కొల్లూరు (గుంటూరు జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొల్లూరు (గుంటూరు జిల్లా)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం కొల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి మార్గాన శివకుమారి
జనాభా (2001)
 - మొత్తం 16,079
 - పురుషుల సంఖ్య 7,969
 - స్త్రీల సంఖ్య 8,056
 - గృహాల సంఖ్య 4,065
పిన్ కోడ్ : 522324
ఎస్.టి.డి కోడ్ : 08644

కొల్లూరు, గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన గ్రామం.ఇది సమీప పట్టణమైన తెనాలి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4598 ఇళ్లతో, 16079 జనాభాతో 1856 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7948,ఆడవారి సంఖ్య 8131.షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4416 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1740.గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590417[1].పిన్ కోడ్: 522324.ఎస్.టి.డి.కోడ్= 08644.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా మొత్తం 16025.అందులో పురుషుల సంఖ్య 7969,మహిళలు 8056,అప్పటి నివాసగృహాలు 4065

గ్రామ చరిత్ర[మార్చు]

కొల్లూరు గ్రామంలోని గనుల్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అపురూపమైన, అత్యంత విలువైన వజ్రం కోహినూరు వజ్రము దొరికింది. చరిత్రలో వెలకట్టలేని వజ్రంగా భావిస్తూవచ్చిన ఈ వజ్రం ఎందరెందరో రాజుల చేతులు మారి భారతదేశం నుంచి పర్ష్యాకు, పర్షియా నుంచి తిరిగి భారతదేశానికి, ఆపైన చివరకు ఇంగ్లాండుకు చేరుకుని ప్రస్తుతం బ్రిటీష్ రాజవంశీకుల వద్ద ఉంది.[2]

సీ ఆర్ డీ ఏ[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[3]

సమీప గ్రామాలు[మార్చు]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తెనాలిలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల ఎప్పుడో బ్రిటిషు కాలంలో 1870లో వీధిబడిగా ప్రారంభమైంది. 1896లో తాలూకా బోర్డు ఆధ్వర్యంలో మాధ్యమిక పాఠశాలగా ఏర్పడింది. 1930లో బోర్డ్ ఉన్నత పాఠశాల పేరుతో పూర్తిస్థాయి ఉన్నత పాఠశాలగా ఒక పెంకుటింట్లో ప్రారంభమైంది.1923లో మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు వ్రాసారు.ఇంతవరకు ఈ పాఠశాల ఆరుసార్లు 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ పాఠశాల కొందరు మేధావులనందించింది. ఇక్కడి పూర్వవిద్యార్థి కొత్తరాల బాపనయ్య, అప్పటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి అందుకున్నాడు.

ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన ప్రముఖులు[మార్చు]

 1. ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నరు కొణిజేటి రోశయ్య
 2. దివంగత సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు
 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి బయ్యారపు ప్రసాదరావు.
 4. ప్రముఖ కవి, దివంగత వేటూరి సుందరరామమూర్తి

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కొల్లూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కొల్లూరులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

బ్యాంకులు[మార్చు]

 1. భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం.08644/243242.
 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు. ఫోన్ నం. 08644/242092.
 3. కొల్లూరు గ్రామంలో 2014,నవంబరు-11న కోస్టల్ బ్యాంక్ 35వ శాఖను ప్రారంభించారు.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కొల్లూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 330 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1525 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 3 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1522 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కొల్లూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1347 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 175 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కొల్లూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

ఇటుకలు

ఇతర సదుపాయాలు[మార్చు]

శ్రీ సీతారామ కాకతీయ కళ్యాణ మండపం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, మార్గాన శివకుమారి, సర్పంచిగా ఎన్నికైంది. [4] మండల పరిషత్ ప్రెసిడెంట్:- కనగాల మధుసూదన ప్రసాద్

గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ గంగా పార్వతీ సమేత, అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో స్వామివారి 901వ వార్షిక ప్రతిష్ఠామహోత్సవం, 2016,జనవరి-20వ తేదీ బుధవారంనాడు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు గణపతి యఙం వేదమంత్రాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి శాంతికళ్యాణం, అభిషేకాలు నిర్వహించారు. మహీలలు అమ్మవేఇకి కుంకుమపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్లూరు పరిసర ప్రాంతాలలోని భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]&[15]
 2. శ్రీ దుర్గాభవానీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ఉప్పువారివీధిలో ఉంది. ఈ ఆలయంలో 2015,జూన్-29వ తేదీనాడు, ఒక గోశాలను ప్రారంభించారు. ఇక్కడ నిత్యం గోపూజకు గోవులు అందుబాటులో ఉండును. [12]
 3. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానం:- ఈ దేవస్థానంలో స్వామివారి కళ్యాణం, ఫాల్గుణమాసం శుక్ల ఏకాదశి నాడు ఘనంగా జరిపించెదరు. [6]
 4. శ్రీ చింతలమ్మ అమ్మవారు:- గ్రామంలో, 2014, ఆగస్టు-24, ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ, ఎడ్లబండిపై చింతలమ్మ ప్రభను, మేళతాళాలలు, డప్పులతో, ఊరేగింపుగా తీసికొని రాగా, మహిళలు పసుపు, కుంకుమలతో నిండుబిందెలతో వారపోసి ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
 5. శ్రీ కాళీ కృష్ణ దివ్య కిరణ పీఠం:- ఇక్కడ 2015,మార్చి-23 నుండి 27వ తేదీ వరకు భజనలు జరిగినవి. ఐదవ రోజైన, 27వ తేదీ శుక్రవారం నాడు, ఈ పీఠంలోని ఓంకారణామాలను భక్తులు, గ్రామ వీధులలో ఊరేగించారు. మహిళలు ఓంకారణామాలకు హారతులిచ్చి, పూజలు చేసారు. ముందుగా ఓంకారణామాలకు బాజ్జీ చేత పూజలు చేయించి, ఈ ప్రదర్శనను మొదలుపెట్టినారు. అనంతరం భక్తబృందంతో, మేళతాళాలతో, నిర్వహించిన కర్రసాము, కోలాటం ప్రదర్శనలు, చూపరులను ఆకట్టుకున్నవి. ఈ ఓంకార నామాల పతిష్ఠ, 2015,మార్చి-29 ఆదివారం నాడు, బాబ్జీ చేతుల మీదుగా వైభవంగా నిర్వహిచారు. ఆదివారంతో శ్రీ కృష్ణ సప్తాహ మహోత్సవాలు ముగిసినవి. [10]
 6. శ్రీ రామాలయం:- కొల్లూరు గౌడపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహాలకు రెండురోజులుగా జలాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [11]
 7. వేద పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,సెప్టెంబరు-22వ తేదీనుండి 29వ తేదీ వరకు, 99వ శ్రీ మద్భగవత్ సప్తఙాన మహోత్సవములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తాక్షరి దీక్ష ప్రవచనం పారాయణం చేసారు. వేదపండితులు లలిత, విష్ణు సహస్రనామ పారాయణం చేసారు. ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [13]

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • ఎస్.వి.భుజంగరాయశర్మ
 • గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి (1913 - 1997) సుప్రసిద్ధ పండితులు.
 • సూర్యదేవర రాఘవయ్య చౌదరి జన్మస్థలం.
 • వేటూరి సుందరరామ్మూర్తి కొల్లూరులో జన్మించారు. కొల్లూరు నుండి గాజుల్లంక వెళ్లే దారిలో ఉన్నఇంట్లో వేటూరి నివసించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వేటూరి, గుమ్మడి పదవ తరగతి వరకు చదివారు.
 • కన్నెగంటి వేంకటేశ్వరరావు
 • అనీర్నెని వెంకటరామయ్య:1960 ప్రాంతంలో కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా 20 ఏళ్ళు పనిచేశారు. గ్రామాభివృద్ధి సాధించారు. ఈయన 1976లో పరమ పదించారు.
 • చెరువు ఆంజనేయశాస్త్రి: సినీ గేయకవి.(1926-1991)
 • అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని: పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చి-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [9]
 • తుమ్మల వెంకట్రామయ్య: ఎగరాలి మన ఎర్రజెండా పాట రచయిత.నవశక్తి, ప్రజాశక్తి పత్రిక సంపాదకుడు. 1914 అక్టోబరు 6 లో జన్మించారు. బనారస్ విద్యాపీఠ్ లో విద్యాభ్యాసం చేసి బాధ్యతలు నిర్వహించారు. 1948-51 మధ్య నిర్బంధంలో ఉన్నారు. తరువాత విశాలాంధ్ర లోనూ, విశాలాంధ్ర పబ్లిషింగ్ లోనూ సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన అభ్యుదయ రచయితల ఉద్యమ నిర్మాతలలో ఒకరు. ఆ సంఘ కార్యదర్శిగా పనిచేసి 1987 నవంబరు 7 న మరణించారు.[4]
 • చెమిటిగంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి: తెనాలి తొలి మునిసిపల్ చైర్మన్.
 • మేడిచర్ల ఆంజనేయమూర్తి:బాలకేశరి పత్రికా నిర్వాహకులు
 • పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక: ఈమె కూచిపూడి నృత్య కళాకారణి. కొల్లూరు గ్రామంలో 2003 జూన్ 13న జన్మించింది.తల్లిదండ్రులు గోవిందమ్మ, శ్రీనివాసరావు. తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాల నందు ఉపాధ్యాయుడుగాను, తల్లి గోవిందమ్మ ఆరోగ్యశాఖలో స్టాపు నర్సుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చెరుకుపల్లిలోని ఆర్.కె. కళాశాలలో 12వ తరగతి (2019-20) చదువుతుంది.50 పైగా అవార్డులు అందుకుంది.450 ప్రదర్సనలకు పైగా వివిధ పట్టణాలలో,నగరాలలో చేసింది.

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
 4. Andhra Pradesh Lo Communist Udhyama Charitra Vol Ii 193642

వెలుపలి లంకెలు[మార్చు]