Jump to content

చందాల కేశవదాసు

వికీపీడియా నుండి

రసికప్రియ సృష్టికర్త హిందీ రచయిత కేశవదాసు గురించి ఇక్కడ చూడండి.

చందాల కేశవదాసు
చందాల కేశవదాసు
జననంచందాల కేశవదాసు
జూన్ 20, 1876
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి
మరణంమే 14, 1956 దుర్ముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ద పంచమి రోజున
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం
మరణ కారణంధ్యానస్థితిలో సహజమరణం
నివాస ప్రాంతంఖమ్మం జిల్లా
ప్రసిద్ధిగీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త
పదవి పేరుతొలి తెలుగు సినిమాపాటల రచయిత, తెలంగాణ హరికథా పితామహుడు
పిల్లలుచందాల కృష్ణమూర్తి, చందాల సీతారామయ్య, గంధం ఆండాళ్ళు
తండ్రిచందాల లక్ష్మీనారాయణ,
తల్లిపాపమ్మ

చందాల కేశవదాసు (జూన్ 20, 1876 - మే 14, 1956) తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి[1], నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశాడు. ఈయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో జూన్ 20, 1876 చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో మే 14, 1956 న మరణించాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు.[2][3] కేశవదాసు తాత చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిదేవిపాడుకు చెందిన వారు. అతను అక్కడే వైద్యవృత్తిని చేసేవారు. అతను ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ కూడా వైద్యవృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. ఆ తరువాత తన నివాసాన్ని జక్కేపల్లికి మార్చారాయన, చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం మొదట వెంకటరామయ్య తర్వాత కేశవదాసు జన్మించారు. వెంకటరామయ్య వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య జీవనం యోగమార్గంలో గడిపారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.

వంశనామం

[మార్చు]

18, 19 శతాబ్దాల మధ్య గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని `చందవోలు' గ్రామం పేరు ప్రజల నోళ్ళలో నలిగి వాడుకలో `చందోలు' గా మారింది. దీనిని పూర్వం `ధనదపురం' గా పిలిచే వారు. ఙది 11వ శతాబ్దంలో వెలనాటి ఛోళులకు రాజధానిగా వుండేది. వీళ్ళు వేంగిని కాపాడిన సామంతులు. వీరు తదనంతరం వివిధ కారణాలతో చెదిరి వేర్వేరుగా స్థిరపడ్డారు. ఆంగ్లేయుల పాలన ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో, ఇటు నైజాం నవాబు స్వతంత్ర రాజుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంస్థానాధీశుల బాధలు వున్నాయి అటువంటి సమయంలో చందవోలు గ్రామంలోని తెలగ వంశీయులలో వైద్య వృత్తిని సాగిస్తున్న ‘శ్రీనివాసులు’ అనే ముఖ్యుడు చందవోలు గ్రామం నుంచి అనేక ఇబ్బందులు పడి అప్పటి ఉమ్మడి ఖమ్మంజిల్లా ఇప్పటి భద్రాద్రి జిల్లాకు చెందిన ‘గంగదేవిపాడు’కు చేరుకున్నారు. ఆయుర్వేద వైద్య వృత్తిలో జీవనం సాగిస్తూ పేదలకు ఉచితంగా ఉదారంగా వైద్యం చేసే వారట. ఆ ఊరి వారి వీరిని సులభంగా గుర్తించేందుకు ‘చందోలు వారని’ పిలిచే వారు కాల క్రమంలో అది ‘చందాల’ వారుగా స్థిరపడిపోయింది అని చెప్తారు.

వివాహం

[మార్చు]

దాసుగారు వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. సంతానం లేదని రెండవ వివాహం చేసుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఇద్దరు భార్యలు మరణించడంతో శిష్యులు అభిమానుల వత్తిడితో మరో రెండు వివాహాలు చేసుకున్నారు. దురదృష్ణం వెంటాడినట్లు వారిద్దరు కూడా దూరం అవ్వడంతో తనకు ఇక వివాహం వద్దు అనుకుంటున్న దశలో చివరకు పలువురు ఒప్పించి కృష్ణాజిల్లా తిరువూరు పట్టణానికి చెందిన కాబోలు రామయ్య గారి కుమార్తె కాబోలు చిట్టెమ్మను వివాహం చేసారు. అంటే చిట్టెమ్మ గారు వీరికి లెక్క ప్రకారం ఐదవ భార్య అన్నమాట.మొదటి నలుగురి గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమూర్తిగారి సతీమణి వెంకట నర్సమ్మగారు అందించిన సమాచారం ప్రకారం. తమ్మర కడియాల నారాయణ గారి అక్క లక్ష్మమ్మ దాసుగారి మొదటి భార్య, నడిగూడెం దగ్గరి సిరిపురం అమ్మాయి రెండవ భార్య, ఖమ్మం గాడేపల్లి వెంకటప్పయ్య గారి వదిన మూడవ భార్య, తిరువూరు మొండి జగ్గయ్య గారి మరదలు నాలుగవ భార్య.

అత్తవారిల్లు కావడం వల్లనే కాక సప్తహ కార్యక్రమ నిర్వహణకు కూడా అతను పలుమార్లు తిరువూరు గ్రామాన్ని సందర్శించారు. తిరువూరుతో విడదీయలేని సంబంధం కేశవదాసు గారికి ఉంది. ఈ ప్రాంత ఆడపడుచును వివాహమాడిన అతనుం సొంత ఖర్చులతో తిరువూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన బావి దాసు పేరుతో నేటికీ పిలవబడుతుండటం విశేషం. ఆరోజులలో భద్రాచలం శ్రీరాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండి వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటుచేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు వీరికిు తిరువూరు, గంపల గూడెం ప్రాంతాల్లో విస్తృతమైన పరిచయాలున్నాయి. అతను ఆరోజుల్లో పాటలు పాడటంతో పాటు అష్టావధానం, శతావధానం చేసేవారు. పలు దేవాలయాలకు గాలి గోపురాలు కూడా నిర్మించారు. పలు గ్రంథాలలో ఉన్న అర్ధంకాని విషయాలను సులభరీతిలో బోధించేవారు. అతను చేసిన సేవలకు తిరువూరు సంస్థానం వారు ఘనంగా సత్కరించారు. 1933- 1935 ప్రాంతాల్లో తిరువూరు, తదితర ప్రాంతాల్లో స్వాతంత్ర్య ఉద్యమం బలంగా ఉండేది. దాసు తన గీతాలతో ప్రజల్లో దేశభక్తిని, చైతన్యాన్ని నింపేవారు.

సంతానం

[మార్చు]
  • కేశవదాసు గారి మూడవ భార్య సంతానంగా రామకవి అనే అతను జన్మించారు. రామకవి గారికి ఛక్రధరరావు, చిట్టెమ్మ, సీతమ్మ కేదారి అనే నలుగురు పిల్లలు.
  • కేశవదాసు చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల కృష్ణమూర్తి, సీతారామయ్య, ఆండాళ్ళు అనే ముగ్గురు పిల్లలు జన్మించారు.
  • పెద్దవాడైన కృష్ణమూర్తి ముత్తాత శ్రీనివాసరావుగారి లాగా వైద్య వృత్తిని మార్గంగా ఎంచుకున్నారు. వైద్య విద్యను అభ్యసించి ఆర్ ఎం పి డాక్టరుగా స్థిరపడ్డారు. ఈయన తండ్రి రచనలు, సేవాకార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. వృత్తి కీర్తి సంపాదనలో మునిగిపోయారు. ఈయనకు వారి దగ్గరి బంధువుల అమ్మాయి వెంకటనర్సమ్మ గారితో వివాహం అయినది. వీరికి శ్రీనివాసరావు, కేశవదాసు, ఉష, శ్రీదేవి అనే నలుగురు పిల్లలు
  • రెండవ కొడుకు సీతారామయ్య భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. వీరికి సక్కుబాయి అనే ఆవిడతో వివాహం అయినది.వీరికి వెంకట కేశవరావు, సత్యనారాయణ, రామ మోహన్, పద్మ అనే నలుగురు పిల్లలు,
  • మూడవ వారు ఆడపిల్ల పేరు ఆండాళ్ళు. కేశవదాసుగారు మునగాల వెళ్ళినప్పుడు గంధం నర్సయ్య అనే కుర్రవాడి బుర్రకథా గానాన్ని ముగ్ధులై అతని గురించి వాకబు చేస్తే అతను రేపాల కాంగ్రెసు ఉద్యమ క్యాంపు కార్యదర్శ అని కూడా తెలుసుకుంటారు. దేపాలలో జనతా కళా మండలి సంస్థ సభ్యుడిగా నర్సయ్య గారి నటనకు అభినందించి 1955లో తన కూతురైన ఆండాళును గంధం నర్సయ్య గారికి ఇచ్చి సాలంకృత కన్యాదానం చేసారట. గంధం దంపతులకు పద్మజ, సత్యనారాయణ, నీరజ, శ్రీనివాస్, శైలజ, శేషగిరిధర్ అనే ఆరుగురు సంతానం

కళారంగంలో ప్రవేశం

[మార్చు]

అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతంలోని మెలకువలు తెలియజేశాడు. గేయరచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరాడు. కాంతయ్యనాటక సమాజంలోచేరి కవిగా, నటుడిగా పేరుగాంచాడు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థుడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చాడు. ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు’, అని శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నెతెచ్చిన గీతం కేశవదాసు రాసిందే. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరచిన ఖ్యాతి పాపట్ల కాంతయ్యకు దక్కింది. భక్త ప్రహ్లాద, కనకతార వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు వ్రాశాడు. కొంతకాలం నాటకరంగానికి స్వస్తిచెప్పి తెలంగాణా అంతటా హరికథలు చెప్పాడు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి.

1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావులు పాడగా బెంగుళూరులో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. "కనక తార", "లంకాదహనం" వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచాడు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశాడు.

నాటక రంగం

[మార్చు]

తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే 'పరబ్రహ్మ పరమేశ్వర - భళిరా హరి మహిమం బెరుగగ బ్రహ్మాదులు తరమా' అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారి కలం నుండి జాలు వారినదే.

""పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతితపావన సుప్రకాశ || పరా||

వరదాయక సకలలోక వాంచిత శుభదప్రమేయ పాహీ – పాహీ – మాం – పాహీ || పరా||""

సినిమా రంగంలోకి ప్రవేశం

[మార్చు]

నాటక రంగంలో చందాల కేశవదాసు మంచి పేరుతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి దాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా 'ఆలం ఆరా' అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే యేడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని భక్త ప్రహ్లాద చిత్రం (1931-32)న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో అతను సినీ జీవితం మొదలైంది.

భక్త ప్రహ్లాద (1931, 1942)

[మార్చు]

ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, హిరణ్యకశ్యపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఈమె పాడిన పరితాప భారంబు భరియింప తరమా పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలిపాట. ఇదేగాక ఈమెనే పాడిన తనయా ఇటులన్‌ తగుపలుకు, మునిపల్లె సుబ్బయ్య పాడిన భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా రెండు పాటలు కూడా చందాల వారు రాశారు. అయితే చిత్రంలో రంభ పాడిన వింతాయెన్‌ వినన్‌ సంతసమాయెనుగా దేవేంద్రా అనే పాట కూడా వొకటుంది. ఇది ధర్మవరం వారు భక్త ప్రహ్లాద నాటకం రాసినపుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినపుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారేననే వాదన ఒకటి ప్రారంభించారు ఆ మధ్య. కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది గనుక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్ర కెక్కారు. తొలి చిత్రం భక్త ప్రహ్లాద (1931-32)కు రాసిన పాటలు, 1942లో తీసిన భక్త ప్రహ్లాదలోనూ వాడుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం (1935)లో రాసిన పాటలు ఆ తరువాత 1956, 1966లోనూ అందుకే అతను తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు.

మొదటి పాట

[మార్చు]

చందాల కేశవదాసు గారు భక్తప్రహ్లాద సినిమా కోసం మూడు పాటలు రాసారు మరి వీటిలో ఏది తొలి గీతం అనేది కూడా ప్రధానంగా వేసే ప్రశ్న అయితే సినిమాలో కథ ప్రకారం కాకుండా పాట రాసిన చరిత్ర ప్రకారం చూస్తే మొదటి పాట ‘‘ పరితాప భారంబు భరియింప తరమా’’ అనేది.

ఈ పూర్తి పాట ఇలా వుంటుంది కానడరాగం ఆదితాళం లో సాగుతుంది ఈ పాట

పరితాప భారంబు భరియింప తరమా

కటకట నే విధి గడువంగ జాలుడు
పతి ఆజ్ఞను దాట గలనా
పుత్రుని కాపాడ గలనా .....పరి
1. ఈ విషము నేనెటులను
తనయుని ద్రావింపగలను?
ధర్మమును కాపాడుదునా?
తనయుని కావగగలనా? .... పరి!

— చందాల కేశవదాసు

సతీ సక్కుభాయి (1935, 1954)

[మార్చు]

'భక్త ప్రహ్లాద' (1931-32) తరువాత కేశవదాసు గారు రచయితగా పని చేసిన సినిమా 'సతీసక్కుబాయి' (1935). భారతలక్ష్మీ ఫిలింస్‌ వారి ఈ చిత్రంలో 'కృష్ణా పోబోకురా', 'రాదేల కరుణా', 'ఆటలాడు కోరా', 'పాలుమీగడ పలుమార్లు భుజియించి', 'పాషాణ మెటులైతివో', 'జాగేలా కావగ రారుగా' పాటలు రాశారాయన. చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తుంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిణి దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లే బ్యాక్‌ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు.

‘సతీ సక్కు‌బాయి’ మహా‌రా‌ష్ట్రా‌నికి చెందిన భక్తు‌రాలి కథ.‌ రంగ‌స్థలం నాట‌కంగా ప్రసి‌ద్ధి‌కె‌క్క‌డంతో 1935లో సినిమా తీశారు.‌ భారత్‌ లక్ష్మీ పిక్చర్స్‌ పేరిట చారు‌రాయ్‌ దర్శ‌క‌త్వంలో కల‌క‌త్తాలో నిర్మిం‌చారు.‌ చిల‌క‌మర్తి లక్ష్మి‌న‌ర‌సింహం పంతులు, సిని‌మాకి మాటలు, పాటలూ రాశారు.‌ కొన్ని పాటలు చందాల కేశ‌వ‌దాసు రాశారు.‌ ‘కృషాల‌పో‌బో‌కుమా, రాదేలా కరుణ, ఆట‌లా‌డు‌కోరా, పాలు మీగడ వెన్న పలు‌మార్లు భుజి‌యించి పాషా‌ణ‌మె‌టు‌లైతివో’, ‘జాగేలా కాన‌రా‌రుగా’ − పాటలు చందాల రాసి‌నవి.‌ ‘సక్కు‌బాయి’ (1935)లో పురు‌షుడే స్త్రీ పాత్ర ధరిం‌చడంమరో విశేషం! సూర‌వ‌రపు వెంక‌టే‌శ్వర్లు రంగస్థలం‌మీద ‘సక్కు‌బాయి’లో అత్త పాత్ర ధరించి ప్రసి‌ద్ది‌పొం‌ద‌డంతో అతను చేతనే సిని‌మాలో అత్త పాత్ర ధరిం‌ప‌జే‌శారు! నాట‌కాల్లో పురు‌షులు స్త్రీ పాత్రలు ధరిం‌చడం, స్త్రీలు పురు‌ష‌పా‌త్రలు ధరిం‌చడం వుండేది.‌ అయితే, సక్కు‌బాయి తర్వాత కాబోలు స్త్రీ పాత్రలు స్త్రీలే ధరిం‌చాలిగాని, పురు‌షులు వెయ్య‌రాదు’ అన్న నిబం‌ధన విధిం‌చారు ప్రభుత్వం, సెన్సా‌ర్‌వారు.‌ మారు‌వే‌షాలు వేసు‌కుని, స్త్రీలు పురు‌ష‌పా‌త్రల్లోనూ, పురు‌షులు స్త్రీ పాత్రల్లోనూ కని‌పిం‌చ‌వచ్చు అది వేరు.‌

శ్రీకృష్ణ తులాభారం (1935, 1955, 1966)

[మార్చు]

మరింగంటి వెంకట నరసింహాచార్య కవి (సా.శ.. 1770) తన బహురచనలలో నొకటిగా ఈ కథను సుమారు 1040 ద్విపదలలో రచించారు. ప్రబంధకవితేతరులైన జానపద- గ్రామీణ జనులు చదివి-చదివించుకొని ఆనందించే విధంగా దీన్ని రచించటం ఒక విశేషం సుప్రసిద్ధమైన పారిజాతాపహరణ ప్రబంధంలో ‘పుణ్యక వ్రతము’ పేర ఈ కథ (54-90 పద్యాలు) ఉంది. కాని దానిలో తులాభార ప్రసక్తిలేదు..శ్రీ కృష్ణ‌తు‌లా‌భారం’ ముత్త‌రాజు సుబ్బా‌రావు రాసిన రంగ‌స్థల నాటకం.‌ ఇది భారత, భాగ‌వ‌తాల్లో లేని కవ్పిత కథ.‌ అంతకు ముందు ఎవరు కల్పిం‌చారో గాని, ముత్త‌రాజు సుబ్బా‌రావు నాటకం బాగా మంచిపేరు పొందింది.‌ దాంతో తొలి‌సా‌రిగా చిత్ర రూపం దాల్చి 1935లో విడు‌ద‌లైంది.‌ ముఖర్జీ, రాజా‌రామ్‌ అనే వారు దర్శ‌కత్వం వహిం‌చారు.‌ జయ‌సింగ్‌ అనే అతను కృష్ణుడు, ఋష్యేం‌ద్రమణి సత్య‌భామ, కపి‌ల‌వాయి రామ‌నా‌థ‌శాస్త్రి నార‌దుడు.‌ విశేషం ఏమి‌టంటే, ఋష్యేం‌ద్రమణి, కాంచ‌న‌మాల, రేలంగి, లక్ష్మీ‌రాజ్యం వంటి నటు‌లకు ఇదే తొలి‌చిత్రం! 1955లో రాజ‌రా‌జే‌శ్వరీ వారు ఇదే చిత్రం తీశారు.‌ సి.‌ఎస్‌.‌రావు దర్శ‌కుడు కాగా, రఘు‌రా‌మయ్య కృష్ణుడు, సూరి‌బాబు నార‌దుడు, ఎస్‌.‌వర‌లక్ష్మి సత్య‌భామ.‌ ఇదీ బాగానే నడి‌చింది.‌ 1966లో డి.‌రామా‌నా‌యుడు సురేష్‌ పతాకం కింద మళ్లీ ‘శ్రీ కృష్ణ తులా‌భారం’ తీశారు.‌ రామా‌రావు కృష్ణుడు, కాంతా‌రావు నార‌దుడు, జమున సత్య‌భామ, కమ‌లా‌కర రామే‌శ్వ‌ర‌రావు దర్శ‌కుడు. 1935లోనే సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలింస్‌ వారి శ్రీకృష్ణ తులాభారం'తో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రంలో రాసినవి మూడు పాటలు. అవి భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్‌ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. అయితే ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం చిత్రాన్ని 1955, 1966ల్లో నిర్మించినపుడు కూడా వాడుకున్నారు. అది కేశవదాసు గారి కవితా వైభవానికి నిదర్శనం. 1966లో డి.రామానాయుడు తీసిన చిత్రంలో దాసుగారి పాటలు వాడుకుని వారి పేరును సినిమాలో గాని, పాటల పుస్తకంలో గాని వేయలేదు. ఇది గమనించిన వారి కుటుంబ సభ్యులు 1970లో ఖమ్మం కోర్టులో కేసు వేయగా దిగివచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్‌లో అతను పేరు వేశారు.

పారిజాతాపహరణ ప్రబంధంలోని కథను – తిమ్మనకవి సంస్కృత హరివంశాధారంగా గ్రహించి సంక్షేపించినా ‘తులాభార’ ప్రసక్తిలేదు. ప్రస్తుత ద్విపద కృతి కర్త కొంత వరకు ముక్కుతిమ్మన కృతిని అనుకరించినా వర్ణనలు – కల్పనలతో కథను పెంచి ‘తులాభారము’ను వేయించినాడు. పారిజాతాపహరణంలోని కొన్ని సన్నివేశాలను మార్చి ఔచిత్యం పాటించిన ద్విపద కావ్యకర్త కథాకథనంలో శ్రద్ధకన్పరచినాడు – ఈయన మార్పుల్లో నారదుడు విచ్చేసి ఏకాంతంలో వున్న సత్యభామకే తులాభారం విషయం వివరిస్తాడు. చైత్రమాసం బదులు – ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశినాడు మాత్రమే చేయవలెనని – మార్గశీర్ష ప్రాముఖ్యాన్ని తెల్పుతాడు. మహర్షి ఆనతి ప్రకారం మార్గశీర్షంలో సత్యభామ వ్రతాన్ని చేస్తే – నారదుడే అష్టదిక్పాలకులకు పతిదాన వ్రత విశేషాలను చెప్పి ఆహ్వానిస్తే వీరితో పాటు మునిజనం, బ్రాహ్మణ బృందం విచ్చేస్తుంది. ఒక వైపు కౌరవులు వస్తే శ్రీ కృష్ణుడేవారికి తగిన పనులప్పగిస్తాడు (రాజసూయయాగంలోవలె) వీరే గాక – కుబ్జ. ద్రౌపది, రాధ, ప్రద్యుమ్నుడు, సాత్యకి విచ్చేసి వ్రత సంబంధ కార్యాలను చేస్తారు. ఇట్లా వీరి వర్ణన కార్యక్రమాలు మొదలగు వాటితో కథ పెరిగింది. పతిదానవ్రత సమయానికి ‘రుక్మిణి’ రాకపోవటం సవతులకయ్యమే ప్రధానమని రేవతీ ద్రౌపదులు భాషించుకోవటం జానపదుల యధార్థకథనంవలె కలదు.

సతీ అనసూయ (1935)

[మార్చు]

1935లో అరోరా ఫిలిమ్స్‌ ఆరోరా ఫిలిమ్స్‌ వారు ‘అన‌సూయ’ చిత్రాన్ని కోల్‌క‌త్తాలో తీశారు.‌ ఈ సిని‌మాకి మాటలు, పాటలు, పద్యాలూ అన్నీ కేశ‌వ‌దాసే రాశారు.‌ ఈ సినిమా విశేషం ఏమి‌టంటే, తొలి‌సా‌రిగా ఒక మహిళ చిత్రని‌ర్మా‌తగా రావడం.‌ ఆమె దాసరి కోటి‌రత్నం.‌ ఆమే అన‌సూయ పాత్రధా‌రణి కూడా.‌ అయితే, ఈ సినిమా బాగా నడవ లేదు.‌ 1936లో సి.‌పుల్లయ్య బాల‌లతో తీసిన ‘అన‌సూయ’ మాత్రం బాగా నడి‌చింది.‌ ఈ సిని‌మాతో పాటు ‘ధ్రువ‌వి‌జయం’ కూడా విడు‌దల చేశారు.‌ కేశవదాసు గారు 1935లో మూడు సినిమాలకు రచయితగా పని చేశారు. ఆ మూడో సినిమా సతీ అనసూయ ఈ సినిమాకు స్క్రిప్టుతో సహా మాటలు, పాటలు రాశారాయన. అలా కేశవదాసు పూర్తి స్థాయిలో రచయితగా పని చేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో అనసూయ స్క్రిప్టు పట్టుకుని ఉన్న దాసుగారి ఫొటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినీ చరిత్రలో 'నభూతో న భవిష్యతి'గా చెప్పుకోవచ్చు. దేవుని దయ ఉంది ఐలెసో, ప్రహ్లాదుగావ స్తంభమునందు నృహరివై, మాతయని మాట విని, కురుతే గంగా సాగర గమనం వంటి పాటలు సతీ అనసూయలో దాసుగారు రాసినవే. ఆ తరువాత దాసుగారికి సినిమా అవకాశాలు వరుస కట్టినవి.

లంకా దహనం (1936)

[మార్చు]

చందాల కేశ‌వ‌దాసు ‘లంకా‌ద‌హనం’ సిని‌మాకి కూడా మాటలు, పాటలు, పద్యాలూ రాశారు.‌ ఇది 1936లో వచ్చించి.‌ రాధా ఫిలిం కంపెనీ పేరిట కాళ్ల‌కూరి సదా‌శి‌వ‌రావు దర్శ‌కత్వం వహిం‌చారు.‌ నటే‌శన్‌ అనే అతను హను‌మం‌తు‌డిగా నటిం‌చారు.‌ ఈ సిని‌మాలో వింతగా కని‌పిం‌చిన విషయం ఏమి‌టంటే −‌ హను‌మం‌తుడు చెట్టు‌కింద కూచుని ‘ఎపుడు కృపా‌క‌లు‌గునో’’ అన్న త్యాగ‌రా‌జ‌కీ‌ర్తన పాడడం.‌ ఈ సినిమా సరిగా ఆడక పోవడం వల్లా పాటల పుస్తకం లేక‌పో‌వ‌డం‌వల్లా ఇతర నటుల వివ‌రాలు తెలి‌య‌రా‌లేదు.‌

కనక తార (1937, 1956)

[మార్చు]

'ద్రౌపదీ వస్త్రాపహరణం తీసిన సరస్వతీ టాకీస్‌ వారు కనక్తార సినిమాను హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ, ఆరణి సత్యనారాయణ, కడారు నాగభూషణం, గంగారత్నం ప్రధాన పాత్రధారులు. రంగస్థలంపై 'కనక్తార'గా చెలామణి అయినా నాటకం వెండి తెర మీదికి వచ్చేసరికి కనకతార అయింది. దప్పిచే నాలుక తడిపొడి లేక పద్యం, ఎంత బాగుండది సక్కని గుంటారాయే నా, యేంటి అబ్బో నా వొల్లు మంటెత్తుతాది పాటలు బహుళ జనాదరణ పొందినవి. ఇదే సినిమాను 1956లో మరోసారి తీసినపుడు కూడా దాసుగారి పాటలను యధాతథంగా వాడుకున్నారు. కనకతారకు రాసిన కథ, పాటలు 1937, 1956లోనూ యధాతథంగా ఈ సినిమాల్లో వినియోగించుకున్నారు

రాధాకృష్ణ (1939)

[మార్చు]

1939లో లక్ష్మీ్ సినీ టోన్ సంస్థ వారు స్థానం నరసింహ రాఉ గారినే రాధగా పెట్టి ఈ సినిమా తీసారు. రాధాకృష్ణ నాటకం కోసం దాసుగారు రాసిన 22 పాటల నుంచి కొన్ని పాటలను ఈ చిత్రం కోసం వాడుకున్నారు.

బాలరాజు (1948)

[మార్చు]

1948 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి సినిమాగా ప్రతిభా బ్యానర్ మీద ఈ సినిమా తీసారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీస్ వరలక్ష్మీ్ కస్తూరి శివరావు ముఖ్యపాత్రలు ధరించారు.

ఉన్నత వ్యక్తిత్వం

[మార్చు]

వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు. ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసి పోయేవారు. అతను వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చుని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ వొక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేట తెల్లం చేస్తుంది. అతను జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగుళూరులోని గ్రామ ఫోను కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసింది.

హరికథా భాగవతార్ గా

[మార్చు]

హరికథలు చెప్పడంలో కేశవదాసుది ఎదురులేని ప్రావీణ్యం. పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర వంటి లెక్కలేనన్ని చోట్ల హరికథలు చెప్పి కీర్తి, ధనం సంపాదించారు. అష్టావధానిగా, హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుది ఒక ప్రత్యేక స్థానముండేది. ఒకసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో జగ్గయ్యపేటలో లక్ష్మీకాంతయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్టావధానం చేశారు. అందులో అతను సాహితీ పాండిత్యాన్ని, భాషామార్దవాన్ని, భావసౌందర్యాన్ని, ధారాశుద్ధిని మెచ్చుకుని తమ నాటక సమాజంలో చేరి రచయితగా, నటునిగా పని చేయవలసిందిగా కోరారు లక్ష్మీకాంతయ్య. దాసుగారికి సంగీతం ఆరో ప్రాణం. పాపట్ల లక్ష్మీకాంతయ్య గారి సంగీత విద్యాప్రేరణతో అతను తనలోని సంగీతాభిరుచిని మెరుగుపరచుకున్నారు. ముఖ్యంగా లయశాస్త్రంపై ఎక్కువ దృష్టిపెట్టి ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల అతనును ‘లయబ్రహ్మ’ అనే బిరుదు అందుకున్నారు. జగ్గయ్య పేటలో జరిగిన హరికథా గానానికి ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయోలిన్ సహకారం అందించడం బట్టి చూస్తే దాసుగారి సంగీత వైదుష్యం హరికథా గాన ప్రతిభ ఎంతటిదో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. సంగీత విద్వాంసులు హుజూర్ నగర్ నివాసులైన యం వి యన్ ఆచార్య గారి స్వీయ పరిశీలన ప్రకారం దాసుగారి హరికథా గానంలో వారి గొంతులో ఒక పల్చటి బొంగురు లాంటి జీర వచ్చేదట అది కూడా వారి కథకు లోపంలా కాక ప్రత్యేక అందంలా అనిపించేదని అంటారు.

అష్టావధానిగా శతావధానిగా

[మార్చు]

కేశవదాసు ప్రాథమిక విద్యను తండ్రి వద్ద నేర్చుకున్నాడు. కాగా చిన్నతనాననే అతను మరణించడంతో తన అన్నగారైన వెంకటరామయ్య పోషణలో పెరిగారు. వెంకటరామయ్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. అతను ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అన్నగారి వద్దనే ఛందస్సు, అవధానం వంటి వివిధ ప్రక్రియల్లో ప్రవేశం పొందారు. అమరకోశాన్ని కంఠస్థం చేశారు. అన్నగారి వీధి బడిని తాను నడుపుతూ అందులోని విద్యార్థులనే పృచ్ఛకులుగా నియమించుకుని సమస్యాపూరణం వంటి వివిధ రంగాలతో అష్టావధానాన్ని సాధన చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సిరిపురంలో జమీందారు పిల్లలకు కొంత కాలం చదువు కూడా చెప్పారాయన. వారినే వృచ్ఛకులుగా చేసుకుని తన అవధాన విద్యనూ సాధన చేసారు. కేశవదాసు మొదటిసారి అష్టావధాన ప్రక్రియను భద్రాచలంలో ప్రదర్శించారు. ఆ తర్వాత హుజూర్‌నగర్‌, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్ల అష్టావధానాలు చేసి పండితులతో ప్రశంసలందుకున్నారు.

భాగవత సప్తాహ నిర్వాహకునిగా

[మార్చు]

సప్త అంటే ఏడు అని అర్ధం సప్తాహము అంటే ఏడురోజులు నిర్వహించేది. బాగవత సప్తాహము బాగవత సంబంధిత అంశాలతో ఏడు రోజులు నిర్వహిస్తారు. సప్తాహ్వః అని నిఘంటు ప్రకారం ఏడాకుల పొన్న చెట్టును కూడా పిలుస్తారు. ఏడురోజులనే ఎన్నుకోవడం వెనక తాత్త్విక కారణం ఏమిటంటే మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము ఏడు రోజులుగా నిర్వహిస్తారని ఒక వివరణ.

భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. శ్రీ మద్భాగవత పఠన సప్తాహ సంప్రదాయం ప్రథమంగా పరీక్షిత్తునకు శ్రీ శుకమహర్షి వినిపింపచేయడంతో మొదలైంది. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత ముప్పది సంవత్సరాలకు కలియుగ ప్రవేశం జరుగుతుంది. భాద్రపద శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు భాగవత సప్తాహంజరుపబడింది. దీనిఫలితంగా పరీక్షిత్తునకు మోక్షం లభించింది.అటువంటి బాగవత సప్తాహాలను కేశవదాసు గారు స్వయంగా బాధ్యత తీసుకుని నిర్వహించే వారు.

రంగస్థల నటుడిగా

[మార్చు]

మైలవరం కంపెనీ వారి బాలభారతి సమాజం పక్షాన నాటక ప్రదర్శనకోసం ఈయన జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు, తెనాలి మొదలైన ప్రాంతాలు తిరిగారు.

స్వాతంత్రోద్యమంలో

[మార్చు]

1930-33 మధ్య మనదేశంలో స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్నకాలం. సమకాలీన పరిస్థితులకు స్పందించడం కవుల విధి ముఖ్యంగా సామాజిక బావాలు అధికంగా గల దాసు గారు అందుకు తగినట్లు గానే తన మేధా శక్తితో ఉద్యమాన్ని కొన్ని దశలుగా విభజించి అసింహా పద్దతిలో పోరాటం నడుపుతున్న గాంధీగారి విధానాలకు ముగ్ధుడై గాంధీని తన రచనలతో ప్రశంసించకుండా వుండలేక పోయారు. ‘‘జయతు జై’’ అంటూ పాట రాయడమే కాక దానిని ఆకుల నరసింహారావు, యస్ రాజేశ్వర రావులతో పాడించి బెంగుళూరులో స్వంత ఖర్చులతో రికార్డు చేయించి ఉద్యమానికి దోహదకారి అయ్యేలా దానిని విడుదల చేసారు. అనేక స్థానిక పోరాటాలలో అతను ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. తన ప్రాంతంలో నిరంతర స్ఫూర్తిని నింపడంలో ముఖ్య భూమిక పోషించే వారు.

కులవ్యవస్థలో ఆధిపత్య దోరణిని అణచివేత దోరణులను దుయ్యబట్టే వారు తన చర్యల ద్వారా కూడా వాటిని ఆక్షేపించేవారు. జక్కేపల్లి దగ్గరున్నరాజుపేటకు చెందిన వెంకయ్య అనే హరిజనుడు దాసుగారి హరికథలను విని మురిసిపోయేవాడట. అతను బీదరికాన్ని చూసి చలించి పోయి అతనును ఇంటికి పిలిచి పక్కన కూర్చుని భొజనం పెట్టంచడమే కాకుండా విసనకర్రతో విసిరే వారట.

అన్నగారి వెంకట్రామయ్య నుంచి పొందిన ఆధ్యాత్మిక గుణాలను ధ్యానం తపస్సు ఉపాసనలను గాంధిపద్దతిలో మేళవించి తన సేవా గుణాన్ని జోడించి ప్రజల్లో జాతీయ భావం పెంపొందేందుకు వీలుగా తన జీవితం మొత్తాన్ని మలచుకోవడమే కాదు. వందలాది సప్తాహ కార్యక్రమాల్లో అదే పద్ధతిలో జాతీయ భావాన్ని ఉద్బోధించేలా మాట్లాడేవారట.

గుప్త దాతగా

[మార్చు]
  • తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న కలపను సీతారామచంద్రస్వామి రథగోపుర నిర్మాణానికి వాడారు.
  • తమ్మరలో గాలిగోపురం, ధ్వజస్తంభం పనులు డబ్బులేక ఆగిపోతే ఇంటికి మనిషిని పంపించి భార్యచేతి బంగారు గాజులు తెప్పించి అమ్మారు.
  • జగ్గయ్య పేటలో సప్తాహం పూర్తయిన తర్వాత పండిత సత్కారాలకు డబ్బు సరిపోకపోతే తన చేతి బంగారు కంకణాన్ని అమ్మారు.
  • నల్గొండ జిల్లా హుజూ‌ర్‌న‌గర్‌ దగ్గర్లో వున్న సీతా‌రా‌మ‌చం‌ద్రస్వామి ఆల‌యా‌నికి గాలి‌గో‌పురం నిర్మిం‌చారు.‌
  • ఒంటి‌మి‌ట్ట‌లోని కోదం‌డ‌రా‌మ‌స్వామి ఆల‌యాన్ని జీర్ణో‌ద్ద‌రణ కావిం‌చారు.
  • ఆరోజులలో భద్రాచలం శ్రీరాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండి వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటుచేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు.
  • తిరువూరు సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఆర్ టి సి బస్టాండు ప్రహారీ గోడను ఆనుకుని ప్రస్తుతం వున్న దాసుగారి బావి అని పిలవబడుతున్న బావి అప్పట్లో భద్రాచలం వెళ్లే యాత్రికుల సౌకర్యంతోపాటు గ్రామ నీటి అవసరాలకు కూడా ఉపయోగపడాలని తవ్వించినదే.
  • కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు. ఆలయానికి సంబంధించిన వింజామరలల వంటి అనేక వస్తువులు అవసరమైన మరమత్తులు, అదనపు హంగులకు సాయపడ్డారు
  • కనక్తార పినిమా పనులు పూర్తికాగానే కలకత్తానుంచి తిరిగి వస్తుండగా నిర్మాత దాసుగారి చేతిలో 600 రూపాయిలు పెట్టారట వెంటనే దాసు గారు ఆ డబ్బుతో తమ్మర స్వామికి రెండు చామరాలు (విసనకర్రలు) ఞక భూచక్ర గొడుగు కొని తీసుకు వచ్చి స్వామికి సమర్పించినాకనే అప్పటి వారి నివాసం జక్కేపల్లికి వెళ్ళారట
  • పోలంపల్లిలో కనక్తార నాటకం వేయించగా వచ్చిన పదివేల రూపాయిలను అక్కడి గ్రంథాలయానికి పుస్తకాలు బీరువాలు కోసం వినియోగించారు.

యోగ సాధన

[మార్చు]

కేశవదాసు చిన్నప్పటినుంచే ఆధ్యాత్మిక గోష్టుల పట్ల చాలా శ్రద్ధ చూపే వాడు, ప్రాథమిక విద్య అంతా తండ్రి దగ్గరే పూర్తి చేసుకున్నప్పటికీ, తండ్రి లక్ష్మీనారాయణ దాసు గారి చిన్నతనం లోనే దూరం కావడంతో అన్న వెంకట్రామయ్య దగ్గర పెరిగాడు. వెంకట్రామయ్య ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఉపాసనా విద్యను సాధన చేసే వారు. బ్రహ్మచర్య వ్రతావలంబకులు తమ్ముడు దాసుకు ఉపాసన విద్యను, రామనామ మంత్రాన్నీ ఉపదేశించింది వెంకట్రామయ్య గారే. కానీ తమ్ముడిని తనలా ఆజన్మ బ్రహ్మచారిగా వుండకుండా వివాహమాడి వంశోద్ధరణ చేయమని ఆదేశించారు. హరికథకులు కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామం లోని ఒక యోగి పుంగవులు శ్రీ నాగ దాసు గారి ఆద్యాత్మిక జీవితాన్ని అద్యయనం చేసి వారిపై నాగదాసు గారి గురించి హరికథ కూడా వీరు రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ సమీపంలోని సుజాత నగర్ బస్ స్టేజీ దాటిన తర్వాత వచ్చే కొండగుహలన్నింటినీ తిరిగి అంకమ్మ విగ్రహం చెక్కి కొంతకాలం సాధన చేసారు. దానికి పసుపు గుడ్డ చుట్టి స్టేజికి సమీపంలో ఒ గుడికట్టి అందులో విగ్రహాన్ని స్థాపించారు. అదే అంకమ్మ గుడి అది ఇప్పటికీ ఉంది.

రచనలు

[మార్చు]
Sati Anasooya

ముద్రితాలు

[మార్చు]

ఈ పుస్తకములు ముద్రణకు నోచుకున్నవి కానీ ప్రతులు బొత్తిగా అరుదైపోయినవి స్వల్పంగా అక్కడక్కడా దాచబడిన ప్రతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయవలసి వుంది

  • కేశవ శతకం
  • కనకతార - (1926) నాటకం
  • కనక్తార పాటలు
  • బలి బంధనం - (1935) ఆరు అంకముల నాటకం
  • శ్రీరామ నామామృత గేయము (1922) [4]
  • సీతాకళ్యాణం
  • రుక్మాంగద
  • మేలుకొలుపులు
  • జోలపాటలు
  • సత్యభామా పరిణయం (హరికథ)
  • సీతా కల్యాణం (హరికథ)
  • రుక్మాంగద (హరికథ)
  • నాగదాసు చరిత్ర (హరికథ)
  • శ్రీరామ దండకము
  • పంచరత్నాలు
  • మోతీలాల్ స్మృతి పద్యము
  • శ్రీరామ స్తవ రాజము
  • పండితాభిప్రాయములు (సతి సక్కుబాయి)
  • రాధాకృష్న పాటలు
  • శ్రీకృష్ణ తులాభారము నాటకము లోని కీర్తనలు
  • గాంధీ ప్రశంసా గీతము
  • మోతీలాల్ స్మృతి గీతము
  • సతీ సక్కుభాయి సినిమా పాటలు
  • శ్రీకృష్ణ తులాభారము సినిమా పాటలు
  • సతీ అనసూయ సినిమా రచన
  • ముందుమాటలు (బలిబంధనము, నాగదాసు చరిత్ర, సతీ సక్కుభాయి నాటకం)

అముద్రితాలు

[మార్చు]

ఈ రచనలు రాతప్రతులుగా వేర్వేరు వ్యక్తుల వద్ద అందుబాటులో వున్నవి వీటిని ముద్రణలోకి లేదా కనీసం ఎలక్ట్రానిక్ ప్రతులుగా అందుబాటులోనికి తేలవలసి ఉంది.

  • పంచముఖ ఆంజనేయ దండకము
  • అష్టావధాన పద్యాలు
  • పాపట్ల కాంతయ్య గారి స్మృతి పద్యాలు
  • మంగళహారతులు
  • జోల పాటలు
  • హెచ్చరికలు
  • మేలు కొలుపులు
  • ఇతరమైన పాటలు
  • భక్త ప్రహ్లాద సినిమా పాటలు
  • కనక్తార సినిమా పాటలు,పద్యాలు
  • విరాట పర్వము (హరికథ)

అలభ్యాలు

[మార్చు]

ఆనోట ఈనోట విన్నవి, వివిధ సందర్భాలలో ప్రస్తావించబడినవి అయిన కొన్ని రచనలు తెలియవస్తున్నాయి కానీ వీటిప్రతులను వెదికి సంపాదించి సాహితీలోకానికి అందుబాటులోనికి తీసుకురావలసిన అవసరం ఉంది.

  • వీరరాఘవ శతకము
  • రుక్మాంగద నాటకము
  • పాదుకా పట్టాభిషేకము నాటకము
  • లంకాదహనము నాటకము
  • సతీ తులసి నాటకము
  • సీతాకళ్ళాణ నాటకము పాటలు
  • భక్త అంభరీష హరికథ
  • సీతాకళ్యాణము హరికథ
  • లవకుశ హరికథ
  • లంకాదహనం సినిమా రచన
  • కనక్తార సినిమా రచన
  • దేశమాత దిగులేల దేశభక్తి గీతము

సినిమా పాటలు

[మార్చు]

బిరుదులు

[మార్చు]
  • ఆంధ్రసూత
  • కలియుగ దశరథ
  • నటనా వతంస

అనుయాయులు, శిష్యులు

[మార్చు]

1950-51 లో బేతవోలు వాస్తవ్యులైన ముడుంబై వేంకటాచార్య గారికి కేశవదాసు ఓ హరికథలో పరిచయం అయ్యారు. ఆచార్యులు వైద్యవృత్తిపై తనకున్న ఆసక్తి వలన దాసుగారి కుమారుడు కృష్ణమూర్తి డాక్టరని తెలుసుకుని అతను దగ్గర కాంపౌండర్ గా నాయకన్ గూడెం వచ్చి చేరారు. అతను ఒకనాడు ద్రాక్షరసం అనుకుని హైడ్రో క్లోరైడ్ త్రాగితే అయి విషంగా వికటించింది. దాంతో దాసుగారు స్వయంగా ఖమ్మం వెళుతున్న నైటు హాల్టు బస్సును వెనక్కి మళ్ళించి అతను్ని సూర్యపేట తీసుకు వెళ్ళి మద్రాసు నుంచి ‘ప్రోనట్’ అనే ఇంజక్షన్ తెప్పించి డా.శర్మగారితో వైద్యం చేయించి బ్రతికించారట. ఇద్దరు శిష్యులు తమ పుస్తకాలను దాసు గారివద్ద పరిష్కరింప జేసుకున్నారు వారు. బొర్రా కోటయ్య చౌదరీ అనే మాజీ కస్టమ్స్ అధికారి ‘భారత కర్మాగారము’ అనే సాంఘిక నాటకాన్ని రచించి దాన్ని దాసుగారితో పరిష్కరింప జేసుకున్నారు. దాసుగారి లాగానే దాన్ని రామాంకితం చేసారు. దబ్బాకుపల్లి డా చింతాల సుబ్బారావు రెండవ వారు అతను మాధవ శతకమును పరిష్కరింపజేసుకున్నారు.

వివాదాలు

[మార్చు]

1. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. (పైడిపాల రాసినట్లుగా) 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి... రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్‌లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది.[5]

2. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు. అయితే, మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కాని మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు అతను్ని ఒప్పించారు. భక్తిగీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసుగారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు.[5]

3. సురభి నాటకంలోని మూడు పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ‘ముక్తకంఠం’తో చెప్పిన పెద్దలు గౌరవనీయులు- వారి మాట శిరోధార్యమే. కాని నాటకం నుండి సినిమాకెక్కాయా? సినిమా నుండి నాటకంలోకి దిగినాయా? అనే సందేహానిక్కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే దాసు గారిపై పరిశోదన చేసిన డా॥ఎం. పురుషోత్తమాచార్యులు తండ్రిగారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథాగానంలో ఉండగా హెచ్.ఎం.రెడ్డిగారి నుండి పిలుపు వచ్చిందనీ, తాను వెళ్లి ‘ప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసి వచ్చాననీ దాసుగారు చెప్పినట్లు తెలియజేసారు.[5]

జక్కేపల్లి ఇంటిపై రజాకార్ల దాడి

[మార్చు]

1946లో విసునూరి దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి తన మనుషులతో దొడ్డి కొమురయ్యను చంపించగా మొదటి సాయుధపోరాటం ప్రారంభం అయ్యింది. 1947 లో అప్పటి నైజాం రాష్ట్రం అంతా 8 నిజాం ఉస్మానలీ పాలనలోకి వచ్చింది.అజాద్ హైద్రాబాద్ నినాదంతో అతను ఇత్తేహాద్ ఉల్ ముస్లిమీన్ నాయకుడు కాశిం రజ్వీ నాయకత్వాన ‘రజాకార్’ సైన్యం ఏర్పాటు చేసాడు. చివరకు రజాకార్ దళాల చేతిలో కీలుబొమ్మగా మారి వారినుంచి తన అధికారం కాపాడుకునేందుకు వారిని గ్రామాలపై దోపిడీలకు ఉసిగొల్పాడు. దీన్ని వ్యతిరేఖించిన స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రమహాసభ సంఘలు సమైక్యంగా సత్యాగ్రహపు పోరాటాలకు పిలుపునిచ్చాయి. అదే పిలుపులో భాగంగా రజాకార్ దళాల అకృత్యాలకు నిరసన గళం వినిపించారు దాసుగారు సైతం. ఈ వ్యతిరేఖను సహించలేని రజాకార్లు మరింత సైన్యాన్ని జతచేసుకుని ముమ్మరంగా దాడులను చేయడం మొదలేసింది. అందులో బాగంగానే 1948 జూలైలో రజాకార్లు జక్కేపల్లిలో ప్రవేశించి బీభత్సం సృస్టించారు. కేశవదాసు ఇంటిని దోచుకున్నారు. అతను రచనా సంపద, వస్తు సామగ్రి, ఆస్తిపాస్తులు ధన ధాన్యాలు దోపిడీకి గురయ్యాయి. ఆ సంవత్సరం చివర్లో తన పొలాలను నమ్మకస్తులకు అప్పగించి దాసు గారు కుటుంబంతో సహా జక్కేపల్లి నుంచి ఖమ్మం చేరారు. కానీ కృష్ణమూర్తి గారి వైద్య వృత్తి సాధనకు ఖమ్మం కంటే ఏదైనా గ్రామీణ ప్రాంతం బావుంటుందని ఓ రెండేళ్ళ అనుభవంలో గ్రహించి 1950లో నాయకన్ గూడెం చేరారు.

మరణం

[మార్చు]

సినిమాలకు దూరమైన తరువాత కలకత్తా నుండి తిరిగివచ్చి జక్కేపల్లిలో హరికథలు చెప్పనారంభించారు. కాని సినిమా రంగంలోకి వెళ్లి రావడం వల్ల అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇంతలో తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపు దాల్చుకున్నది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో హైదరాబాదు సంస్థానాన్ని కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌ వచ్చింది. నిజాం పాలనలో దోపిడీపీడనలకు వ్యతిరేకంఆ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల్ని అణచి వేయడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించాడు నిజాం నవాబు. ఆ రజాకార్లు జక్కేపల్లిలో కేశవదాసు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ దాడిలో అతను ఆస్తిపాస్తులు, ధనమే గాక అంతకన్న విలువైన అతను సాహిత్య సంపద కూడా నాశనమైనది. ఆ తరువాత జక్కేపల్లి నుండి ఖమ్మంకి తన మకాంను మార్చారాయన. ఇది జరిగింది 1948 చివరి నాటికి. అటు నుండి కొడుకు కృష్ణమూర్తి వైద్య వృత్తి నిమిత్తం వారి కాపురం 1950లో నాయకన్‌గూడెంకు మారింది. కేశవదాసు గారు చివరి రోజులను నాయకన్‌ గూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న అంటే దుర్ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు చివరి శ్వాస విడిచారు.[3]

చివరిగా తమ్మర దర్శనం

[మార్చు]

1956 ఏప్రిల్ లో మనసుకి ఊరటకావాలంటే గతంలో వెళ్ళినట్లే తమ్మర సీతారామచంద్రుని దర్శనం కోసం వెళ్ళారట. కానీ మునుపటి ఉత్సాహం వారిలో లేదు ఎందు కంటే అక్కడ ఎప్పటిలా తన చిన్ననాటి స్నేహితులు నరసింహాచార్యులు, హనుమచ్ఛాస్త్రి, పాపట్ల లక్ష్మీకాంతయ్య మొదలైన వారు కనిపించలేదు. వారు అప్పటికే పరమపదించారు. అంతా శూన్యంగా అనిపిస్తుంటే అలా గోడకు చేరగిల పడి అప్పటి దేవాలయ ధర్మకర్తలలో ఒకరైన నారపరాజు నారాయణ రావు గారితో నిర్వేదంగా అంపశయ్యమీద స్వయం మరణాన్ని కోరుకున్న భీష్ముడిలా ఇలా అన్నారట. ఇప్పటికే 80, 90 ఏళ్ళు వచ్చేశాయి. నేను తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు గతించి పోయారు. చేయాల్సిన చేయగల పనులన్నీ భగవంతుడి దయమేరకు కుదిరినంతా చక్కబెట్టేశాను. పిల్లలను పెంచి ప్రయోజకులను చేసాను. ఇహ ఉండి ఎందుకు ఒక్కణ్ణి ఏకాకిని ప్రయాణానికి సిద్దమవుతాను అన్నారట తమ్మరనుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉపాసనాధ్యాన లక్షణాలు మరింతగా పెరిగాయట, ఆహార తీసుకోవడం బాగా తగ్గించారట. ఎప్పటిలాగానే మే 14న రామనామ స్మరణతో నిద్రలేచిన దాసుగారు స్నానాదికాలు ముగించుకుని నిలువు నామాలు పెట్టుకుని ఆరోజు కొడుకు కృష్ణమూర్తిని ఎక్కడికీ వెళ్ళవద్దని ఆదేశించారట. నవ్వకముఖంతో ప్రశాంతమైన వదనంతో ఇంట్లోవారందరినీ, ఇంటినీ ఒకసారి కలియజూసి కన్నులు మూసుకుని ధ్యానంలోకి జారిపోయారట. అలా ధ్యానం చూస్తుండగానే దీర్ఘ నిద్రయై వారికి ఇష్టమైన తమ్మర రామునిలో లీనంమై పోయిందని కుటుంబ సభ్యులు కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. సహజకవి చందాల కేశవదాసు పేరు తో నమస్తే తెలంగాణ వ్యాసం[1] Archived 2016-06-25 at the Wayback Machine
  2. "మన వెండి వెలుగులు - నమస్తే తెలంగాణా". Archived from the original on 2016-03-05. Retrieved 2013-06-20.
  3. 3.0 3.1 తెలంగాణ మ్యాగజైన్. "పరబ్రహ్మ! పరమేశ్వర!! గీతకర్త". magazine.telangana.gov.in. Retrieved 20 June 2017.
  4. ఆర్కీవు.కాంలో శ్రీరామ నామామృతం పూర్తిగేయం.
  5. 5.0 5.1 5.2 సాక్షి పత్రికలో పురుషోత్తమాచార్యులు గారి వ్యాసం

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: