బి.ఎస్.రంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. ఎస్. రంగా
జననం
బిండిగణవలే శ్రీనివాస అయ్యంగార్ రంగా

(1917-11-11)1917 నవంబరు 11
మరణం2010 డిసెంబరు 12(2010-12-12) (వయసు 93)
వృత్తిఫోటోగ్రఫీ
పిల్లలు3 కుమారులు, 1 కుమార్తె

సినిమా పరిశ్రమలో ఒక శాఖలో అనుభవం సంపాదించినవారు ఇంకో శాఖని చేపట్టడం ఆనవాయితీగా వస్తూనేవుంది. ఎడిటర్లుగా పేరు తెచ్చుకున్నవారు దర్శకులయ్యారు (సంజీవి, టి.కృష్ణ, ఆదుర్తి సుబ్బారావు), నటులుగా ప్రవేశించి దర్శకులైనవారున్నారు (భానుమతి, యన్.టి.రామారావు, విజయనిర్మల, యస్.వి.రంగారావు, పద్మనాభం మొదలైనవారు), నిర్మాతలుగా చిత్రాలు తీసి దర్శకులు కూడా అయినవారు కొందరైతే, దర్శకులుగా పేరు తెచ్చూని నిర్మాతలు ఐనవాళ్ళూ ఉన్నారు. ఈ కోవలో ఛాయాగ్రాహకులు కూడా దర్శకులైనవారిలో కె.రామ్‌నాథ్, రవికాంత్‌ నగాయిచ్‌, కమల్‌ ఘోష్‌, యస్.యస్.లాల్, లక్ష్మణ్‌గోరే, బి.యస్.రంగా వంటివారు కనిపిస్తారు.

జీవిత ప్రథమార్థం

[మార్చు]

ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్ని తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో తీసిన రంగాగారి పూర్తి పేరు బిండిగణవలే శ్రీనివాస అయ్యంగార్ రంగా. ఆయన 1917, నవంబరు 11న అప్పటి మైసూరు రాజ్యంలోని బెంగుళూరు సమీపములోని మగడి గ్రామంలో జన్మించారు. ఆయన మాతృభాష కన్నడం. చదువుకుంటూనే ఫోటోగ్రఫీ మీద శ్రద్ధ చూపించి ఆ కళలో కృషి చేశారు. 17వ ఏటనే ఆయన తీసిన ఛాయాచిత్రాలు రాయల్ సెలూన్ ఆఫ్ లండన్‌లో ప్రదర్శితమయ్యాయి. ఫెలో ఆఫ్ ది రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీగా ఎన్నికయ్యారాయన. దేశాలు పర్యటీంచి, ఛాయాచిత్రాల నాణ్యతను పరిశీలించి, బొంబాయి చేరి సినిమాటోగ్రఫిలో చేరారు. ఆ సమయంలోనే స్క్రిప్ట్ రయిటింగ్ మీద అధ్యయనం చేశారు. కొన్ని కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసి, దర్శకనిర్మాతగా, స్టూడియో అధిపతిగా మారారు. విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ పేరిట మా గోపి (1954), భక్త మార్కండేయ (1955), తెనాలి రామకృష్ణ (1956), కుటుంబ గౌరవం (1957), పెళ్ళి తాంబూలం (1961), అమరశిల్పి జక్కన్న (1964), వసంతసేన (1967) వంటి చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలలో కొన్నింటిని కన్నడంలోనూ, తమిళంలోనూ తీశారు. అసలు 1940లోనే ఆయన పరదేశి, ప్యాస్, ప్రకాష్ అనే హిందీ చిత్రాలు డైరెక్టు చేశారు.

మొదట్లో జెమిని స్టూడియోలో కొంతకాలం పనిచేసి, తరువాత విక్రమ్ స్టూడియో ఆరంభించారు. అక్కినేని నాగేశ్వరావు, ఎన్.టి.రామారావు, శివాజీ గణేశన్, రాజ్‌కుమార్, ఎం.జి.రామచంద్రన్, కల్యాణ్ కుమార్ మొదలైన నటులందరితోనూ రంగా చిత్రాలు తీశారు. రంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్ కలర్ లాబొరేటరీని నెలకొల్పారు. ఈ లాబొరేటరీ బెంగళూరు సమీపంలోని నయనదహళ్లి అనే ఊర్లో ఉండేది. వాహినీ స్టూడియోలోని లాబొరేటరీ అధిపతిగా పనిచేసిన సేన్‌గుప్తాప్త మొదట్లో అక్కడే పనిచేసేవారు. బి.యన్.రెడ్డి గారి సలహాతో రంగాగారు లాబొరేటరీని మద్రాసుకు మార్చారు. అప్పుడే సేన్‌గుప్తా వాహినీలో చేరారు. కన్నడంలో తొలి వర్ణ చిత్రం అమరశిల్పి జక్కనాచారి, అది నిర్మించిన ఘనత కూడా రంగాగారిదే. అప్పట్లో ఆ చిత్ర నిర్మాణానికి కేవలం 11 లక్షల రూపాయిలు మాత్రమే వ్యయమయ్యాయి.

కొన్ని విశేషాలు

[మార్చు]

ఈయన నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్ 1960వ, 70వ దశకాలలో మంచి పేరు తెచ్చుకున్నది.

లైలామజ్నూ (1949), దేవదాసు (1953) వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడైన రంగా దర్శకుడై, నిర్మాత కూడా అయి, స్టూడియో కూడా నిర్మించారు. ముఖ్యంగా క్లాసిక్స్ అనబడే కళాత్మక చిత్రాలు తీశారు రంగాగారు. తెలుగులో తెనాలి రామకృష్ణ (1956), అమరశిల్పి జక్కన్న (1964), వసంతసేన (1967) వంటి చిత్రాల్ని, కన్నడంలో మహిషాసుర మర్దిని తీశారు. మహిషాసుర మర్దినిలో రాజ్‌కుమార్ నాయకుడు. రంగాగారు తెలుగులో గుమ్మడి గారితో నిర్మించాలనుకుని ఆయనని అడిగితే, ఆయన తెలుగులోకి డబ్బింగు చేయమని సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం తెలుగులోకి డబ్ చేశారు. రాజ్‌కుమార్‌కి తెలుగులో గుమ్మడి గాత్రం ఇచ్చారు.

ఛాయాగ్రాహకుడిగా ఆయన తీసిన తొలి చిత్రం భక్త నారద. భక్త మార్కండేయని మూడు భాషలలో ఏకకాలంలో నిర్మించిన ఘనత కూడ ఆయనకి ఉంది. పుష్పవల్లి గారి పుత్రుడు బాబ్జీ (మాయాబజార్‌లో విన్నావా యశోదమ్మా పాటలో బాలకృష్ణుడు) మార్కండేయుడిగా, తల్లి పుష్పవల్లి మార్కండేయుడి తల్లి మరుద్వతిగా మూడు భాషలలోనూ నటించారు.

మా గోపి చిత్రం తరువాత తెలుగు, తమిళంలలో తెనాలి రామకృష్ణ సినిమాను ప్రారంభించాడు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. ఎన్టీ రామారావు తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో శివాజీ గణేశన్ వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ భానుమతి పోషించింది. జమునకు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు.[1] అప్పట్లో అనామక రచయిత అయిన అత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చని ఆత్రేయ తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు.[2] విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.

రంగాగారి కొన్నిచిత్రాలకు బహుమతులు లభించాయి. తెనాలి రామకృష్ణ, అమరశిల్పి జక్కన్న చిత్రాలకు రాష్ట్రపతి బహుమతులు లభించాయి.

ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]

"రంగాగారికి కథాగమనం మీద మంచి అవగాహన ఉంది. తానే దర్శకుడు, నిర్మాత గనక, పొదుపుగా తియయ్యడం గురించి కూడా ఆలోచించేవారు. కథే సినిమాకి ప్రాణం అని, కథ నిర్ణయమైన తరువాత నిర్మాణ వ్యయాన్ని వృధా కాకుండా, సినిమా తియ్యడం క్షేమదాయకం అనీ చెప్పేవారని" తెనాలి రామకృష్ణ చిత్రానికి రచయితగా పనిచేసిన సముద్రాల రాఘవాచార్యులుగారు చెప్పేవారు.

మంచిమనసులు (1962) చిత్రంలో అహో ఆంధ్రభోజా పాట ఉంది. ఆ పాటలో కృష్ణదేవరాయలు కనిపిస్తారు. "ఆ షాట్స్ రంగాగారి తెనాలి రామకృష్ణలోవి. రంగాగారు ఎంత సహృదయుడంటే పాటలో కొన్ని షాట్స్ సూపర్ ఇంపోజ్ చేసుకోడానికి అనుమతి ఇమ్మని అడగ్గానే, తప్పకుండా అని తానే ఆ షాట్స్ ప్రింట్ చేయించారు. ఎందుకైనా మంచిది, రామారావు గారితో కూడా ఓ మాట చెప్పండి అన్నారు. తప్పకుండా అని నేను రామారావు గారితో చెబుతే, దానికేం బ్రదర్ అంతకంటేనా అన్నారు. వాళ్ళ మంచి మనసులు అలాంటివి" అని ఆదుర్తి సుబ్బారావు చెపారు.

చిత్రంలో సంగీతం

[మార్చు]

చిత్రంలోని సంగీతం ఎంతో మధురంగా, శ్రావ్యంగా ఉండాలని రంగాగారు ఆశించేవారు. మాగోపి, తెనాలి రామకృష్ణ చిత్రాలలో మంచి సంగీతం వినిపిస్తుంది. విశ్వనాథన్‌ - రామమూర్తి జంట ఈ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తే, అమరశిల్పి జక్కన్న, వసంతసేన చిత్రాలకు యస్.రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. "ఆయన మూడ్ ప్రకారం మనం నడుచుకోగలిగితే, రాజేశ్వరావుగారు అద్భుతమైన వరుసలు చేస్తారు. జక్కన్న సమయంలో ఇబ్బంది పడినా, వసంతసేన సమయంలో ఆయన ఇష్టప్రకారమే సమయం పాటించాను" అని చెప్పేవారు రంగాగారు.

చివరి రోజులు

[మార్చు]

వయసు పైబడిన తరువాత, ఆయన చిత్ర నిర్మాణం ఆపి, కర్ణాటక వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్యం విషమించి తన 93వ ఏట 2010 డిసెంబరు 12వ తేదీన కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు పుత్రులు, ఒక పుత్రిక సంతానం. నాటి ఉత్తమ ఛాయాగ్రహణానికి ప్రామాణికంగా లైలామజ్నూ, దేవదాసు చిత్రాల గురించి నేటి ఛాయాగ్రాహకులు చెప్పుకుంటూ ఉంటారు. దృశ్యానికి తగ్గ మూడ్‌ని లైటింగ్‌తో సృష్టించారని కీర్తిస్తారు.

మూలాలు

[మార్చు]

ఈనాడులో రావి కొండలరావు వ్యాసం

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-06. Retrieved 2009-04-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-03. Retrieved 2009-04-25.

బయటి లింకులు

[మార్చు]