మాచవరపు ఆదినారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాచవరపు ఆదినారాయణ

మాచవరపు ఆదినారాయణ తెలుగు యాత్రికుడు, యాత్రా రచయిత.

జీవిత విషయాలు

[మార్చు]

డాక్టర్ మాచవరపు ఆదినారాయణ ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు సమీపంలోని చవటపాలెం గ్రామ నివాసి. ఒంగోలు సీఎస్ఆర్ శర్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆదినారాయణ, ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆదినారాయణ స్వయంగా శిల్పి. అలాగే చిత్రకారుడు కూడా. కొండలు, పర్వతాలు అధిరోహించటం, వాగులు, వంకలు, లోయల్లో ప్రయాణించడం, గ్రామీణ జీవితంలో లీనం కావడం ఆయన ప్రయాణాలలో నేర్చుకున్న అంశాలు. ఇప్పటి వరకు 7 ఖండాలలోని 30 పైగా దేశాలలో ఆయన పాద యాత్రలు చేశారు. ఈ క్రమంలో 30 వేల కిలో మీటర్లకు పైగా నడిచారు. ఆయన నడిచినంతమేర ఆయా ప్రాంత భౌగోళిక విషయాలు, కళ, మతం, సారస్వతం, ఆహారం, ఆహార్యం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ జీవిత నిర్మాణం, జీవన శైలి, విరామ సమయాల కాలక్షేపాలను పరిశీలిస్తారు. తన పరిశీలనలోకి వచ్చిన అంశాలను అక్షరీకరించి పుస్తకాలు రాస్తారు.

ఆదినారాయణ ఆసియా ఖండంలోని నేపాల్, భూటాన్, ఇరాన్, చైనా, ఐరోపాలోని స్వీడన్, నార్వే, ఇటలీ, బ్రిటన్, స్కాట్లాండ్, ఉత్తర అమెరికాలోని మెక్సికో, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, ఆఫ్రికాలోని నైజీరియా, ఆస్ట్రేలియాలోని తాస్మానియాలో ఆయన చేసిన ప్రయాణాల తాలూకూ విశేషాలను భూభ్రమణ కాంక్ష పుస్తకంలో పొందుపరిచారు. రష్యన్ కాలమిస్టు దిమిత్రో త్యికోటిన్ ఆదినారాయణను తన వ్యాసంలో ఇండియన్ మార్కోపోలోగా అభివర్ణించారు. [1]

పుస్తకాలు

[మార్చు]

2002వ సంవత్సరంలో ఆదినారాయణ తాను రాసిన జిప్సీలు (ప్రపంచవ్యాప్త సంచారులు) అనే పుస్తకం కోసం, ఆరు ఖండాల్లో చెల్లాచెదురుగా జీవిస్తున్న మనదేశపు రొమానీ జిప్సీల గురించి తెలుసుకోవటానికి ప్రపంచ యాత్రా సాహిత్యం అంతా అధ్యయనం చేయాల్సి వచ్చింది. తరువాత రాసిన స్త్రీ యాత్రికులు (2005) కోసం ఆరు ఖండాల్లో ఉన్న వివిధ దేశాల్లోని స్త్రీ యాత్రా సాహిత్యాన్ని చదివారు. ఇక మహా యాత్రికులు (2008) పుస్తకం కోసం మరొక్కసారి ప్రపంచ యాత్రా సాహిత్య విజ్ఞాన సర్వస్వాన్ని కూలంకషంగా తెలుసుకున్నారు. భ్రమణకాంక్ష, భూభ్రమణ కాంక్ష, తెలుగు వారి యాత్రికులు మొదలైన పుస్తకాలు రాశారు. [2]

తొలి యాత్ర

[మార్చు]

ఆదినారాయణ 26 ఏళ్ల కిందటే తన తొలియాత్రకు శ్రీకారం చుట్టారు. 1990లో హిమాలయ గ్రామసీమల్లో 20 రోజులపాటు 300 కిలోమీటర్ల పర్యటనతో పాదయాత్రికుడిగా ప్రస్థానం ప్రారంభించారు. అలా వివిధ సందర్భాలలో ఈ దేశంలోని వివిధ రాష్ట్రాలలో 23 వేల కిలోమీటర్లు తిరిగారు. అప్పటికి ఆయనకి 35 ఏళ్లు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండటంతో ఆర్థికంగా ఎటువంటి సమస్యలూ ఆయనకు ఎదురుకాలేదు. ఈ దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ చుట్టేశాక, ఆయనకి ప్రపంచయాత్ర చేయాలనిపించింది. [3]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్స్.ఓఆర్జీలో సాక్షి పత్రిక వ్యాసం, మాచవరపు ఆదినారాయణ సమాచారం".
  2. "సాక్షి పత్రికలో వ్యాసం".
  3. "మనం వెబ్ పత్రికలో వ్యాసం". Archived from the original on 2021-06-03. Retrieved 2021-06-03.