బుద్ధవనం ప్రాజెక్టు
బుద్ధవనం ప్రాజెక్టు | |
---|---|
బుద్ధవనం ప్రాజెక్టు | |
రకం | పార్కు |
స్థానం | హిల్‌కాలనీ, నాగార్జునసాగర్, నల్లగొండ జిల్లా, తెలంగాణ |
విస్తీర్ణం | 247 ఎకరాలు |
నిర్వహిస్తుంది | తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వం |
తెరుచు సమయం | తెరువబడింది |
స్థితి | వాడులో ఉంది |
బడ్జెట్ | 100 కోట్లు |
నిర్మాణ వ్యయం | 100 కోట్లు |
బుద్ధవనం ప్రాజెక్టు అనేది తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సమీపంలోని నందికొండ హిల్‌కాలనీలో నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆసియా ఖండంలోనే అతిపెద్దగా సుమారు 100 కోట్ల రూపాయలతో 247 ఎకరాల్లో[1] నిర్మించిన ఈ బౌద్ధక్షేత్రం 2022 మే 14న ప్రారంభించబడింది. దేశ నలుమూలల నుంచి బౌద్ధ నమూనాలను పరిశీలించి దీనిని రూపొందించారు.
చరిత్ర
[మార్చు]రెండు వేల సంవత్సరాల కిందట ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశంగా, ఆయన స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, బౌద్ధమత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్టును రూపుదిద్దుకుంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతం గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. దీనికి గుర్తుగా నాగార్జున సాగర్ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2005లో నాటి పర్యాటక శాఖ అధికారులు బుద్ధవనం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2006లో బౌద్ధ మత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు.
తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. 2015 మే 2,3,4 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా నాగార్జునసాగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బుద్ధవనాన్ని సందర్శించి, దీని అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు కేటాయించడమేకాకుండా, మల్లేపల్లి లక్ష్మయ్యను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా నియమించాడు.[2]
నిర్మాణం
[మార్చు]బుద్ధవనానికి మొత్తం 274 ఎకరాలు కేటాయించగా, అందులోని 90 ఎకరాల్లో ప్రపంచదేశాలు ఆకర్షించేలా ఈ ప్రాజెట్టు నిర్మించబడింది. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం (బోధిసత్వ పార్), ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, హాస్పిటాలిటీ, వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటుచేశారు. దేశ, విదేశాలకు సంబంధించిన 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలు, భారతదేశంతోపాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలు ఇక్కడ ఏర్పాటుచేయబడ్డాయి. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్థూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించారు.
ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతి పెద్ద స్తూపం, శ్రీలంక నుండి తీసుకొచ్చిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ ఇక్కడ ఏర్పాటుచేయబడ్డాయి. స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు శిల్పాలు ఏర్పాటుచేశారు. బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో 8 పార్కులు (మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలు, రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు, మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు, నాలుగోది ప్రపంచ స్తూపాల పార్కు, ఐదో పార్కులో 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమ, ఆరవ పార్కును ధ్యానవనం, ఏడో పార్కులో మహాస్తూపం, ఎనిమిదో పార్కును స్తూపవనం ఏర్పాటుచేశారు.
కడప జిల్లా, జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన మల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు. బుద్ధవనంలోకి ప్రవేశించే 3 ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వాడారు. బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉండడంతో ఇక్కడ 22 రకాల చెట్లను పెంచుతున్నారు. సిద్ధార్థుడు ఆహారం, నీళ్లు తీసుకోకుండా 48 రోజులపాటు కఠోర తపస్సు చేసి, హృదేలా గ్రామంలో సుజాతాదేవి ఇచ్చిన పాయసం స్వీకరించిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ ఇతివృత్తాంతాన్ని ప్రతిబింబిచేలా మహాస్తూపం కిందిభాగంలో మోకాళ్ళ మీద కూర్చుని పాయసం తీసుకున్నట్లు ప్రతిమను చెక్కారు.
21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసంతో మహాస్తూపాన్ని నిర్మించారు. కాంక్రీట్‌తో నిర్మించిన స్తూపాల్లో ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్దదైన ఈ స్తూప నిర్మాణానికి, గుంటూరు జిల్లా అమరావతిలో శాతవాహనుల కాలంలో నిర్మించిన స్తూప కొలతలను తీసుకున్నారు. విశాలమైన ధ్యాన మందిరం, లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం కూడా ఉన్నాయి.[3]
ప్రారంభం
[మార్చు]బుద్ధవనం ప్రాజెక్టును 2022 మే 14న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యుత్ శాఖామంత్రి జి. జగదీష్ రెడ్డి, కార్మిక శాఖామంత్రి సీహెచ్ మల్లా రెడ్డి, పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మల్సీ ఎంసి కోటిరెడ్డి, టీఎస్‌టీడీసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నందికొండ మున్సిపల్ చైర్‌పర్సన్ కర్ణ అనూషారెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తు నిపుణుడు ఈమని శివనాగిరెడ్డి, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు.[4][5]
నిర్మాణాలు
[మార్చు]274 ఎకరాల్లోని 35 ఎకరాలలో విపాసన ధ్యాన కేంద్రాన్ని నిర్మించి బుద్ధుడు అనుసరించిన అష్టాంగ మార్గాలను బోధించే వివరించేలా బుద్ధ చరిత్ర వనం, జాతక పార్కు, ధ్యాన వనం, స్థూప పార్కు, మహాస్థూపం మొదలైనవి నిర్మించారు.[6]
- స్థూప పార్కు: ప్రపంచంలో ఉన్న బౌద్ధులు ఒకేచోట స్థూప నమూనాలు చూసేవిధంగా నిర్మించిన ఈ పార్కులో సాంచీ, సారనాథ్, అజంతా, అమరావతి, కారలే, మాణిక్యాల 5 రకాల స్థూపాల నమూనాలు, వివిధ దేశాల్లోని మీర్‌పూర్‌ఖాస్ (పాకిస్తాన్), అనురాధపుర (శ్రీలంక), పగోడ (చైనా), చోర్‌టన్ (టిబెట్), బౌద్ధనాథ్ (నేపాల్) తదితర 8 బౌద్ధ స్థూపాల నమూనాలతో మొత్తం 13 స్థూపాలు ఉన్నాయి.
- అవకాన బుద్ధ: శ్రీలంక, తెలుగు ప్రజల మధ్యనున్న రెండువేల సంవత్సరాల అనుబంధానికి ప్రతీకగా నాగార్జునకొండలో సింహళ విహారం నిర్మించిన అప్పటి శ్రీలంక ప్రభుత్వం, దానికి కొనసాగింపుగా బుద్ధవనంలో 27 అడుగుల ఎత్తైన ఈ బుద్ధ విగ్రహంతోపాటు దమ్మగంటను కూడా ఏర్పాటు చేసింది.
- బుద్ధుడి జననం: బుద్ధుడి జననం గురించి తెలిసేలా ఒక మహావృక్షం కింద మహిళ, ఆమె ముందు బాలుడులో ఒక శిల్పం ఉంది. సిద్ధార్థుడు మాయాదేవికి లుంబినీ వనంలో సాల వృక్షం కింద జన్మించాడని చెప్పడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది.
- బుద్ధచరిత వనం: గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన బుద్ధుడి జననం, మహా నిష్క్రమణ, తపస్సు చేయడం, ఉపన్యాసం, మరణం వంటి ఘట్టాలను ఇక్కడ కంచు లోహాలతో పొందుపరిచారు. బుద్ధుడు అహింసా మార్గాన్ని ఎంచుకున్న ఘట్టాలు, అడవులకు పోయిన సన్నివేశాలు, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన అంశాలకు సంబంధించిన శిల్పాలను ఈ పార్కులో ఏర్పాటు చేశారు.
- ఆ నలుగురు: సిద్ధార్థుడు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తరువాత అక్కడ చూసి చలించిన ముసలి వ్యక్తి, రోగి, అంతిమ యాత్రగా వెళ్తున్న వ్యక్తి మృతదేహం, సాధువు శిల్పాలను ఏర్పాటుచేశారు.
- జాతక పార్కు: బుద్ధుడికి సంబంధించి ప్రపంచంలో వాడుకలో ఉన్న 547 జాతక కథలలో ప్రముఖమైన 42 కథలను సేకరించి, వాటిని వివరించే విధంగా శిల్పాల రూపంలో ఈ పార్కులో పొందుపరిచారు.
- మహా స్తూపం: 42 మీటర్ల వ్యాసం, 21 మీటర్ల ఎత్తుతో బుద్ధవనంలో నిర్మించిన మహాస్థూపం దక్షిణ భారత దేశంలో అతిపెద్దది. రెండు వేల సంవత్సరాల క్రితం శాతవాహన కాలంలో అమరావతిలో నిర్మించిన మహాస్థూపానికి సంబంధించిన కొలతలను ప్రమాణికంగా తీసుకున్నారు. మహాస్థూప నిర్మాణంలో అష్టాంగ మార్గానికి గుర్తుగా 8 భాగాలను ఏర్పాటు చేశారు. ఇందులో మ్యూజియం, ఆడిటోరియం, లైబ్రరీ ఉన్నాయి. ఆసియాలోనే అతి పెద్ద కాంక్రీట్ స్థూపం నిర్మాణానికి 128 మంది కళాకారులు పని చేశారు.
- అహింసాయుతమైన అష్టాంగ మార్గాలు: గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అహింసాయుతమైన అష్టాంగ మార్గాలతో బౌద్ధ భిక్షువులను, పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు చేపట్టారు.
- ఆయక స్తంభాలు: బుద్ధుడి జీవితంలోని ముఖ్యమైన 5 సంఘటనలను వివరించేలా మహాస్తూపానికి నాలుగు వైపులా ఐదేసి చొప్పున ఆయక స్తంభాలను ఏర్పాటుచేశారు.
- సిద్ధార్థుడి జననం: లుంబినీ వనంలో మాయాదేవికి సిద్ధార్థుడు జన్మించడం
- మహాభినిష్క్రమనం: నాలుగు విషాదకరమైన సంఘటనలు చూసిన తర్వాత సిద్ధార్థుడు భార్యాపిల్లలు, నగరాన్ని వదిలి తపస్సు కోసం అడవికి వెళ్లడం
- జ్ఞానోదయం: గయలో సిద్ధార్థుడు తపస్సు అనంతరం బుద్ధుడిగా మారడం
- ధర్మచక్ర పరివర్తన: సారనాథ్‌లోని మృగధావనంలో బుద్ధుడి మొదటి ఉపన్యాసం
- మహాపరినిర్యాణం: 80వ ఏట బుద్ధుడి నిర్యాణం
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-05-11). "14న బుద్ధవనం ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2022-05-11. Retrieved 2022-05-15.
- ↑ "బుద్ధం.. శరణం.. బుద్ధవనం!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-05-12. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-15.
- ↑ "కృష్ణానది తీరంలో బుద్ధవనం ప్రారంభానికి సిద్ధం.. మహాద్భుత నిర్మాణం ప్రత్యేకతలివే". Samayam Telugu. 2022-05-12. Archived from the original on 2022-05-13. Retrieved 2022-05-15.
- ↑ telugu, NT News (2022-05-15). "ప్రపంచ పర్యాటక క్షేత్రంగా బుద్ధవనం". Namasthe Telangana. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
- ↑ India, The Hans (2022-05-15). "KTR inaugurates Buddhavanam project". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
- ↑ telugu, NT News (2022-05-15). "బుద్ధవనం చూసొద్దాం". www.ntnews.com. Archived from the original on 2022-05-15. Retrieved 2023-03-27.