Jump to content

యు.ఎన్.ధేబర్

వికీపీడియా నుండి
సౌరాష్ట్ర సమాఖ్య యొక్క మంత్రులు సంస్థానాధీశులతో ముఖ్యమంత్రి యు.ఎన్.ధేబర్ (కుడి నుండి నాలుగవ వ్యక్తి).

ఉచ్ఛరంగ్‌రాయ్ నవాల్‌శంకర్ ధేబర్ (1905–1977) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1948 నుండి 1954 వరకు సౌరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1955 నుండి 1959 వరకు భారత జాతీయ కాంగ్రేసు అధ్యక్షుడిగా పనిచేశాడు. 1962లో రాజ్‌కోట్ నుండి మూడవ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

జీవితం

[మార్చు]

ధేబర్, 1905, సెప్టెంబరు 21న గుజరాత్ రాష్ట్రంలోని జాంనగర్కు పదకొండు మైళ్ళ దూరంలోని గంగాజాల అనే కుగ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి నవాల్‌శంకర్.[1] విశ్వవిద్యాలయంలో విద్య పూర్తిచేసుకొని, న్యాయవాదవృత్తి ప్రారంభించి, ప్రముఖ న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో 1936లో న్యాయవాదవృత్తిని వదిలి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు.

1936లో రాజ్‌కోట్ మిల్లు కామ్‌దార్ మండలం అనే కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1937-38లో కథియావర్ రాజకీయమండలికి కార్యదర్శిగా ఉన్నాడు.1938-39లో రాజ్‌కోట్ ప్రజామండలికి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.[1] 1941లో మహాత్మాగాంధీ విరమ్‌గామ్ వద్ద వ్యక్తిగత సత్యాగ్రహాన్ని చేపట్టడానికి ధేబర్ ను ఎంపిక చేశాడు. దీనివళ్ళ ధేబర్ ఆరునెలలు జైలుశిక్ష అనుభవించాడు.

1942లో మరలా క్విట్ ఇండియా ఉద్యమకాలంలో జైలుకు వెళ్ళాడు. స్వాతంత్ర్యానంతరం ధేబర్, కథియావర్ సంస్థానాలు, భారతదేశంలో విలీనం కావటానికి, సంయుక్త కథియావర్ రాష్ట్రం ఏర్పాటుకు విశేషకృషి చేశాడు. ఆ తర్వాత ఈ రాష్ట్రానికే సౌరాష్ట్ర అని పేరుమార్చారు. 1948లో సౌరాష్ట్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితుడై 1954వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఈయన పాలనలో గ్రామోద్దరణకు సౌరాష్ట్రలో అనేక సంస్కరణలు చేపట్టాడు.

1955లో దేభర్ భారత జాతీయ కాంగ్రేసు అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు పనిచేశాడు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే తొలి చర్యగా, దేశానికి పార్టీ ఏ విధంగా సహాయపడగలదనే విషయంపై నిర్ణయించడానికి, పార్టీ యొక్కప్రముఖనేతలనందరినీ సమావేశపరచాడు. 1960-61లో షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1962లో రాజ్‌కోట్ నుండి మూడవ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1] అనేక సామాజిక, సాంఘిక సేవా సంస్థలతో ధేబర్‌కు అనుబంధం ఉంది. 1973లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మవిభూషణ్ సత్కారంతో గౌరవించింది. రాజ్‌కోట్ విమానాశ్రయానికి దేభర్ పేరే పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Members profile". Loksabha. 21 September 1905. Archived from the original on 12 మార్చి 2016. Retrieved 24 February 2016.

బయటి లింకులు

[మార్చు]