Jump to content

చెరుకుమల్లి సూర్యప్రకాశ్

వికీపీడియా నుండి
చెరుకుమల్లి సూర్యప్రకాశ్
చెరుకుమల్లి సూర్యప్రకాశ్
జననం1940
మధిర, ఖమ్మం జిల్లా, తెలంగాణ
మరణంమే 22, 2019
నివాస ప్రాంతంహైదరాబాదు
ప్రసిద్ధిచిత్రకళారంగం
మతంహిందూ
తండ్రిహనుమంతయ్య

చెరుకుమల్లి సూర్యప్రకాశ్ (1940 - మే 22, 2019) తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. ఆయిల్‌, అక్రిలిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్స్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు.[1][2]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

సూర్యప్రకాశ్ 1940లో హనుమంతయ్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మధిరలో జన్మించాడు. పాఠశాల, ఇంటర్‌ విద్య మధిరలో చదివిన సూర్యప్రకాశ్ 1961లో హైదరాబాదు మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల నుండి డిగ్రీ పట్టా అందుకున్నాడు.[3][4]

చిత్రకళారంగం

[మార్చు]

కళాశాలలో చదువుతున్న సమయంలోనే హైదరాబాదులోని వివిధ గల్లీలను చిత్రీకరించేవాడు. చిత్రకళపై ఉన్న ఇష్టంతో 1964లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వదులుకొని, ఢిల్లీ చిత్రకారుడు రామ్‌ కుమార్‌ దగ్గర 6 నెలలుపాటు శిక్షణ తీసుకున్నాడు.[5]

సూర్యప్రకాశ్‌ 1960ల్లో ఆటోమొబైల్‌ వ్యర్థాలు, పాత ఇనుప వస్తువులతో వివిధ కళాకృతులను రూపొందించగా వాటికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. అలానే ఆయిల్‌, ఆక్రిలిక్‌ పెయింటింగ్స్‌ వంటి ప్రక్రియలల్లో కొన్ని వందల బొమ్మలు గీశాడు. యూరోపియన్‌ ఆర్ట్‌కు చెందిన డాట్‌ ఆర్ట్‌లో కూడా సూర్యప్రకాశ్‌ ప్రయోగాలు చేసి, నీటిపై తేలాడినట్లు ఉండే ఇటలీలోని వెనిస్ నగరాన్ని చిత్రీకరించాడు. 1970లలో శ్రీనగర్ కాలనీలో ‘సూర్య ఆర్ట్‌ గ్యాలరీ’ని ప్రారంభిం, అనేక ఔత్సాహిక, వర్ధమాన చిత్రకారులను ప్రోత్సహించాడు. సీసీఎంబీ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో అనేక ఆర్ట్‌ క్యాంపులను నిర్వహించి, ఆ శిక్షణా శిబిరాలకు ఎం.ఎఫ్. హుసేన్, చైనాకు చెందిన లియాన్‌ వంటి చిత్రకారులను ఆహ్వానించాడు. ఎల్వీప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చనిపోయేవరకు సంస్థాగత చిత్రకారుడిగా పనిచేశాడు. ఆస్పత్రి ప్రాంగణంలోనే సూర్యప్రకాశ్‌ ప్రత్యేక ఆర్ట్‌ స్టూడియోను ప్రారంభించాడు. సూర్యప్రకాశ్‌ కళారంగ జీవితం గురించి ‘ఏ అబ్‌స్ట్రాక్ట్‌ రియాల్టీ’, ‘ఏ పర్స్‌పెక్టీవ్‌ ఐ’ పేరుతో పుస్తకాలు వెలువడడమేకాకుండా, మన్మోహన్‌ దత్‌, సిసిర్‌ సహానా అనే చిత్రకారులు డాక్యుమెంటరీలనూ కూడా రూపొందించారు.

40ఏళ్ళ క్రితమే డెన్మార్క్, స్వీడన్, నార్వే, జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండు, బ్రిటన్‌ తదితర దేశాల్లోని చిత్రప్రదర్శనలలో సూర్యప్రకాశ్‌ గీసిన బొమ్మలకు మంచి గుర్తింపు లభించింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రప్రదర్శనలలో పాల్గొనమేకాకుండా దాదాపు డెభ్భైకి పైగా సోలో ఎగ్జిబిషన్స్‌ ఏర్పాటుచేశాడు.

పురస్కారాలు

[మార్చు]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సూర్యప్రకాష్
  1. హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ బంగారు పతకం (1963)
  2. రాష్ట్ర ప్రభుత్వ లలితకళా అకాడమీ గోల్డ్‌మెడల్‌ (1966)
  3. న్యూఢిల్లీ లలిత కళా అకాడమీ జాతీయస్థాయి అవార్డు (1966)
  4. న్యూఢిల్లీ లలిత కళా అకాడమీచే సూర్యప్రకాశ్‌ మోనోగ్రాఫ్ ప్రచురణ (1978)
  5. జాతీయ సాంస్కృతిక శాఖ నుండి నాలుగేళ్లపాటు సీనియర్‌ ఫెల్లోషిప్‌ హోదా (1982)
  6. న్యూఢిల్లీ లలిత కళా అకాడమీ ఎమినెంట్‌ పెయింటర్‌ గుర్తింపు
  7. ఆల్‌ఇండియా ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ సొసైటీ న్యూఢిల్లీ వారి కళా విభూషణం అవార్డు (1997)
  8. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం, (జూన్ 2, 2018)[6][7][8]

మరణం

[మార్చు]

2019, మే 22 బుధవారంరోజున ఉదయం గం. 8.30ని.లకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.[9][10][11]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (23 May 2019). "చిత్రకారుడు సూర్యప్రకాశ్‌ కన్నుమూత". Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
  2. Deccan Chronicle, Nation News (22 May 2019). "Surya Prakash, known for abstract realism, dead". Lakshmi Nambiar. Archived from the original on 22 May 2019. Retrieved 24 May 2019.
  3. The Hindu, Entertainment-Art (22 May 2019). "The sun sets". Archived from the original on 22 May 2019. Retrieved 24 May 2019.
  4. సాక్షి, తెలంగాణ-హైదరాబాదు (22 May 2019). "ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్‌ కన్నుమూత". Archived from the original on 22 May 2019. Retrieved 24 May 2019.
  5. Telangana Today, Hyderabad (22 May 2019). "Artist Surya Prakash no more". Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
  6. నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 2018-06-14. Retrieved 24 May 2019.
  7. ఆంధ్రజ్యోతి (31 May 2018). "విశిష్ట పురస్కారాలు". Retrieved 24 May 2019.[permanent dead link]
  8. మనం న్యూస్ (6 June 2018). "తెలంగాణ కళకు ఘనసత్కారం". Retrieved 24 May 2019.[permanent dead link]
  9. ఈనాడు, రాష్ట్ర వార్తలు (23 May 2019). "చిత్రకారుడు సూర్యప్రకాష్‌ మృతి". Archived from the original on 2019-05-23. Retrieved 24 May 2019.
  10. "Noted artist Surya Prakash dead". The Hindu BusinessLine. M Somasekhar. 22 May 2019. Archived from the original on 22 May 2019. Retrieved 24 May 2019.
  11. The New Indian Express, Telangana (23 May 2019). "Acclaimed artist Surya Prakash is no more". Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.