సువర్ణముఖి నది (చిత్తూరు జిల్లా)

వికీపీడియా నుండి
(స్వర్ణముఖి నది నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
స్వర్ణముఖి నది, శ్రీ కాళహస్తి

సువర్ణముఖి (స్వర్ణముఖి, మొగిలేరు) నది దక్షిణ భారతదేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది. తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ప్రముఖ శైవ క్షేత్రమయిన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది. ఈ నదికి ఉపనదులైన భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

ఈ నది ఇసుక వెండిలా తెల్లగానూ అలాగే సువర్ణంలో బంగారం వర్ణంతోనూ ఉంటుంది కావున స్వర్ణముఖి అనే పేరు వచ్చిందని చెపుతారు. నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా " మొగలేరు " అనే మరొకపేరు కూడా వచ్చింది. ఒక కథనం ప్రకారం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, వారి చేతుల్లోకి ఇసుక తీసుకుంటే వారి కష్టానికి తగిన ప్రతిఫలంగా బంగారంగా మారేది. [ఆధారం చూపాలి]

నది ప్రస్థానం

[మార్చు]
స్వర్ణముఖి నదిపై వంతెన , శ్రీకాళహస్తి

స్వర్ణముఖి నది పాకాల సమీపంలో ఉన్న పాలకొండ లలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టినది. తరువాత ఈ నది కొంతదూరం ఉత్తరంగా ప్రవహించి మరికొంత దూరం ఈశాన్యంగా ప్రవహిస్తు శేషాచల కొండలను స్పృజించి చంద్రగిరి ఎగువన భీమానదితో, దిగువన కల్యాణీనదులతో సంగమించి కపిలతీర్ధం, అలివేలుమంగాపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు మీదుగా ప్రవహించి నూడుపేట సమీపంలో ఉన్న సిద్ధవరం వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈ నది మొత్తంగా దాదాపు 100 మైళ్ళు ప్రయాణిస్తుంది.

నదీ పురాణం

[మార్చు]

హిమాలయాలలో శివపార్వతుల కల్యాణానికి కదిలి వచ్చిన దేవ, ఋషి, మానవ గణాల భారంతో భూమి ఒక వైపుకు వంగిపోయిన సందర్భంలో శివుడు అగస్త్యమహామునిని పిలిచి వింధ్యపర్వతాలకు ఆవలివైపు వెళ్ళమని ఆదేశించాడు. అగస్త్యుడు శివుని ఆదేశాన్ని అనుసరించి భారతదేశ దక్షిణప్రాంతానికి తరలి వెళ్ళాడు. పోతూ పోతూ సూర్యగమనానికి అడ్డుతగులుతూ పెరుగుతున్న వింధ్యపర్వతం వద్ద తాను తిరిగి వచ్చే వరకు పెరగకూడదని వరం స్వీకరించాడు. అందువలన వింధ్యపర్వతాల పెరుగుదల ఆగిపోయింది. అగస్త్యుడు తిరిగి ఉత్తరదిశకు వెళ్ళలేదు. ఇలా వింధ్య పర్వత గర్వభంగం చేసాడు. దక్షిణ దిశకు వచ్చిన అగస్త్యుడు కృష్ణానది, జ్యోతి సిద్ధవటం, శ్రీశైలం, ద్రాక్షారామం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాళహస్తికి చేరుకున్నాడు. అక్కడ స్నానపానాలకు, జపతపాలకు తగిన నీరు లభించని కారణంగా కాళహస్తికి నాలుగు యోజనముల దూరములో పడమరదిశగా ఉన్న పర్వతశ్రేణులలో తపస్సు చేయగా బ్రహ్మాదులు దేవగణములతో శివుని దర్శించుకుని అగస్త్యుని కోరిక తెలిపారు. శివుడు ఆప్రదేశంలో ఒక నదీమతల్లి ఆవిర్భావానికి అనుగ్రహించగా ఆకాశం నుండి గంగాభవాని స్వర్ణ కాంతులతో భూమిమీదకు దిగివచ్చింది. అందువలన ఈ నది స్వర్ణముఖి అని నామధేయురాలైంది.

నదీ తీరంలో పుణ్య క్షేత్రాలు

[మార్చు]

ఈ నదికి కల్యాణీ, భీమానదులు ప్రధానమైన ఉపనదులు. కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణశ్రీనివాసుడు వెలసి పూజలందుకుంటున్నాడు. తొండవాడ వద్ద అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గర పరశురామేశ్వరాలయం, శ్రీకాళహస్తి దగ్గర శ్రీకాళహస్తీశ్వరాలయం ఉన్నాయి.

మూలాలు, వనరులు

[మార్చు]
  • శ్రీకాళహస్తి దేవస్థానం వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆహ్వానపత్రిక నుండి సేకరించింది.

వెలుపలి లంకెలు

[మార్చు]