మఖ్తల్ మండలం
| మఖ్తల్ | |
| — మండలం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°30′00″N 77°31′00″E / 16.5000°N 77.5167°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | నారాయణపేట జిల్లా |
| మండల కేంద్రం | మఖ్తల్ |
| గ్రామాలు | 37 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| వైశాల్యము | |
| - మొత్తం | 366 km² (141.3 sq mi) |
| జనాభా (2011) | |
| - మొత్తం | 72,028 |
| - పురుషులు | 36,094 |
| - స్త్రీలు | 35,934 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 38.24% |
| - పురుషులు | 49.71% |
| - స్త్రీలు | 26.87% |
| పిన్‌కోడ్ | 509208 |
మఖ్తల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]దీని ప్రధాన పరిపాలనా కేంద్రం మఖ్తల్. ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.[4][5] మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన మార్గంలో మహబూబ్ నగర్ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గణాంకాల
[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 72,028 - పురుషులు 36,094 - స్త్రీలు 35,934 అక్షరాస్యుల సంఖ్య 33533.[6]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 366 చ.కి.మీ. కాగా, జనాభా 72,028. జనాభాలో పురుషులు 36,094 కాగా, స్త్రీల సంఖ్య 35,934. మండలంలో 14,264 గృహాలున్నాయి.[7]
మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పు
[మార్చు]గతంలోమహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[8] ఈ మండలంలో కేవలం 5 కిలో మీటర్లలోపు సంగంబండ రిజర్వాయర్ ఉంది. దీనికి చిట్టెం నర్సిరెడ్డి డ్యామ్‌గా నామకరణం చేశారు. ఈ డ్యామ్ కింద కొన్ని వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
మండలం లోని దేవాలయాలు
[మార్చు]పడమటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం
[మార్చు]మఖ్తల్ లో వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని పశ్చిమ ముఖంగా ప్రతిష్ఠించినందున పడమటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారు.స్వామి వారి విగ్రహం ఒక ప్రక్కకు ఒరిగినట్లుగా ఉంటుంది.పూర్వం అర్చకులు పొట్టి వారుగా ఉన్నందున వారి కోరిక మేరకు స్వామి వారు ఒక ప్రక్కకు ఒరిగాడని అంటారు. పడమటి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా నిలుచుని ఉండటం విశేషం. స్వామి వారి గర్భగుడిపై కప్పు లేదు. కప్పు వేయాలంటే, సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం లోపు పవిత్ర నదీజలాలతో ఆగమశాస్త్రం ప్రకారం పైకప్పు వేస్తేనే నిలుస్తుందని చెప్పడంతో ఎన్నోమార్లు వేయాలని చూసి, విఫలమయ్యారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్గశిర పౌర్ణమి రోజు స్వామి వారికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో రథోత్సవం, పాల ఉట్ల కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంలో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొంటారు.
జానపద గాథ: ఇక్కడి స్వామి వారి విగ్రహానికి కాషాయ సింధూర లేపనం నిత్యం ఉంటుంది. ఒకసారి ఓ అర్చకుడు స్వామి వారి నిజరూప దర్శనం చూడాలన్న ఉద్దేశంతో విగ్రహంపై అక్కడక్కడ రేకుతో గీకాడట. మరుసటి రోజు అర్చకుడి శరీర భాగాలపై గాయాలయ్యాయట. తప్పు తెలుసుకున్న అర్చకుడు స్వామి వారి విగ్రహానికి యథాతతంగా లేపనం పూసి, వేడుకోగా గాయాలు మానినవట[9].
నల్ల జానమ్మ ఆలయం
[మార్చు]మక్తల్‌లోకి ప్రవేశించే సమయంలో పెద్ద చెరువు సమీపంలో నల్లజానమ్మ ఆలయం ఎంతో విశిష్టమైనది. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగే రావణ దహన కార్యక్రమానికి వెళ్లడం ఆనవాయితీ. ఈ ఆలయం నుంచి సీతారామలక్ష్మణ, ఆంజనేయ వేషధారులు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. అప్పుడు రావణ దహనం ప్రారంభమవుతుంది. దేవీశరన్నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్ష చేసేవారు ఇక్కడే బస చేస్తారు.
ఆలయాల పట్టణం
[మార్చు]మక్తల్‌లో ఆలయాలకు కేంద్రంగా ఉంది. శివాలయం, కుంభేశ్వరాలయం, వెంకటేశ్వర ఆలయం, మార్కండేయ ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, సత్యసాయి మందిరం, షిర్డీ సాయిబాబా ఆలయం, రాఘవేంద్ర టాకీస్ వద్ద శివాలయం, వీరభద్రేశ్వరాలయం, గోపాలస్వామి ఆలయం ఇలా ఎన్నో ఆలయాలు మక్తల్‌లో ఉన్నాయి. ఇక మక్తల్ శివారులో ఎల్లమ్మ, జములమ్మ, మారెమ్మ ఆలయాలు ఉన్నాయి. మక్తల్ నడిమధ్యలో పద్మశాలి కులదైవం మధ్యలమ్మ ఆలయం ఉంది. ప్రతియేటా బోనాలు వైభవంగా ఆ కులస్తులు చేసుకుంటారు.
శివాలయం
[మార్చు]ప్రధాన రహదారికి చేరువలో నల్లజానమ్మ ఆలయం సమీపంలోనే చారిత్రక శివాలయం ఉంది. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆలయం ఆకర్షిస్తుంటుంది. ఈ ఆలయంపై అనేక కథలు స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ ఆలయం లోపల ఉన్న గుహ నుంచి శ్రీశైలం దాక వెళ్లవచ్చని అప్పటి తరం చెబుతుంటారు. ఈ ఆలయంలో శివరాత్రి, కార్తీకమాసం సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ సమయంలో ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
కుంభేశ్వరాలయం
[మార్చు]మక్తల్ నడిమధ్యలో కుంభేశ్వరాలయం కొలువుదీరి ఉంది. దీన్నే వెయ్యి స్తంభాల గుడిగా కూడా పిలుస్తుంటారు. నల్లరాతితో సుందరంగా ఈ ఆలయం ఉంటుంది. వరంగల్‌లోని వెయ్యి స్తంభాల ఆలయం మాదిరి ఈ ఆలయంలో స్తంభాలు ఉంటాయి. శివరాత్రి, కార్తీకమాసం సమయంలో ఉత్సవాలు జరుగుతాయి.
వెంకటేశ్వర ఆలయం
[మార్చు]మక్తల్‌లోని బాపనగేరిలో వెంకటేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రత్యేక దినాల్లో ఉత్సవాలు జరుగుతాయి. కల్యాణం.. వ్రతాలు జరుగుతుంటాయి.
దత్తాత్రేయస్వామి దేవాలయం
[మార్చు]ఇక్కడ దత్తాత్రేయస్వామి దేవాలయం కూడా ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సోమేశ్వరబండ
- మాధ్వార్
- లింగంపల్లి
- ఉప్పరపల్లి
- కాచ్వార్
- జక్కలేర్
- గుడిగండ్ల
- జౌలాపూర్
- మంథన్‌గోడ్
- బొందలకుంట
- టేకులపల్లి
- మఖ్తల్
- సంగంబండ
- గుర్లపల్లి
- తిరుమలాపూర్
- దాసరదొడ్డి
- చందాపూర్
- గోల్పల్లి
- యెర్నగన్పల్లి
- కాట్రేవుపల్లి
- భూత్పూర్
- రుద్రసముద్రం
- ఖానాపూర్
- కర్ని
- పంచలింగాల్
- చిట్యాల్
- పసుపుల్
- పంచదేవుపాడు
- పరెవాల్
- ముసలయ్యపల్లి
- ఆనుగొండ
- చిన్నగోపాలపూర్
- భగవాన్‌పల్లి
- సత్యవర్
- కొండదొడ్డి
- ముష్టిపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణించబడలేదు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
- ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-29 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
- ↑ "Villages and Towns in Makthal Mandal of Mahbubnagar, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. the original నుండి 2022-09-26 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-09-26.
- ↑ "Villages & Towns in Makthal Mandal of Mahbubnagar, Andhra Pradesh". www.census2011.co.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-09-26.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Andhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". web.archive.org. 2019-04-12. ఒరిజినల్ నుండి 2019-04-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-19.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 16
