చార్లెస్ డార్విన్

వికీపీడియా నుండి
(ఛార్లెస్ డార్విన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఛార్లెస్ డార్విన్
చార్ల్కెస్ రాబర్ట్ డార్విన్ (1809-1882), 51 ఏళ్ళ వయసులో.
ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ను ప్రచురించిన కొత్తలో.
జననం(1809-02-12)1809 ఫిబ్రవరి 12
మౌంట్ హౌస్, ష్ర్యూస్‌బరి, ష్రోప్‌షైర్, ఇంగ్లాండు
మరణం1882 ఏప్రిల్ 19(1882-04-19) (వయసు 73)
డౌన్‍హౌస్, డౌనే, కెంట్, ఇంగ్లాండు
నివాసంఇంగ్లాండు
జాతీయతబ్రిటిష్
రంగములుప్రకృతివేత్త
వృత్తిసంస్థలురాయల్ జియోగ్రాఫికల్ సొసైటి
చదువుకున్న సంస్థలుఎడిన్‌బరో యూనివర్శిటీ
కేంబ్రిడ్జ్ యూనివర్సిటి
విద్యా సలహాదారులుఆడమ్ సెగ్విక్
జాన్ స్టీవెన్స్ హెన్‌స్లో
ప్రసిద్ధిబీగిల్ ఓడపై ప్రయాణం
ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్
సహజ ఎంపిక
ప్రభావితం చేసినవారుచార్లెస్ లియెల్
ప్రభావితులుథామస్ హెన్రీ హక్స్‌లీ
జార్జి జాన్ రోమనెస్
ముఖ్యమైన పురస్కారాలురాయల్ మెడల్ (1853)
వొల్లాస్టన్ మెడల్ (1859)
కోప్లే మెడల్ (1864)
సంతకం
గమనికలు
అతడు ఎరాస్మస్ డార్విన్ మనవడు, జోసియా వెడ్జ్‌వుడ్ మనవడు ఎమ్మా వెడ్జ్‌వుడ్‌ను పెళ్ళి చేసుకున్నాడు.

చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809 ఫిబ్రవరి 12 – 1882 ఏప్రిల్ 19) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది. డార్విన్, ఒక ప్రకృతి శాస్త్రవేత్తగా, జియాలజిస్టుగా, బయాలజిస్టుగా, రచయితగా ప్రసిద్ధుడు. ఒక వైద్యుని వద్ద సహాయకుడిగాను, రెండేళ్ళ పాటు వైద్య విద్యార్థిగాను ఉన్న డార్విన్, ఆధ్యాత్మిక విద్య చదువుకున్నాడు. జంతు చర్మాల్లో గడ్డి లాంటి వాటిని కూరి వాటిని బ్రతికున్నవి లాగా కనబడేలా చేసే పనిలో శిక్షణ పొందాడు.</ref> ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[1] అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు. ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది. విజ్ఞాన శాస్త్రంలో దీన్ని ఒక మౌలికమైన భావనగా భావిస్తారు.[2][3]

ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్‌ తో కలసి ప్రచురించిన పరిశోధనా పత్రంలో అతను, తన శాస్త్రీయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం, ప్రకృతివరణం అని పిలిచే ఒక ప్రక్రియ వల్ల ఈ శాఖలుగా చీలడం జరుగుతూ వచ్చింది.[4]

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడు[5][6]. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా అతడు చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధి అని ఉపాధ్యాయులు భావించేవారు. అతను చిన్ననాటి నుండి కీటకాలను, ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16 యేండ్ల వయస్సులో వైద్య విద్య చదవటం కోసం అతన్ని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో చేర్పించారు. కాని మత్తుమందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి, ఆ చిత్రహింసకు కలత చెంది, వైద్యవిద్యపై మనసు పెట్టి చదవలేక పోయాడు[7][8]. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరిక మేరకు కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరాడు. అక్కడి ప్రొఫెసర్‌ ఓసారి అతడికి ఓ ఓడ కెప్టెన్‌ను పరిచయం చేశాడు. ఆ కెప్టెన్‌ నడిపే ఓడ పేరు 'బీగల్‌'. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్‌ తన తండ్రి వద్దంటున్నా వినకుండా బీగిల్ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో ప్రకృతివరణం (నేచురల్ సెలక్షన్) ద్వారా పరిణామం చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, డీఎన్‌ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.

డార్వినిజం

[మార్చు]

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలను వ్యతిరేకించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి ఒక రకమైన తోక లేని కోతి (వాలిడి) జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్టు చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది. మలేషియా నుంచి రస్సెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్ 1844లో తన రచననూ, వాలేస్ పంపిన వ్యాసాన్నీ లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలను పరిశీలించారు. 1844లో డార్విన్ తన వ్యాసాన్ని మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.

ప్రకృతివరణ వాదము

[మార్చు]

1831 లో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం యురోపియన్ దేశాలను చుట్టిరావటానికి బయలు దేరిన బీగల్ ఓడలో ప్రకృతివేత్తగా ప్రయాణం చేసే అవకాశం డార్విన్ కి లభించింది. ఈ అవకాశం ఆయన పాలిట సువర్ణావకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఆధారభూతమైనది. అయిదేళ్ళపాటు కొనసాగిన ఈ సముద్ర యానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను దర్శించాడు. ప్రకృతికి, జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ ఆలోచన ఫలితమే ప్రకృతివరణ సిద్ధాంతంగా (నేచురల్ సెలక్షన్ థీరీ) గా పరిణమించింది.

వివరణ

[మార్చు]

ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతం చెప్పే ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే ననీ ఇది చెబుతుంది. గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులు గానూ, మరికొన్ని మాంసాహారులు గానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.

ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తర దిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవ సమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషి జాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. దీని కారణంగానే జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు కాదు.

పరిశోధనలు

[మార్చు]

సరిగ్గా ఈ సమయంలోనే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలేస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే వెలువరించాడు. డార్విన్ కు ఉత్తరం కూడా రాసాడు. 1858 లో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా! 1859 లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు. ఈ పుస్తకం విడుదలైన రోజునే ఆన్ని ప్రతులూ అమ్ముడు పోయి సరికొత్త రికార్డును సృష్టించింది.[9]

పరిణామ సిద్ధాంతం

[మార్చు]

జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థక జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిధ్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం. అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు. అయితే బైబిల్ లో చెప్పినట్లు ఏడు రోజుల లోనే సమస్త సృష్టి, సకల జీవ జలాలు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం.

ప్రశంసలు

[మార్చు]

చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.

విమర్శలు

[మార్చు]

కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్ఠివాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిధ్ధాంతాన్ని నిషేధించారు. ఈ సిద్ధాంతం తప్పని, జీవ పరిణామక్రమం జరగలేదని వాదించేవారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ యహ్యా ఒకరు.

రచనలు

[మార్చు]

1868 లో డార్విన్ "ది వారియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. "ఇంసెక్టివోరస్ ప్లాంట్స్" "డీసెంట్ ఆఫ్ మ్యాన్", "ది ఫార్మేషన్ ఆఫ్ గజిటబుల్ మౌల్డ్ థ్రూ ది ఏక్షన్ ఆఫ్ వర్మ్స్" వంటి వి ఈయన రాసిన మరికొన్ని పుస్తకాలు.[10]

అస్తమయం

[మార్చు]

డార్విన్ 74 యేండ్ల వయస్సులో చనిపోయాడు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన్ను కూడా సమాధి చేసారు. డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతివరణ సిద్దాంతం నిలిచే ఉంటుంది.[11][12]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. van Wyhe 2008.
  2. Coyne, Jerry A. (2009). Why Evolution is True. Viking. pp. 8–11. ISBN 978-0-670-02053-9.
  3. Coyne, Jerry A. (2009). Why Evolution is True. Viking. pp. 8–11. ISBN 978-0-670-02053-9.
  4. Larson 2004, pp. 79–111
  5. Desmond, Adrian J. (13 September 2002). "Charles Darwin". Encyclopædia Britannica. Archived from the original on 6 February 2018. Retrieved 11 February 2018.
  6. John H. Wahlert (11 జూన్ 2001). "The Mount House, Shrewsbury, England (Charles Darwin)". Darwin and Darwinism. Baruch College. Archived from the original on 6 డిసెంబరు 2008. Retrieved 26 నవంబరు 2008.
  7. Smith, Homer W. (1952). Man and His Gods. New York: Grosset & Dunlap. pp. 339–40.
  8. Darwin 1958, pp. 46–48.
  9. Desmond & Moore 1991, pp. 412–441, 457–458, 462–463Desmond & Moore 2009, pp. 283–284, 290–292, 295
  10. Freeman 1977, p. 122
  11. Colp, Ralph (2008). "The Final Illnes [sic]". Darwin's Illness. pp. 116–120. doi:10.5744/florida/9780813032313.003.0014. ISBN 978-0-8130-3231-3.
  12. Clayton, Julie (24 June 2010). "Chagas disease 101". Nature. 465 (n7301_supp): S4–S5. Bibcode:2010Natur.465S...3C. doi:10.1038/nature09220. PMID 20571553. S2CID 205221512.

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]