సామినేని ముద్దుకృష్ణ
ముద్దుకృష్ణ | |
---|---|
జననం | సామినేని ముద్దుకృష్ణ 1889 |
మరణం | 1973 |
ప్రసిద్ధి | కవి, నాటక కర్త, పాత్రికేయుడు |
మతం | హిందూ మతము |
సామినేని ముద్దుకృష్ణ కవి, నాటక కర్త, పాత్రికేయుడు.[1]
జననం
[మార్చు]ముద్దుకృష్ణ 1889లో జన్మించాడు.
సాహిత్య రంగం
[మార్చు]పేరు చెప్పగానే మొదట మనకు స్ఫురించేది ఆయన సమకూర్చిన కవితాసంకలనం, వైతాళికులు. ముద్దుకృష్ణ సామినేని ముద్దునరసింహంనాయుడుకి ముని మనుమడు, హేతువాది. అశోకం నాటకం వ్రాశాడు. రావణ వధ తరువాత అగ్ని ప్రవేశం చేయమన్న రాముడికి సీత ఎదురు తిరిగి "నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి. నన్ను కాపాడుకోలేక పోయావు...."అని నిలదీసినట్లు రాస్తాడు. చిన్నతనంలోనే తెలుగు సాహిత్యంలో ముద్దుకృష్ణకున్న అభిరుచిని పసికట్టిన తండ్రిగారు మనుచరిత్ర, వసుచరిత్ర బోధించాడు. స్కూల్ ఫైనల్ చదివే నాటికి ఆంగ్ల సాహిత్యంలో కూడ ఆసక్తి పెరిగి, "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలో అభినయించే స్థితికి వచ్చాడు. కాలేజి చదువు కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు వద్ద కొంతకాలం జరిగింది. భావకవితా యుగానికి చెందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి మొదలగు వారితో సాన్నిహిత్యం; కళాశాలల్లోని ఇంగ్లీషు నాటక ప్రదర్శనలూ, స్థానిక నాటక సమాజాల తెలుగు నాటక ప్రదర్శనలూ, సుప్రసిద్ధ కవీ, నటుడూ, హరీన్ చటోపాధ్యాయతో కలిసి 1927 ప్రాంతాలలో కళాప్రదర్శనలూ ముద్దుకృష్ణలో నాటక రచనకు ప్రేరేపించాయి. "అశోకం" నాటకం ద్వారా ముద్దుకృష్ణ అపూర్వసంచలనం కలిగించాడు. ముద్దుకృష్ణ బ్రహ్మచారి; ఈ బ్రహ్మచారి వ్రాసిన "దాంపత్య దీపిక" ఎందరి ప్రశంసనలనో పొందింది. ఈయన వ్రాసిన అనార్కలి నాటిక ఆకాశవాణిలో ప్రసారమైన తొలి తెలుగు శ్రవ్యనాటికగా (1934) ప్రసిద్ధి చెందింది. 1934 లో ప్రారంభించిన "జ్వాల" పత్రిక యువకులలో కొత్త ఆలోచనలను రేపింది. ఈయన అపవాదు, టీకప్పులో తుఫాను, ఢాకినీ, ఎత్తుకు పై ఎత్తు, ఆడవాళ్ల తెలివి, అడయిక్కప్ప పిళ్ళై (1941 తొలి ముద్రణ) వంటి నాటకాలు రచించారు.[2]
ఈయన ప్రచురించిన "వైతాళికులు"లో చోటు చేసుకొన్న కవులు: అబ్బూరి రామకృష్ణారావు, కవికొండల వెంకటరావు, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి', కొడాలి ఆంజనేయులు, గురజాడ అప్పారావు, చింతా దీక్షితులు, నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు, నోరి నరసింహశాస్త్రి, పింగళి-కాటూరి, పెనుమర్తి వెంకటరత్నం, చావలి బంగారమ్మ, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, రామచంద్ర అప్పారావు, దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, కొడవటిగంటి వెంకటసుబ్బయ్య, వేంకట పార్వతీశ్వరకవులు, విశ్వనాథ సత్యనారాయణ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, మల్లవరపు విశ్వేశ్వరరావు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, సౌదామిని - బసవరాజు రాజ్యలక్ష్మమ్మ.
మరణం
[మార్చు]ఈయన 1973లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.462.
- ↑ ముద్దుకృష్ణ (1941). అడయిక్కప్పపిళ్ళై. Retrieved 2 January 2015.