జి. వి. కృష్ణారావు
గవిని వెంకట కృష్ణరావు | |
---|---|
జననం | గవిని వెంకట కృష్ణరావు 1914 గుంటూరు జిల్లా కూచిపూడి (అమృతలూరు) గ్రామం |
మరణం | ఆగష్టు 23, 1979 |
వృత్తి | తత్త్వవేత్త, రచయిత |
జీవిత భాగస్వామి | యశోదమ్మ |
పిల్లలు | జి. ఉమాదేవి, జి. శోభాదేవి |
తల్లిదండ్రులు |
|
డా. జి.వి.కృష్ణరావు (1914 - ఆగష్టు 23, 1979) [1] హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించాడు. గుంటూరు జిల్లా, కూచిపూడి గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో పట్టభద్రుడై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంథాలు రాశాడు. కళాపూర్ణోదయం సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందాడు.
జీవన సంగ్రహం
[మార్చు]గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించాడు. బక్కపలచటి శరీరం, ఆలోచనాత్మకమైన చూపులు, సునిశిత మేధ ఆయన లక్షణాలు. తురుమెళ్ళ, కొల్లూరు హైస్కూళ్లలో పాఠశాల విద్య అభ్యసించాడు. ఏసి కాలేజి, గుంటూరు నుండి 1937లో పట్టభద్రులై, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఎం. ఏ. 1914లో పూర్తి చేశాడు. కాశీలో వుండగా మార్క్స్ సిద్ధాంతాల ప్రభావం ఆయనపై పడింది. మార్క్స్ సిద్ధాంతాల జాడలో కావ్య జగత్తు అనే సాహిత్య గ్రంథం వ్రాశాడు.
కాలక్రమేణా ఎం.ఎన్.రాయ్ ఉద్యమ ప్రభావానికి లోనయ్యాడు. విగ్రహవ్యావర్తిని అనే తాత్విక సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. నాగార్జునాచార్యుని శూన్యవాదాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తల సరళిని కృష్ణారావు ఆకళింపు చేసుకొన్నాడు. ప్లేటో ఆదర్శ రాజ్యాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వారికి తెలుగులోకి అనువదించాడు.
జేగంటలు, కీలుబొమ్మలు, వరూధిని శివరాత్రి, యుగసంధ్య ఈయన ఇతర రచనలు. బొమ్మ ఏడ్చింది, భిక్షా పాత్ర వంటి నాటికలు ఆదర్శ శిఖరాలు అనే పేరుతో సంపుటిగా వెలువరించాడు. కీలుబొమ్మలు నవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. పాపికొండలు, రాగరేఖలు, జఘన సుందరి వీరి నవలల్లో ప్రసిద్ధాలు. గ్రామీణ జన జీవనాన్ని అద్దంపట్టే కథలు చైత్రరథం పేరుతో సంపుటిగా వేశాడు. ఉదయబిందువులు యితర రచనల సంపుటి. నవ్యతోరణం వేదవ్యాస సంపుటి ప్రకటించాడు.
"Studies in Kalapoornodayam" అనే సిద్ధాంత గ్రంథాన్ని పరిశోధనకు సమర్పించి Ph.D. పట్టా మదరాసు విశ్వవిద్యాలయం నుండి పొందాడు. పింగళి సూరనపై యిది యిప్పటికీ అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. తత్వవేత్త అయిన కాంట్ పరతత్వ వాదాన్ని ఆయన సునిశితంగా పరిశీలించాడు.
ఆంధ్రప్రభలో సబ్‌ఎడిటర్‌గా, ఎడిటర్‌గా రాడికల్ డెమోక్రాట్, విహారి, దేశాభిమాని, విజయప్రభ పత్రికలలో పనిచేశాడు. వి.ఎస్.ఆర్.కాలేజి, తెనాలిలో అధ్యాపకునిగా 1952-1962 మధ్య పనిచేశాడు. పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా కృష్ణారావు సాహితీసేవ చేశాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1963 నుండి ఒక దశాబ్దిపాటు ప్రసంగ శాఖలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయ పాలకవర్గ సభ్యుడుగా వ్యవహరించాడు. 1978 ఆగష్టు 23న కృష్ణారావు పరమపదించాడు.
రచనలు
[మార్చు]తత్త్వశాస్త్ర గ్రంథాలు
[మార్చు]- ప్లేటో
- అరిస్టోటిల్
- కాంటు పరతత్త్వవాదం
- హెగెల్
- గతితార్కిక భౌతికవాదం
- విగ్రహవ్యావర్తని
- రత్నావళి
- చతుఃస్తవం
- మాధ్యమిక వింశతి
- భవసంక్రాంతి సూత్రవృత్తి
- నిర్వాణప్రకరణం
- ప్లేటో ఆదర్శరాజ్యం
నవలలు
[మార్చు]- కీలుబొమ్మలు
- జఘన సుందరి
- పాపికొండలు
- రాగరేఖలు
నాటికలు
[మార్చు]- భిక్షాపాత్ర
- యాదవప్రళయం
- ధమ్మిల్లం
- దానధార
- సునీథ
- ఆదర్శ శిఖరాలు[2]
- ప్రతిక్రియ
- స్వర్గమా, నరకమా?
- డమడమాల బండి
- పాడు సంఘం
- విధి నిర్ణయం!
- తమ్మ పడిగ
- ఫ్రెంచికామెడీ
నాటకాలు
[మార్చు]- బొమ్మఏడ్చింది
- ప్రతిమ (భాసనాటకం)
సాహిత్య విమర్శ
[మార్చు]- కావ్యజగత్తు
- నవ తోరణం
- తెలుగు లిపి సంస్కరణ
- Studies in Kala Purnodayam
కావ్యాలు
[మార్చు]- వరూధిని
- శివరాత్రి
- యుగసంధ్య
కథాసంపుటాలు
[మార్చు]- ఉదబిందువులు
- చైత్రరథం
మూలాలు
[మార్చు]- ↑ సాహితీ చైత్రరథం - డా.జి.వి.కృష్ణారావు సాహిత్య సమాలోచన (ప్రత్యేక సంచిక)
- ↑ జి.వి.కృష్ణారావు. ఆదర్శ శిఖిరాలు.