చంబా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంబా
పట్టణం
చంబా
నదికి ఆవల చంబా పట్టణం
నదికి ఆవల చంబా పట్టణం
చంబా is located in Himachal Pradesh
చంబా
చంబా
చంబా is located in India
చంబా
చంబా
చంబా is located in Asia
చంబా
చంబా
Coordinates: 32°34′12″N 76°7′48″E / 32.57000°N 76.13000°E / 32.57000; 76.13000
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాచంబా జిల్లా
స్థాపన920
Elevation
996 మీ (3,268 అ.)
Population
 (2011)
 • Total19,933
Time zoneUTC+5:30
Post code
176310 , 176314
Area code+91-18992-xxxxx
Vehicle registrationHP-48 and HP-73

చంబా హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, చంబా జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది రావి నది ఒడ్డున, సాల్ నది సంగమం వద్ద ఉంది. చంబియల్‌లు చంబా రాజ్యాన్ని పాలించేవారు [1] చంబియళ్ళు తమ పేరు వెనుక వర్మ (లేదా వర్మన్) అనే ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు.

చంబా ప్రాంతపు చరిత్ర క్రీ.పూ 2 వ శతాబ్దానికి చెందిన కొలియన్ తెగలకు నాటిదే అయినప్పటికీ, ఔపచారికంగా (లాంచనంగా) ఈ ప్రాంతపు పాలన సా.శ 500 లో మారూ రాజుతో మొదలైంది. అతడు చంబా పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉన్న భర్మూర్‌ను రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించాడు. [2] సా.శ. 920 లో రాజా సాహిల్ వర్మ తన కుమార్తె చంపావతి [3] కోరిక మేరకు రాజధానిని చంబాకు మార్చాడు ( [3] ("చంబా" అనే పేరు ఆమె పేరు మీదుగానే వచ్చింది). రాజు మారూ కాలం నుండి చివరికి 1948 ఏప్రిల్‌లో ఇండియన్ యూనియన్‌లో విలీనం అయ్యే వరకూ ఈ రాజవంశానికి చెందిన 67 మంది రాజులు చంబాను పరిపాలించారు (1846 నుండి 1947 వరకు బ్రిటిషు వారి ఆధీనంలో భాగంగా) .

ఈ పట్టణంలో అనేక దేవాలయాలు, రాజభవనాలూ ఉన్నాయి. [3] [4] ఇక్కడ "సుహి మాతా మేళా", "మింజార్ మేళా" అనే రెండు ప్రసిద్ధ జాతరలు జరుగుతాయి. ఈ జాతరల్లో అనేక రోజుల పాటు సంగీతం, నృత్యోత్సవాలు జరుగుతాయి. 17 వ, 19 వ శతాబ్దాల మధ్య ఉత్తర భారతదేశంలోని పర్వతీయ రాజ్యాల్లో ఉద్భవించిన పర్వతీయ చిత్రకళకు, ఇతర హస్తకళలూ, వస్త్రాలకూ చంబా బాగా ప్రసిద్ది చెందింది. [5] [6] [7]

చరిత్ర[మార్చు]

చంబా చరిత్ర ప్రాచీనమైనది. చంబా జిల్లా చరిత్ర నుండి ఇది విడదీయరానిది. ఇక్కడి తొలి పాలకులు కోలియన్ తెగలకు చెందినవారు. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దంలో ఖశులు, ఆడుంబరులు ఈ ప్రాంతాన్ని పాలించారు. సా.శ. 4 వ శతాబ్దంలో గుప్తుల కాలంలో, ఠాకూర్లు, రాణాలూ పరిపాలించారు. 7 వ శతాబ్దం నుండి, గుర్జర ప్రతీహారులు లేదా రాజపుత్ర రాజవంశం అధికారంలోకి వచ్చింది. [8]

నరసింహ ఆలయం. జిల్లా పురాతన రాజధాని భర్మౌర్‌లో ఉంది. (1875).

సా.శ. 500 ప్రాంతంలో కల్పగ్రామ నుండి వాయవ్య భారతదేశానికి వెళ్లిన మారూ అనే వ్యక్తితో రాజపుత్ర పాలకుల చరిత్ర మొదలైనట్లు చెబుతారు. [9] అతను బుధాల్ నది లోయలో బ్రహ్మపుర అనే ప్రదేశంలో తన రాజధానిని స్థాపించాడు. తరువాత దానికి భర్మౌర్ అనే పేరు వచ్చింది. భర్మౌర్, నేటి చంబా పట్టణానికి తూర్పున 60 కి.మీ. దూరంలో ఉంది. మూడు వందల సంవత్సరాల పాటు రాజపుత్రులు భర్మౌర్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు.

అయితే, సా.శ. 920 లో, భర్మౌర్ రాజు రాజా సాహిల్ వర్మ (లేదా సాహిలా వర్మ) తన రాజధానిని బర్మౌర్ నుండి దిగువ రావి లోయలో మరింత కేంద్రస్థానంలో ఉన్న పీఠభూమికి మార్చి, ఆ నగరానికి చంపావతి అని పేరు పెట్టాడు. [9] ఈ పరివర్తన ఖచ్చితంగా ఎలా జరిగిందనే దానిపై చంబా చరిత్రలో విభిన్న కథనాలున్నాయి. ఒక కథనంలో, చాలాకాలం పాటు సంతానలేమితో బాధ పడిన తరువాత, వర్మకు పది మంది కుమారులు, "చంపావతి" అనే కుమార్తె కలిగారు. లోయలో కొత్త రాజధాని పట్టణం నిర్మించాలని చంపావతి తండ్రిని కోరింది. అయితే రాజు, ఆధునిక చంబా పరిసరాల్లోని భూమిని అప్పటికే కణ్వ బ్రాహ్మణులకు దానమిచ్చినందున, రాజధానిని మార్చడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. కొత్త రాజధానికి కోసం వారు తమ భూమిని అప్పగిస్తే, బ్రాహ్మణ కుటుంబంలో జరిగే ప్రతి వివాహానికీ ఎనిమిది చక్లీ లను (రాగి నాణేలు) బహుమతిగా ఇస్తానని చెప్పి రాజు ఆ సమస్యను పరిష్కరించాడు. ఈ విధంగా పొందిన భూమిలో, కొత్త రాజధానిని నిర్మించి, తన కుమార్తె పేరిట చంపా అని పేరు పెట్టారు. కాలక్రమంలో ఇది "చంబా" అయింది.

చంబా పేరు రావడానికి సంబంధించిన మరొక కథనం ఇలా ఉంది. రాచకుమారి చంపా, ఒక ఆశ్రమాన్ని తరచూ సందర్శిస్తూ ఉండేది. [10] రాజు, తన కుమార్తె శీలాన్ని అనుమానించి, ఒక రోజు ఆశ్రమానికి వెళ్తాడు. కాని ఆశ్చర్యకరంగా అక్కడ అతనికి తన కుమార్తె గానీ, సన్యాసి గానీ కనిపించలేదు. కుమార్తెపై అతని అనుమానాలు నిరాధారమైనవనీ, ఆమె నైతికతను అనుమానించినందుకు శిక్షగా ఆమెను శాశ్వతంగా అతని నుండి దూరం చేసినట్లూ అశరీరవాణి అతనికి చెబుతుంది [11] రాజు, పశ్చాత్తాపంతో, తన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ ఆశ్రమాన్ని ఒక గుడిగా మార్చి దాని చుట్టూ నగరాన్ని నిర్మించాడు. చంపావతి ఆలయం అనే ఈ గుడిలో నేటికీ రాజు కుమార్తెను దేవతగా పూజిస్తారు. సా.శ. 935 నుండి, ఏటా మింజార్ పండుగ లేదా ఉత్సవం జరుగుతూ ఉంది. [12] ఇది బైసాఖి మొదటి రోజుతో మొదలై, 21 రోజులు జరుగుతుంది.

ఆధునిక చరిత్ర[మార్చు]

సా.శ. 1806 లో, గూర్ఖాలు, స్థానిక పర్వత ప్రాంత నాయకులూ సంయుక్తంగా రాజా సంసార్ చంద్ దళాలపై దాడి చేసి ఓడించారు. రాజా, తన కుటుంబంతో పాటు కాంగ్రా కోటలో ఆశ్రయం పొందాడు . గూర్ఖాలు కాంగ్రా కోటను ముట్టడించి, కాంగ్రా, మహల్ మొహ్రియన్ కోట మధ్య ఉన్న ప్రాంతాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారు. గ్రామాలను నాశనం చేశారు. కోట ముట్టడి మూడేళ్లపాటు కొనసాగింది. సా.శ. 1809 లో, సన్సార్ చంద్ కోరిక మేరకు లాహోర్ సిక్కు పాలకుడు రాజా రంజిత్ సింగ్ గూర్ఖాలతో యుద్ధం చేసి, వారిని ఓడించాడు. అందుకుగాను సంసార్ చంద్, కాంగ్రా కోటనూ 66 గ్రామాలనూ సిక్కులకు అప్పగించి భారీగా మూల్యం చెల్లించుకున్నాడు. [13] రంజిత్ సింగ్ ఈ ప్రాంతాన్ని తన అధీనం లోకి తెచ్చుకుని, చంబా వద్ద ఒక దండును ఉంచాడు. కొండ రాజ్యాల నేతలు అతడికి కప్పం చెల్లించేలా చేసాడు. రంజిత్ సింగ్ కాంగ్రా పాలకుడు సంసార్ చంద్ కటోచ్తో సహా కొండ ప్రాంతాల నేతలను గద్దె దింపేసాడు. కాని చంబాను మాత్రం వదిలేసాడు. 1809 లో కటోచ్తో చర్చలలో చంబా మంత్రి నాథూ మధ్యవర్తిగా అతడికి అవసరమయ్యాడు. 1817 లో కాశ్మీర్‌లో శీతాకాలపు దండయాత్ర సందర్భంగా రంజిత్ సింగు తప్పించుకోవడానికి నాథూ తన గుర్రాన్ని ఇచ్చి సహాయం చేసాడు. [8]

చంబా లోయ, 1865

1845 లో, సిక్కు సైన్యం బ్రిటిష్ భూభాగంపై దాడి చేసింది. [8] బ్రిటిష్ వారు సిక్కు సైన్యాన్ని ఓడించి, చంబాను దీనమైన స్థితిలోకి నెట్టారు. ఆ తరువాత జరిగిన చర్చలలో చంబా మంత్రి బాఘా, ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతడి సలహా మేరకు చంబా రాజులు, బ్రిటిషు వారి ఆధిపత్యంలో, జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా ఉండేందుకూ, అందుకు ప్రతిగా రూ .12 వేల వార్షికం పొందేందుకూ అంగీకరించారు. లాహోర్ ఒప్పందంపై 1846 లో సంతకం చేసారు. దీనిలో రాజాలు చంబా జిల్లా భూభాగాన్ని వదులుకోవడానికి అంగీకరించారు. [14] అప్పటి నుండి, బ్రిటిషు వారితో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేవి. బ్రిటిషు పాలనలో చంబా రాజులు, శ్రీ సింగ్, గోపాల్ సింగ్, షామ్ సింగ్, భూరి సింగ్, రామ్ సింగ్, లక్ష్మణ్ సింగ్ అందరూ బ్రిటిష్ సైనికాధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు.

బ్రిటిషు వారి హయాంలో చంబాలో అనేక ప్రగతిశీల సంస్కరణలు, పరిణామాలూ చోటు చేసుకున్నాయి. [8] 1863 లో, చంబాలో మొదటి తపాలా కార్యాలయం స్థాపించారు. రోజువారీ మెయిల్ సేవ మొదలు పెట్టి, ఒక ప్రాథమిక పాఠశాల తెరిచారు. [15] 1866 డిసెంబరులో, కాశ్మీర్ మెడికల్ మిషన్‌కు చెందిన డాక్టర్ ఎల్మ్స్లీ ఒక ఆసుపత్రిని ప్రారంభించారు. 1860 ల చివరలో కొల్రి, ఖాజియార్ ల మీదుగా డల్హౌసీకి రెండు కొత్త రహదారులను నిర్మించారు. 1870 నుండి 1873 వరకు పరిపాలించిన గోపాల్ సింగ్, పదవీ విరమణ చేసిన తరువాత, తన వేసవి నివాసంగా గ్రాండ్ జందరిఘాట్ ప్యాలెస్‌ను నిర్మించాడు. [16]

1948 ఏప్రిల్ 15 న మండి - సుకేట్ రాజ్యం, సిర్మౌర్ రాజ్యం, సిమ్లా కొండలలోని వారందరితో పాటు చంబా సంస్థానం భారతదేశంతో విలీనం అయింది. [8]

భౌగోళికం, వాతావరణం[మార్చు]

పట్టణం ఎగువ భాగం, దాని చుట్టూ ఉన్న పర్వతాల పానోరామా దృశ్యం

చంబా పట్టణం, చంబా జిల్లాకు ముఖ్య పట్టణం. నైఋతి, పశ్చిమాల్లో జమ్మూ కాశ్మీరు, ఉత్తరం, ఈశాన్యాల్లో లడఖ్, లాహౌల్ స్పితి, బారా బంఘాల్ లు, ఆగ్నేయంలో కాంగ్రా, దక్షిణాన పంజాబ్కు చెందిన పఠాన్‌కోట్ జిల్లాలు జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి.. దీని సగటు ఎత్తు 1,006 మీటర్లు. [17]

పట్టణం, జిల్లా, పట్టణం ఉన్న లోయ - వీటన్నిటికీ చంబా అనే పేరే ఉంది. రావి నది, దాని ఉపనది అయిన సాల్ నదుల సంగమం వద్ద చంబా పట్టణం ఉంది. తూర్పు వైపు నేపథ్యంగా షా మాదర్ కొండ ఉంది. [18] రావి నది తూర్పు-పడమర దిశలో ప్రవహిస్తూ లోతైన లోయలను ఏర్పరచింది. వసంత ఋతువులో, వేసవి నెలలలో మంచు కరగడం వలన నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరదలు వచ్చే ప్రమాదం ఉంది. [19] 2005 జూలైలో నదికి వచ్చిన వరదల కారణంగా, జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ వారి 300-మెగావాట్ల చమేరా విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపేయవలసి వచ్చింది.

రావి నదికి కుడి గట్టున, వరుసగా చదునైన క్షేత్రాలపై నిర్మించిన ఈ పట్టణాన్ని ఆవరిస్తూ, ధౌలాధర్, జాన్స్కర్ శ్రేణులున్నాయి. [18] [20] చంబా, కొండ ప్రదేశమైనప్పటికీ, సిమ్లా, ఢిల్లీ, చండీగఢ్ సహా ఇతర రాష్ట్రాలతో చక్కటి రహదారి సౌకర్యాలున్నాయి. [21] [22] [23] సమీప బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్లు చక్కి బ్యాంక్, పఠాన్ కోట్ (రోడ్డు ద్వారా 125 కి.మీ. ) వద్ద ఉన్నాయి.

శీతోష్ణస్థితి డేటా - Chamba, Himachal Pradesh (1961–1990, rainfall 1951–2000)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 25.3
(77.5)
26.2
(79.2)
29.9
(85.8)
38.5
(101.3)
42.3
(108.1)
38.6
(101.5)
39.5
(103.1)
36.6
(97.9)
35.2
(95.4)
32.6
(90.7)
28.3
(82.9)
25.0
(77.0)
42.3
(108.1)
సగటు అధిక °C (°F) 17.9
(64.2)
20.5
(68.9)
22.9
(73.2)
28.8
(83.8)
33.5
(92.3)
32.3
(90.1)
32.6
(90.7)
30.7
(87.3)
29.2
(84.6)
28.2
(82.8)
23.4
(74.1)
19.7
(67.5)
26.6
(80.0)
సగటు అల్ప °C (°F) 4.2
(39.6)
5.6
(42.1)
7.3
(45.1)
13.2
(55.8)
17.3
(63.1)
20.5
(68.9)
21.5
(70.7)
21.1
(70.0)
18.5
(65.3)
13.7
(56.7)
8.9
(48.0)
5.7
(42.3)
13.1
(55.6)
అత్యల్ప రికార్డు °C (°F) 0.1
(32.2)
0.4
(32.7)
2.1
(35.8)
0.0
(32.0)
6.0
(42.8)
8.5
(47.3)
8.0
(46.4)
10.5
(50.9)
5.0
(41.0)
1.0
(33.8)
0.5
(32.9)
0.0
(32.0)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 73.6
(2.90)
117.1
(4.61)
159.8
(6.29)
100.0
(3.94)
88.4
(3.48)
103.5
(4.07)
169.2
(6.66)
168.3
(6.63)
101.7
(4.00)
32.7
(1.29)
25.8
(1.02)
50.8
(2.00)
1,190.9
(46.89)
సగటు వర్షపాతపు రోజులు (≥ 2.5 mm) 5.0 6.0 7.6 5.5 5.5 6.6 10.8 10.0 4.9 2.2 1.9 3.0 69
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 77 75 78 67 58 62 78 81 80 73 72 75 73
Source: India Meteorological Department[24]

జనాభా వివరాలు[మార్చు]

2011 భారత జనా గణన ప్రకారం, చంబా జనాభా 20,312. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. చంబా అక్షరాస్యత 81%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 85%, స్త్రీ అక్షరాస్యత 77%. పరిపాలనా భాష హిందీ. స్థానికంగా మాట్లాడే భాష చంబేలి. పంజాబీ, పష్తో మాట్లాడే సిక్కు, హిందూ సంతతికి చెందినవారు కూడా కొందరున్నారు. వారు 1947 దేశవిభజన తరువాత ఇక్కడకు వచ్చారు.

పట్టణ కేంద్రానికి దూరంగా, చంబా లోని గిరిజన ప్రజల్లో రెండు ప్రధాన సమూహాలున్నాయి: గుజ్జర్లు, గద్దీలు. [25] గుజ్జర్లు, ప్రధానంగా సంచార జాతులు. వాళ్ళు వాణిజ్య మార్గాల్లో కాశ్మీర్ నుండి రాష్ట్ర సరిహద్దు మీదుగా చంబాకు వచ్చారు. వాళ్ళు ఇస్లామిక్ సమాజంలోని సంచార పశువుల కాపరులు. శీతాకాలంలో చంబా కొండలలో ఉండే విపరీతమైన చలి నుండి తప్పించుకునేందుకు తమ పశువులతో సహా లోతట్టు పంజాబుకు వెళతారు. తుర్కిక్ లక్షణాలుండే వీళ్ళు, భాష , సంస్కృతుల్లో చంబా పట్టణ వాసుల కంటే విభిన్నంగా ఉంటారు.

గద్దీల్లో అనేక జాతులున్నాయి; అవి బ్రాహ్మణులు, రాజపుత్రు‌లు, ఠాకూర్‌లు, రాఠీలు, ఖాత్రిలు, ఈ జాతుల్లో మెజారిటీ. [25] వారు రైతులు. "గద్దీ" అంటే "గొర్రెల కాపరి" అని అర్ధం. వారు ప్రధానంగా చంబా జిల్లాలో ని ధౌలా ధార్ పర్వతాలలో నివసిస్తారు. దీనిని బ్రహ్మౌర్ వజారత్ లేదా "గదారన్" అని పిలుస్తారు. ఇది చంబా, కాంగ్రాల మధ్య ఉంది. "గదర్" అంటే గొర్రెలు, కాబట్టి వారి భూమిని అనధికారికంగా "గదరన్" అని అంటారు. అంటే "గొర్రెల దేశం" అని అర్ధం. మొఘల్ సామ్రాజ్య కాలంలో 18 వ శతాబ్దంలో లాహోర్ నుండి చంబాకు గద్దీ ప్రజల వలస ప్రవాహం ఉన్నప్పటికీ, వారు 10 వ శతాబ్దంలోనే చంబాకు వచ్చారని భావిస్తారు. [7] వారు శివుణ్ణి, జంతువులనూ ఆరాధిస్తారు.

మూలాలు[మార్చు]

 1. Aśoka Jeratha (1998). Dogra legends art and culture. Chamba: Indus Publishing, 1998. pp. 271 pages. ISBN 9788173870828.
 2. Sharma & Sethi (1997), p.34
 3. 3.0 3.1 3.2 Bhatnagar (2008), pages 39-44
 4. "Places of Interest in Chamba". National Informatics Centre:Government of Chamba district. Archived from the original on 20 October 2009. Retrieved 28 October 2009.
 5. "Hindu Hill Kingdoms". Victoria and Albert Museum. Archived from the original on 30 March 2010. Retrieved 6 April 2010.
 6. "PahariKamat".
 7. 7.0 7.1 Bradnock (2000), p.211
 8. 8.0 8.1 8.2 8.3 8.4 "Chamba at Glance:History". National Informatics Centre:Government of Chamba district. Retrieved 28 October 2009.
 9. 9.0 9.1 Bharati (2001), pp.16-23
 10. Bharati (2001), pp.23-24
 11. Bharati (2001), p.24
 12. "Introducing Chamba". Lonely Planet. Retrieved 6 April 2010.
 13. htm
 14. Archer (1973), p.68
 15. Pramanik, Prabal. "History of Chamba". Chamba Heritage. Archived from the original on 29 October 2010. Retrieved 6 April 2010.
 16. "CHAMBA: Gopal Singh, Raja of Chamba (ruled 1870-1873)". British Library. Archived from the original on 2021-10-19. Retrieved 2020-11-13.
 17. "About Chamba". Himachal Pradesh Tourism Department. Archived from the original on 31 August 2009. Retrieved 28 October 2009.
 18. 18.0 18.1 Bharati (2001), p.16
 19. "Chamera power station shut down". The Tribune (Himachal Pradesh). 6 July 2005. Retrieved 6 April 2010.
 20. Bhatnagar (2008), p.40
 21. "Chamba Hill station". Archived from the original on 15 July 2009. Retrieved 29 October 2009.
 22. "Access to Chamba". National Informatics Centre:Government of Chamba district. Archived from the original on 8 December 2008. Retrieved 29 October 2009.
 23. "Chamba Tourism". India Line. Retrieved 28 October 2009.[permanent dead link]
 24. "Climate of Himachal Pradesh" (PDF). Climatological Summaries of States Series - No. 15. India Meteorological Department. January 2010. pp. 36–42. Archived (PDF) from the original on 20 February 2020. Retrieved 8 March 2020.
 25. 25.0 25.1 Pramanik, Prabal. "Gaddis and Gujjars". Chamba Heritage. Archived from the original on 29 October 2010. Retrieved 6 April 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=చంబా&oldid=4022156" నుండి వెలికితీశారు