిపే రేడియం ఇన్‍స్టిట్యూట్ లో ఫ్రెడెరిక్ జూలియట్ ఆమె అసిస్టెంటుగా పనిచేసేవారు. అతనితో ఐరీన్ కు బాగా పరిచయమై ఇరువురి అభిరుచులు, పనిచేసే రంగం, చోటు ఒక్కటే కావడం వల్ల ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ మేరీ పర్యవేక్షనలో పరిశోధన మొదలుపెట్టారు. ఆల్ఫా కిరణాల గురించి కొంత ప్రయోగం జరిపి వుండడం వలన ఐరీన్, రేడియోధార్మికత గురించి అధ్యయనం చేయనారంభించారు. ప్రకృతి సిద్ధమైన కృత్రిమమైన రేడియో ధార్మికతల గురించి, మూలతత్వల మార్పు, న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి నిర్ధిష్టంగా ప్రయోగాలు చేశారు. ఫలితంగా రేడియోధార్మికత మూలతత్వాల కృత్రిమ నిర్మాణం గురించి ఆమె కనుక్కొన్నారు.[2][3][4] ఈ పరిశోధనకే 1935లో తన భర్త ఫ్రెడరిక్ తో కలిసి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. తన ప్రయోగాలతో ఇతర మూలతత్వాలను ఆధారంగా తీసుకొని కూడా కృత్రిమంగా రేడియోధార్మిక తత్వాలను సృష్టించవచ్చునని కనుగొన్నారు. నోబెల్ బహుమతిని అందుకున్న తరువాత, 1938లో న్యూట్రాన్ యొక్క భారీ తత్వాల ప్రభావంతో యురేనియంని విడగొట్టే దిశగా మహత్తరమైన ప్రయోగాలు చేశారామె.
1932 నుండి పారిస్ ఫాకల్టీ ఆఫ్ సైన్సెస్ లో వ్యాఖ్యాతగా పనిచేసిన ఐరీన్, 1937 నాటికి అక్కడే ప్రొఫెసర్ గా నియమించబడ్డారు. 1946లో ఐరీన్ రేడియం ఇన్‍స్టిట్యూట్ కి డైరెక్టర్ అయ్యారు. దేశంలోని పరమాణు శక్తి కేంద్రం కమీషనర్ గా 6 సంవత్సరాఉ పనిచేశారు. "ఆర్‍సే"లో న్యూక్లియర్ ఫిజిక్స్ కేంద్రాన్ని స్థాపించింది. ఆ కేంద్రంలో ఎక్కువ శక్తి గలిగిన "సిన్‍క్రో సైక్లోట్రాన్"ను రూపొందించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఐరీన్, ఫ్రెడెరిక్ 1926 లో వివాహం తర్వాత వారి ఇంటిపేరును జూలియట్ క్యూరీగా మార్చుకున్నారు. పదకొండు నెలల తర్వాత పుట్టిన హెలెన్ లాంగ్విన్ జూలియట్ కూడా ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తగా పెరిగింది. 1932లో జన్మించిన వీరి కుమారుడు పియరీ జూలియట్, జీవశాస్త్రవేత్తగా మారాడు.
ఐరీన్ వరల్డ్ పీస్ కౌన్సిల్ (World Peace Council) సభ్యురాలుగా ఉంది. ఈమెకు అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు లభించాయి.
ఐరీన్ 1956 మార్చి 17 తేదీన పారిస్లో ల్యుకీమియా వ్యాధితో మరణించింది.[5] ఆమె తర్వాత 'ఆర్‍సే' న్యూక్లియర్ ఫిజిక్స్ బాధ్యతను ఆమె భర్త ఫ్రెడెరిక్ జూలియట్ స్వీకరించారు.
మూలాలు
[మార్చు]- ↑ "Nobel Laureates Facts: 'Family Nobel Laureates'". Nobel Foundation. 2008. Retrieved 2008-09-04.
- ↑ Irène Joliot-Curie (December 12, 1935). "Nobel Lecture: Artificial Production of Radioactive Elements".
- ↑ Frédéric Joliot (December 12, 1935). "Chemical Evidence of the Transmutation of Elements" (PDF).
- ↑ Byers; Moszkowski; Chadwick (via 1956 Nature obituary). "Irène Joliot-Curie Contributions and Bibliography". CWP.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Q&A: Polonium-210". Chemistry World. Royal Society of Chemistry. 27 November 2006. Retrieved 2008-09-04.
ఇంకా చదవండి
[మార్చు]- Opfell, Olga S. (1978). The Lady Laureates : Women Who have Won the Nobel Prize. Metuchen,N.J. & London: Scarecrow Press. pp. 165–182. ISBN 0810811618.