ఆకాశవాణి కేంద్రం, విజయవాడ

ఆకాశవాణి రేడియో ప్రసారాల కోసం విజయవాడలో నెలకొల్పిన కేంద్రం ఇది.
చరిత్ర
[మార్చు]1948 డిసెంబరు 1వ తేది ఆంధ్రుల సాంస్కృతిక కేంద్రమైన విజయవాడలో ఆకాశవాణి నెలకొంది. ఈ రేడియో కేంద్రానికి 1948 డిసెంబర్ 1వ తేదీన అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూశాఖ మంత్రి కళా వెంకట్రావు ప్రారంభోత్సవం చేశారు.[1] 1 KW మీడియం వేవ్ పై ప్రసారాలు సాగేవి. ప్రసారశక్తి ఆరువేల చదరపు కిలోమీటర్లు. విజయవాడలో PWD ఎగ్జిక్యూటివ్ యింజనీర్ బంగళాలో ఆరెకరాల స్థలంలో దీన్ని స్థాపించారు. అప్పట్లో బెజవాడ క్లబ్ అక్కడ వుండేది. దాన్ని అద్దెకు తీసుకున్నారు. 120 అడుగుల ఎత్తుగల రిలే టవర్ నెలకొల్పారు. N.S. రామచంద్రన్ తొలి స్టేషను డైరక్టరు. M.S. నారాయణస్వామి స్టేషను యింజనీరు. మదరాసు ' బి ' కేంద్రం నుండి తెలుగు కార్యక్రమాలు రిలే చేసేవారు. తర్వాత కొంతకాలానికి 1950 లో డా. అయ్యగారి వీరభద్రరావు స్టేషను డైరక్టరుగా చేరారు. రెండేళ్ళ పరిపాలనలో ఆయన ప్రసారాలలో నూతనత్వాన్ని కలిగించారు.
20 కిలోవాట్ల ప్రసారశక్తికి విజయవాడ కేంద్రస్థాయిని 1957 జనవరి 20న పెంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. తొలినాళ్ళలో స్టేషను డైరక్టర్లుగా సర్వశ్రీ M.V. రాజగోపాల్, S.K. బోస్, G.P.S. నాయర్, పి. శ్రీనివాసన్, సి.ఆర్. రెడ్డి, అయూబ్, కులకర్ణి, దుర్గా భాస్కర్, డా. ఆర్. అనంత పద్మనాభరావు వ్యవహరించారు.
పురోగతి
[మార్చు]1962 ఆగష్టులో అప్పటి కేంద్ర ప్రసార సమాచార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి వివిధ భారతి ప్రసారాల ' బి ' కేంద్రాన్ని ప్రారంభించాయి. 1971 మార్చి నుండి వాణిజ్య ప్రసారాలు ఆరంభమయ్యాయి. వ్యవసాయ ప్రసారాలు 1966 జూన్ 7 నుండి ప్రారంభమయ్యాయి. నిడుదవోలులో జరిగిన సభలో నీటి పారుదల శాఖామాత్యులు T. V. రాఘవులు వ్యవసాయ ప్రసారాలు ప్రారంభించారు. గుమ్మలూరు సత్యనారాయణ, కె.వి. సుబ్బారావు, వై. హనుమంతరావు, వ్యవసాయ విభాగానికి అధిపతులుగా మూడు దశాబ్దాలు ఈ కార్యక్రమాలను తీర్చిదిద్దారు. 1995 జూన్ లో మూడు దశాబ్దాల వార్షికోత్సవాన్ని వ్యవసాయ శాఖామత్యులు కోటగిరి విద్యాధరరావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన సభలో నిర్వహించారు.
విజయవాడలో రేడియో కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత 13 ఏళ్ళకి అంటే 1962, ఆగష్టు 9వ తేదీన ఒక కిలోవాట్ శక్తితో వివిధభారతి ప్రారంభమై దాని ద్వారా సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడంతో ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించింది. కాగా, వివిధ భారతిని 1971 మార్చి 21వ తేదీ నుండి వాణిజ్య ప్రసారభారతిగా మార్పుచేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎంతోమంది సాహితీవేత్తలు, కళాకారులు తమ వాణిని వినిపించారు. మహాకవి శ్రీశ్రీ, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం, పువ్వాడ శేషగిరిరావు, ఎస్.వి. భుజంగరాయశర్మ, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమశాస్త్రి, నండూరి రామమోహనరావు వంటి సాహిత్యకారులు, శ్రీమతి భానుమతి, శ్రీమతి ఎస్.వరలక్ష్మీ, చిత్తూరు నాగయ్య, ఈలపాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి వంటి కళాకారులు తమ కార్యక్రమాలతో శ్రోతలను అలరింప చేశారు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలలో పైన తెలిపినటువంటి సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొనడమే కాకుండా ఈ కేంద్రంలో కార్యక్రమాల నిర్వాహకులుగా పనిచేసినవారు కూడా ప్రఖ్యాతిగాంచిన సాహితీవేత్తలు, కళాకారులు కావడం ఈ కేంద్రం ప్రత్యేకతగా చెప్పవచ్చు. పద్మభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బందా కనకలింగేశ్వరరావు, ఓలేటి వెంకటేశ్వర్లు, రాచకొండ నరసింహమూర్తి వంటి కళాకారులతో పాటు పింగళి లక్ష్మీకాంతం, బుచ్చిబాబు, ఎ. గోపాలరావు, బాలాంత్రపు రజనీకాంతారావు, జలసూత్రం వంటి సాహితీవేత్తలు కార్యనిర్వాహకులుగా ఈ కేంద్రంలో పనిచేశారు. విజయవాడ కేంద్రం నుంచి ప్రారంభించబడి ప్రజల మన్ననలను పొందిన కార్యక్రమాలలో, బావగారి కబుర్లు, భక్తిరంజని, నృత్య నాటకాలు, సందేహాలు-సమాధానాలు ముఖ్యమైనవి. బావగారి కబుర్లు అనే కార్యక్రమాన్ని బహుముఖ ప్రజ్ఞాశీలులు ప్రయాగ నరసింహశాస్త్రి, గాడేపల్లి సూర్యనారాయణలు నిర్వహించారు.
ప్రత్యేకతలు
[మార్చు]నృత్యనాటకాలు అనే ప్రక్రియ రూపొందించిన ఘనత బందా కనకలింగేశ్వరరావుకు దక్కుతుంది. బందా స్వయంగా నృత్యకారుడు, నటుడు. ఉషశ్రీ నిర్వహించిన సందేహాలు - సమాధానాలు కార్యక్రమంతో పాటు రామాయణం, మహాభారత ప్రవచనం శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. ఉషశ్రీ రేడియోలో చేసిన రామాయణం, భారత ప్రవచనాలు గ్రంథరూపంలో కూడా వెలువడ్డాయి. సంప్రదాయకీర్తనలు, భక్తి గీతాలను ప్రముఖ కళాకారులచే ఆలపింపచేసే భక్తిరంజని కార్యక్రమాలను విజయవాడ కేంద్రం పరిధిలో విననివారుండరంటే అతి శయోక్తి కాదు. కార్యక్రమాల నిర్వహణలో విజయవాడ కేంద్రానికి అనేక బహుమతులు లభించాయి. బాలాంత్రపు రజనీకాంతరావు, 1973లో రూపొందించిన 'కొండనుంచి కడలిదాక' అనే సంగీత రూపకానికి ఎస్.హెచ్.కె. జపాను బహుమతి లభించింది. 1974వ సంవత్సరంలో ఆకాశవాణి జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు విజయవాడ కేంద్రం నిర్వహించిన మధురక్షణాలు అనే నాటకానికి, విక్రాతగిరి శిఖరం అనే రూపకానికి మొదటి బహుమతులు లభించాయి. విజయవాడ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల స్థాయినిబట్టి ఈ కేంద్రంలో పనిచేసే కార్యక్రమాల నిర్వాహకులు, ఉద్యోగులు, స్టేషన్ డైరెక్టర్ సామర్ధ్యాన్ని సులభంగానే అర్థంచేసుకోవచ్చు. నగరంలో మహాత్మగాంధీ రోడ్ లో గల ఈ కేంద్రంలో మొత్తం ఐదు స్టూడియోలు వున్నాయి. వీటిలో మూడు రికార్డింగ్ స్టూడియోలు కాగా, మిగిలినవాటిలో ఒకదానిలో డబ్బింగ్, మరోదానిలో వాణిజ్యప్రసారాలను నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతిని, కళలను, సాహిత్యాన్ని నలుదిశలా వ్యాపింపచేయడంలో విజయవాడ కేంద్రం విశేష కృషిచేస్తుంది.
అమృతోత్సవం
[మార్చు]2023 డిసెంబర్ 22 నాటికి 75 ఏళ్ళు పూర్తి చేసుకొని అమృతోత్సవ వేడుకలు జరుపుకుంది.
కార్యక్రమాలు
[మార్చు]- భక్తిరంజని
- నిలయ విద్వాంసుల సంగీత కార్యక్రమాలు
- వ్యవసాయ కార్యక్రమాలు
- జానపద సంగీతం
బహుమతులు
[మార్చు]ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతుల్ని ఈ కేంద్రం గెలుచుకొంది.
- గోదావరి నదిపై రూపొందించిన ' కొండ నుండి కడలి దాకా ' రూపకానికి రజనికి విద్యా ప్రసారాలలో "హోనబంకా" అవార్డు లభించింది.
- వ్యవసాయ విభాగంలో Y. హనుమంతరావుకు ' మధురక్షణాలు ' నాటకానికి బహుమతి వచ్చింది.
- శ్రీ గోపాల్ సమర్పించిన విక్రాంతగిరి శిఖరం, అరుణాచల జ్యోతి బహుమతులందుకొన్నాయి.
- శ్రీ రామం సమర్పించిన నీలినీడలు, నిశ్శబ్దం గమ్యం, మెట్లు, మహా విశ్వ అవార్డులు పొందాయి.
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సమర్పించిన అమరారామం, వర్షానందిని, నేనుకాని నేను జాతీయస్థాయిలో వన్నెకెక్కాయి.
- K. V. హనుమంతరావు రూపొందించిన శ్రమఏవజయతే, కృష్ణవేణి ప్రశంసలందుకొన్నాయి.
- పన్నాల సుబ్రహ్మణ్య భట్ సమర్పించిన నాదబంధం, మార్గబంధం బహుమతులందుకొన్నాయి.
- 1988లో ఉత్తమస్థాయి సాంకేతిక కేంద్రంగా గుర్తింపు లభించింది.
భక్తిరంజని
[మార్చు]విజయవాడ కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తి నార్జించి పెట్టిన కార్యక్రమాల్లో 'భక్తిరంజని' ఒకటి. G.P.S. నాయర్ గారు డైరక్టర్‌గా వున్న రోజుల్లో, Dr. బాలాంత్రపు రజనీకాంతరావు గారి నేతృత్వంలో, వీరిరువురి ప్రేరణతో 'భక్తిరంజని' కార్యక్రమ రూపకల్పన జరిగింది. ఇందులో త్యాగరాజు దివ్యనామ కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, తరంగాలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, కర్ణాటక సంగీత బాణీలోని మాధుర్యం విడవకుండా చక్కని సంప్రదాయ శైలిలో పాడించిన ఘనత వోలేటిగారిదే.
కాళహస్తి సంస్థానంలోవుండే మునిపల్లె సుబ్రహ్మణ్యకవి విరచిత అధ్యాత్మ, రామాయణ కీర్తనలు, జొన్నలగడ్డ శివశంకరశాస్త్రిగారి ముఖత:విని స్వరం నిర్ధారించి ప్రముఖ విద్వాంసుల చేత పాడించటంలో వోలేటి గారు చేసిన కృషి శ్లాఘనీయం. కర్ణాటక సంగీత విద్వాంసుడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, నాట్యాచారులు చింతాకృష్ణమూర్తిగారి లాంటి వారి సహకారంతో శశిరేఖా పరిణయం, రామనాటకం, ఉషాపరిణయం, రుక్మాంగద చరిత్రము, ప్రహ్లాద, హరిశ్చంద్ర, మార్కండేయ లాంటి యక్షగానాలెన్నో రూపకల్పన చెంది వోలేటి గారి కృషిని చాటాయి.
విజయవాడ కేంద్రంలో పనిచేసిన ప్రముఖులు
[మార్చు]- బాలాంత్రపు రజనీకాంతారావు
- ఉషశ్రీ
- అన్నవరపు రామస్వామి
- నాయని సుబ్బారావు
- దండమూడి రామమోహనరావు
- సి.రామ్మోహనరావు
- బందా కనకలింగేశ్వరరావు
- నండూరి సుబ్బారావు
- విన్నకోట రామన్నపంతులు
- మల్లిక్
- డా. ఆయ్యగారి వీరభద్రరావు
- జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి
- తురగా జానకీరాణి
- గొల్లపూడి మారుతీరావు
- మల్లాది సూరిబాబు
- న్యాయపతి రాఘవరావు
- వింజమూరి లక్ష్మి
- శ్రీరంగం గోపాలరత్నం
- వోలేటి వెంకటేశ్వర్లు
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
- ఏడిద కామేశ్వరరావు
- గుమ్మలూరి సత్యనారాయణ
- వింజమూరి శివరామారావు
- ప్రయాగ నరసింహశాస్త్రి
- జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి
- బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి
- యల్లా వెంకటేశ్వరరావు
- సుత్తి వీరభద్రరావు
- ఆమంచర్ల గోపాలరావు
- తెన్నేటి హేమలత
- సుందరపల్లి సూర్యనారాయణమూర్తి (క్లారినెట్ విద్వాంసులు)
- దత్తాడ పాండురంగరాజు (వయొలిన్)
- కందుకూరి రామభద్రరావు
- కుమారి కౌతా ప్రియంవద
- ప్రయోగ వేదవతి
- డా. ఆర్. అనంతపద్మనాభరావు
- ఎ.బి. ఆనంద్
- మంగళగిరి ఆదిత్యప్రసాద్
- జ్యోత్స్నాదేవి
- ప్రయాగ రామకృష్ణ
- కొప్పుల సుబ్బారావు
- ఓంకార్
- రెంటాల కల్పన
- జీడిగుంట నాగేశ్వరరావు
మూలాలు
[మార్చు]- ↑ ప్రసార ప్రముఖులు. విజయవాడ కేంద్రం. డా. ఆర్. అనంతపద్మనాభరావు. p. 41.