Jump to content

కొడవటిగంటి కుటుంబరావు

వికీపీడియా నుండి
(కొ.కు. నుండి దారిమార్పు చెందింది)
కొడవటిగంటి కుటుంబరావు
కొడవటిగంటి కుటుంబరావు
జననంకొడవటిగంటి కుటుంబరావు
అక్టోబర్ 28, 1909
గుంటూరు జిల్లా, తెనాలి
మరణంఆగష్టు 17, 1980
ఇతర పేర్లుకొడవటిగంటి కుటుంబరావు
ప్రసిద్ధిప్రసిద్ధ తెలుగు రచయిత.హేతువాది

కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28 - 1980 ఆగష్టు 17), ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు.

జీవితము

[మార్చు]

కొకు గుంటూరు జిల్లా, తెనాలి లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. చిన్నవయసులోనే 1914లో తండ్రీ, 1920లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేత వయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. 1925లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన పెళ్ళి జరిగింది.1925 నుండి 1927 వరకు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో మహారాజా కళాశాల, విజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన నాస్తికునిగా మారిపోయాడు.

1929లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. 1930లో కొకు తొలిరచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటి కథ ప్రాణాధికం గృహలక్ష్మి మాసపత్రికలో అగ్రస్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. 1931లో కొంతకాలం పాటు వరంగల్లులో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించాడు.

1939లో భార్య పద్మావతి మరణించింది. 1940 - 42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేసాడు. ఆ కాలంలో జరుక్‌శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక లోహపు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి 1943 జనవరి వరకు సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. 1944లో ఒడిషా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.

మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగిన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో 1945లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. 1948లో మూణ్ణెల్ల పాటు బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. 1948లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. 1952, జనవరి 1 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో కృషి సలిపాడు.

బుద్ధి కొలతవాదం

[మార్చు]

జగత్తులో స్థలము (space), కాలము (time) అనే రెండు కొలతలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జగత్తుకు ఈ రెండు కొలతలే కాకుండా బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుంది అనే సిద్ధాంతాన్ని బుద్ధికొలత వాదం అనే పేరుతో ఇతడు ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదన అనేక చర్చలకు దారితీసింది.

రచనలు

[మార్చు]

వ్యాఖ్యలు

[మార్చు]
  • సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది.
  • నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు.., అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు.
  • ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు
  • మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే
  • కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది. ఈ వ్యవస్థని ఉద్దేశించి అన్న వాక్యం)

బయటి లింకులు

[మార్చు]