Jump to content

సర్వ శిక్షా అభియాన్

వికీపీడియా నుండి
(సర్వశిక్షా అభియాన్ నుండి దారిమార్పు చెందింది)
మధ్యప్రదేశ్ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల.

సర్వ శిక్షా అభియాన్ [1] అనేది 6–14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చిన పథకం. ఇది భారత రాజ్యాంగంలో 86వ సవరణ ద్వారా ప్రాథమిక విద్య సార్వజనీకరణ సాధనకు అటల్ బీహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. 2001లో లక్షిత బాలల సంఖ్య 205 మిలియన్ల వద్ద ఉన్నట్లు అంచనా. 2010 నాటికి సంతృప్తికర నాణ్యతతో ప్రాథమిక విద్య యొక్క సార్వత్రీకరణ సాధన ఈ కార్యక్రమ లక్ష్యంగా ఉంది.

ఈ కార్యక్రమాను సారం, భారతదేశంలో అవసరమైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం, పిల్లలందరినీ పాఠశాలలలో చేర్పించడం, విద్యను సార్వత్రీకరించడం. నిరక్షరాస్యతను పారద్రోలి, అక్షరాస్యతను సాధించడం. పాఠశాలైన, ప్రాథమిక పాఠశాలలను ప్రతి కిలోమీటరునకూ ఒక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకూ ఓ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి, విద్యను వ్యాపింపజేయడం ముఖ్య ఉద్దేశం. పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని తగురీతిలో వుంచి విద్యాస్థాయిని పెంపొందించడం. పాఠశాలలలో ప్రయోగశాలలను ఏర్పాటుచేయడం, కంప్యూటర్లను ఏర్పాటుచేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యాలలోనివి.

నేపథ్యం

[మార్చు]

ప్రాథమిక విద్య సార్వజనీకరణ కోసం రాజ్యాంగ, న్యాయ, జాతీయ ప్రకటనలు

  1. రాజ్యాంగ ఆదేశం, 1950 - "ఈ రాజ్యాంగం అమలు చేసిన సమయం నుంచి పదేళ్ల కాలంలోగా దేశం బాలలందరికీ 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉచితంగా, తప్పనిసరి విద్య అందించేందుకు ప్రయత్నించాలి."
  2. విద్యా జాతీయ విధానం, 1986 - "మనం 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టడానికి ముందు బాలలందరికీ 14 ఏళ్ల వయస్సు వరకు సంతృప్తికరమైన ఉచిత, నిర్బంధ విద్య అందేలా చూడాలి".
  3. ఉన్నికృష్ణన్ తీర్పు, 1993 - "ఈ దేశం యొక్క ప్రతి బిడ్డ/పౌరుడికి పద్నాలుగేళ్ల వయస్సు వచ్చే వరకు ఉచిత విద్య పొందే హక్కు ఉంది."

ఉద్దేశాలు

[మార్చు]
  • బాలలందరూ 2003నాటికి బడి, విద్యా హామీ కేంద్రం లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో ఉండేలా చర్యలు
  • 2005నాటికి ఐదేళ్ల ప్రాథమిక విద్యను, 2010నాటికి 8 ఏళ్ల పాఠశాల విద్యను పూర్తి చేయడం.
  • 2010నాటికి బాలలందరూ ఎనిమిదేళ్ల పాఠశాల విద్యను పూర్తి చేయడం
  • జీవనానికి అవసరమైన విద్యపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక విద్యను సంతృప్తికరమైన నాణ్యతతో అందించడానికి కృషి
  • 2007నాటికి ప్రైమరీ స్థాయిలోను, 2010నాటికి ప్రాథమిక విద్యా స్థాయిలోనూ లింగ, సామాజిక అంతరాలన్నింటినీ తొలగించడం
  • 2010నాటికి పాఠశాల విద్య సార్వత్రీకరణ

పాఠశాల సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వసతులు, నిర్వహణ నిధులు, పాఠశాల అభివృద్ధి నిధుల కల్పన ద్వారా మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయుల నియామకం, విస్తృత శిక్షణ, బోధన-శిక్షణ సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడం, ఒక సమూహం, బ్లాకు, జిల్లా స్థాయిల్లో విద్యా మద్దతు వ్యవస్థను పటిష్ఠపరచడం ఈ కార్యక్రమ విధివిధానాలుగా ఉన్నాయి. జీవన నైపుణ్యాలతోపాటు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం సర్వ శిక్షా అభియాన్ లక్ష్యం. బాలికల విద్యపైన, ప్రత్యేక అవసరాలు ఉన్న బాలలపైనా సర్వ శిక్షా అభియాన్ ప్రత్యేక దృష్టి పెడుతుంది. డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు కంప్యూటర్ విద్యను అందించే చర్యలు కూడా దీనిలో భాగంగా ఉన్నాయి. పాఠశాలకు బాలలు తక్కువగా హాజరవుతుండటాన్ని అధిగమించేందుకు మధ్యాహ్న భోజనాలు ప్రవేశపెట్టారు.

విభాగాలు

[మార్చు]

సర్వ శిక్షా అభియాన్ లో మొత్తం పదిహేను విభాగాలు ఉన్నాయి

  1. మండల సంపన్మూల కేంద్రము (బ్లాక్ రీసోర్స్ సెంటర్ (BRC ) )
  2. సమూహ సంపన్మూల కేంద్రము (క్లస్టర్ రీసోర్స్ సెంటర్ (CRC) )
  3. ప్రత్యామ్నాయ, ఆధునిక విద్య ( MGLC&AIE -AIE ఆల్టర్నేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్- ) బాలలందరికీ ప్రాథమిక విద్యా ప్రాప్తి కల్పించేందుకు ఇది ఉద్దేశించబడింది. గిరిజన, తీర ప్రాంతాల్లోని నిమ్న, దారిద్ర్య ప్రజా సమూహాల్లో బాలలను పాఠశాలలకు తీసుకొచ్చేందుకు వివిధ రకాల వ్యూహాలు అభివృద్ధి చేయబడ్డాయి.
  4. సివిల్ వర్క్స్ (ప్రజా పనులు) - ప్రజా పనుల విభాగం సర్వ శిక్షా అభియాన్ లో ముఖ్యమైనది. మొత్తం కార్యక్రమ బడ్జెట్‌లో 33% నిధులను దీనిలోనే ఉపయోగిస్తున్నారు. బాలలకు విద్యా ప్రాప్తిని కల్పించడంలో పాఠశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, వారి హాజరును నిలిపివుంచేందుకు సాయపడటం దీని విధుల్లో భాగంగా ఉన్నాయి. ఈ రెండు చర్యలు సర్వ శిక్షా అభియాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాల్లో భాగంగా ఉన్నాయి. ఉప-జిల్లా స్థాయిలో వనరుల కేంద్రాలకు మౌలిక సదుపాయాల కల్పన విద్యా మద్దతును సృష్టించడంలో సాయపడుతుంది, ఇది నాణ్యత అభివృద్ధివైపు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ కింది నిర్మాణాలను ప్రజా పనుల కింద చేపట్టారు.
  5. ఉచిత పాఠ్య పుస్తకాలు
  6. వినూత్న కార్యకలాపాలు - ఉపయోకరమైన, సంబంధిత ప్రాథమిక విద్యను 6-14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ అందించాలనే లక్ష్య సాధన ప్రక్రియలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి, అంతేకాకుండా సమూహం యొక్క క్రియాశీల భాగస్వామ్యంలో సామాజిక, ప్రాంతీయ, లింగ అంతరాలను పూడ్చడంలోనూ ఇవి సాయపడుతున్నాయి. విద్యపై విద్యార్థులకు ఆసక్తి కల్పించడంలో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి, వారు చదువును విడిచిపెట్టకుండా చేయడంలోనూ సాయపడ్డాయి. వినూత్న పథకాలు కింద అమలు చేసిన కార్యక్రమాలలో కొన్ని ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య, బాలికల విద్య, ఎస్సీ/ఎస్టీ (SC/ST) విద్య, కంప్యూటర్ విద్య
  7. IEDC
  8. నిర్వహణ, నిర్వహణ సమాచార వ్యవస్థ (M& MIS)
  9. పరిశోధన, మూల్యాంకనం (రీసెర్చ్ అండ్ ఇవాల్యుయేషన్ (R&E) ' ఈ విభాగంలో పరిశోధన, అంచనా వేయడం, అజమాయిషీ, పర్యవేక్షణ విధులు నిర్వహిస్తారు. ఒక సమర్థవంతమైన విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థ (EMIS) పై వనరు/పరిశోధన సంస్థల ద్వారా సామర్థ్యాల అభివృద్ధి, పర్యవేక్షణ కోసం ప్రతి పాఠశాలకు 1,500/- నిధులు కేటాయించాలని నిబంధనలు ప్రతిపాదిస్తున్నాయి. గృహసంబంధ సమాచారాన్ని నవీకరించేందుకు రోజూ పాఠశాల గుర్తింపు/సూక్ష్మ ప్రణాళికకు కూడా కేటాయింపులు ఉన్నాయి. ఈ నిధులను ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సాయంతో నడుస్తున్న పాఠశాలలు రెండింటికీ ఉపయోగిస్తారు. ఈ విభాగంలో ఈ కింది కార్యకలాపాలు ప్రతిపాదించబడ్డాయి.
    1. సమర్థవంతమైన క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వనరుల బృందాన్ని సృష్టించడం,
    2. రోజూ సేకరించిన సమూహ ఆధారిత సమాచారాన్ని అందించడం,
    3. సాధన పరీక్ష, అంచనా అధ్యయనాలు నిర్వహించడం
    4. పరిశోధన కార్యకలాపాలు చేపట్టడం,
    5. తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్న జిల్లాలకు, బాలికలు, ఎస్సీ, ఎస్టీ తదితర విషయాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం.
    6. విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థపై వ్యయాలను చేర్చడం
    7. చార్టులు, పోస్టర్లు, స్కెచ్ పెన్‌లు, ప్రొజెక్టర్ కొరకు (OHP) పెన్ తదితరాల వంటి తటస్థ వ్యయాన్ని చేపట్టడం
    8. బృంద అధ్యయనాలు నిర్వహించడం.
  10. పాఠశాల గ్రాంట్ (నిధులు) - ఈ కార్యక్రమం కింద ప్రతి పాఠశాలకు రూ.2000 నిధులు అందిస్తారు. పాఠశాల గ్రాంట్‌లో రూ.1000 డబ్బును పాఠశాలలో గ్రంథాలయ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ఇస్తున్నారు. మిగిలినదానిని పనిచేయని పరికరాల మరమత్తు, పాఠశాల సుందరీకరణ, ఫర్నీచరు, సంగీత పరికరాల మరమత్తు, నిర్వహణ, పాఠశాల పర్యావరణ అభివృద్ధికి ఉపయోగిస్తారు.
  11. ఉపాధ్యాయ గ్రాంట్- ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులందరికీ తరగతి గది లావాదేవీలను మెరుగుపరిచేందుకు, బోధన సహాయాల సన్నాహాలకూ రూ.500 నిధులు అందిస్తున్నారు. సమర్థవంతమైన తరగతి గది లావాదేవీలకు బోధన అధ్యయన సామాగ్రి (TLM) ను సృష్టించేందుకు, సేకరించేందుకు ఉపాధ్యాయులు ఈ డబ్బును ఉపయోగిస్తారు. 2007-08లో, 547590 మంది LP/UP ఉపాధ్యాయులు దీనిద్వారా లబ్ధి పొందారు.
  12. ఉపాధ్యాయ శిక్షణ - నాణ్యమైన విద్య యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా ఉంది. శిక్షణను మెరుగుపరిచేందుకు వివిధ వ్యూహాలను ఉపయోగిస్తున్నారు, అవి :
    1. ఉపాధ్యాయులకు శిక్షణ, పునఃశిక్షణ
    2. కొత్త పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం
    3. జాతీయ పాఠ్యాంశ కార్యాచరణపై అవగాహన కల్పించడం (NCF 2005)
    4. పరీక్షా సంస్కరణలు
    5. గ్రేడింగ్ పద్ధతిపై శిక్షణ, గ్రేడింగ్ పద్ధతి ప్రభావంపై అంచనా
    6. పాఠశాల సంబంధ, పాఠశాలేతర ప్రాంతాల అభివృద్ధి
    7. ప్రత్యేక అవసరాలు ఉన్న బాలలకు సంఘటిత విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ
    8. నాణ్యమైన విద్యా ప్రమాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయడం, అమలు చేయడం
    9. అన్ని స్థాయిల్లో వనరుల బృందాలను పటిష్ఠపరచడం (ప్రతి విభాగానికి ప్రత్యేక వనరుల బృందాలు) ప్రతి జిల్లాకు 300-350 మంది సిబ్బంది), తదనంతర కార్యకలాపాలు, క్షేత్రస్థాయిలో మద్దతు, సమీక్షా సమావేశాలు. జిల్లా విద్య, శిక్షణ సంస్థ (DIET) లు గుర్తించిన శిక్షణా అవసరాలు - కీలకమైన ప్రదేశాలు, శిక్షణా భాగాల అభివృద్ధి. ఈ ప్రక్రియ శిక్షణ నాణ్యతను మెరుగుపరిచేందుకు సాయపడింది. శిక్షకులకు, బ్లాకు స్థాయి కార్యక్రమ అధికారులకూ శిక్షణలు నిర్వహించబడ్డాయి.
  13. ప్రత్యామ్నాయ బోధన
  14. సమూహ సమీకరణ
  15. దూర విద్య - దూర విద్యా కార్యక్రమం (డిస్టాన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (DEP) ) సర్వ శిక్షా అభియాన్లో ఒక జాతీయస్థాయి భాగంగా ఉంది, ఇది భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కలయికతో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ద్వారా దూర విద్య నిర్వహించబడుతుంది. ప్రాథమిక విద్యా రంగంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి విద్యను అందించడంలో ఇది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. ఆడియో-వీడియో ప్రోగ్రామ్‌లు, రేడియో ప్రసారాలు, టెలీకాన్ఫరెన్సింగ్, తదితరాల వంటి మల్టీ-మీడియా ప్యాకేజ్‌లను ఉపయోగించడం ద్వారా ఇది ముఖాముఖి శిక్షణను అందిస్తుంది. పెద్ద సంఖ్యలో వ్యక్తులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా, దూర విద్యా శిక్షణ, శిక్షణా విషయాల్లో ఏకరూపతను సాధించి, బదిలీ నష్టాన్ని తగ్గిస్తుంది. నేరుగా జరిగే శిక్షణా తరగతుల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.

ఇవేకాక అంగన్‌వాడీ (ICDS), బాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించే ఉద్దేశంతో 2004 లో ప్రారంభించిన కస్తూరీ గాంధీ బాలికా విద్యాలయ యోజనా (KGBVY) దీనిలో విలీనం చేశారు.

నిధులు

[మార్చు]

ఈ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం 2005-06 లో రూ. 7156 కోట్లను కేటాయించగా, సత్ఫలితాలను చూసి, 2006-07 లో ఈ బడ్జెట్ ను 10,004 కోట్లరూపాయలకు పెంచారు. 5,00,000 అదనపు గదులను నిర్మించడం, 1,50,000 అదనపు ఉపాధ్యాయులను నియమించడం కూడా ఉద్దేశ్యాలే. 2006-07 లో రూ 8746 కోట్ల రూపాయలను ప్రారంభ శిక్షా కోష్ కు కేటాయించి, మిగతా రొక్కాన్ని విద్యా సెస్సుగా వసూళ్ళద్వారా సమకూర్చడానికి నిర్ణయం జరిగింది.

సాధనలు

[మార్చు]

గ్రామీణ స్థాయిల్లో ఈ కార్యక్రమం వలన గణనీయమైన సాధనలు సాధ్యపడ్డాయి. 2004లో భారతదేశంలోని అనేక గ్రామాలకు కార్యక్రమ విస్తరణ జరిగింది. ప్రాథమిక విద్యా కేంద్రాలు తెరిచారు.

దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులో, నాగపట్నం జిల్లాలోని సత్యనాథపురం (పట్టణం: సీర్కాళి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం, మిగిలిన విద్యా కార్యక్రమాల వలన అక్షరాస్యతలో గణనీయమైన వృద్ధి రేటు సాధ్యపడింది. ప్రభుత్వేతర సంస్థలు స్వచ్ఛందంగా పేద విద్యార్థులకు భూములు విరాళంగా ఇచ్చాయి, గ్రామ పంచాయితీలు పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేశాయి.

ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్

[మార్చు]

2010-11 నివేదిక ప్రకారం,[2] పనితీరు ఈ విధంగా ఉంది.

  • 73,324 పాఠశాలలకు నిర్వహణ ఖర్చులను పంపిణీ చేశారు.
  • 25 కొత్త పాఠశాలలను తెరవటం జరిగింది.
  • 37,429 ఉపాధ్యాయులకు జీతాల పంపిణీ
  • 2, 13,386 బడిబయటపిల్లలను బడిలో చేర్చారు.
  • 6,973 పాఠశాల సంకీర్ణాలకు తోడ్పాటు నందించారు.
  • 1,137 మండల సంపన్మూల కేంద్రాలకు తోడ్పాటు
  • 84,621 పాఠశాలలకు ధనం మంజూరు.
  • 2, 84,862 ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
  • 5,765 ఆదర్శ క్లస్టర్ పాఠశాలలను ప్రారంభించారు.
  • 725 కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలను ప్రారంభించారు.
  • 7, 36,346 సముదాయ సభ్యులకు శిక్షణ ఇచ్చారు.
  • 2,29,856 ఉపాధ్యాయులకు గ్రాంటులిచ్చారు.
  • మూడు నివాస పాఠశాలలు ప్రారంభించారు.
  • 52, 66,837 పిల్లలకు సమవస్త్రాలను పంపిణిచేశారు.

దీనికి 1107 కోట్ల రూపాయలు ఖర్చయినవి. 2010కి 100 శాతం పిల్లలు పాఠశాలలో వుండాల్సిన లక్ష్యానికి 95.81 శాతం ఆవాసాలకు 1 కిమీ దూరంలో 57184 ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. మిగతా ఆవాసాలలో చాలినంత పిల్లలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ సృజనాత్మక విద్యా పద్ధతులద్వారా 100 శాతం లక్ష్యం అందుకున్నారు.

విద్యాప్రమాణాల నాణ్యత

నాణ్యత పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా విద్యార్థుల శిక్షణ మెరుగైనట్లు తెలిపారు. అయితే అసర్ సర్వే ప్రకారం తెలిసిన ఫలితాలకు పొంతన వున్నట్లు లేదు. ప్రాథమిక స్థాయిలో దాదాపు 60 శాతం పిల్లలు వారితరగతికి తగిన నైపుణ్యం కలిగివున్నారని సర్వ శిక్ష అభియాన్ నివేదిక చెప్తుంటే అసర్ లో 50 శాతం మంది మాత్రమే మూడవ తరగతి స్థాయి చదవగలిగే నైపుణ్యాలు కలిగివున్నట్లు చెప్పింది.

మాధ్యమం

[మార్చు]

మాధ్యమం గణాంకాలు (దాదాపు 10 వతరగతి వరకు విద్యార్థుల శాతం) ఈ విధంగా ఉన్నాయి.

సంవత్సరంతెలుగుఇంగ్లీషు

1995-1996 85.62%11.47%

1996-1997 85.28%11.90%

1997-1998 85.30%11.97%

1998-1999 85.31%11.44%

1999-2000 84.64%12.67%

2000-2001 83.47%13.77%

2001-2002 82.14%14.93%

2002-2003 81.11%15.75%

2003-2004 79.86%17.09%

2004-2005 78.38%18.61%

2005-06 76.07%21.04%

2006-07 73.91%23.32%

2007- 08 71.08%26.01%
రాష్ట్ర విద్యాపరిశోధన సంస్థలో ఇంగ్లీషు బోధన పత్రము ప్రకారం. ఇంగ్లీషు మాధ్యమంలో చదువుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.[3]

మాధ్యమం

2001-02

2009-10

2010-11

నమోదు

%

నమోదు

%

నమోదు

%

తెలుగు

10863366

83.11

8650448

66.92

8214416

63.64

ఇంగ్లీషు

1815001

13.89

3906288

30.22

4337731

33.61

ఇతర

393231

3

370718

2.86

355056

2.75

మొత్తం

13071598

100

12927454

100

12907203

100

ప్రైవేట్ పాఠశాలలో నమోదు

2000-2001 లో ప్రైవేటు పాఠశాలలో 17% విద్యార్థులు నమోదు కాగా 2010-11 నాటికి 40%కు చేరుకుంది.[4]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2005-2006 సంవత్సరం వరకు 3518 పాఠశాలలలో కంప్యూటర్ సహాయంతో విద్య ప్రవేశపెట్టారు. వీటిలో 2057 ప్రాథమిక, 584 ప్రాథమికోన్నత, 877 ఉన్నత పాఠశాలున్నాయి. వీటికొరకు పాఠశాలలలో కంప్యూటర్ సహాయంతో విద్య (వేయి కంప్యూటరుల ప్రాజెక్టు, ఎంపి నిధులతో ఇవ్వబడిన కంప్యూటరులు, లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలచే ఇవ్వబడిన కంప్యూటరులు), పాఠశాల వెలుపల కంప్యూటర్ సహాయంతో విద్య అనగా (దగ్గరలో కంప్యూటర్ సదుపాయంగల పాఠశాలు, లేక ఈ-సేవ కేంద్రాలు మొదలైనవి) పధకాలు వాడుతున్నారు.

సిడి అభివృద్ధి

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూపొందించిన 64 సిడీలను 1 నుండి 9 తరగతి వరకు, తెలుగు, ఇంగ్లీషు, గణితం, విజ్ఞాన శాస్త్రం, సమాజ శాస్త్రం విషయాలను నేర్పటానికి వాడుతున్నారు. దీనికొరకు అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

పనితీరు

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ నాలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ సహాయ విద్య పనితీరుని 2008 లో పరిశీలించింది.[5] చాలా కొద్ది కేంద్రాలు మాత్రమే సరిగా పనిచేస్తున్నాయని తెలిసింది. ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయల మనస్సులో వీటి నిర్వహణ బాధ్యత గురించి అవగాహన లేకపోవటం, కంప్యూటర్ విద్యగురించిన అపోహలు, వీటిని వాడటానికి సరియైన మూలభూతసౌకర్యాలు లేకపోవటం దీనిలోని లోపాలు అని తెలిపింది.

ఇవీ చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. "సర్వ శిక్షా అభియాన్ అంధ్రప్రదేశ్ వెబ్సైట్". Archived from the original on 2012-01-26. Retrieved 2012-02-16.
  2. ఆంధ్రప్రదేశ్ లో సర్వశిక్షా అభియాన్ 2010-11 నివేదిక (ఇంగ్లీషు)[permanent dead link]
  3. "రాష్ట్ర విద్యాపరిశోధన సంస్థలో ఇంగ్లీషు బోధనా పత్రము" (PDF). Archived from the original (PDF) on 2013-10-22. Retrieved 2013-12-26.
  4. "రాష్ట్ర విద్యాప్రణాళికా పరిధి పత్రం-2011" (PDF). Archived from the original (PDF) on 2012-06-10. Retrieved 2013-03-10.
  5. "కంప్యూటర్ సహాయంతో నేర్చుకొనే ప్రణాళిక నివేదిక 2008 -అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్(ఇంగ్లీషు)" (PDF). Archived from the original (PDF) on 2011-07-10. Retrieved 2013-03-10.