భూత్పూర్ (భూత్పూర్ మండలం)
భూత్పూర్ | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°42′N 78°04′E / 16.70°N 78.06°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్‌నగర్ జిల్లా |
మండలం | భూత్‌పూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | టి.శోభాదేవి |
జనాభా (2011) | |
- మొత్తం | 6,248 |
- పురుషుల సంఖ్య | 3,161 |
- స్త్రీల సంఖ్య | 3,087 |
- గృహాల సంఖ్య | 1,331 |
పిన్ కోడ్ | 509382 |
ఎస్.టి.డి కోడ్ | 08542 |
భూత్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, భూత్‌పూర్ మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న భూత్పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఈ గ్రామం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌కు 8 కిమీ దూరంలో 44వ నెంబరు (పాతపేరు 7వ నెంబరు) జాతీయ రహదారిపై 16°42' ఉత్తర అక్షాంశం, 78°3' తూర్పు రేఖాంశంపై ఉపస్థితియై ఉంది.[4] మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి కూడా గ్రామం మీదుగా వెళ్ళుచుండటంతో ఈ గ్రామం ప్రధాన రోడ్డు కూడలిగా మారింది. మొదట జడ్చర్ల తాలుకాలో భాగంగా ఉన్న ఈ గ్రామం 1986లో మండల వ్యవస్థ ఏర్పడిన పిదప ప్రత్యేకంగా మండల కేంద్రంగా మారింది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1331 ఇళ్లతో, 6248 జనాభాతో 1414 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3161, ఆడవారి సంఖ్య 3087. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 928 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1117. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 575543[5].పిన్ కోడ్: 509382. జనాభాలో ఎస్సీలు 928, ఎస్టీలు 1117 ఉన్నారు. అక్షరాస్యత శాతం 55.20%. గ్రామ కోడ్ సంఖ్య 575543. మండలంలో ఇది రెండో పెద్ద గ్రామం. జిల్లాలో 61వ పెద్ద గ్రామం.
కార్యాలయాలు
[మార్చు]గ్రామంలో మండల కార్యాలయాలతో పాటు, గ్రామపంచాయతి కార్యాలయం, సహకార పరపతి సంఘం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శాఖా గ్రంథాలయం, వ్యవసాయ కార్యాలయం, ఉప-తపాలా కార్యాలయం ఉన్నాయి. శ్రీసత్యసాయి గురుకుల పాఠశాలతో పాటు గ్రామంలో జడ్పీ, మండల పరిషత్తు, ప్రైవేటుకు సంబంధించిన పలు విద్యాసంస్థలున్నాయి.
భౌగోళికం, సరిహద్దులు
[మార్చు]ఈ గ్రామం 16°42' ఉత్తర అక్షాంశం, 78°3' తూర్పు రేఖాంశంపై ఉంది. భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరం వైపున మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులో ఉంది. ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం ఉండగా, తూర్పున తాడిపర్తి, కొత్తూర్ గ్రామాలు, దక్షిణాన కొత్తమొల్గర, గోప్లాపూర్ ఖుర్డ్ గ్రామాలు, పశ్చిమాన అమిస్తాపూర్ గ్రామం సరిహద్దులుగా ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]చరిత్రలో బూదపురంగా పిలువబడిన ఈ గ్రామం పలు యుద్ధాలకు స్థానమైంది. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వేయించిన శాసనంతో పాటు ఈ గ్రామంలో గోనరెడ్ల పాలకులకు, చాళుక్యులకు సంబంధించిన పలు చారిత్రక ఆధారాలు, శాసనాలున్నాయి.ఈ గ్రామంలోనే కాకుండా గ్రామ పరిసరాలలో కూడా పలు చారిత్రక ఆధారాలు, శాసనాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజధానులుగా వర్థిల్లిన వర్థమానపురం, కందూరు లాంటి చారిత్రక ప్రాంతాలు కూడా గ్రామానికి సమీపంలోనే ఉన్నాయి.
భూత్పూరు ప్రాంతానికి ఘనమైన చారిత్రక ప్రాశస్త్యం ఉంది. బృహచ్ఛిలాయుగం నాటి ఆనవాళ్ళు లభించిన బాదేపల్లి, జడ్చర్ల, బిజినేపల్లి ఈ గ్రామానికి సమీపంలో ఉన్నాయి.[6] శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. సా.శ.3వ శతాబ్దిలో ఇది ఇక్ష్వాకుల పాలనలోకి వెళ్ళింది. ఆ తర్వాత వాకాటకులు, విష్ణుకుండినుల అధీనంలో నుంచి సా.శ.6వ శతాబ్దిలో చాళుక్యుల పాలనలో చేరింది. కళ్యాణి చాళుక్యులకు సంబంధించిన శాసనం కూడా గ్రామంలో ఉంది.[7] సా.శ.10వ శతాబ్దిలో కందూరు చోడుల రాజధాని అయిన కందూరు ఈ గ్రామానికి సమీపంలోనే ఉంది. 12వ శతాబ్దిలో గోనరెడ్లు అధికారంలోకి వచ్చి రాజధానిని వర్థమానపురానికి మార్చారు. ఈ రాజధాని కూడా భూత్పూరు గ్రామ సమీపంలోనిదే. ఈ కాలంలోనే గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. గోన బుద్ధారెడ్డి సొదరి కుప్పాంబిక సా.శ.1276లో[8] ఈ గ్రామంలో ఒక శాసనం వేయించింది. ఇదే బూదపురం శాసనంగా ప్రసిద్ధి చెందింది.[9] ఈమె తెలుగులో తొలి కవయిత్రిగా గణతికెక్కింది. వర్థమానపురం పాలకుడు మల్యాల గుండయ బూదపురం సమీపంలో బానసముద్రం, కుప్పసముద్రం త్రవ్వించాడు. గణపతిదేవుని పేరిట గణపసముద్రం కూడా త్రవ్వించాడు.[10] ఇతను 1259లో బూదపురంలో శాసనం వేయించాడు.[11] కాకతీయ గణపతిదేవుడు వర్థమానపురంపైకి దండెత్తి రావడంతో ఈ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో భాగమైంది. వర్థమానపురం పాలకులకు, కాకతీయులకు మధ్యన భారీ యుద్ధం ఈ ప్రాంతంలోనే జరినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత గణపతిదేవుడు వర్థమాన పురాన్ని గాడిదలచే దున్నించి గ్రామం మొత్తాన్ని నాశనం చేసి గుండదండాధీశుడిని ఈ ప్రాంతపు ప్రతినిధిగా నియమించి వెళ్ళిపోయాడు.[12] గుండదండాధీశుడు వేయించిన శాసనం కూడా భూత్పూరులో లభ్యమైంది. భూత్పూరు సమీపంలోని పోతులమడుగు గ్రామంలోని శిలాశాసనం ఆధారంగా ఈ ప్రాంతం 13వ శతాబ్దిలో బాదామి చాళుక్యులు ఏలినట్లు చరిత్రకారులు నిర్థారించారు.[13] 14వ శతాబ్దంలో ఇది పద్మనాయక సామ్రాజ్యంలో ఉండింది. ఆ తర్వాత బహమనీలు, కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు పాలించారు. 1948, సెప్టెంబరులో నిజాం పాలన నుంచి బయటపడి భారతదేశంలో భాగమైంది. 1948 నుంచి 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో ఉండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణతో తెలంగాణ మొత్తంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంతో ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. ప్రారంభంలో ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. 1870లో నల్గొండను విభజించి నాగర్‌కర్నూలు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం కూడా నాగర్‌కర్నూలు జిల్లాలో చేరింది. 1883లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం కావడంతో[14] ఈ జిల్లాలో భాగమై కొనసాగుతోంది. మొదట నాగర్‌కర్నూలు తాలుకాలో, ఆ తర్వాత 1986 వరకు జడ్చర్ల తాలుకాలో ఉండగా, మండల వ్యవస్థ ఏర్పాటుతో ఈ గ్రామం ప్రత్యేకంగా మండల కేంద్రం అయింది.
దేవాలయాలు
[మార్చు]పురాతనమైన నందీశ్వరాలయం గ్రామం నడిబొడ్డున ఉంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రోడ్డు రవాణా: జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉండుట, 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉండుటచే రవాణా పరంగా గ్రామానికి మంచి సౌలభ్యం ఉంది. భూత్పూర్ ప్రముఖ కూడలి ప్రదేశం. జాతీయ రహదారిపై నుంచి హైదరాబాదు- బెంగుళూరు వైపులకే కాకుండా కూడలి నుంచి మహబూబ్‌నగర్, శ్రీశైలం వైపు రహదారులున్నాయి. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించబడింది.
రైలురవాణా: గ్రామానికి రైలు సదుపాయము లేదు. అయిననూ 8 కిమీ దూరంలో ఉన్న మహబూబ్‌నగర్ రైల్వేస్టేషను గ్రామస్థులకు అందుబాటులో ఉంది.
వాయురవాణా: ఈ గ్రామానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం శంషాబాదులోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది భూత్పూర్ నుంచి 90 కిమీ దూరంలో ఉంది.
రాజకీయాలు
[మార్చు]ఈ గ్రామం దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది.2001లో గ్రామ సర్పంచిగా నారాయణరెడ్డి, 2006లో కాట్రావత్ ప్రమీల (ఇండిపెండెంట్) గెలుపొందినారు. 2013, ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘపు ఎన్నికలో సింగిల్ విండోలోని 13 డైరెక్టర్ స్థానాలలో పదింటిని తెరాస, రెండు తెలుగుదేశం పార్టీ, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి.[15] 2013, జూలై 23న జరిగిన పంచాయతి ఎన్నికలలో సర్పంచిగా టి.శోభాదేవి ఎన్నికైనది.[16]
విద్యాసంస్థలు
[మార్చు]గ్రామంలో రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, ఒక ఉర్దూమీడియం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ప్రైవేట్ పాఠశాలలు (శ్రీసత్యసాయి గురుకులం ఉన్నత పాఠశాల, న్యూటాలెంట్ స్కూల్, వివేకానంద విద్యాలయం) ఉన్నాయి. గ్రామంలో డిగ్రీ కళాశాల లేదు. దీనికై విద్యార్థులు మహబూబ్‌నగర్ పట్టణానికి లేదా జడ్చర్లకు వెళ్ళవలసివస్తుంది.
శాఖా గ్రంథాలయం
[మార్చు]గ్రామం నడిబొడ్డున పురాతనమైన నందీశ్వరాలయం ప్రక్కనే శాఖా గ్రంథాలయం ఉంది. తెలుగు. హిందీ, ఆంగ్లం, ఉర్దూ పుస్తకాలే కాకుండా దినపత్రికలు, వారపత్రికలు గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ శాఖా గ్రంథాలయానికి కావలసిన వనరులు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి సమకూరుతుంది. ఉదయం, సాయంత్రం వేళలలో గ్రంథాలయం పనిచేస్తుంది.
గ్రామపాలన
[మార్చు]భూత్పూర్ గ్రామపాలన గ్రామపంచాయతీచే నిర్వహించబడుతుంది. 2013 ఎన్నికల నాటికి పంచాయతి పరిధిలో 14 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు ఒక వార్డు సభ్యుడు ఎన్నికయ్యాడు. గ్రామపంచాయతికి అధిపతి సర్పంచి. 2013, జూలై 23న జరిగిన పంచాయతి ఎన్నికలలో టి.శోబాధేవి సర్పంచిగా ఎన్నికైనది. పారిశుద్ధ్యం, వీధిదీపాల ఏర్పాటు, త్రాగునీటి సరఫరా గ్రామపంచాయతి ముఖ్యవిధులు. కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి పలు నిర్మాణ పనులు కూడా జరిగాయి. జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ ప్రక్కనే (జడ్చర్ల వైపు) గ్రామపంచాయతి కార్యాలయం ఉంది.
ఆదాయవనరులు: గ్రామపంచాయతికి ముఖ్యంగా వసూలు చేసే ఇంటి పన్నులు, నీటి పన్నులు, లైసెన్స్ ఫీజు, అనుమతి ఫీజుతదితరాలే కాకుండా 13వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా లభిస్తాయి. ఆర్థిక సంఘం నిధుల నుంచి నిర్మాణాత్మకమైన పనులు అనగా కాల్వల నిర్మాణం, స్లాబుల నిర్మాణం, ప్రహరీ గోడలు, బోర్‌వెల్స్ వేయడం తదితరాలకై వినియోగించబడుతుంది.
వాతావరణం, వర్షపాతం
[మార్చు]ఈ గ్రామం 16 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై ఉండుట వల్ల జిల్లాలోని ఇతర ప్రాంతాల వలె ఇక్కడ కూడా వేసవిలో వేడిగా ఉంటుంది. ఏప్రిల్, మేలలో 39 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత, డిసెంబరు-జనవరిలలో 16 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. ఈ గ్రామం సరాసరి వార్షిక వర్షపాతం 626 మిల్లిమీటర్లు.[17] ఇందులో అధికభాగం జూన్-జూలై మాసాలలో నైరుతి రుతుపవనాల వల్ల కురుస్తుంది.
వ్యవసాయం, పంటలు
[మార్చు]గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయము. గ్రామంలో పండించే ముఖ్యమైన పంట వరి. మొక్కజొన్న, జొన్నలు, కందులు కూడా పండిస్తారు. వరి పంట ఖరీఫ్, రబీలలో పండగా, మొక్కజొన్న, జొన్నలు, కందులు ఖరీఫ్‌లో మాత్రమే పండుతుంది. ఇక్కడ పండించే పంటను వ్యవసాయదారులు జడ్చర్ల లేదా మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీలకు తరలించి విక్రయిస్తారు. ఇవి కాకుండా కూరగాయలు పండించి స్థానికంగా విక్రయిస్తారు. ప్రతి ఆదివారం రోజు జాతీయ రహదారి ప్రధాన కూడలి వద్ద పెద్ద సంత జరుగుతుంది.
గ్రామ సంస్కృతి
[మార్చు]పండుగలు: దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్, మొహర్రం తదితరపండుగలు గ్రామంలో జరుపుకొనే ప్రధాన పండుగలు. వినాయక చవితి సందర్భంగా వీధివీధనా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించి, ఐదురోజుల అనంతరం నిమజ్జనం చేస్తారు. సీతారామలక్ష్మణ సంజీవరాయ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు.[18]
వేషధారణ:జిల్లాలోని ఇతర ప్రాంతాల వలె ఈ గ్రామంలో కూడా పురుషుల సంఖ్య ప్యాంటు, చొక్కా, వృద్ధులు (పురుషుల సంఖ్య) ధోవతి, చొక్కా, స్త్రీల సంఖ్య చీర, రవిక ధరిస్తారు. టీనేజి అమ్మాయిలు / అబ్బాయిలు కొత్త కొత్త ఆకర్షణీయమైన దుస్తులలో కనిపిస్తారు.
వంటలు, భోజనం:జిల్లాలోని ఇఅతర ప్రాంతాల మాదిరిగా ఇక్కడ కూడా వరి అన్నం, కూరగాయలు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. జొన్నరొట్టెలు ఉదయం పూట టిఫిన్‌గా కాకుండా భోజనంలో కూడా అదనంగా తీసుకుంటారు. మారుతున్న జీవన విధానం వల్ల టిఫిన్‌లో కొత్తకొత్త రకాలు చోటుచేసుకుంటున్నాయి.
భాష:ఇక్కడి వారు పలికే భాషలో జిల్లాలోని మిగితా ప్రాంతాల మాదిరిగానే తెలంగాణ యాస అధికంగా ఉంటుంది. మహబూబ్‌నగర్ పట్టణం సమీపంలోనే ఉన్ననూ ఇక్కడ భాషలో మాత్రం గ్రామీణ ప్రభావం కనిపిస్తుంది.
గ్రామ వీధులు
[మార్చు]గ్రామం గుండా హైదరాబాదు-బెంగుళూరు జాతీయ రహదారి, మహబూబ్‌నగర్-శ్రీశైలం రహదారులు వెళ్ళుచున్నందున మిగితా రహదారులు అభివృద్ధి చెందలేవు. గ్రామంలోని ప్రధాన దుకాణములన్నియూ ఈ రెండు రహదారుల వెంబడే ఉన్నాయి. రెండూ ప్రధాన రహదారుల కూడలే గ్రామం ప్రధాన కూడలి. మండల కార్యాలయాలు కూడలికి సమీపంలో మహబూబ్‌నగర్ వెళ్ళు రహదారిపై ఉన్నాయి. గ్రామపంచాయతి కార్యాలయం జాతీయ రహదారిపై హైదరాబాదు వెళ్ళు వైపు ఉంది. సహకార సంఘం, సబ్-పోస్టాఫీసు కూడా గ్రామపంచాయతికి సమీపంలోనే జాతీయ రహదారిపై ఉన్నాయి.
దేవాలయాలు
[మార్చు]భూత్పూరు గ్రామంలో పలు ప్రాచీన ఆలయాలున్నాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ముందు గోనవంశపు రెడ్లు వేయించిన శిలాశాసనం ఉంది. జాతీయ రహదారి సమీపంలో మునిరంగస్వామి ఆలయం ఉంది. 600 సంవత్సరాల చరిత్ర కల ఈ ఆలయానికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సంజీవరాయుని దేవాలయం, శాఖా గ్రంథాలయం సమీపంలో పురాతనమైన నందీశ్వరాలయం ఉన్నాయి.
సందర్శనీయ ప్రాంతాలు
[మార్చు]భూత్పూర్ సమీపంలో పలు అధ్యాత్మిక, చారిత్రక సందర్శనీయ ప్రాంతాలు చాలా ఉన్నాయి. పిల్లలమర్రి 12 కిమీ దూరంలో, ప్రముఖమైన వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, మన్యంకొండ ఆలయం, కందూరు, వర్థమానపురం లాంటి చారిత్రక ప్రాంతాలు సమీపంలో ఉన్నాయి.
సదుపాయాలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు,
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
- పోలీస్ స్టేషను,
- సబ్-పోస్టాఫీసు,
- వ్యవసాయ సహకార సంఘం,
- శాఖా గ్రంథాలయము
- వ్యవసాయ అధికారి కార్యాలయము
కాలరేఖ
[మార్చు]- 1122: త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యునిచే బూదపురంలో శాసనం వేయబడింది.[19]
- 1276: భర్త మల్యాలగుండన మరణానంతరం కుప్పాంబిక బూదపురంలో శాసనం వేయించింది.
- 1986: జడ్చర్ల తాలుకాలో ఉన్న ఈ గ్రామం మండల వ్యవస్థ ఏర్పాటుతో ప్రత్యేకంగా మండలకేంద్రంగా మారింది.
- 2011, మే 4: మంచినీటి సరఫరా పథకం (కొత్త) ప్రారంభమైంది.
- 2013, ఫిబ్రవరిలో జరిగిన భూత్పూరు ప్రాథమిక సహకార పరపతి సంఘం ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది.
- 2013, ఏప్రిల్ 14: గ్రామంలో రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ చే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది.
- 2013, జూలై 23న జరిగిన పంచాయతి ఎన్నికలలో టి.శోబాధేవి సర్పంచిగా ఎన్నికైనది
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 15 April 2021.
- ↑ Handbook of Statistics, Mahabubnagar Dist, 2010, PNo 57
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ తెలంగాణ చరిత్ర, రచన:సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 2011 ముద్రణ, పేజీ 23
- ↑ మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము, రచన: బీఎన్ శాస్త్రి, పేజీ 127
- ↑ తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 29
- ↑ తెలంగాణ చరిత్ర, రచన:సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 2011 ముద్రణ, పేజీ 129
- ↑ మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము, రచన:బీఎన్ శాస్త్రి, పేజీ 225
- ↑ నాగర్‌కర్నూల్ తాలుకా గ్రామాలు- చరిత్ర, రచన:కపిలవాయి కిశోర్‌బాబు
- ↑ మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము, రచన: బీఎన్ శాస్త్రి, పేజీ 242
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-08-2008
- ↑ పాలమూరు సాహితీవైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 4
- ↑ archive.andhrabhoomi.net/content/b-1036
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013
- ↑ Handbook of Statistics, Mahabubnagar Dist, 2010, PNo 42
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, మహబుబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 13-09-2013
- ↑ మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము, రచన; బి.ఎస్.శాస్త్రి, పేజీ 179