Jump to content

పంజాబీ మాండలికాలు

వికీపీడియా నుండి

పంజాబీ భాషలోని మాండలికాలను భారతదేశ పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఉపయోగించగా, పాకిస్థాన్లో 60 శాతం వాడతారు.

Punjabi dialects

ప్రధానమైన మాండలికాలు

[మార్చు]

భారత్ లోని పంజాబీ మాండలికాల్లో ముఖ్యమైనవి మాఝీ, దోఅబీ, మాళ్వాయీ, పోవాధీ. పోథోహరీ, లహందీ, ముల్తానీ మాండలికాలు పాకిస్థాన్ కు చెందినవి.[1] అయితే మాఝీ మాండలికం మాత్రం రెండు దేశాలకూ ప్రామాణికమైనది.

మాఝీ

[మార్చు]

మాఝీ అనేది పంజాబీ భాషకు ప్రతిష్ఠాత్మకమైన మాండలికం. ఎందుకంటే పంజాబీ భాషకు ప్రామాణికమైన రాతకోతలు ఈ మాండలికంలోనే జరుగుతాయి. చారిత్రకంగా పాకిస్థానీ పంజాబ్ ప్రాంతంలోని లాహోర్, షేఖుపురా, కసుర్, ఒకారా, నన్కానా సాహిబ్, ఫైసలాబాద్, గుజ్రాన్ వాలా, వజీరాబాద్, సైల్ కోట్, నరోవల్,  గుజ్రాత్, ఝెలం, పక్పాటన్, వహేరి, ఖనేవాల్, సాహివాల్, హఫీజ్ బాద్, మండీ, బహుద్దీన్, చినియోట్ మండలాలు మాఝా ప్రాంతంలోకి వస్తాయి.

భారత్ పంజాబ్ లో అమృత్ సర్, తర్న్ తర్న్ సాహిబ్, గుర్దస్పూర్  మండలాలు మాఝూ ప్రాంతం కిందకి  వస్తాయి. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లోనూ, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా మాఝూ ప్రాంతవాసులు చెప్పుకోదగ్గ జనాభాలోనే ఉన్నారు.

మహసు పహారీ

[మార్చు]

హిమాచల్ ప్రదేశ్ లో మాట్లాడే  మహాసు పహారీ మాండలికం పశ్చిమ పహారీ భాషకు రూపాంతరం. మహాసుయీ,  మహాసువీ అని కూడా అంటారు. 2001 లెక్కల ప్రకారం దాదాపు 1,000,000మంది ఈ  మాండలికాన్ని మాట్లాడుతున్నారు. ఈ మాండలికాన్ని హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, సోలన్ ప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడతారు. సిమ్లా,  సోలన్ మండలాలు ప్రాచీన మహాసు  ప్రాంతంలోనివని కూడా చెబుతారు.  1972 సెప్టెంబరులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహాసు మండలంలోని ప్రాంతాలను పాలనాసౌలభ్యం కోసం వివిధ మండలాలుగా విడదీసింది. అప్పటి మహాసు మండలంలోని సోలన్, అర్కి తాలూకల నుండి సోలన్ మండలాన్నీ, కందఘట్, నలగఢ్ తాలూకాల నుండి ఇప్పటి సిమ్లా మండలాన్నీ విడదీశారు.

ఈ భాషని ఇండో-యూరోపియన్, ఇండో-ఇరానియన్, ఇండో-ఆర్యన్, ఉత్తరభాగం, పశ్చిమ పహారీగా వర్గీకరించబడింది. వివిధ ప్రాంతాల్లో వివిధ మాండలికాలుగా తయారైంది. కింది (లోవర్) మహాసు పహారీ వర్గంలో బఘాటి, బఘళినీ, కియుంతాళీ మాండలికాలు, పైన (అప్పర్) మహాసు పహారీలో రాంపురీ, రోహ్రురీ, సిమ్లా సిరాజీ, సొడొచి మాండలికాలు వస్తాయి. కియుంతాళీ మాండలికం ఇతర మాండలికాలు వాడేవారికి త్వరగా అర్ధమవుతుంది. పైగా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. రాంపురీని కోచి అని, రోహ్రురీని సోరచోలీ అని కూడా అంటారు. సోడొచి మాండలికాన్ని కోట్ గఢ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక మాండలికం వాడేవారికి వేరే మాండలికపు పదాలు 85శాతం అర్ధమవుతాయి. పైన మాండలికపు పదాలు 74-82శాతం, కింది మాండలికపు పదాలు 74-95శాతం నిఘంటు అర్ధాలు ఒకేలా ఉంటాయి. ఈ భాషను ఇళ్ళల్లోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఎక్కువగా వాడతారు. ఈ భాష వాడే ప్రజలపై హిందీ, ఇంగ్లీష్ భాషల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ భాష అంతరించిపోయే ప్రమాదం ఉంది.  మహాసు భాషకు బాగా దగ్గరగా ఉండే సిర్మువర్ మాండలికాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మవురీ ప్రాంతంలోనూ,  జాయుంసర్-బవర్ భాషను ఉత్తరాఖండ్ లోనూ మాట్లాడతారు.

షాహ్ పురీ

[మార్చు]

షాహ్ పురీ మాండలికాన్ని సర్గోధా అని కూడా అంటారు. దీనిని ఎక్కువగా పాకిస్థానీ పంజాబ్ లో మాట్లాడతారు. పాకిస్థానీ పంజాబ్ [2] లోని సర్గోధ్ ప్రాంతంలో మాట్లాడే ఈ మాండలికం పంజాబీ భాషలోనే అతి ప్రాచీనమైనది.[3] ఇప్పటి సర్గోధా మండలంలోని షాహ్ పూర్ తాలూకా ఒకప్పుడు షాహ్ పూర్ మండలంగా ఉండేది. ఆ మండలం  పేరు మీదుగానే ఈ మాండలికానికి షాహ్ పురీ అనే పేరు వచ్చింది. ఈ మాండలికం మాఝీ, పోథోహరీ, తొలాచీ మాండలికాల మిశ్రమంగా చెప్పుకోవచ్చు. ఖుషబ్ ప్రాంతంలోని ప్రజలు ఈ మాండలికాన్ని ఎక్కువగా తొలాచీ టోన్ లో మాట్లాడుతుంటారు. దక్షిణ ప్రాంతంలో ఝాంగోచి యాసలో మాట్లాడతారు.[4] సర్గోధా, ఖుషబ్ మండలాలతో పాటు, పొరుగు మండలాలైన మైన్ వాలీ, భక్కర్ లలో కూడా విస్తృతంగా మాట్లాడతారు ఈ మాండలికాన్ని. సింధ్ నది పశ్చిమ ప్రాంతం నుండి, జెహ్లం నది దాటి చెన్నాబ్ నది వరకు ఈ మాండలికాన్ని ఎక్కువగా మాట్లాడతారు.[5] మిగిలిన పంజాబీ మాండలికాల కన్నా ఈ షాహ్ పురీ మాండలికం చాలా విషయాల్లో ప్రాముఖ్యం  కలదిగా నిలిచింది. 

ఝంగోచీ/ఛాంగ్వీ

[మార్చు]

ఝంగోచీ మాండలికం పంజాబీ భాషలోనే అత్యంత ప్రాచీనమైన మాండలికం. ఈ మాండలికాన్ని ఎక్కువగా పాకిస్థానీ పంజాబ్ లో మాట్లాడతారు. ఖనేవల్, ఝాంగ్, హఫీజ్ బాద్ మండలాల్లో ఎక్కువ వాడే మాండలికం ఇది. ఈ ప్రాంతాలు రవి నది నుండి చెనాబ్ నది వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలు భాషలోనే కాక, సంప్రదాయాలు, పద్ధతులు, సంస్కృతుల్లో ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్రాంతానికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం సాహిత్య వారసత్వానికి ప్రాముఖ్యం. హీర్ రంఝా, మీర్జా సాహిబ్ ల రోమాంటిక్ ప్రేమకథలు ఈ ప్రాంతానికి చెందినవే. ఉభెచారీ మాండలికం అని కూడా అంటారు దీన్ని.

జాంగ్లీ/రచ్నవీ

[మార్చు]

జాంగ్లీ మాండలికం ప్రాచీన తెగల భాష. సాధారణంగా వీటి పేర్ల వెనుక బార్ అని వస్తుంది. నీటిపారుదల వ్యవస్థ మొదలుకాక ముందు, 20వ శతాబ్దానికి పూర్వం ఉండే జంగిల్ బార్ ల వంటివి ఈ ప్రాంతాలు. ఈ మాండలికాన్ని ప్రాచీన లయల్ పూర్, మొంట్గోమరి మండల పశ్చిమ సగభాగంలో ఎక్కువగా మాట్లాడతారు. పాకిస్తానీ పంజాబ్ లోని  ఫైసలాబాద్, చినియోట్, తోబా టెక్ సింగ్, బహవల్నగర్ మండలాలు ఈ ప్రాంతానికి చెందినవే. ఈ మాండలికానికి రచ్నవీ అనే పేరు కూడా ఉంది.

మండేలీ

[మార్చు]

మండేలీ అనేది పశ్చిమ పహారీ భాష. ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి మండలంలో ఎక్కువగా మాట్లాడే మాండలికం. మండి నగరంలోనూ, మండి లోయలోనూ ఈ మాండలికాన్ని మాట్లాడతారు. మండలం గర్హి, మండిగ్యర్హి అని కూడా అంటారు. భారతదేశంలో అతి వేగంగా అంతరించిపోతున్న భాషగా ఈ మాండలికాన్ని యునెస్కో  గుర్తించింది.[6] 1961 నుండి 2001 వరకు ఈ భాష మాట్లాడే వారి సంఖ్య 21శాతానికి పడిపోయింది.

చంబేలిక్  రకాలైన బిలాస్ పురీ, చంబేలీ, భాట్టియాలీ, పంగ్వాలీ, గడ్డీ, చురాహీ/భద్రవాహీ/భలేసీ/ఖషాలీ/పదారీ మాండలికాలు వేర్వేరు భాషలుగా పరిగణింపబడతాయి. కానీ ఇవి దాదాపు 90-95శాతం మండేలీ భాషలానే ఉంటాయి.

భాదర్ వాహీ

[మార్చు]

జమ్ము కాశ్మీర్ లోని భాదర్ వాహ్ ప్రాంత స్థానిక భాష  భాదర్  వాహీ. 50,000మంది మాట్లాడే ఈ  భాదర్ వాహీ అనేది పహారీ భాషకు  చెందినది. భాదర్ వాహ్ పట్టణంలోనూ, చుట్టుపక్కల  గ్రామాల్లోనూ, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన చౌరాహ్, సలునీ తాలూకాలో దాదాపు 110,000 మంది మాట్లాడతారు ఈ భాషను. ఈ మాండలికాన్ని బదేర్ వాలీ, భాద్రి,  బద్రోహి, భిద్లి  అని కూడా అంటారు.

కాంగ్రి

[మార్చు]

ఉత్తర భారతంలో ఎక్కువగా మాట్లాడే మాండలికం కాంగ్రి. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా మండలంలో ఎక్కువగా మాట్లాడే మాండలికం  ఇది. డోగ్రికి చెందిన ఇండో-ఆర్యన్ మాండలికం ఇది. పశ్చిమ పహారీ భాషా సముదాయ వర్గానికి చెందిన ఈ కాంగ్రి మాండలికానికి పంజాబీ పదజాల ప్రభావం కూడా ఉంది.[2] పంజాబ్ రాష్ట్రంలోని పశ్చిమ  ప్రాంతంలో  ఈ మాండలికాన్ని వాడతారు.1960లో భాషావేత్తలు కాంగ్రి, డోగ్రి  మాండలికాలను పంజాబీకి చెందిన మాండలికాలుగా గుర్తించారు. పహారీ భాషా సముదాయానికి చెందిన మాండలికాలుగా కూడా ఈ రెండిటినీ గుర్తించారు.

మాళ్వాయి

[మార్చు]

భారత పంజాబ్ లో తూర్పు ప్రాంతంలోనూ, పాకిస్థాన్ పంజాబ్ లోని బహవల్ నగర్, వెహారీ మండలాల్లో ఈ మాళ్వాయి మాండలికాన్ని మాట్లాడతారు. లుధియానా, పటియాలాఅంబాలాభతిండా,  గంగానగర్, మలేర్ కోట్లా, ఫజిల్కా, ఫిరోజ్‌పూర్, మోగా, మాళ్వా, వంటి ప్రాంతాలు ప్రస్తుత భారత పంజాబ్ లోని దక్షిణ, మధ్య ముఖ్య ప్రాంతాల్లో ఈ మాండలికం మాట్లాడతారు. పంజాబీ భాష మాట్లాడే హర్యానా రాష్ట్రంలోని అంబాలా, హిస్సార్, సిర్సా, కురుక్షేత్ర వంటి ప్రాంతాల్లో ఈ మాండలికం మాట్లాడతారు.

దొయిబీ

[మార్చు]

దొయిబీ మాండలికం భారత పంజాబ్, పాకిస్థానీ పంజాబ్ లలో కూడా మాట్లాడతారు. దో ఆబీ అంటే రెండు నదుల మధ్య ప్రదేశం అని అర్ధం. చారిత్రకంగా బియాస్, సట్లెజ్ నదుల మధ్య ఉండే దొయిబా అనే  ప్రాంతంలో మాట్లాడేవారు. ప్రస్తుత భారత పంజాబ్ లోని  జలంధర్కపూర్తలా మండలల్లోనూ, డోనా, మంజకి ప్రాంతాల్లో  ఇప్పటికీ మట్లాడతారు. పాకిస్థానీ పంజాబ్ లో తోబా టెక్ సింగ్, ఫైసలాబాద్ మండలంలో మాట్లాడే ఈ మండలాన్ని ఫైసలాబాదీ పంజాబీ అని కూడా అంటారు.

ప్వాధీ

[మార్చు]

ప్వాధీ, పోవాధ్, ప్యువాధ్/పోవాధా అనేవి పంజాబ్, హర్యానాలోని ప్రాంతాలు. ఇవి సట్లజ్, ఘగ్గర్ నదుల మధ్య ఉంటాయి. హర్యానాలోని అంబాలా మండలం పక్కన ఉన్న రూప్ నగర్, దాని దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ప్రాంతాలను పోవాధి అని అంటారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కాలా అంబ్(ఇది ఘగ్గర్ నదికి తూర్పున ఉంది) దాటి సట్లజ్ నది దగ్గర్లోని రూప్ నగర్ మండలం వరకు పోవాధ్ ప్రాంతమే. ఫతేగఢ్ సాహిబ్ మండలంలోని కొన్ని ప్రాంతాలు, పటియాలా మండలంలోని రాజ్ పురా ప్రదేశం కూడా పోవాధ్ ప్రాంతం కిందకే వస్తోంది. ఈ భాషను ప్రస్తుత పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని కురాలీ, రోపార్, నుర్పుర్బేది, మొరిందా, పైల్, రాజ్ పురా, సమరలా ప్రాంతాలు, హర్యానా రాష్ట్ర ఫతేబాద్ మండలంలోని పింజోరే, కల్కా, ఇస్లామైల్ బాద్, పెహోవా, బంగర్ ప్రాంతాల్లో ప్వాధీ మాండలికాన్ని మాట్లాడతారు.

చంబేలీ

[మార్చు]

చంబేలీ రకాలైన బిలాస్ పురీ, చంబేలి, భట్టియాలీ, పంగ్వాలీ గడ్డీ, చురాహ్/భద్రావాహీ/భలేసీ/ఖషాలీ/పదారీలు విడివిడి భాషలుగా పరిగణింపబడతాయి. కానీ మండేలీ మాండలికానికి 90-95శాతం దగ్గరగా ఉంటాయి ఈ మాండలికాలు.

హరిజన్ కిన్నోరి

[మార్చు]

పహారీ కిన్నోరి లేదా హరిజన్ కిన్నోరి అనేది ఉత్తర భారతదేశానికి చెందిన పశ్చిమ పహారీ భాష. కిన్నోర్ మండలంలోని దళితులు ఈ మాండలికం మాట్లాడతారు. హిమాచలీ భాష నుండి  ఈ మాండలికం ఎంత భిన్నమైందో ఎవరూ నిర్ధారించలేదు.

పొథోహరీ/పహారీ-పొతొవారీ-పంజిస్థానీ

[మార్చు]

పొథోహరీ మాండలికం ఉత్తర పాకిస్థానీ పంజబ్ లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ మాట్లాడతారు. ఉత్తరంలోని ముజఫరబాద్ నుండి దక్షిణంలోని ఝెలం, గుజర్ ఖాన్, రావత్, రావల్పిండి, ఉత్తర రావల్పిండిలోని ముర్రే కొండలు, తూర్పు భింబెర్, రావల్ కోట్ ప్రాంతాల్లో ఈ మాండలికాలు మాట్లాడతారు. చిభాలీ, ధుండి-కైరాలీ మాండలికాలు కూడా వీటికి సంబంధించినవే. పంజాబీ భాషకు చెందిన మాఝీ, హింద్కో మాండలికాలు ఈ మాండలిక సమూహాలకు చెందినవే అని ఒక అంచనా.

ముల్తానీ

[మార్చు]

పాకిస్థాన్ పంజాబ్ లోని ముల్తాన్, లోధ్రాన్ మండలాల్లో ముల్తానీ మాండలికం మాట్లాడతారు. చారిత్రకంగా ఈ మాండలికం పంజాబీ భాషలోనిది. 1920లలో భాషావేత్త గార్రిసన్ చేసిన భారతీయ భాషా సర్వేలో ఈ మాండలికాన్ని లహందా క్లస్టర్ లోకి చేర్చారు. 1964లో ముల్తానీ మాండలికలను సారైకి అనే పేరుతో విడి భాషగా ప్రకటించారు.

కొహతి/పెషవేరి/హింద్కో

[మార్చు]

పాకిస్థాన్ కు చెందిన ఖ్యబెర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని పెషావర్, నొవ్షెరా, కోహత్, మన్షెహ్రా, అబ్బొట్టా బాద్, హరి పూర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని నీలుం మండలల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ మాండలకాన్ని మాట్లాడతారు. ఈ మాండలికం కూడా చారిత్రకంగా పంజాబీకి చెందినిదిగా పరిగణించబడుతోంది. ఈ మాండలికాన్ని కూడా 1920లలో భాషావేత్త గార్రిసన్ చేసిన భారతీయ భాషా సర్వేలో ఈ మాండలికాన్ని లహందా క్లస్టర్ లోకి చేర్చారు. హింద్కోని వేరే భాషగా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

కుల్లు

[మార్చు]

కుల్లుని కుల్లూ, కులుయి, కుల్వీ అని కూడా అంటారు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో మాట్లాడే పశ్చిమ పహారీ భాషా సమూహానికి చెందిన మాండలికం.

దేరావాలీ

[మార్చు]

పాకిస్థానీ పంజాబ్ లోని రాజన్ పూర్, దేరా ఘజీ ఖాన్ మండలల్లో ఎక్కువగా మాట్లాడే మాండలికం ఇది. ఈ మధ్యనే దీనిని సారైకీ సముదాయంలో పరిగణించారు. చాలా మంది భాషావేత్తలు దీనిని వేరే భాషగా కూడా ప్రతిపాదిస్తారు.

ఘేబి

[మార్చు]

పోతోవారీ మాండలికానికీ, ఈ ఘేబి మాండలికానికీ చాలా పోలికలున్నాయి. కానీ కొన్ని వ్యాకరణాంశాల్లో, ముఖ్యంగా భూతకాల ప్రయోగంలో కొన్ని వైరుధ్యాలు కనపడతాయి. ఘేబిని పాకిస్థానీ పంజాబ్ లోని ఫతేహ్ జంగ్, పిండి ఘెబ్ తాలూకాల్లో ఎక్కువగా మాట్లాడతారు. మైన్ వాలీ ప్రాంతంలో మాట్లాడే అవాంకరీ మాండలికానికీ, దీనికీ కూడా పోలికలున్నాయి.

రైస్తి

[మార్చు]

దీనిని భావల్ పురీ/చోలిస్తానీ అని కూడా అంటారు. పాకిస్థానీ పంజాబ్ లోని బహవల్ పూర్, లోధ్రన్, రహిమ్ యార్ ఖాన్ మండలాల్లో ఈ మాండలికాన్ని వాడతారు. బహవల్ పూర్ లోని రైస్త్ ప్రాంతం పేరు మీదుగా వచ్చింది ఈ రైస్తి మాండలికం. రాజస్థానీ, పంజాబీ, ముల్తానీ భాషల కలయికగా దీనిని చెప్పుకోవచ్చు. సట్లజ్ పరీవాహక ప్రాంతాల్లోనూ, చూలిస్థాన్ ఎడారి ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఈ మాండలికాన్ని వాడతారు. పంజాబీ భాషకు మాండలికమైన సరైకీ మాండలిక సముదాయంలో ఈ రైస్తిని ఈ మధ్యే పరిగణించారు.

ఛాచి

[మార్చు]

పాకిస్థానీ పంజాబ్ లో మాట్లాడే అనేకానేక మాండలికాల్లో ఇది ఒకటి. పోతోవారీ, హింద్కో మాండలికాల మిశ్రమం ఛాచి. పాకిస్థానీ పంజాబ్ లోని అటోక్ మండలంలో గల ఛాచ్ ప్రాంతం పేరు మీదుగా ఛాచి పేరు వచ్చింది. ఛాచి తెగ కోహ్లి ఖొఖ్రన్ తెగలో భాగం. అటోక్ మండలంలోనూ, హజారా భూభాగంలోనూ, ఖ్యబెర్ పఖ్తుంఖా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మండలీకం కనిపిస్తుంది.

జండాలీ

[మార్చు]

పోతోవారీ, ఛాఛి, థలోచి మాండలికల మిశ్రమం జండాలీ. దీనిని రోహి అని కూడా వ్యవహరిస్తారు. ఈ మాండలికాన్ని పాకిస్థానీ పంజాబ్ లోని  జంద్ తాలూకాలోనూ, మైన్ వాలీ మండలంలోనూ ఎక్కువగా మాట్లాడతారు.

థలోచి/థాలి

[మార్చు]

పాకిస్థానీ పంజాబ్ లోని థాల్ ఎడారిలో ఈ మాండలికం మాట్లాడతారు. థాల్ ఎడారి పేరు పైనే దీనికి థాలి అని పేరు వచ్చింది. సర్గోదా, ఖౌషబ్ మండలాల్లో మాట్లాడే పంజాబీ మాండలికం షాహ్ పురీకి దీనికి దగ్గరి పోలికలున్నాయి. పాకిస్థానీ పంజాబ్ లోని సింధ్ నది తూర్పు భాగాన ఉండే భక్కర్, లయ్యాహ్, ముజ్జఫ్ఫర్ గడ్ మండలాల్లోనూ, సింధ్ నది పశ్చిమ ప్రాంతాలైన బన్ను, తనక్, డెరా ఇస్మాయిల్ ఖాన్ లలో  ఈ మాండలికం మాట్లాడతారు.

ధాని

[మార్చు]

పాకిస్థానీ పంజాబ్ లోని రావల్పిండి ప్రాంతంలో ఈ మాండలికాన్ని ఎక్కువగా మాట్లాడతారు.[2] ధాన్ లోయలో ఎక్కువగా మాట్లాడే ఈ మాండలికానికి దాని పేరు మీదనే పేరు వచ్చింది. చక్వాల్ ప్రాంతంలోనూ, జెహ్లాం, అటొక్ మండలాల్లో కూడా ఈ మాండలికాన్ని మాట్లాడతారు.[7] పొథొహర్ ప్రజలు పొథొహర్ మాండలికం వాడతారు. కానీ చక్వాల్, ధాన్నీ ప్రాంత ప్రజలు పొథొహరీ మాట్లడరు. వీరు పంజాబీ భాషకు చెందిన చక్వాలీ, థాన్నీ మాండలికాలు మాట్లాడతారు. ఇవి షాహ్ పురీకి దగ్గరగా ఉంటాయి.

జఫ్రి/ఖెత్రానీ

[మార్చు]

ఇవి దెరావాలీకి రూపాంతరంగా చెప్పుకోవచ్చు. బలూచీ, సింధి భాషల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంది. పాకిస్థానీ పంజాబ్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ముసఖేల్, బర్ఖాన్ మండలాల్లో ఎక్కువగా మాట్లాడతారు.

ఖెత్రానీ మాండలికం లహందా భాష కాదు కానీ, దార్దిక్ కు చెందినది. 

జేన్సారీ

[మార్చు]

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్ వాల్ ప్రాంతానికి చెందిన డెహ్రాడూన్ మండలంలోని చక్రతా, కల్సీ ప్రదేశాల్లో ఈ జేన్సారీ మాండలికాన్ని  మాట్లాడతారు. ఇది పహారీ భాషకు చెందినది. దీనిని గర్హ్ వాలీ భాష  అని కూడా అంటారు. కానీ ఇది డోగ్రీ-కంగ్రీ భాషలకు దగ్గరగా  ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మేర్ మండలంలో ఎక్కువగా  మాట్లాడతారు. దీని పదాలు సిర్మేరీ భాషకు దగ్గరగా ఉంటాయి.

ఇక్కడి ప్రజలు ఇండో-ఆర్యన్ మూలాలకు చెందిన వారు. తాము  మహాభారతం లోని పాండవుల వారసులమని వీరి నమ్మకం. భారత  ప్రభుత్వం వీరిని ఎస్టీలుగా గుర్తించింది.

లహందా

[మార్చు]

లెహందా లేదా పశ్చిమ పంజాబీ అనేవి పాకిస్థానీ పంజాబ్ కు చెందిన ఇండో-ఆర్యన్ రకపు భాషలు. సింధి, తూర్పు పంజాబీ భాషలకు అనువాద భాషలుగా చెప్పుకోవచ్చు. లహందా మాండలిక వ్యవహర్తల సాహిత్య భాష సంప్రదాయకంగా పంజాబీ సాహిత్యంలో ప్రామాణిక భాషగా ఉంది.[8]

చెనవరీ

[మార్చు]

పాకిస్థానీ పంజాబ్ లోని చీనాబ్ నది పశ్చిమాన ఉన్న ఝాంగ్ మండలానికి చెందిన ఝాంగోచి మాండలికాన్నీ, థాలోచీని కలపగా వచ్చిన మాండలికమే చెనవరీ. చీనాబ్ నది పేరు మీదుగా ఈ మాండలికానికి చెనవరీ అని పేరు వచ్చింది.

విదేశీ(బర్లీ బోలీ)

[మార్చు]

మాండలికపు సమూహంలో ఎన్నో మాండలికాలు నిత్యం కలుస్తూ ఉంటాయి. దీనర్ధం ఆ ప్రాంతపు ప్రజలు వలస వెళ్ళిన ప్రాంతాల్లోని భాషల పదాలతో ఈ భాషలను సుసంపన్నం చేస్తూన్నాయి. పంజాబీ విషయంలో కూడా అదే జరిగినా, దాని ప్రత్యేకతను ఆ భాష ఎప్పుడూ నిలబెట్టుకుంటూ వచ్చింది. ఉదాహరణకు యుకె, ఉత్తర అమెరికాలకు పంజాబీ ప్రజలు వలస వెళ్ళి, ఆంగ్ల భాష లోని పదాలను,  వ్యాకరణాన్నీ పంజాబీ భాషలోకి ఇమిడ్చారు అని చెప్పొచ్చు.

డోగ్రీ

[మార్చు]

ఇండో-ఆర్యన్ భాష డోగ్రీ ని పాకిస్థాన్, భారత్ లలో దాదాపు ఐదు మిలియన్ ప్రజలు మాట్లాడతారు.[9] జమ్మూ, హిమాచల్ ప్రదేశ్,  ఉత్తర పంజాబ్ ప్రాంతాల్లో ఈ మాండలికాన్ని మాట్లాడతారు.[10] డోగ్రీ మాట్లాడేవారిని డోగ్రాలని, మాట్లాడే వారి ప్రాంతాన్ని డుగ్గర్ అని అంటారు.[11] కాశ్మీరీ, పంజాబీ, ఉర్దు, హిందీ భాషలు స్వతంత్రంగానే ఉన్నా, వీటి మాండలికాల ప్రభావాలు ఒక దానిపై ఒకటి ఉంటాయి. చాలామంది డోగ్రీ, హిమాచలీ మాండలికలను పంజాబీ మాండలికాలుగా పరిగణిస్తారు. అలాగే రంబానీ వంటి పశ్చిమ పహారీ భాషలను కాశ్మీరీకి మాండలికాలుగా కూడా వ్యవహరిస్తారు.[12] డోగ్రీ పశ్చిమ పహారీ భాషలకు చెందినదే.[13] డోగ్రీని పాకిస్థాన్ లో పహారీ అని అంటారు. ఇండో-యూరోపియన్ భాషల్లా కాక డోగ్రీ శబ్ధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే భాష.[14] పంజాబీ, పశ్చిమ పహారీ భాషలతో సారూప్యం ఉంటుంది ఈ డోగ్రీ మాండలికానికి.

గడ్డీ

[మార్చు]

హిమాచల్ ప్రదేశ్జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లో ఉండే తెగలు గడ్డీలు.  వీరు ప్రధానంగా హిందువులు. వీరిలో కూడా బ్రాహ్మణులు, రాజపుత్రులు, ధంగర్, ఖత్రి, రాణ, ఠాకూర్ వంటి కులాలు ఉన్నాయి. వీరు మాట్లాడే మాండలికమే గడ్డీ.

Gaddi woman cutting grass. Painting by Alfred Hallett, c.1975.
Gaddi woman cutting grass. Painting by Alfred Hallett, c.1975.

సరైకి

[మార్చు]

సింధ్, బెలూచిస్థాన్ లలో సరైకి మాండాలికం మాట్లాడతారు.

సిర్మోరి

[మార్చు]

సిర్మోరి, హిమాచాలీ  అనేవి పశ్చిమ పహారీ భాషలకు చెందినవి. ఉత్తర భారతంలోని ధర్తీ, గిరిపరి ప్రాంతాల నుండి వచ్చిన మాండలికాలు ఇవి. ఈ రెంటికీ సారూప్యతలు తక్కువే అయినా. పశ్చిమ పహారీ భాషా సమూహంలోని ఇతర భాషలతో పోలిస్తే ఇవి రెండూ వినడానికి ఒకేలా ఉంటాయి.

పంజాబీ విశ్వవిద్యాలయ వర్గీకరణ

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయం పంజాబీ భాష యొక్క మాండలికాల జాబితా ప్రచురించింది. అవి:[15]

మూలాలు వనరులు

[మార్చు]
  1. "UCLA Language Materials Project: Language Profile". Lmp.ucla.edu. Archived from the original on 2015-05-13. Retrieved 2016-07-16.
  2. 2.0 2.1 2.2 "Online Punjabi Teaching". Learnpunjabi.org. Archived from the original on 2017-07-31. Retrieved 2016-02-02.
  3. "District Website". Sargodha.dc.lhc.gov.pk. Archived from the original on 2014-10-02. Retrieved 2016-02-02.
  4. The Indo-Aryan Languages By Colin P. Masica (page 18)
  5. "The Art and Culture of the Diaspora | Mother Tongue: The Many Dialects of Punjabi". Sikhchic.com. Retrieved 2016-02-02.
  6. "UNESCO Atlas of the World's Languages in danger". Unesco.org. Retrieved 25 August 2012.
  7. "History of Chakwal | I Have A Dream In My Eyes". Meetcornor.wordpress.com. Retrieved 2016-02-02.
  8. Tolstaya, Natalya I. (1981). The Panjabi Language. Routledge. ISBN 9780710009395.
  9. Sharma, Sita Ram (1992). Encyclopaedia of Teaching Languages in India, v. 20. Anmol Publications. p. 6.
  10. Billawaria, Anita K. (1978). History and Culture of Himalayan States, v.4. Light & Life Publishers.
  11. Narain, Lakshmi (1965). An Introduction to Dogri Folk Literature and Pahari Art. Jammu and Kashmir Academy of Art, Culture and Languages.
  12. Itagi, N. H. (1994). Spatial Aspects of Language. Central Institute of Indian Languages. p. 70. ISBN 81-7342-009-2.
  13. Masica, Colin P. (1993). The Indo-Aryan Languages. Cambridge University Press. ISBN 0-521-29944-6.
  14. Ghai, Ved Kumari (1991). Studies in Phonetics and Phonology: With Special Reference to Dogri. Ariana Publishing House. ISBN 81-85347-20-4. non-Dogri speakers, also trained phoneticians, tend to hear the difference as one of length only, perceiving the second syllable as stressed
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-31. Retrieved September 20, 2009.