Jump to content

పిల్లలమర్రి పినవీరభద్రుడు

వికీపీడియా నుండి
(పిల్లలమర్రి పిన వీరభద్రుడు నుండి దారిమార్పు చెందింది)
పిల్లలమర్రి పినవీరభద్రుడు

పిల్లలమర్రి పిన వీరభద్రుడు (1480) విద్వత్కవి. సరస్వతీ కటాక్షాన్ని పొందిన మహాకవి. "వాణి నారాణి' అని చెప్పినట్లు జనబాహుళ్యంలో ఉంది. పదిహేనో శతాబ్ధంలోని ఈ కవి "శృంగార శాకుంతలం", "జైమినీ భారతం" అనే గ్రంథాలు రచించాడు.

శృంగార శాకుంతలం

[మార్చు]

శృంగార శాకుంతలం నాలుగు ఆశ్వాసాల ప్రభంధం. వెన్నయామాత్యునికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యానికి పేరు పెట్టడంలో శ్రీనాథుని అనుకరించాడు. వ్యాస భారతంలోని మూలకథను గాని, కాళిదాసు అభిఙ్ఞాన శాకుంతలమును గాని యధాతధంగా అనుసరించక రెండింటిని కలిపి మృదు మధుర శృంగార రస ప్రభందంగా శృంగార శాకుంతలాన్ని రచించాడు. ఈ కావ్యంలో శృంగార రసపోషణకు ప్రాధాన్యం ఉంది.

జైమిని భారతం

[మార్చు]

జైమిని భారతం పిల్లలమర్రి పినవీరభద్రుని రెండవ కావ్యం. ఇది 8 ఆశ్వాసాల ప్రభందం. దీనిని సాళువ నరసింహరాయలకు అంకితం ఇచ్చాడు. జైమినీ భారత రచనా నైపుణ్యాని నరసింహరాయలు మెచ్చుకొన్నట్లు జైమిని భారత పీఠికలో కవి చెప్పుకొన్నాడు. భారతంలోని అశ్వమేధ పర్వ కథే జైమిని భారతంలోని ఇతివృత్తం. కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగాన్ని గురించి జైమిని అనే మహర్షి జనమేజయునికి చెప్పిన విషయం ఇందులో ముఖ్యమైంది. మహాభారతంలో లేని ఉపాఖ్యానాలు - కుశలవోపాఖ్యానం, చంద్రహాస చరిత్ర, ప్రమీలార్జునీయం, ఉద్దాలకుని చరిత్ర వంటివి జైమిని భారతంలో ఉన్నాయి. ఈ కావ్యంలో ప్రారంభంలో శైలి ఫ్రౌఢమైనది అయిన తరువాత రమ్య శైలిని కవి పాటించాడు. తెలుగు పలుకుబడులను ఈ కవి చక్కగా ప్రయోగించాడు. తరువాతి ప్రబంధ రీతికి శ్రీనాథుని వలెనే పిల్లల మర్రి పినవీరభద్రుడు కూడా మార్గదర్శకుడే.