రామ్ రహీం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్ రహీం
(1974 తెలుగు సినిమా)
Ram rahim.jpg
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం నందమూరి బాలకృష్ణ,
నందమూరి హరికృష్ణ,
కైకాల సత్యనారాయణ
రేలంగి
షావుకారు జానకి
రోజారమణి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ రాజలక్ష్మి కంబైన్స్
విడుదల తేదీ డిసెంబరు 30, 1974
భాష తెలుగు

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథ[మార్చు]

రామ్‌ - రహీమ్‌ ఒకే తరగతిలో చదువుకునే విద్యార్థులు. ఇద్దరూ ప్రాణమిత్రులు. రామ్‌ తండ్రి రాజయ్య జగన్మోహనరావు అనే శ్రీమంతుడి వద్ద లారీడ్రైవరుగా పని చేస్తుంటాడు. జగన్మోహనరావు పైకి పెద్దమనిషిగా చలామణి అవుతున్నా అతను చేసేది మాత్రం స్మగ్లింగ్ వ్యాపారం.

రాజయ్య జూదరి, త్రాగుబోతు. తను సంపాయించిన డబ్బంతా ఈ వ్యసనాలకే తగలేస్తుంటాడు. రాజయ్య భార్య లక్ష్మి చుట్టుపక్కల ఇళ్ళల్లో పనిమనిషిగా వుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వుంటుంది. రాజయ్య తల్లి తన కొడుకు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించినా ఎప్పుడూ అతడినే వెనకేసుకొస్తుంది. తండ్రి కారణంగా తల్లి, అక్క రాధ, తమ్ముడు అందరూ ఇంట్లో బాధలకు, అశాంతికి గురవుతూ వుండడం చూస్తూ రామ్‌ కుమిలిపోతూ వుంటాడు. రహీమ్‌ అతన్ని ఎప్పటికప్పుడు ఓదారుస్తూ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు.

రహీమ్‌ తండ్రి ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్. తన విధి నిర్వహణపట్ల, క్రమశిక్షణ పట్ల కఠినంగా వుండే వ్యక్తి. అతని భార్య 'బేగం' భర్తకు అనుకూలవతియైన ఇల్లాలు. రహీమ్‌ ఇంటికి తరచుగా వస్తూ వుండే రామ్‌ ఆదర్శవంతమైన ఆ కుటుంబాన్ని చూసి, తన కుటుంబాన్ని తలచుకుంటూ బాధ పడుతూ వుంటాడు.

వెంకట్రామయ్య అనే ఓ సంపన్నుడి కూతురు కమలకు రామ్‌ అక్కయ్య రాధకూ గల స్నేహం వల్ల అప్పుడప్పుడూ రాధను తమ ఇంటికి తీసుకు వెళ్తూ వుండేది కమల. ఆ విధంగా కమల సోదరుడు శ్యామ్‌కు రాధకు పరిచయమై ఆ పరిచయం క్రమక్రమంగ ప్రేమగా మారింది.

రామ్‌ ఒక రోజు స్కూలు ఫీజుకని డబ్బడిగితే చదువు మానెయ్యమని చెప్పాడు రాజయ్య. ఇంటి పరిస్థితులను చూస్తూ, ఇక గత్యంతరం లేక చదువు మానేసి రిక్షా తొక్కసాగాడు రామ్‌. రెండో కొడుకు జబ్బు పడితే, మందులు తేవడానికని రామ్‌ తెచ్చిన డబ్బును తీసుకెళ్ళి తాగుడుకూ, జూదానికీ ఖర్చు పెట్టాడు రాజయ్య. మందులు లేక కొడుకు మరణించడంతో లక్ష్మికి పూర్తిగా నైరాశ్యం ఆవరించి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. సమయానికి రామ్‌, రాధ వచ్చి ఆ ప్రయత్నానికి అడ్డు పడ్డారు. మన కుటుంబ పరిస్థితులను ఒక ఒడ్డుకు తీసుకు వస్తానని తల్లికి వాగ్దానం చేస్తాడు రామ్‌.

రహీమ్‌ అనుక్షణం రామ్‌కు తోడుగా వుంటూ అతని ప్రయత్నాలలో సహకరించసాగాడు. రామ్‌ రహీమ్‌లు యుక్తిగా శ్యామ్‌ రాధల పెళ్ళికి వెంకట్రామయ్యను ఒప్పించగలిగారు. అయితే ఆ సందర్భంలోనే తను వెంకట్రామయ్య గారి పెంపుడు కొడుకునన్న సంగతి బయటపడే సరికి తన అసలు తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలని శ్యామ్‌ బయలు దేరాడు. జగన్మోహనరావు అనుచరులు అతన్నొక సి.ఐ.డి. ఆఫీసర్ అని అనుమానించి బంధించారు. కొడుకు సంగతి తెలియకపోయేసరికి వెంకట్రామయ్య పడ్డ ఆందోళన అంతా ఇంతా కాదు.

శ్యామ్‌ను వెదికే ప్రయత్నంలో రామ్‌ రహీమ్‌లకు కొన్ని కొత్త సంగతులు తెలిశాయి. వాళ్ళకు జగన్మోహనరావు అసలు స్వరూపం బాగా అర్థమయ్యింది. అయితే నిజానిజాలు నిరూపించడానికి అడుగడుగునా చిక్కులు ఎదుర్కొన్నప్పటికీ రామ్‌ రహీమ్‌లు ధైర్యంగా నిలబడి, వంచకులను ఎదిరించి న్యాయాన్ని రక్షించి చివరికి అందరికీ ఆనందాన్ని కలుగజేశారు.[1]

పాటలు[మార్చు]

  1. ఎగిరే గాలిపటానికి దారం ఆధారం నా నిరుపేద జీవితానికి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
  2. కలలే కన్నాను శిలనై ఉన్నాను పలుకని గొంతుతో ఏమని - పి.సుశీల - రచన: దాశరథి
  3. నేను కత్తుల రత్తయ్యనులే నేను నెత్తురు నరసయ్యనులే - మహమ్మద్ రఫీ, మాధవపెద్ది రమేష్ - రచన: దాశరథి
  4. ప్రపంచమంతా ఝూటా ఇది మోసగాళ్ళ సయ్యాట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సముద్రాల జూనియర్
  5. రిక్షా తొక్కాలిరా నా సామిరంగా సైకిల్ రిక్షా తొక్కాలిరా - ఎం.రమేష్ బృందం - రచన: కొసరాజు

మూలాలు[మార్చు]

  1. "రామ్‌ రహీమ్‌". విజయచిత్ర. 9 (6): 11–13. 1 December 1974.

బయటిలింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రామ్_రహీం&oldid=3868429" నుండి వెలికితీశారు