Jump to content

భారతదేశంలో ప్రాచీన శిలాయుగం

వికీపీడియా నుండి

ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) లో తొలి దశను "పూర్వ ప్రాచీన శిలాయుగం" (Lower Paleolithic Age) గా పేర్కొంటారు. భారత దేశంలో ఈ దశ సుమారు 6 లక్షల సంవత్సరాల కాలం నుండి 1.50 లక్షల సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. భారత ఉపఖండంలో ఆదిమ మానవుడు మొట్టమొదటిసారిగా శిలా పరికరాలు (Stone Tools) ను తయారు చేసుకొని ఉపయోగించిన కాలం నుంచి ఈ యుగం ప్రారంభమై సుమారిగా 1,50,000 సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది.

భారతదేశంలో ప్రాచీన శిలాయుగం - కాల నిర్ణయం

[మార్చు]

భారత దేశానికి సంబంధించి నంతవరకూ ప్రాచీన శిలాయుగ విభజన కాల వ్యవధులు క్రింది విధంగా ఉన్నాయి.

  1. పూర్వ ప్రాచీన శిలాయుగం (Lower Paleolithic Age): ఇది సుమారుగా 6 లక్షల సంవత్సరాల కాలం నుండి 1.50 లక్ష సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. భారత దేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగం యొక్క కాల వ్యవధి మధ్య ప్లీస్టోసిన్ (Middle Pleistocene) శకానికి సంబంధించినది మాత్రమే.[1]
  2. మధ్య ప్రాచీన శిలాయుగం (Middle Paleolithic Age): ఇది సుమారుగా క్రీ.పూ. 1,50,000 నుండి క్రీ.పూ 35,000 వరకూ కొనసాగింది.[2]
  3. ఉత్తర ప్రాచీన శిలాయుగం (Upper Paleolithic Age): ఇది సుమారుగా క్రీ.పూ. 35,000 నుండి క్రీ.పూ. 10,000 వరకూ కొనసాగింది.[1]

అయితే పై దశలలో ఏ ఒక్క దానికి కూడా ప్రత్యెక పరిధి అంటూ ఏదీ లేదు. పరిణామ క్రమలో పాత సంప్రదాయాలు కొనసాగుతూ వుంటుంటే వాటితో పాటు కొత్త సంప్రదాయాలు కూడా ఆవిర్భవించి పాతవాటితో పాటూ కొనసాగాయి. అంటే మధ్య శిలాయుగం (Mesolithic Age) అనేది ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) ను పూర్తిగా కనుమరుగు చేయదు. మధ్య శిలాయుగాన్ని నవీన శిలాయుగం (Neolithic Age) పూర్తిగా నెట్టి వేయదు. ప్రాచీన శిలాయుగం చివరి దశ, మధ్య శిలాయుగం మొదటి దశ రెండూ కలసి కొనసాగాయి. మధ్య శిలాయుగం చివరి దశ, నవీన శిలాయుగం మొదటి దశ రెండూ కలసి కొనసాగాయి. ఉదాహరణకు బెలాన్ నదీ లోయ (ఉత్తర ప్రదేశ్), నాగర్జన కొండ (ఆంధ్ర ప్రదేశ్) లాంటి ప్రాంతాలలో అయితే ప్రాచీన శిలాయుగ సంస్కృతి నుండి నవీన శిలాయుగ సంస్కృతుల వరకు శిలాయుగ సంస్కృతి అవిచ్ఛన్నంగా కొనసాగింది.[3]

భారత దేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతి - ముఖ్య లక్షణాలు

[మార్చు]

ఈ సంస్కృతికి చెందిన ప్రాఛీన మానవ జాతి సమూహాలు సంచార జీవితం (Nomadic) గడిపేవారు. వీరి ఆవాస స్థానాలు నదీ లోయలు, వాగులు సమీపంలోనే ఉన్నాయి. ఆహార సేకరణే వీరి ప్రధాన వృత్తి. ఆహార సంపాదనకు రాతి పనిముట్లును వాడేవారు. క్వార్జైట్ (Quartzite) తో చేసిన గులకరాతి (Pebbles) పనిముట్లను వాడుతూ, జంతువులను వేటాడి ఆహార సముపార్జన చేసేవారు. జంతువుల మాంసాన్ని చీల్చడానికి రాతి సుత్తి (Stone Hammers) లను వాడేవారు. చేతి గొడ్డళ్ళు (Hand-Axes), ఛేదకాలు (Cleavers) వంటి పరికరాలను తయారు చేసారు. ఈ దశలో ఆదిమ మానవులు తయారు చేసి ఉపయోగించిన పనిముట్లు మొరటుగా ఉన్నాయి. వీరికి గులకరాళ్ళను ప్రత్యక్షంగా పనిముట్ల తయారీలో వాడటమే తెలుసుగాని దాని నుంచి తీసిన పెచ్చులను (Flakes) పనిముట్ల తయారీలో ఉపయోగించడం తెలీదు. వీరికి ఎముకతో గాని, దంతాలతో గాని పనిముట్లు చేయడం ఇంకా తెలీదు. గుహలలో బొమ్మలు గీయడం ఇంకా నేర్వలేదు. నిప్పును రాజేయడం కూడా తెలీదు.

భారతదేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన ప్రధాన సంస్కృతులు

[మార్చు]

భారత దేశానికి సంబంధించి నంతవరకూ పూర్వ ప్రాచీన శిలాయుగం ప్రధానంగా రెండు సంస్కృతులతో కొనసాగింది. అవి

  1. సోవేన్ సంస్కృతి (Soanian Culture)
  2. మద్రాసీ సంస్కృతి (Madrasian Culture)

సోవేన్ లేదా సోహానియన్ సంస్కృతి ఉప హిమాలయ మండలానికి ప్రత్యేకం కాగా మద్రాసీ సంస్కృతి భారత ద్వీపకల్పమంతా విస్తరించి ఉంది.

సోవేన్ సంస్కృతి (Soanian Culture)

[మార్చు]

ఇది ప్రధానంగా పాకిస్తాన్ లోను, ఉత్తర భారత దేశంలో వ్యాపించి ఉంది. ఇది సుమారుగా 5 లక్షల సంవత్సరాల కాలం నుండి 1.25 లక్షల సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. పాకిస్తాన్ లోని సింధు నదికి ఉపనది అయిన 'సోవెన్' (Soan) నదీ పరీవాహక ప్రాంతాన్ని ప్రధాన మానవ ఆవాసంగా కలిగిన ఈ సంప్రదాయానికి చెందిన శిలా పరికరాలు హిమాచల్ ప్రదేశ్ లోని చౌంత్ర (Chauntra), కాశ్మీర్‌లో, ఉత్తర ప్రదేశ్- నేపాల్ సరిహద్దులలోని శివాలిక్ పర్వత పాదాలలో, ధార్ ఎడారిలోనూ బయటపడ్డాయి. ఇక్కడ లభించిన శిలా పనిముట్లను యూరఫ్ తదితర ప్రాంతాలలో కనిపించే అషులియన్ (Acheulean) సంస్కృతికి చెందిన పనిముట్లతో పోల్చవచ్చు. సోవేన్ సంస్కృతికి చెందిన ఆదిమ వాసులు ఉపయోగించిన పనిముట్లలో రాతి నుంచి చేయబడిన చేతి గొడ్డళ్ళు (Hand Axes), కొమ్ము ఆకారపు పనిముట్లు, కోసే పనిముట్లు ముఖ్యమైనవి. ఈ శిలా పరికరాలతో పాటు రాతి పెచ్చు (Flakes) లతో చేసిన పనిముట్లు కూడా లభించడం ఒక విశేషం. పెచ్చులతో చేసిన పనిముట్లు దేశం లోని మిగిలిన ప్రాంతాలలో మధ్య ప్రాచీన శిలాయుగం (Middle Paleolithic Age) నాటికి కాని కనపడవు. రాతితో చేసిన పనిముట్లు కన్నా, రాళ్ళ పై తీసిన పెచ్చులతో చేసిన పనిముట్లు మరింత పరిణితి చెందినవి. శిలా పరికరాల తయారీలో భగ్నమైన పెచ్చులను (Flakes) కూడా తిరిగి ఉపయోగపడేటట్లుగా తిరిగి చెక్కడం అనే ప్రక్రియ (Reflaking or Retouching technology) భారతదేశంలో మిగిలిన ప్రాంతాలలో ‘మధ్య’ ప్రాచీన శిలాయుగం (Middler Paleolithic Age) లో ప్రారంభమైతే, సోవెన్ నదీ పరీవాహక ప్రాంతంలో మాత్రం ‘పూర్వ’ ప్రాచీన శిలాయుగం కాలం (Lower Paleolithic Age) లోనే ప్రారంభమైంది.

మద్రాసీ సంస్కృతి (Madrasian Culture)

[మార్చు]

ఇది దక్షిణ భారత దేశంలో సుమారుగా 15 లక్షల సంవత్సరాల కాలం నుండి 1 లక్ష సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. సుప్రసిద్ధ బ్రిటీష్ ఆర్కియాలజిస్ట్ రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1863 లో తమిళనాడు లోని కోర్తలైయార్ ప్రవాహ తీరంలో గల అత్తిరాంపక్కం (మద్రాస్) వద్ద తొలిసారిగా పూర్వ ప్రాచీన శిలాయుగ దశకు చెందిన శిలాపరికరాలను (చేతి గొడ్డళ్ళు, ఛేదకాలు) కనుగొన్నాడు. ఇక్కడ లభించిన ద్విముఖ చేతి గొడ్డళ్ళు (bifacial Hand-Axes) సుమారుగా 15 లక్షల సంవత్సరాల కాలం నాటివి. అత్తిరాంపక్కం (మద్రాస్) ప్రధాన ఆవాసంగా కొనసాగిన ఈ పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతిని మద్రాస్ చేతి గొడ్డళ్ళ పరిశ్రమ (MadrasHand- Axe Industry) లేదా మద్రాసీ సంస్కృతి (Madrasian Culture) గా పరిగణించారు. ఇక్కడ రాతి నుండి చేయబడిన చేతి గొడ్డళ్ళతో పాటు చేదకాలు (Cleavers), గుండ్రని రాయి మూలం (Discoidal Core), కోసే పనిముట్లు కూడా లభించాయి. ఈ సంప్రదాయానికి చెందిన శిలా పరికరాలు దక్షిణ భారత దేశంలో పల్లవరం, వడమదురై, నట్టం తదితర చోట్ల లభించాయి. సోవెన్ సంస్కృతిలో వలె ఈ మద్రాసీ సంస్కృతిలో దొరికిన పనిముట్లు కూడా కొంతవరకు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో దొరికిన అషులియన్ సంస్కృతి (Acheulean Culture) కి చెందిన పనిముట్లతో పోలికలు కలిగి ఉన్నాయి.

భారతదేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన ఇతర స్థావరాలు

[మార్చు]

భారత దేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగపు మానవులు ఉపయోగించిన శిలా పరికరాలు, సోవన్, మద్రాసి సంస్కృతుల ప్రాంతాలలోనే గాక దక్షిణ భారతదేశంలో అనేక ప్రదేశాలలో కనిపించాయి. ముఖ్యంగా నర్మదా, కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల లోను, చోటా నాగపూర్ ప్రాంతంలోనూ, బ్రాహ్మణీ నదీ పరీవాహక తీరంలోను, ఆంధ్ర ప్రదేశ్‌లో నాగులేరు, సాగిలేరు, గుండ్లకమ్మ, పాలేరు, మున్నేరు మొదలగు వాగుల తీర భూములలోను, పెన్నా, సువర్ణముఖి పరీవాహక ప్రదేశాలలోనూ విస్తృతంగా లభించాయి.

భారత దేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన కొన్ని ముఖ్య ప్రదేశాలు

రాష్ట్రం పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన ప్రదేశాలు
ఉత్తర ప్రదేశ్ బెలాన్ లోయ
రాజస్థాన్ దిద్వానా (Didwana)
మధ్యప్రదేశ్ నర్మదా పరీవాహక ప్రాంతం, భీం బెత్కా రాతి షెల్టర్లు, ఆదంగడ్ గుహలు, నర్సింగపూర్ (Narsingapur), హోషంగాబాద్ ప్రాంతం
ఒరిస్సా బూరి బలాంగ్ నదీ లోయ, బ్రాహ్మణీ నదీ లోయ, ధెన్ కెనాల్, సుందర్ గడ్, సంబల్ పూర్, కియోంజహార్, మయూర్ భంజ్ ప్రాంతాలు
మహారాష్ట్ర కృష్ణా బేసిన్ లోని అహ్మద్ నగర్ ప్రాంతం, గోదావరి బేసిన్ లోని నాసిక్, నెవాసా, చిర్కి, గంగాపూర్, కొలాబా
తమిళనాడు అత్తిరాంపక్కం (మద్రాస్), పల్లవరం, వడమదురై, నట్టం

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన కొన్ని ముఖ్య ప్రదేశాలు

జిల్లా పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన ప్రదేశాలు
అనంతపురం గుంతకల్లు, విషణ కళ్ళు కోట, లత్తవరం,కొత్తపేట, ఉరవకొండ
చిత్తూరు గుడిమల్లం, ఎదుల్ల చెరువు, చింతల పాలెం, జంగాల పల్లి
కడప కల్వపాడు, కనపర్తి, తంబళ్ళపల్లి, సఖిలేరు, రాజంపేట, ఆడకూరు, చెన్నూరు
కర్నూలు బేతంచెర్ల, కృష్ణాపురం, నంద్యాల, వెంకటాపురం, ద్రోణాచలం, సంగమేశ్వరం
నెల్లూరు పినకుర్తి, పగడాలపల్లి, రాచర్లపాడు, పెద గోపవరం, ఇందూరు, వేంకటగిరి
ప్రకాశం డోర్నాల, తోకపల్లి, చింతపల్లి, యర్రగొండపాలెం, గిద్దలూరు
గుంటూరు నాగార్జునకొండ, కారెంపూడి, చేజెర్ల

వీటిని కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 R.S, Sharma. India's Ancient Past (2016 ed.). New Delhi: Oxford University Press. p. 56.
  2. R.S, Sharma. India's Ancient Past (2016 ed.). New Delhi: Oxford University Press. p. 52.
  3. Kambhampati, Satyanarayana. ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర తొలి భాగం [A Study of the History and Culture of the Andhras] (1993 ed.). Hyderabad: Hyderabad Book Trust. p. 16.

వెలుపలి లంకెలు

[మార్చు]
  • History of India, Vol. I, Romila Thapar
  • Studies in Ancient Indian Social history by Romila Thapar
  • Ancient India by Ram Sharan Sharma
  • India's Ancient Past by R.S. Sharma, Oxford University Press.2016 Ed
  • The birth of Indian Civilization by Allchin, B&R
  • An Introduction to Indian archaeology by HD Sankalia
  • The Stone Age in India by P.T. Srinivasa Iyengar
  • Pre-historic South India by V R Ramachandra Dikshitar
  • The lower Paleolithic of the Indian subcontinent by Parth R. Chauhan
  • దక్షిణ భారత దేశ చరిత్ర, వి. సుందర రామశాస్త్రి, తెలుగు అకాడమి
  • The Indian Paleolithic Encyclopedia Britanica
  • Indian Archaeology 1988-89 A Review [1],1993 Edited by M.C.Joshi, Published by Director general of Archaeolgical Survey of India, Government of India, New Delhi