వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 07వ వారం
భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే (కన్నడ:ಅನಿಲ್ ರಾಧಾಕೃಷ್ಣ ಕುಂಬ್ಳೆ). 1970 అక్టోబర్ 17 న కర్ణాటక లోని బెంగుళూరు లో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మనదేశం తరఫున టెస్ట్ క్రికెట్ లోనూ, వన్డే క్రికెట్ లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. 2007 నవంబర్ 8 న అతనికి టెస్ట్ క్రికెట్ నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించబడినది. మొదటగా పాకిస్తాన్ తో స్వదేశంలో జర్గే 3 టెస్టుల సీరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 1990 లో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించి 603 టెస్ట్ వికెట్లను, 337 వన్డే వికెట్లను పడగొట్టాడు. బంతిని బాగా స్పిన్ చేయలేడని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆస్ట్రేలియా కు చెందిన షేన్ వార్న్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో లెగ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు, స్పిన్నర్లలో షేన్ వార్న్, శ్రీలంక కు చెందిన ముత్తయ్య మురళీధరన్ ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. 2008, జనవరి 17 నాడు టెస్ట్ క్రికెట్‌లో 600వ వికెట్టును సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించినాడు. టెస్ట్ క్రికెట్ లో అతని యొక్క అత్యంత ప్రముఖ సంఘటన ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లను సాధించడం. ఇంగ్లాండ్ కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ కావడం గమనార్హం. అతని యొక్క సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. తనకు ఎంతో ప్రీతిపాత్రమైన ఢిల్లీ ఫిరీజ్‌షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి 2008, నవంబర్ 2న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
టెస్ట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాధించిన వారిలో ఇంగ్లాండు కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత అనిల్ కుంబ్లే రెండో బౌలర్. 1999 లో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ఢిల్లీ లో పాకిస్తాన్ తో జర్గిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే ఈ ఘనతను సాధించాడు. కాని ఈ టెస్ట్ లో పాకిస్తాన్ కు చెందిన వకార్ యూనిస్ ను రెండు ఇన్నింగ్సులలోనూ ఒక్కసారి కూడా ఔట్ చేయలేడు. అతని వికెట్టును కూడా సాధించి ఉంటే ఒకే టెస్ట్ మ్యాచ్ లో ప్రత్యర్థికి చెందిన మొత్తం 11 బ్యాట్స్‌మెన్ లను ఔట్ చేసిన అరుదైన ఘనతను అనిల్ కుంబ్లే సొంతం చేసుకునేవాడు. ఆ ఇనింగ్సులో 9 వికెట్లను తీసిన తర్వాత అతని సహ బౌలర్ అయిన జవగళ్ శ్రీనాథ్ అనిక్ కుంబ్లే కు 10 వికెట్లు దక్కాలనే నెపంతో అతను వికెట్టు సాధించడానికి ప్రయత్నించలేడనే వాదన ఉంది. అనిల్ కుంబ్లే ఈ అరుదైన రికార్డు సాధించిన తర్వాత బెంగుళూరు లోని ఒక ప్రధాన కూడలికి అతని పేరు పెట్టారు.
.....పూర్తివ్యాసం: పాతవి