Jump to content

రం

వికీపీడియా నుండి
భారతదేశంలో అత్యధిక విక్రయాలు కల రం లలో ఒకటైన ఓల్డ్ మాంక్

రం లేదా రమ్ము (ఆంగ్లం: Rum) చెరకు ఉపఫలాలైన చెరకురసం, లేదా చెరకు మడ్డి లను స్వేదనం/కిణ్వనం చేయడంతో తయారుచేయబడే ఒక మద్యపానం. ఇలా వెలికితీయబడ్డ రాన్ని ఓక్ వుడ్ చే చేయబడ్డ పీపాలలో నిల్వ ఉంచుతారు.

కరేబియన్ దీవులు, ల్యాటిన్ అమెరికాలలో రం అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది. ఆస్ట్రియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, ఫిలిప్పీన్స్, భారతదేశం, రీయూనియన్ దీవి, మారిషస్, దక్షిణ ఆఫ్రికా, తైవాన్, థాయ్ లాండ్, జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా దేశాలు రం ఉత్పత్తి అత్యధికంగా కలిగి ఉన్నాయి.

రం వివిధ శ్రేణులలో తయారు చేయబడుతుంది. తక్కువ శక్తి గల తేలికపాటి (Light) రాలు కాక్ టెయిల్ లలో వినియోగించబడగా, శక్తివంతమైన గోల్డెన్/డార్క్ రాలు యథాతథంగా సేవించటానికి, వంటకాలలో వినియోగించటానికి ఉత్పత్తి చేయబడిననూ, ప్రస్తుత కాలంలో ఇతరాలతో మిళితం చేసి సేవిస్తున్నారు. యథాతథంగా/కేవలం ఐసు ముక్కలతో సేవించటానికి ప్రీమియం రం కూడా ఉత్పత్తి చేయబడుతుంది.

వెస్ట్ ఇండీస్, మారిటైంస్, న్యూ ఫౌండ్ ల్యాండ్ వంటి ప్రదేశాల చరిత్రను రం ప్రభావితం చేసింది. నీరు లేదా బీరుతో కలిపిన రం (దీనినే గ్రాగ్ అని అంటారు) రాయల్ నేవీ (యునైటెడ్ కింగ్డం నావల్ ఫోర్స్) తో, అక్కడి సముద్రపు దొంగలతో సంబంధం కలిగి ఉంది. ఆఫ్రికా, ఐరోపా, అమెరికాల మధ్య జరిగిన త్రికోణ వర్తకం పై రం ప్రాముఖ్యత కలిగి ఉంది. వ్యవస్థీకృత నేరాలకు, అమెరికా విప్లవం, ఆస్ట్రేలియా విప్లవం లకు కారణభూతమైనది.

చరిత్ర

[మార్చు]

మూలాలు

[మార్చు]

చెరకు నుండి పులియబెట్టిన పానీయాలను వెలికితీయటం ప్రాచీన చైనా/భారతదేశంలో ఉంది. 17వ శతాబ్దంలో మొట్టమొదటి సారిగా రం కరేబియన్ దీవులలో స్వేదనం చేయబడ్డది. చక్కెరను శుద్ధి చేసే ప్రక్రియలో ఉపఫల్ంగా వచ్చే చెరకు మడ్డిని కిణ్వనం చేయటం వలన మద్యంగా మారుతుందని బానిసలు ఆ తర్వాత కనుగొన్నారు. ఈ మద్యపాన ఉపఫలాలను స్వేదనం చేయటం ద్వారా వాటిలోని మాలిన్యాలను తొలగించవచ్చని కనుగొనటంతో స్వచ్ఛమైన రం ఉత్పత్తి అవ్వటం ప్రారంభమైనది. 16వ శతాబ్దం నాటికే రం ఉత్పత్తి బ్రెజిల్, స్వీడన్ లలో జరిగాయి అని ధ్రువీకరించటానికి ఆనవాళ్ళు ఉన్నాయి.

ఉత్తర అమెరికా

[మార్చు]

అటు తర్వాతి కాలంలో రం సేవనం/ఉత్పత్తి ఉత్తర అమెరికాకు విస్తరించింది. నానాటికీ రం యొక్క డిమాండ్ పెరిగిపోతోండటంతో ఇక్కడ చెరకు పంట కోసం శ్రామికులు కావలసి వచ్చింది. దీనితో ఆఫ్రికా, కరేబియన్, ఉత్తర అమెరికాల మధ్య త్రికోణ వర్తకం స్థాపించవలసిన అవసరం వచ్చింది. బానిస-చెరకు మడ్డి-రం ల మార్పిడి మూడు పూవులు-ఆరు కాయలుగా వర్థిల్లినది. 1764 లో చేయబడిన చక్కెర చట్టంతో ఈ వర్తకానికి అడ్డుకట్ట పడినది. ఇదే అమెరికా విప్లవానికి ఒక కారణంగా పేర్కొనవచ్చును.

రాజకీయ వ్యవస్థలో రం కీలకపాత్ర పోషించటం మొదలుపెట్టినది. ప్రజాప్రతినిధులు ఎన్నికల ఫలితాలను రాన్ని విరివిగా పంచటంతో శాసించగలిగారు. ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధి రం సేవిస్తేనే అతనిని స్వతంత్రుడిగా తమలో ఒకనిగా గుర్తించే పరిస్థితులు ఏర్పడ్డాయి.

బ్రిటీషు ద్వీపాల నుండి చక్కెర దిగుమతులపై విధించిన ఆంక్షలు, విస్కీ యొక్క అభివృద్ధితో అమెరికాలో రం ప్రాముఖ్యత క్షీణించటం మొదలైనది.

నావికా దళాలలో రం

[మార్చు]
రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక నావికునికి "The King God Bless Him" అని వ్రాసి ఉన్న పాత్రలో నుండి రం అందిస్తోన్న వుమెన్స్ రాయల్ నేవీ సర్వీస్ (WRNS) కు చెందిన ఒక స్త్రీ నావికురాలు

సముద్రపు దొంగలు రాన్ని చట్టాలకు వ్యతిరేకంగా తస్కరించేవారు.

1655 లో బ్రిటీషు దళాలు జమైకాను ఆక్రమించుకొనటంతో రాయల్ నేవీ (యునైటెడ్ కింగ్డం యొక్క నావికా దళం) కి రంతో సంబంధాలు ఏర్పడ్డవి. అక్కడ రం విరివిగా లభ్యమవ్వటంతో అప్పటి వరకు నావికులకు రోజువారీ కేటాయిస్తోన్న ఫ్రెంచి వైన్ కు బదులుగా రాయల్ నేవీ రాన్ని కేటాయించటం మొదలు పెట్టినది. స్వచ్ఛమైన రం లేదా నిమ్మకాయ రసంతో కలిపిన రాన్ని కొంతకాలం కేటాయించిననూ, (నావికులపై మద్యం యొక్క ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా) ఈ మిశ్రమంలో నీటిని కలపటం మాత్రం 1740లో అడ్మిరల్ ఎడ్వార్డ్ వెర్నన్ తో మొదలైనది. అప్పట్లో టాట్ (Tot) అని పిలువబడిన ఈ మిశ్రమం తర్వాత గ్రాగ్ (Grog) అయినది. చలి, గాలి, వర్షాన్ని తట్టుకొనేందుకు గాను అతను ధరించే గ్రోగ్రాం (Grogram) తో చేయబడిన కోటు వలన దీనికి ఆ పేరు స్థిరపడిపోయింది.

"https://te.wikipedia.org/w/index.php?title=రం&oldid=2883619" నుండి వెలికితీశారు