రాచమల్లు రామచంద్రారెడ్డి
రాచమల్లు రామచంద్రా రెడ్డి | |
---|---|
జననం | పైడిపాలెం, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా | 1922 ఫిబ్రవరి 28
మరణం | 1988 నవంబరు 24 | (వయసు 66)
వృత్తి | రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు |
తల్లిదండ్రులు |
|
రారాగా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి (ఫిబ్రవరి 28, 1922 - నవంబరు 25, 1988) బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. ఆయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకునిగా ఆరేళ్ళు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించాడు. కడప నుంచి 1968 - 1970 ల మధ్య వెలువడిన 'సంవేదన' త్రైమాసిక పత్రిక సంపాదకుడిగా తెలుగు సాహిత్య విమర్శకు ఒరవడి దిద్దాడు. 1959 - 1963 మధ్యకాలంలో కడప నుంచే 'సవ్యసాచి' అనే రాజకీయ పక్ష పత్రిక కూడా నడిపాడు. చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.), మహీధర రామమోహనరావు లాంటి రచయితలపై ఆయన చేసిన మూల్యాంకనం లోతైనది. ఆయన వాదోపవాదాల్లో దిట్ట. ఆయన్ను శ్రీశ్రీ 'క్రూరుడైన విమర్శకుడు' అన్నా నిజజీవితంలో రారా చాలా స్నేహశీలి.
జీవిత విశేషాలు
[మార్చు]వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామంలో 1922, ఫిబ్రవరి 28 న జన్మించాడు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, భయపు రెడ్డి. రారా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని డిస్ట్రిక్ట్ బోర్డు హైస్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్మీడియేట్ అనంతపురంలోని ఆనాటి దత్త మండలాల కాలేజీ (ఇప్పటి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల)లో చదివాడు. తర్వాత చెన్నై లోని గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు కానీ 1941లో గాంధీజీ జైలులో చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా సమ్మె చేసినందుకు ఆయనను, మరికొందరు విద్యార్థులను కళాశాలనుంచి బహిష్కరించారు. క్షమాపణ చెప్పినవారిని తిరిగిచేర్చుకున్నారు కానీ రారా, చండ్ర పుల్లారెడ్డి క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. 1944లో రారా విజయవాడనుంచి వెలువడే 'విశాలాంధ్ర దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరాడు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక పోయాడు. తర్వాత కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా)లో మకాం పెట్టి ఎర్రగడ్డ (ఉల్లిపాయ)ల వ్యాపారం చేశాడు. 1950ల నుంచి మార్క్సిజమ్ పట్ల మొగ్గు ఏర్పడింది.
1962 నాటికి కేతు విశ్వనాథరెడ్డి, నల్లపాటి రామప్ప నాయుడు, బంగోరె (బండి గోపాల రెడ్డి), ఉద్యోగరీత్యా కడపలో ఉండేవారు. వీరే కాకుండా నర్రెడ్డి శివరామిరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులంతా ప్రతి ఆదివారం రారా ఇంట్లో చేరి కావ్యపఠనం, సాహితీచర్చలు చేసేవారు. అలా ఆర్వీయార్, కేతు విశ్వనాథరెడ్డి, వై.సి.వి.రెడ్డి, కొత్తపల్లి రవిబాబు (ప్రజాసాహితి సంపాదకులు), తదితరులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సంవేదన పత్రిక ప్రారంభించాడు. ఇది యుగసాహితి ప్రచురణ. 1968 ఏప్రిల్ లో తొలి సంచిక విడుదలైంది. ఆవిష్కరణ సభ మార్చి 28 న శ్రీశ్రీ, కొ.కు. ల సమక్షంలో జరిగింది. మొత్తం వెలువడింది ఏడు సంచికలే అయినా అది చరిత్ర సృష్టించింది.
1970లలో ఆరేళ్లపాటు మాస్కోలో అనువాదకుడిగా పనిచేశాడు. తిరిగొచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు ఈనాడు పత్రికకు సంపాదకీయాలు రాశాడు.
- కార్ల్ మార్క్స్, ఏంగెల్స్‌ల ముందూ అందరూ దిగదుడుపేనన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం.
- కన్యాశుల్కం' గొప్ప నాటకమే అయినా అందులో ఒక పరిష్కారం లేదు, నాచ్ సమస్య నవ్వులపాలయ్యింది. వితంతు సమస్య అల్లరిపాలయ్యింది, సంస్కరణోద్యమం అభాసుపాలు అయ్యింది అంటారు.
- ఎవరికైనా జీవితం పట్ల ఒక తీవ్రమైన, నిరంతరమైన, పరిష్కారం సాధ్యం కాని అసంతృప్తి ఉన్నప్పుడే తాత్విక చిత్తవృత్తి ఏర్పడుతుందన్న భావాన్ని శ్రీశ్రీ గురించి వ్యక్తం చేశారు.
పుట్టపర్తి నారాయణా చార్యులు వారితో వీరికి చిక్కని సాన్నిహిత్యం ఉండేది.. పుట్టపర్తి వారు వీణి గదాఘాతం నుంచీ తప్పించుకున్న వాణ్ణి బహుశా నేనొక్కణ్ణే నేమో అనేవారు నవ్వుతూ..
సాహిత్య కృషి
[మార్చు]రారా మార్క్సిజాన్ని సాహిత్యానికి అన్వయించి సాహిత్యానికున్న శక్తిని - సమాజాన్ని మార్చే శక్తిని విశదీకరించాడు. రాసినవి ఎక్కువ భాగం సమీక్షలే ఐనా గొప్ప విమర్శకుడిగా పేరు పొందాడు. పుస్తక సమీక్షలను ప్రామాణికమైన విమర్శవ్యాసాలుగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. గియోర్గి లూకాచ్ అనే హంగేరియన్ సౌందర్య శాస్త్రవేత్త 'చారిత్రక నవల' అనే గ్రంథంలో చేసిన సూత్రీకరణల ఆధారంగా కొల్లాయి గట్టితేనేమి నవలను సమీక్షించాడు రారా. తెలుగులో ఇలాంటి విమర్శ అంతకు ముందు రాలేదు.
కథలు
[మార్చు]1957-59 మధ్యకాలంలో ఈయన రాసిన కథలు 1960లో అలసిన గుండెలు పేరిట పుస్తకరూపంలో వచ్చాయి. కావ్యచిత్ర అనే పెద్దకథ ఆయన మరణానంతరం సాహిత్యనేత్రం త్రైమాసిక పత్రికలో ప్రచురితమైంది. ఇవి కాక ఈయన సృజించిన బాలసాహిత్యం: చంద్రమండలం-శశిరేఖ, విక్రమార్కుని విడ్డూరం, అన్నం పెట్టని చదువు.
ఇతర గ్రంథాలు
[మార్చు]- సారస్వత వివేచన
- వ్యక్తి స్వాతంత్ర్యం - సమాజ శ్రేయస్సు
- రారా లేఖలు
- అనువాద సమస్యలు
అనువాదాలు
[మార్చు]- మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు
- లెనిన్ సంకలిత రచనలు
- పెట్టుబడిదారీ అర్థశాస్త్రం
- గోర్కీ కథలు
- చెహోవ్ కథలు మొదలైనవి.
మరణం
[మార్చు]చివరిదశలో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడిన రారా 1988, నవంబరు 25 న కన్నుమూశాడు.
మూలాలు, వనరులు
[మార్చు]- రారా రాసిన 'ఓడిపోయిన సంస్కారం' కథ
- కేంద్ర సాహిత్య అకాడెమీ వారి మోనోగ్రాఫ్ (రచన: తక్కోలు మాచిరెడ్డి)
- రారాను గురించి ప్రముఖ కథకుడు సొదుం జయరాం చెప్పిన సంగతులు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1922 జననాలు
- 1988 మరణాలు
- తెలుగు రచయితలు
- తెలుగు పాత్రికేయులు
- తెలుగు అనువాదకులు
- వైఎస్ఆర్ జిల్లా రచయితలు
- కడప జిల్లా సాహితీ విమర్శకులు
- కడప జిల్లా అనువాద రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు
- రష్యన్ నుండి తెలుగు లోకి అనువాదాలు చేసిన రచయితలు