Jump to content

ప్లాసీ యుద్ధం

అక్షాంశ రేఖాంశాలు: 23°48′N 88°15′E / 23.80°N 88.25°E / 23.80; 88.25
వికీపీడియా నుండి
ప్లాసీ యుద్ధం
ఏడు సంవత్సరాల యుద్ధంలో భాగము

"ప్లాసీ యుద్ధం తరువాత మీర్ జాఫరు రాబర్టు క్లైవుల సమావేశం" - కాన్వాస్ పై ఆయిల్ చిత్రం . ఫ్రాన్సిస్ హేమన్ (1762)
తేదీ1757 జూన్ 23
ప్రదేశంపలాషి, బెంగాల్ సుబా
23°48′N 88°15′E / 23.80°N 88.25°E / 23.80; 88.25
ఫలితంఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయాత్మక విజయం సాధించింది
రాజ్యసంబంధమైన
మార్పులు
బెంగాల్ ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకుంది
ప్రత్యర్థులు
ఇంగ్లాండు * బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీమొగలు సామ్రాజ్యము
* బెంగాలు రాజ్యం
*ఫ్రాన్స్
సేనాపతులు, నాయకులు
Kingdom of Great Britain కర్నల్ రాబర్టు క్లైవు
* మేజర్ కీల్పాట్రిక్
* మేజర్ గ్రాంట్
* మేజర్ ఐరీ కూట్
* కెప్టెన్ గాప్
నవాబ్ సిరాజుద్దౌలా
* మోహన్ లాల్
* మీర్ మదాన్ ఖాన్
* మీర్ జాఫరు (ఫిరాయింపుదారు)
* యార్ లుతూఫ్ ఖాన్('ఫిరాయింపుదారు')
* రాయ్ దుర్లభ్ (ఫిరాయింపుదారు) Kingdom of France సిన్ఫ్రే
బలం
1,750 ఇంగ్లీషు సైనికులు
100 టోపాసులు
2,100 భారత సిపాయీలు
100 గన్నర్లు
8 శతఘ్నులు 2 హొవిట్జర్లు
మొగలు సామ్రాజ్యం:సిరాజుద్దౌలా యొక్క
7,000 కాల్బలం
5,000 అశ్శ్వికులు
మీర్ జాఫరు యొక్క 35,000 కాల్బలం
15,000 అశ్వికులు
53 శతఘ్నులు
ఫ్రాన్స్:
50 శతఘ్ని దళం (6 శతఘ్నులు)
ప్రాణ నష్టం, నష్టాలు
22 మరణం
50 క్షతగాత్రులు
500 మృతులు, క్షతగాత్రాలు
A map of the Indian subcontinent depicting the European settlements in India in the period from 1501 to 1739
భారత్‌లో ఐరోపా వలసలు -1501 నుండి 1739 వరకు

ప్లాసీ యుద్ధం, బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రుల కూటమిపై నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం. 1757 జూన్ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారత్ అంతటా విస్తరించింది.

యుద్ధం బెంగాల్లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కి.మీ. దూరంలో, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఈస్టిండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రత్యర్థులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషువారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. రాబర్టు క్లైవు, నవాబు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపీ, తన పక్షానికి తిప్పుకున్నాడు. ప్లాసీ యుద్ధంలో క్లైవు, బెంగాలు నవాబును ఓడించి కలకత్తాను స్వాధీనపరచుకున్నాడు.[1]

ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, ఫోర్ట్ విలియంలో చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. బ్రిటిషు వారు రాబర్టు క్లైవు నాయకత్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవు ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్‌నగర్ కోటను వశపరచుకున్నాడు.[2] బ్రిటిషువారికీ, సిరాజుద్దౌలాకూ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు ప్లాసీ యుద్ధానికి దారితీసాయి. సంఖ్యపరంగా సిరాజుద్దౌలా సైన్యం, బ్రిటిషు సైన్యం కంటే చాలా ఎక్కువ. ఈ విషయమై ఆందోళన చెందిన క్లైవు, మీర్ జాఫరు, యార్ లుతూఫ్ ఖాన్, ఓమిచంద్, రాయ్ దుర్లభ్, జగత్ సేఠ్‌లతో కలిసి కుట్రపన్నాడు. దాని ప్రకారం వీళ్ళంతా యుద్ధభూమికి తమ సైన్యాలతో వచ్చినప్పటికీ, యుద్ధంలో పాల్గొనలేదు. ఫలితంగా 18,000 మందితో కూడిన సిరాజుద్దౌలా సైన్యం, కేవలం 3,000 క్లైవు సైన్యం చేతిలో పరాజయం పొందింది. యుద్ధం కేవలం 40 నిముషాల్లో ముగిసిపోయింది.

సామ్రాజ్యవాదులు భారత్‌ను ఆక్రమించుకోవడంలో ఈ యుద్ధం కీలకమైనదిగా భావిస్తారు. దీనితో బ్రిటిషువారికి బెంగాలు నవాబుపై అధిపత్యం కలిగింది. తద్వారా తమకు జరిగిన యుద్ధ, వ్యాపార నష్టాలకు పరిహారంగా అతడి నుండి ఎన్నో రాయితీలను పొందారు. ఈ సొమ్మును తమ సైనిక శక్తిని పెంపొందించుకునేందుకు, తమ ఐరోపా ప్రత్యర్థులను దక్షిణాసియా నుండి వెళ్ళగొట్టి, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకూ వాడుకున్నారు.

నేపథ్యం

ఈస్టిండియా కంపెనీకి భారత్‌లో మూడు ప్రధాన స్థావరాలున్నాయి -మద్రాసులోని ఫోర్టు సెంట్ జార్జి, కలకత్తాలో ఫోర్ట్ విలియం, బొంబాయిలో బాంబే కోట. ఈ మూడూ స్వతంత్ర ప్రెసిడెన్సీలు, మూడింటికీ విడిగా ప్రెసిడెంటు, కౌన్సిలూ ఉంటుంది. వీరిని ఇంగ్లాండులోని డైరెక్టర్ల కోర్టు నియమిస్తుంది. స్థానిక రాజులు, నవాబులతో చేతులు కలిపి తిరుగుబాటు దారుల నుండి, విప్లవకారుల నుండి వాళ్ళకు రక్షణ కల్పించే విధానాన్ని బ్రిటిషు వాళ్ళు అవలంబించారు. దీనికి ప్రతిగా నవాబులు వాళ్లకు అనేక రాయితీలు కల్పించారు. అప్పటికి ఈస్టిండియా కంపెనీకి, డచ్చి, పోర్చుగీసు వాళ్లకూ మధ్య వైరం సమసిపోయింది. ఫ్రెంచి వాళ్ళు కూడా 14 వ లూయీ నేతృత్వంలో తమ స్వంత ఈస్టిండియా కంపెనీని స్థాపించి బెంగాల్లోని చందర్‌నగర్, పాండిచ్చేరిల్లో తమ స్థావరాలను నెలకొల్పుకున్నారు. ఈ రెండూ కూడా పాండిచ్చేరి ప్రెసిడెన్సీ పాలనలో ఉండేవి. ఫ్రెంచి వాళ్ళు భారత్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, త్వరగా స్థిరపడిపోయి, బ్రిటన్ను మించిపోయే స్థాయికి చేరుకున్నారు.[3][4]

కర్నాటిక్ యుద్ధాలు

మొగలు సామ్రాజ్యానికి చెందిన బెంగాలు నవాబు ఆలివర్ది ఖాన్ ఐరోపా వ్యాపారుల పట్ల కఠిన వైఖరి అవలంబించేవాడు.

ఆస్ట్రియా యుద్ధం (1740 – 1748) తరువాత బ్రిటను, ఫ్రాన్స్ మధ్య భారత్‌లో సైనిక ఆధిపత్యం కోసం, రాజకీయ జోక్యం కోసం ఆధిపత్య పోరు మొదలైంది. 1746 సెప్టెంబరులో ఫ్రెంచి సేనాని మాహె డి లా బోర్దోన్నా, నౌకా సైన్యంతో మద్రాసు తీరం చేరి నగరాన్ని ముట్టడించాడు. మూడు రోజుల యుద్ధం తరువాత మద్రాసు లొంగిపోయింది. లొంగుబాటులో భాగంగా, బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ అతడికి నగదు చెల్లించాలనే ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ గవర్నరు జనరలు, డూప్లే ఒప్పుకోలేదు. అక్టోబరులో బోర్దోన్నా భారత్‌ను వదలిపెట్టి వెళ్ళిపోగానే, డూప్లే ఆ ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ మొహమ్మద్ ఖాన్ బ్రిటిషు వారికి మద్దతుగా కలగజేసుకున్నాడు. రెండు సైన్యాలు కలిసి, మద్రాసును తిరిగి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాయి. సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఈ సంయుక్త బలగాలు, ఫ్రెంచి వారి ముందు నిలవలేకపోయాయి. మద్రాసు ఓటమికి ప్రతీకారంగా బ్రిటిషు వారు మేజర్ లారెన్స్, అడ్మిరల్ బొస్కావెన్‌ల నాయకత్వంలో పాండిచ్చేరిని ముట్టడించాయి. కానీ 31 రోజుల తరువాత ముట్టడిని ఎత్తివేయాల్సి వచ్చింది. 1748 లో కుదిరిన ఐ లా చాపెల్ ఒడంబడికకు అనుగుణంగా డూప్లే మద్రాసును బ్రిటిషు వారికి తిరిగి ఇచ్చివేసాడు.[3][5]

ఐ లా చాపెల్ ఒడంబడిక రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలను నివారించినప్పటికీ, ఇరు దేశాలూ స్థానిక రాజులతో జతకట్టి ప్రచ్ఛన్న యుద్ధాలకు తెరదీసాయి. దక్కను నిజాము, దాని సామంత కర్నాటక రాజ్య నవాబుల వారసత్వ పోరులో డూప్లే కలగజేసుకున్నాడు. ఆ రెండు పదవులకూ బ్రిటిషు ఫ్రెంచి వారు తమ తమ అభ్యర్థులను ప్రకటించారు. రెండు చోట్లా డూప్లే అభ్యర్థులు మాయోపాయాలతోటీ, రెండు హత్యలతోటీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1751 మధ్య నాటికి, నవాబు స్థానానికి ఫ్రెంచి అభ్యర్థి ఐన చందా సాహిబ్, బ్రిటిషు అభ్యర్థి మొహమ్మద్ ఆలీ స్థావరమైన తిరుచినాపల్లిని ముట్టడించాడు. అతడికి ఫ్రెంచి సేనాని చార్లెస్ మార్క్ దే బుస్సీ సాయం చేసాడు.[3][5]

1751 సెప్టెంబరు 1 న 280 ఐరోపా సైనికులు 300 మంది సిపాయీలు కెప్టెన్ రాబర్టు క్లైవు నాయకత్వంలో కర్నాటిక్ రాజధాని ఆర్కాటును ఆక్రమించుకున్నారు. చందా సాహిబ్ తన సైన్యంలో కొంత భాగాన్ని ఇక్కడికి పంపిస్తాడని, అప్పుడు తిరుచినాపల్లిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చనీ వారు భావించారు. చందా సాహిబ్ రజా సాహిబ్ నేతృత్వంలో 4,000 మంది భారతీయులు, 150 మంది ఫ్రెంచి వారు ఉన్న సైన్యాన్ని పంపించాడు. వారు కోటను కొన్ని వారాల పాటు ముట్టడించి, కొన్ని చోట్ల గోడలను పగలగొట్టారు. క్లైవు, మురారి రావు ఘోర్పడే అనే మరాఠా సేనానికి వర్తమానం పంపించాడు. మరాఠాలు రావడం ఖాయమని తెలిసిన రజా సాహిబ్, పెద్ద మొత్తంలో నగదు ఇస్తాను లొంగిపొమ్మని క్లైవుకు కబురు పంపాడు. క్లైవు ఒప్పుకోలేదు. నవంబరు 24 ఉదయాన రజా సాహిబ్, కోటపై చివరి దాడి చేసాడు. కానీ బ్రిటిషు తుపాకుల దాడికి అతడి ఏనుగులు చెల్లాచెదురవడంతో అది విఫలమైంది. కోట రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళేందుకు అనేక విఫలయత్నాలు చేసారు. మరుసటి రోజు రజా సాహిబ్ దళాలు ముట్టడిని ఎత్తేసి, తమ ఆయుధాలు అక్కడే వదిలేసి, పారిపోయాయి. ఆర్కాటు, కాంచీవరం, తిరుచినాపల్లిలలో విజయాల తరువాత, బ్రిటిషు వారు కర్నాటిక్‌ను స్వాధీనపరచుకుని కొత్త ఫ్రెంచి గవర్నరు, గొదేహూతో కుదిరిన ఒప్పందం ప్రకారం ముహమ్మద్ ఆలీని నవాబు చేసారు.[6][7]

ఆలీవర్ది ఖాన్ ముర్షిదాబాదును ముట్టడించి పట్టుకున్నాడు. అతడు బెంగాలు నవాబయ్యాడు. అతడు బెంగాల్లోని ఐరోపా దేశీయుల పట్ల కఠినంగా ఉండేవాడని ప్రతీతి. మరాఠాలతో అతడు యుద్ధాలు చేస్తున్న సమయంలో అతడు ఐరోపా వారి దుర్గాలను బలోపేతం చేసుకునేందుకు అనుమతించాడు. అలాగే మరాఠా కందకాన్ని తవ్వేందుకు బ్రిటిషు వారికి అనుమతినిచ్చాడు. మరోవైపు తన యుద్ధాల ఖర్చుల కోసం వారి నుండి అధిక మొత్తాల్లో ధనం వసూలు చేసాడు. 

దక్షిణ భారతంలో బ్రిటిషు, ఫ్రెంచి వారు స్థానిక పాలకులను అడ్డుపెట్టుకుని చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధాల గురించి అతడికి బాగానే తెలుసు. ఆ పరిస్థితి తన రాజ్యంలో రాకూడదని అతడు ఐరోపా దేశీయులతో జాగ్రత్తగా వ్యవహరించేవాడు. అయితే, వారి మధ్య నిరంతరం స్పర్థ ఉండేది; ఫరూఖ్‌ సియార్ 1717 లో తమకు జారీ చేసిన ఫర్మానాను అనుభవించనీయడంలేదని బ్రిటిషు వారు అతడిపై తరచూ ఆరోపించేవారు. నవాబు కొలువులోని వారిని మాత్రం బ్రిటిషు వారు జాగ్రత్తగా చూసుకునేవారు. స్థానిక వ్యాపారులను పన్ను లేకుండా వ్యాపారం చేసుకోనిచ్చేవారు. తమ ప్రాంతాలకు వచ్చే వస్తువులపై పన్నులు బాగా విధించేవారు. ఇవన్నీ నవాబు ఆదాయానికి గండికొట్టాయి.

1756 లో ఆలీవర్ది ఖాన్ మరణించాక అతడి మనవడు సిరాజుద్దౌలా పరిపాలన కొచ్చాడు. అతడు తీవ్రమైన కోపిష్టి అనీ, విషయ గ్రహణ శక్తి తక్కువనీ ప్రతీతి. ఐరోపా కంపెనీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయని అతడికి అనుమానంగా ఉండేది. బ్రిటిషు, ఫ్రెంచి వారు తమ స్థావరాలను బలోపేతం చేసుకుంటుండగా అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు కాబట్టి, వాటిని వెంటనే ఆపెయ్యమని అతడు ఆదేశించాడు. బ్రిటిషు వారు అందుకు తిరస్కరించినపుడు, నవాబు 3,000 మందితో కాసింబజారు వెళ్ళి కోటను, కర్మాగారాన్నీ ఆక్రమించి, అనేకమంది బ్రిటిషు అధికారులను బందీలుగా పట్టుకున్నాడు. అక్కడినుండి కలకత్తాపై దాడికి వెళ్ళాడు. కలకత్తాలో ఫోర్ట్ విలియంకు రక్షణ బలహీనంగా, ఆసలే లేనట్టుగా ఉంది. కోటలో ఉన్న 180 మంది సైనికులు, 50 మంది ఐరోపా వాసులు, 60 మంది ఐరోపా సైనికులు, 150 మంది ఆర్మేనియా, పోర్చుగీసు సైనికులు, 35 మంది ఐరోపా శతఘ్నిదళం, 40 మంది నావికులూ కలిసి నవాబు 50,000 మంది సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సిరాజ్ జూన్ 16 న నగరాన్ని, 20 వ తేదీన కోటనూ ఆక్రమించు కున్నాడు. బందీలను తన అధికారులకు అప్పగించి, ఫోర్టు విలియం కోటలోని చీకటిగదిలో బంధించాడు. దాన్ని బ్లాక్ హోల్ అనే వారు. 5.5 మీ పొడవు, 4.3 మీ వెడల్పూ కలిగిన ఈ చీకటిగదికి రెండు చిన్న కిటికీలుండేవి. ఆరుగురు ఖైదీలను ఉంచేందుకు బ్రిటిషువారు కట్టిన ఆ గదిలో 146 మంది బందీలను కుక్కారు. జూన్ 21 ఉదయం గదిని తెరిచినపుడు 146 మందికు గానూ 23 మంది మాత్రమే బయటికి వచ్చారు. మిగతా వారు ఊపిరాడక, వేడికీ, పిచ్చితోటీ మరణించారు. వారిని బంధించిన పరిస్థితుల గురించి నవాబుకు తెలిసినట్లుగా ఆధారాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, నవాబు సైన్యం కలకత్తా నగరాన్ని, బ్రిటిషు కర్మాగారాలనూ  దోచుకున్నారు.

కలకత్తా ఆక్రమణ కబురు 1756 ఆగస్టు 16 నాటికి మద్రాసులో తెలిసింది. కౌన్సిల్ వెంటనే కలనల్ క్లైవ్, అడ్మిరల్ వాట్సన్ నాయకత్వంలో ముందస్తు బలగాన్ని పంపింది. ఫోర్ట్ సెంట్ జార్జి కౌన్సిల్ ఇచ్చిన ఉత్తరంలో ఇలా ఉంది, "ఈ యాత్ర ఉద్దేశం కేవలం బెంగాల్లోని స్థావరాలను పునరుద్ధరించడమే కాదు, కంపెనీ హక్కులను గుర్తింపజేసి, జరిగిన నష్టానికి పరిహారాన్ని వసూలు చెయ్యడం కూడా" -అదీ యుద్ధం అవసరం లేకుండా. నవాబు ఉద్యోగులు, అనుచరులలో అసంతృప్తి ఏమైనా ఉంటే దాన్ని ఉసిగొలపాలి.[8] అని కూడా రాసారు. క్లైవు 900 మంది ఐరోపా సైనికులు, 1500 మంది సిపాయీలు ఉన్న పదాతి దళాన్ని నడపగా, వాట్సన్ నావికా దళానికి నేతృత్వం వహించాడు. ఈ సైన్యం డిసెంబరులో హుగ్లీ నదిని చేరుకుంది. అక్కడ ఫుల్టా గ్రామం వద్ద పరారీలో ఉన్న తమ వారిని కలిసారు. వారిలో కౌన్సిల్ సభ్యులు కూడా ఉన్నారు. కౌన్సిల్ సభ్యులు దిశను చూపిస్తూండగా, సైన్యం డిసెంబరు 29 న బడ్జ్ బడ్జ్ కోటను స్వాధీనం చేసుకుంది. వాళ్ళు మరింత ముందుకు వెళ్ళి, 1757 జనవరి 2 న కలకత్తా కోటపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. 500 మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు.[9] కలకత్తాను స్వాధీనపరచుకున్నాక, కౌన్సిల్‌ను పునస్థాపించి, ఇక నవాబును ఏం చెయ్యలనే విషయంపై ప్రణాళిక రచించారు. ఫోర్ట్ విలియం ను పటిష్ఠ పరచి, నగరానికి ఈశాన్యాన రక్షణ చర్యలు చేపట్టారు.[10][11][12]

బెంగాల్ దండయాత్ర

A oil-on-canvas portrait of Robert Clive painted by Nathaniel Dance in 1773. The portrait shows Clive wearing the Order of the Bath with a battle in progress behind him, probably intended to be Plassey
రాబర్ట్ క్లైవు (1773), నథానియెల్ డాంస్ - హాలండ్

1757 జనవరి 9 న కెప్టెన్ కూట్, మేజర్ కీల్పాట్రిక్ నాయకత్వంలో 650 మందితో కూడిన సైన్యం కలకత్తాకు 37 కి.మీ. దూరంలో ఉన్న హుగ్లీ పట్టణాన్ని ముట్టడించి ఆక్రమించింది. ఈ సంగతి తెలిసిన నవాబు, సైన్యాన్ని సన్నద్ధం చేసుకుని కలకత్తాకు ప్రయాణ మయ్యాడు. ఫిబ్రవరి 3 న సైన్యంలోని ప్రధాన భాగంతో చేరుకుని మరాఠా కందకం వద్ద విడిది చేసాడు. తన ప్రధాన స్థావరాన్ని ఓమిచంద్ తోటలో స్థాపించాడు. అతడి సైన్యంలోని ఒక చిన్న భాగం పట్టణ ఉత్తర పొలిమేరల్లో దాడి చేసింది. లెఫ్టెనెంట్ లెబేమ్ నాయకత్వంలోని సైన్యం వీరిని ఓడించి, 50 మందిని ఖైదీలుగా పట్టుకుంది.[13][14][15][16][17]

ఫిబ్రవరి 4 ఉదయాన నవాబు శిబిరంపై మెరుపుదాడి చెయ్యాలని క్లైవు నిర్ణయించాడు. అర్ధరాత్రి 600 మంది నావికులు, 650 మంది ఐరోపా సైనికులు, 100 మంది శతఘ్ని దళం, 800 మంది సిపాయీలు, 6 ఆరు-పౌండ్ల గన్నర్లు నవాబు శిబిరాన్ని సమీపించాయి. ఉదయం 6 గంటలకు, దట్టమైన మంచు మాటున ఈ గస్తీ దళానికి నవాబు గస్తీ దళం ఎదురుపడింది, వాళ్ళు తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయారు. దళం మరికొంత ముందుకు వెళ్ళి, ఓమిచంద్ తోటను సమీపించారు. అప్పుడు వారికి అశ్విక దళపు డెక్కల చప్పుడు వినిపించింది. అశ్వికులు 27 మీ దూరంలోకి వచ్చాక, బ్రిటిషు దళం వారిపై కాల్పులు మొదలుపెట్టింది. చాలా మంది మరణించగా మిగిలినవారు చెల్లాచెదురయ్యారు. మంచు కారణంగా నడక దూరానికి మించి దారి కనబడలేదు. దానితో దళం నడక మెల్లగా సాగింది. కాల్బలం, శతఘ్ని దళం అప్పుడప్పుడు రెండువైపులా కాల్పులు జరుపుతూ పోయింది. తోట దక్షిణాన ఉన్న సన్నటి ఎత్తైన దారిలో వెళ్ళి తోటలోని నవాబు శిబిరంపై దాడి చెయ్యాలని క్లైవు భావించాడు. నవాబు సైన్యం ఆ దారికి అడ్డు పెట్టింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో మంచు తెరలు తొలగడం మొదలైంది. అప్పుడు మరాఠా కందకం ఆవలి వైపు నుండి నవాబు శతఘ్ని దళం ప్రయోగించిన గుళ్ళ దాడికి బ్రిటిషు దళాలు చెల్లా చెదురయ్యాయి.

నవాబు సైన్యం ఓ మైలు దూరంలో ఉన్న వంతెన ద్వారా కందకాన్ని దాటి, కలకత్తా చేరుకుంది. క్లైవు సైన్యంలో 57 మరణించగా, 137 మంది గాయపడ్డారు. నవాబు సైన్యం 22 మంది అధికారురతో సహా, 600 మంది సైనికులు, 4 ఏనుగులు, 500 గుర్రాలు, కొన్ని ఒంటెలను, ఎన్నో ఎద్దులనూ కోల్పోయింది. ఈ దాడితో నవాబు భయపడిపోయి, ఫిబ్రవరి 9 న కంపెనీతో ఆలీనగర్ ఒడంబడిక చేసుకున్నాడు. దాని ప్రకారం, కంపెనీ తన కర్మాగారాలను పునర్నిర్మించుకోవడం, కలకత్తాను బలోపేతం చేసుకోవడం, గత హక్కులను పునస్థాపించుకోవడం చేసుకోవచ్చు. నవాబు తన సైన్యాన్ని తిరిగి రాజధాని ముర్షిదాబాదుకు తరలించాడు.[18][19][20][21][22]

బుస్సీ బెంగాలుపై చూపిస్తున్న శ్రద్ధపైన, ఐరోపాలోని ఏడు సంవత్సరాల యుద్ధంపైనా ఆందోళన చెందిన కంపెనీ, బెంగాల్లో ఫ్రెంచి ముప్పుపై దృష్టి సారించింది. కలకత్తాకు 32 కి.మీ. దూరంలో ఉన్న ఫ్రెంచి పట్టణం చందర్‌నగర్‌ను ఆక్రమించేందుకు క్లైవు ప్రణాళిక వేసాడు. దాడి చేస్తే నవాబు ఎవరి పక్షం వహిస్తాడో క్లైవు తెలుసుకో గోరాడు. నవాబు సూటిగా సమాధానం చెప్పలేదు. క్లైవ్ దీన్ని తనకు అనుకూలంగా భావించాడు. మార్చి 14 న పట్టణంపై, కోటపైనా క్లైవ్ దాడి మొదలు పెట్టాడు. కోటకు వెళ్ళే దారుల్లో ఫ్రెంచి వారు కాపు కాసారు. అక్కడకు వచ్చే నదీ పాయ ద్వారా సైనికులు రాకుండా అనేక పడవలను ముంచేసారు. కోటలో 600 మంది ఐరోపా సైనికులు, 300 మంది సిపాయీలు ఉన్నారు. హుగ్లీ నుండి నవాబు సైన్యం తమకు సాయం చేస్తుందని ఫ్రెంచి వారు అనుకున్నారు. కానీ హుగ్లీ గవర్నరు నందకుమార్‌ను లంచంతో లోబరచుకుని, నవాబు సైన్యం చందర్‌నగర్ చేరకుండా నిరోధించారు. కోట మంచి రక్షణలో ఉంది. కానీ మార్చి 23న అడ్మిరల్ వాట్సన్ తన బలగంతో నదీ పాయ ద్వారా ముట్టడించినపుడు, తీరంలో ఉన్న మరో రెండు దళాల సాయంతో ఎడతెగకుండా తుపాకీ యుద్ధం చేసారు. కోటనుండి జరిపిన మస్కెట్ తుపాకీ కాల్పుల కారణంగా నౌకా దళానికి తీవ్ర నష్టం జరిగింది. మార్చి 24 న ఉదయం 9 గంటలకు ఫ్రెంచి వారు యుద్ధం విరమించి తెల్ల జెండా ఎగురవేసారు. సాయంత్రం 3 గంటలకు లొంగుబాటు పూర్తైంది. చందర్‌నగర్‌ను దోచుకున్నాక క్లైవు, మద్రాసుకు తిరిగి రమ్మని తనకు వచ్చిన ఆదేశాలను ధిక్కరించి బెంగాల్లోనే ఉండిపోయేందుకు నిర్ణయించుకున్నాడు. హుగ్లీ పట్టణానికి ఉత్తరానికి తన సైన్యాన్ని తరలించాడు.

బెంగాల్లో కంపెనీ విస్తరించేందుకు మొగలు చక్రవర్తి ఆలంఘీర్-2 అనుమతి ఇవ్వలేదని సిరాజ్ నమ్మాడు.

కుట్ర

చందర్‌నగర్‌పై దాడి గురించి తెలిసిన నవాబు ఆగ్రహించాడు. బ్రిటిషు వారిపై గతంలో అతడికి ఉన్న వ్యతిరేకత తిరిగి వచ్చింది. బ్రిటిషు వారి శత్రువులతో తాను చేతులు కలిపి బలపడాలని అతడు అనుకున్నాడు. ఉత్తరం నుండి అహ్మద్ షా దుర్ర్రానీ నాయకత్వంలో ఆఫ్ఘనుల నుండి, పశ్చిమం నుండి మరాఠాల నుండీ, నవాబుకు దాడుల భయం ఉంది. ఈ కారణంగా అతడు తన సైన్యం మొత్తాన్నీ బ్రిటిషు వారిపై మోహరించలేడు. బ్రిటిషు వారికీ నవాబుకూ మధ్యేమో అవిశ్వాసం పేరుకుపోయింది. ఫలితంగా, కాసింబజారులోని ఫ్రెంచి కర్మాగారం అధికారి జీన్ లా తోటి, డి బుస్సీ తోటీ రహస్యంగా చర్చలు మొదలుపెట్టాడు. రాయ్ దుర్లభ్ నాయకత్వంలో నవాబు పెద్ద సైన్యాన్ని ముర్షిదాబాదుకు 48 కి.మీ. దూరంలో ఉన్న ప్లాసీ వద్దకు తరలించాడు.[20][23][24][25]

నవాబు దర్బారులోనే అతడిపై అసంతృప్తి వ్యాపించి ఉంది. సిరాజ్ పాలనలో ధనవంతులైన సేఠ్‌లు తమ సంపద భద్రత పట్ల కలత చెందుతూ ఉండేవారు. ఆలీవర్ది పాలనలో అలా ఉండేది కాదు. వాళ్ళు తమ రక్షణ కోసం యార్ లుతూఫ్ ఖాన్‌ను నియమించుకున్నారు.[26] సిరాజ్‌ను కూలదోసేందుకు దర్బారులో జరుగుతున్న కుట్ర గురించి దర్బారులో కంపెనీ ప్రతినిధి విలియమ్ వాట్స్, క్లైవుకు చెప్పాడు. కుట్రలో మీర్ జాఫర్, రాయ్ దుర్లభ్, యార్ లుతూఫ్ ఖాన్, ఓమిచంద్, అనేక మంది సైనికాధికారులూ ఉన్నారు.[27] మీర్ జాఫర్ సంప్రదించిన విషయాన్ని, క్లైవ్ కలకత్తాలోని సెలెక్ట్ కమిటీకి మే 1 న చెప్పాడు. కమిటీ దానికి మద్దతు ఇచ్చేందుకు ఆమోదించింది. బ్రిటిషు వారితో చేతులు కలిపి నవాబును కూలదోసాక, మీర్ జాఫర్‌ను నవాబు చేసేందుకూ, అందుకు ప్రతిగా అతడు బ్రిటిషు వారికి సొమ్మును ఇచ్చేందుకూ వారి మధ్య ఒప్పందం కుదిరింది. మే 2 న, క్లైవు తన శిబిరాన్ని ఎత్తేసి, సగం సైన్యాన్ని కలకత్తాకు, మిగతా సగాన్ని చందర్‌నగర్‌కూ పంపించాడు.[28][29][30][31]

తమకూ బ్రిటిషు వారికీ మధ్య కుదిరిన ఒప్పందం ఓమిచంద్ కు చెప్పకుండా దాచి ఉంఛాలని మీర్ జాఫరు, సేఠ్‌లు భావించారు. కానీ ఆ సంగతి తెలుసుకున్న ఓమిచంద్, తన వాటాను 30 లక్షల రూపాయలకు పెంచకపోతే కుట్రను నవాబుకు చెప్పేస్తానని బెదిరించాడు. ఇది తెలుసుకున్న క్లైవు ఒక ఉపాయం ఆలోచించాడు. రెండు ఒడంబడికలు కుదుర్చుకోవాలి – ఓమిచంద్ ప్రస్తావనే లేని అసలు ఒప్పందం తెల్ల కాగితంపైనా, ఓమిచంద్ కోరుకున్న ఒప్పందం ఎర్ర కాగితంపైన. కమిటీ సభ్యులంతా రెండు ఒప్పందాలపైన సంతకం పెట్టారు, అడ్మిరల్ వాట్సన్ తప్ప. అతడు అసలు ఒప్పందం (తెల్ల కాగితం) మీద మాత్రమే సంతకం పెట్టాడు. రెండవ ఒప్పందం మీద అతడి సంతకాన్ని ఫోర్జరీ చేసారు.[32] జూన్ 4 న మీర్ జాఫరు రెండు ఒప్పందాల పైనా సంతకం పెట్టాడు.[33][34][35][36]

భారత్‌లో తన ప్రవర్తనపై జరిగిన ఇంగ్లండు పార్లమెంటరీ దర్యాప్తుకు హాజరైన క్లైవు తనను సమర్ధించుకుంటూ ఇలా చెప్పాడు:

నవాబు తనకు విశ్వాసపత్రుడైన సేవకుడుగా భావించే ఓమిచంద్, నవాబుపై దాడి చేసేందుకు ఇంగ్లీషు వారికి, డుప్రీ కీ మధ్య కుదిరిన ఒప్పందం గురించి చెప్పి, ఆ వార్త చెప్పినందుకు గాను నాలుగు లక్షల రూపాయల బహుమతి నవాబు నుండి పొందాడు. ఈ వ్యక్తిపై నవాబుకు అత్యంత విశ్వాసం ఉందని గ్రహించి, మేం తలపెట్టిన విప్లవానికి అతడే చోదకుడని భావించాం. అందుచేత మా అవసరార్థం మేము అతడి డిమాండ్లను అంగీకరిస్తామని ఒప్పందం చేసుకున్నాం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక, అనుకున్న రోజు రాగానే ఓమిచంద్, నవాబు దర్బారులో ఉన్న వాట్స్‌తో 30 లక్షల రూపాయలూ, నవాబు దగ్గర దొరికే సంపదలో ఐదు శాతమూ ఇవ్వాలని డిమాండు చేసాడు. తన డిమాండును వెంటనే ఒప్పుకోకపోతే, విషయం మొత్తాన్నీ నవాబుకు చెప్పేసి, తెల్లవారేసరికి వాట్స్‌దీ, మరో ఇద్దరు ఇంగ్లీషు వాళ్ళవీ తలలు తెగ్గోయించేస్తానని కూడా అతడు వాట్స్‌కు చెప్పాడు. వాట్స్ హుటాహుటిన ఆ సమాచారాన్ని నాకు పంపించాడు. వాళ్ళను రక్షించుకుని, అనుకున్న పనిని నెరవేర్చుకోడానికి నేను పన్నాగం పన్నడంలో వెనకాడలేదు. దీనికోసం మేం మరొక ఒడంబడిక కుదుర్చుకున్నాం. ఒకటి "రెడ్" అని పిలవగా రెండోదాన్ని"వైట్" ఒడంబండిక అని అన్నాం. ఈ ఒడంబడికపై అడ్మిరల్ వాట్సన్ తప్ప అందరం సంతకం పెట్టాం; నేను అతడితో మాట్లాడిన దాన్ని బట్టి, అతడి పేరును కూడా దానిలో పెట్టేందుకు అవసరమైనంత అధికారం నాకుందని అనుకున్నాను. అడ్మిరల్ వాట్సన్ పేరుపై సంతకం పెట్టిన వ్యక్తికి సంబంధించినంత వరకూ, ఆ సంతకం అతడి సమక్షంలో పెట్టాడా లేదా అనేది నేను చెప్పలేనుగానీ, ఆ పని చేసేందుకు తనకు సరిపడా అధికారం ఉందని మాత్రం అతడు భావించాడని తెలుసు. ఈ ఒడంబడికను వెంటనే ఓమిచంద్‌కు పంపించాం. అతడు మా పన్నాగాన్ని అనుమానించలేదు. సంఘటన అనుకున్న ప్రకారం విజయవంతంగా జరిగింది; కంపెనీ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నపుడు, ప్రజల ప్రాణాలు కచ్చితంగా పోయే స్థితిలో ఉన్నపుడు, ఆ విలన్ను మోసగించడం సరైన విధానమేననీ, అది న్యాయమేననీ ఈ సభ అంగీకరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.[37][38]

దాడికి సన్నాహాలు

జూన్ 12 న, మేజర్ కీల్పాట్రిక్ కలకత్త్తా నుండి సైన్యంతో వచ్చి చందర్‌నగర్‌లో క్లైవుతో కలిసాడు. సంయుక్త సైన్యంలో 613 మంది ఐరోపా సైనికులు, 8 శతఘ్నులు, 2 హొవిట్జర్లతో 171 మంది శతఘ్ని దళం, 91 టొపాసులు, 2100 మంది సిపాయీలు, 150 మంది నావికులూ ఉన్నారు.[39][40] జూన్ 13 న సైన్యం ముర్షిదాబాదుకు పయనమయింది. భారతీయ సైనికులు ఒడ్డుపై నడుస్తూండగా, ఐరోపా సైన్యం మందుగుండు సామాగ్రి, సరుకులతో 200 పడవలపై ప్రయాణించింది. జూన్ 14 న, క్లైవ్ సిరాజ్‌కు యుద్ధ ప్రకటన పంపించాడు. మీర్ జాఫర్ బ్రిటిషు వారితో చేతులు కలిపాడని అనుమానించిన సిరాజ్, జూన్ 15 న అతడి ఇంటిపై దాడి చేసి, యుద్ధభూమిలో బ్రిటిషు వారితో చేతులు కలపనని అతడి నుండి మాట తీసుకున్నాడు.[41] తరువాత తన సైన్యం మొత్తాన్నీ ప్లాసీ వెళ్ళేందుకు ఆదేశాలు ఇచ్చాడు. కానీ తమకు బాకీ ఉన్న జీతాలను పూర్తిగా చెల్లించే వరకూ నగరాన్ని వీడి వెళ్ళమని సైనికులు భీష్మించారు. ఈ ఆలస్యం కారణంగా జూన్ 21 కి గానీ అతడి సైన్యం ప్లాసీ చేరుకోలేకపోయింది.[42][43][44][45]

జూన్ 16 నాటికి బ్రిటిషు సైన్యం పాల్టీ చేరుకుంది. అక్కడికి 19 కి.మీ. ఉత్తరాన వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న కట్వా పట్టణం, కోట ఉన్నాయి. కోటలో అపారమైన ధాన్యం, మందుగుండు సామాగ్రి నిల్వలూ ఉన్నాయి. దాని చుట్టూ అజి నది ప్రవహిస్తోంది. జూన్ 17 న క్లైవు ఆ కోటను స్వాధీనం చేసుకునేందుకు 200 మంది ఐరోపా సైనికులు, 500 మంది సిపాయీలు ఒక శతఘ్ని, ఒక హొవిట్జరుతో మేజర్ కూట్‌ను పంపించాడు. ఆ దళం అర్థరాత్రి అక్కడికి చేరుకునే సరికి, పట్టణం నిర్మానుష్యంగా ఉంది. 19 ఉదయమే మేజర్ కూట్ వెనక్కు, నది ఒడ్డుకు వెళ్ళి, తెల్ల జెండా ఊపాడు. అయితే అతడికి తుపాకి పేలుడు, గవర్నరు ధిక్కారమూ స్వాగతం చెప్పాయి. కూట్ తన దళాన్ని రెండు భాగాలు చేసాడు; సిపాయీలు నదిని దాటి, కోట బురుజులపై కాల్పులు జరపగా, ఐరోపా సైనికులు కోటకు ఇంకా ముందుకు వెళ్ళి నదిని దాటారు. కోటలోని సైనికులు ఈ దళాలను చూడగానే తమ కాపలా స్థలాలను వదలిపెట్టి ఉత్తరానికి పరారయ్యారు. ఈ విజయం గురించి తెలుసుకున్న క్లైవ్ తన మిగతా సైన్యంతో కలిసి జూన్ 19 సాయంత్రానికి కట్వా చేరుకున్నాడు.[44][46][47]

ఆ సమయంలో క్లైవు ఒక సందిగ్ధంలో పడ్డాడు. ఓ వైపు నవాబు మీర్ జాఫర్‌తో రాజీ కుదుర్చుకుని అతణ్ణి సైన్యంలో ఒక పార్శ్వంలో నాయకుడిగా నియమించాడు. మరోవైపు క్లైవుతో తాను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నడుచుకుంటానని మీర్ జాఫరు తనకు వర్తమానం పంపాడు. జూన్ 21 న క్లైవ్ యుద్ధ మండలి సమావేశం పెట్టి సమస్యను నివేదించాడు. అప్పుడున్న పరిస్థితులలో వేరే సాయమేమీ లేకుండా సైన్యం వెంటనే నదిని దాటి నవాబుపై దాడి చెయ్యాలా, లేక కత్వాలో స్థావరాన్ని పటిష్ఠపరచుకుని, మరాఠాలు లేదా ఇతర భారతీయ పాలకుల సాయం అందే వరకు వేచిచూడాలా అనేది అతడు వారిముందు ఉంచిన ప్రశ్న. హాజరైన 20 మందిలో క్లైవుతో సహా 13 మంది వేచి చూడాలని భావించగా, మిగిలిన వారు వెంటనే దాడి చెయ్యాలని చెప్పారు. ఓ గంట చర్చల తరువాత, జూన్ 22 ఉదయాన భాగీరథి నదిని (హుగ్లీ) దాటాలని క్లైవు సైన్యాన్ని ఆదేశించాడు.[48][49][50][51][52]

జూన్ 23 అర్థరాత్రి 1 గంటకు, ప్లాసీ గ్రామం దాపున తమ గమ్యానికి చేరుకున్నారు. అక్కడున్న లక్షా బాగ్ అనే మామిడితోటను ఆక్రమించుకున్నారు. అది 730 మీ పొడవు, 270 మీ వెడల్పుతో, చుట్టూ కందకంతో, మట్టి గోడతో ఉంది. భాగీరథి నదికి కొంత కోణంలో పొడవుగా అది వ్యాపింంచి ఉంది. తోటకు కొద్దిగా ఉత్తరాన, నది ఒడ్డున, చుట్టూ మట్టి ప్రహరీ గోడతో వేటబంగళా ఒకటి ఉంది. క్లైవు ఆ బంగళాను ఆక్రమించుకుని తన నివాసంగా మార్చుకున్నాడు.

ఆ తోట నవాబు గుడారాల నుండి ఒక మైలు దూరంలో ఉంది. క్లైవు సైన్యం కంటే 26 గంటల ముందు నవాబు సైన్యం అక్కడ విడిది చేసింది. జీన్ లా సారథ్యంలో ఫ్రెంచి దళం రెండు రోజుల్లో ప్లాసీకి రానుంది. నవాబు సైన్యం 180 మీ పొడవున నదికి లంబంగా సాగి, ఆ తరువాత ఈశాన్యానికి తిరిగి 4.8 కి.మీ. ల దూరం పాటు తీర్చి ఉంది. ఆ మలుపు వద్ద ఒక రక్షక బురుజును, శతఘ్నితో సహా అమర్చారు. ఈ బురుజుకు తూర్పున 270 మీ దూరంలో చెట్లతో కూడిన ఒక గుట్ట ఉంది. బ్రిటిషు సైన్యం దిక్కుగా 730 మీ దూరంలో ఒక చిన్న చెరువు, 91 మీ దక్షిణాన ఒక పెద్ద చెరువూ ఉన్నాయి. రెంటి చుట్టూ, పెద్ద మట్టి కట్టలున్నాయి.[53][54][55][56]

సైన్యాల మోహరింపు

ఆంగ్లో భారత సైన్యం (ఈస్టిండియా కంపెనీ)
దళం నాయకుడు
సర్వ సైన్యాధిపతి కలనల్ రాబర్ట్ క్లైవ్
మొదటి దళం  మేజర్ జేమ్స్ కీల్పాట్రిక్
రెండవ దళం మేజర్ అలెగ్జాండర్ గ్రాంట్
మూడవ దళం మేజర్ కూట్
నాలుగవ దళం మేజర్ జార్జ్ ఫ్రెడరిక్ గువా
సిపాయీలు 2100
శతఘ్నులు లెఫ్టెనెంట్ హేటర్ కెప్టెన్ విలియం జెన్నింగ్స్ 150 (100 సైనికులు, 50 నావికులు)

6 శతఘ్నులు, 2 హొవిట్జర్లు


బెంగాలు సైన్యం
దళం సారథి ఆయుధాలు
సర్వ సైన్యాధిపతి సిరాజుద్దౌలా
పదాతి దళం మీర్ మదన్ మోహన్ లాల్ 5,000 అశ్వికులు

7,000 కాల్బలం

ఎడమ పార్శ్వం మీర్ జాఫర్ 15,000 అశ్వికులు

35,000 కాల్బలం

మధ్య యార్ లుతూఫ్ ఖాన్
కుడి పార్శ్వం రాయ్ దుర్లభ్
శతఘ్ని దళం 53 శతఘ్నులు
ఫ్రెంచి శతఘ్ని దళం సెంట్ ఫ్రేస్ 50 శతఘ్ని దళం, 

6 శతఘ్నులు

యుద్ధం

A plan depicting the positions and movements of the opposing armies in the Battle of Plassey
బెంగాలు నవాబుకు, కలనల్ రాబర్టు క్లైవుకూ మధ్య 1757 జూన్ 23 న జరిగిన ప్లాసీ యుద్ధం యుద్ధభూమి చిత్రం.

జూన్ 23 తెల్లవారుఝామునే నవాబు సైన్యం శిబిరాన్ని వీడి, తోట వైపు సాగింది. అతడి సైన్యంలో 30,000 కాల్బలం, 20,000 అశ్విక దళం, 300 శతఘ్నులూ ఉన్నాయి. సెంట్ ఫ్రైస్ నాయకత్వంలో 50 మంది ఫ్రెంచి సైనికులు శతఘ్నులతో సహా ఉన్నారు. ఫ్రెంచి వారు పెద్ద చెరువు వద్ద 4 చిన్న శతఘ్నులతో మోహరించారు. రెండు పెద్ద శతఘ్నులు ముందుకు వెళ్ళి తోటకు మైలు దూరంలో మోహరించాయి. వారి వెనక మీర్ మదాన్ ఖాన్, మోహన్ లాల్ నాయకత్వంలో 5,000 అశ్వికులు, 7,000 కాల్బలం మోహరించింది. 45,000 మంది సైన్యం చిన్న గుట్ట నుండి తోట దక్షిణ కొన వైపుగా అర్ధ చంద్రాకారంలో, క్లైవు సైన్యాన్ని చుట్టూరా ముట్టడించేలా మోహరించింది. వారి సైన్యపు కుడి పార్శ్వానికి రాయ్ దుర్లభ్, మధ్య యార్ లుతూఫ్ ఖాన్, బ్రిటిషు సైన్యానికి దగ్గరగా ఉన్న ఎడమ భాగానికి మీర్ జాఫరు నేతృత్వం వహించారు.[57][58][59]

వేట బంగళా పై నుండి క్లైవు, మీర్ జాఫర్ నుండి వార్తను ఆశిస్తూ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. అతడు తన సైన్యాన్ని తోట నుండి ముందుకు వెళ్ళి, పెద్ద చెరువు వద్ద మోహరించమని ఆదేశాలిచ్చాడు. అతడి సైన్యంలో 750 మంది ఐరోపా కాల్బలం, 100 టోపాసులు, 2100 మంది సిపాయీలు[39] 100 మందితో శతఘ్ని దళం, 50 మంది నావికులూ ఉన్నారు. శతఘ్ని దళంలో 8 శతఘ్నులు, 2 హొవిట్జర్లూ ఉన్నాయి. ఐరోపా సైనికులు, టొపాసులు మధ్యలో ఉండగా, సిపాయీలు రెండు వైపులా సమానంగా మోహరించారు. రెండు శతఘ్నులు, రెండు హొవిట్జర్లను సైన్యానికి ఎడమ వైపు, 180 మీ దూరంలో ఇటుక బట్టీల వెనుక ఫ్రెంచి శతఘ్నులను ఎదుర్కొనేందుకుగాను ఉంచాడు.[60][61][62]

యుద్ధం మొదలైంది

నవాబు సైన్యపు చిత్రమిది. ఆరడుగుల ఎత్తైన బండిపై శతఘ్నులు, దాని గుళ్ళు, మందుగుండు సామాగ్రి, వాటిని ప్రయోగించే సైనికులు ఉంటారు. ఈ ఈ బళ్ళను 40 50 బలిష్టమైన ఎద్దులు లాగేవి. ఈ ఎద్దులు పూర్ణియా ప్రాంతంలో పెంచినవి. ప్రతీ బండి వెనకా ఒక ఏనుగు కూడా నడుస్తూ ఉండేది, గతుకుల్లో, గుంటల్లో బండిని తోసేందుకు.

ఉదయం 8 గంటలకు, పెద్ద చెరువు వద్ద మోహరించిన ఫ్రెంచి శతఘ్ని దళం మొదటి కాల్పు జరిపింది. ఒక సైనికుడు చనిపోగా, ఒకతను గాయపడ్డాడు. దీన్ని సంకేతంగా తీసుకుని, నవాబు శతఘ్ని దళం ఉధృతంగా కాల్పులు జరిపింది. బ్రిటిషు వారి శతఘ్నులు ఫ్రెంచి వారిని ఎదుర్కోగా, వారి సైన్యం నవాబు శతఘ్నులను ఎదుర్కొంది. బ్రిటిషు వారి తుపాకి కాల్పులు నవాబు శతఘ్నులను ఆపలేకపోయాయి. అరగంటలో బ్రిటిషు సైన్యం 10 మంది ఐరోపా సైనికులను, 20 మంది సిపాయీలనూ కోల్పోయింది. శతఘ్ని దళాన్ని ఇటుక బట్టీల వద్దే వదిలి, మిగతా సైనికులను వెనక్కి, తోటలోకి వచ్చేయమని క్లైవు ఆదేశించాడు. అక్కడున్న రక్షణ కారణంగా నష్టం జరగడం తగ్గింది.[63][64][65]

మీర్ మదాన్ ఖాన్ మరణం

ఆ తరువాత మూడు గంటల పాటు యుద్ధంలో పెద్దగా పురోగతి లేదు. రెండు పక్షాలూ ఎక్కడివారు అక్కడే ఉన్నారు. క్లైవు తన బృందంతో సమావేశమై తదుపరి చర్యలపై సమాలోచనలు జరిపాడు. చీకటి పడేవరకు ఇలాగే కొనసాగించి, అర్థరాత్రి వేళ నవాబు శిబిరంపై దాడి చెయ్యాలని నిర్ణయించారు. సమావేశం పూర్తైన కొద్ది సేపటికే భారీ వర్షం కురిసింది. బ్రిటిషు వారు తమ మందు గుండు సామాగ్రిపై టార్పాలిన్లు కప్పారు. నవాబు సైన్యం ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో వారి మందుపొడి తడిసిపోయి సరిగ్గా పేలలేదు. వర్షం కారణంగా బ్రిటిషు వారి తుపాకులు సరిగ్గా పనిచెయ్యవని భావించిన మీర్ మదాన్ ఖాన్ వర్షం తగ్గగానే తన దళాన్ని బ్రిటిషు వారిపై దూకించాడు. అయితే బ్రిటిషు వారు అతడిపై గుళ్ళ వర్షం కురిపించడంతో అతడు హతుడయ్యాడు. అతడి సైన్యం వెనక్కి తగ్గింది.[66][67][68][69]

కాల్పులు జరుగుతున్నంత సేపు సిరాజ్ తన శిబిరంలోనే సేవకులు, అధికారుల మధ్య ఉన్నాడు. విజయం తమదేనని వారు అతడికి చెబుతూ ఉన్నారు. మీర్ మదాన్ మరణం గురించి వినగానే అతడు బాగా కలత చెందాడు. మీర్ జాఫర్‌తో రాజీకొచ్చాడు. తన పాగాను నేలకు విసిరి కొట్టి, దాన్ని కాపాడమని అతణ్ణి బ్రతిమిలాడాడు. సరేనని ఒప్పుకున్న మీర్ జాఫర్ వెంటనే క్లైవుకు దాడి చెయ్యమని వర్తమానం పంపాడు. మీర్ జాఫర్ నవాబు శిబిరం నుండి బయటకు వెళ్ళాక, రాయ్ దుర్లభ్ నవాబును యుద్ధాన్ని వీడి ముర్షిదాబాదుకు వెళ్ళిపొమ్మని, యుద్ధాన్ని సేనానులకు వదిలిపెట్టమనీ సలహా ఇచ్చాడు. సిరాజ్ ఆ సలహాను అనుసరించి, సైన్యాన్ని రక్షణ స్థావరానికి వచ్చెయ్యమని మోహన్ లాల్‌ను ఆదేశించి, ఒంటెనెక్కి, 2000 మంది సైన్యంతో ముర్షిదాబాదు ప్రయాణమయ్యాడు[70][71][72][73]

యుద్ధభూమి విన్యాసాలు

A soldier of the 39th Regiment of Foot stands with his rifle (c. 1742)
బ్రిటిషు 39 వ రెజిమెంటుకు చెందిన కాల్బల సైనికుడు (1742)
ప్లాసీ యుద్ధంలో బ్రిటిషు శతఘ్నులు

మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నవాబు సైన్యం శతఘ్ని కాల్పులు ఆపి, తమ రక్షణ స్థావరాల వైపు వెనుదిరిగింది. సెంట్ ఫ్రైస్‌కు చెందిన శతఘ్ని దళం ఒంటరై పోయింది. సెంట్ ఫ్రైస్ మోహరించి ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుంటే, వెనుదిరిగిపోతున్న నవాబు సైన్యంపై శతఘ్ని కాల్పులు జరపవచ్చని మేజర్ కీల్పాట్రిక్ గమనించాడు. ఈ సంగతిని విశ్రాంతి తీసుకుంటున్న క్లైవుకు వర్తమానం పంపించి, తాను రెండు కంపెనీల సైన్యంతో, రెండు శతఘ్నులతో సెంట్ ఫ్రైస్ స్థావరం వైపు సాగాడు. ఈ వార్త విన్న క్లైవ్ వెంటనే యుద్ధ భూమికి వెళ్ళి, తన ఆదేశాలు లేకుండా ముందుకు వెళ్ళడంపై కీల్పాట్రిక్‌ను మందలించాడు. తోటలోనుండి మిగతా సైన్యాన్ని ముందుకు రమ్మని ఆదేశించి, తానే స్వయంగా సెంట్ ఫ్రైస్‌పై దాడికి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాన్ని ఆక్రమించుకున్నాడు. ఫ్రెంచి దళం తమ రక్షణ స్థావరానికి వెనుదిరిగింది.[73][74][75][76]

బ్రిటిషు సైన్యం పెద్ద చెరువు వైపు సాగుతూండగా, నవాబు సైన్యంలోని ఎడమ పార్శ్వం మిగతా సైన్యం వెనక తచ్చాడుతూండడం కనబడింది. ఆ దళం తోటకు ఉత్తర కొనకు చేరగానే అది ఎడమ పక్కకు తిరిగి తోటవైపుకు కదిలింది. ఆ దళం మీర్ జాఫరుదని తెలియని క్లైవ్, అది తమ సరుకు, సరంజామాపై దాడి చేసేందుకు వెళ్తోందని భావించి, కెప్టెన్ గ్రాంట్, లెఫ్టెనెంట్ రంబోల్డ్ నాయకత్వంలో మూడు ప్లటూన్ల సైన్యాన్ని, ఒక శతఘ్నినీ వారిపైకి పంపించాడు. శతఘ్ని కాల్పులతో ఆ దళం ముందుకు సాగడం ఆగిపోయింది. మిగతా నవాబు దళాల నుండి విడిపోయిన ఆ దళం అక్కడే ఉండిపోయింది.[77][78][79]

ఇదిలా ఉండగా బ్రిటిషు శతఘ్నులు పెద్దచెరువు కట్టపై నుండి నవాబు శిబిరంపై కాల్పులు మొదలుపెట్టాయి. దాంతో నవాబు సైన్యాలు, శతఘ్నులు తమ కందకాల నుండి బయటికి రావడం మొదలుపెట్టాయి. క్లైవు తన సైన్యంలో సగాన్ని చిన్న చెరువు వద్దకు, మిగతా సగాన్ని అక్కడికి 180 మీ దూరంలో ఉన్న ఎత్తైన స్థలానికీ చేర్చి, నవాబు సైన్యంపై మరింత సూటిగా కాల్పులు జరిపాడు. దాంతో నవాబు సైన్యాలు తికమక పడ్డాయి. నవాబు సైన్యాలు బురుజుకు గుట్ట వైపున ఉన్న గుంటలు, గోతులు, పొదలు మొదలైనవాటి మాటున ఉండి తుపాకీ కాల్పులు సాగించగా, సెంట్ ఫ్రైస్ శతఘ్నులు బురుజు పైనుండి కాల్పులు కొనసాగించాయి. అశ్విక దళాల దాడిని కూడా బ్రిటిషు శతఘ్ని దళాలు తిప్పికొట్టాయి. అయితే బ్రిటిషు సైన్యానికి జరిగిన ప్రాణనష్టంలో అత్యధిక భాగం ఈ దశలోనే జరిగింది.[80][81][82]

ఆ సమయానికి, ఆ దళం మీర్ జాఫరుదని గ్రహించిన క్లైవు, తిరిగి ఆ తాత్కాలిక బురుజును, దానికి తూర్పున ఉన్న గుట్టనూ ఆక్రమించు కోవడంపై దృష్టి సారించాడు. తన సైన్యాన్ని మూడు భాగాలు చేసి, ఏక కాలంలో బురుజు, గుట్టలపై ముక్కోణపు దాడి చేసాడు. సాయంత్రం4:30 కి మేజర్ కూట్ శత్రువును పారదోలి, గుట్టను పట్టుకున్నాడు. కూట్ కందకం మీదుగా పారిపోయేవారి వెంటబడ్డాడు. సెట్ ఫ్రైస్ ను పారదోలి బురుజును కూడా పట్టుకున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా, శత్రువు దాగిన కందకాన్ని, శిబిరాన్నీ బ్రిటిషు వారు స్వాధీన పరచుకున్నారు. బ్రిటిషు సైన్యం ముందుకు సాగి, రాత్రి 8 గంటల కల్లా దౌడ్‌పూర్ దాటి 9.7 కి.మీ. దూరాన విడిది చేసింది.[83][84][85]

బ్రిటిషు సైన్యం 22 మందిని కోల్పోయింది. 50 మంది గాయపడ్డారు. నవాబు సైన్యం ఆఫీసర్లతో కలిపి 500 మందిని కోల్పోయి ఉంటుందని క్లైవ్ అంచనా వేసాడు.[86]

పర్యవసానాలు

తాను వచ్చి కలుస్తానని మీర్ జాఫరు నుండి క్లైవుకు 23 సాయంత్రం వర్తమానం అందింది. తరువాతి రోజు ఉదయాన దౌడ్‌పూర్‌లో కలుద్దామని అతడు సమాధానం పంపాడు. ఆ ఉదయం మీర్ జాఫరు బ్రిటిషు శిబిరానికి వచ్చినపుడు క్లైవ్ అతణ్ణి ఆలింగనం చేసుకుని, బెంగాలు, బీహారు, ఒడీషా నవాబుగా అతణ్ణి సంబోధించి ప్రణామం చేసాడు. అతడు మీర్ జాఫరును వెంటనే ముర్షిదాబాదుకు వెళ్ళి, సిరాజ్‌ తప్పించుకోకుండా అడ్డుకుని, అతడి సంపదను కొల్లగొట్టాలని సలహా ఇచ్చాడు. జూన్ 24 సాయంత్రం మీర్ జాఫరు ససైన్యంగా ముర్షిదాబాదు చేరుకున్నాడు. క్లైవు, తన ప్రాణానికి ప్రమాదముందన్న నేపథ్యంలో, 200 మంది ఐరోపా సైనికులు, 300 మంది సిపాయీలను తీసుకుని జూన్ 29 న ముర్షిదాబాదు చేరుకున్నాడు. మీర్ జాఫరు, అతడి ఉద్యోగులూ క్లైవును స్వాగతించారు. మీర్ జాఫరును నవాబుగా గుర్తించి, అతణ్ణి సింహాసనంపై కూచోబెట్టి, అతడికి బంగారు రూపాయల పళ్ళేన్ని బహూకరించాడు.[87][88]

జూన్ 23 అర్ధరాత్రికి సిరాజుద్దౌలా ముర్షిదాబాదు చేరుకున్నాడు. తన అనుయాయులతో జరిపిన సమావేశంలో కొందరు బ్రిటిషు వారికి లొంగిపొమ్మని చెప్పగా, కొందరు యుద్ధాన్ని కొనసాగించమని చెప్పారు. జూన్ 24 రాత్రి పది గంటలకు సిరాజ్ తన భార్యతో, విలువైన నగలను తీసుకుని మారువేషంలో ఒక పడవలో తప్పించుకుని ఉత్తర దిశగా పారిపోయాడు. జీన్ లా సాయంతో పాట్నా చేరుకోవాలని అతడి ఉద్దేశం. జూన్ 24 అర్ధరాత్రి అతణ్ణి పట్టుకోవడానికి మీర్ జాఫరు అనేక బృందాలను పంపించాడు. జూలై 2 నాటికి సిరాజ్ రాజమహల్ చేరుకుని అక్కడ ఒక నిర్జనమైన తోటలో తలదాచుకున్నాడు. సిరాజ్ గతంలో బంధించి, శిక్షించిన ఒక వ్యక్తి అతణ్ణి గుర్తించి, ఆ సమాచారాన్ని స్థానిక సైన్యాధికారి యైన మీర్ జాఫరు సోదరుడికి అందించాడు.

మీర్ జాఫరును సిరాజ్‌ను ఏం చెయ్యాలో తేల్చలేక, అతణ్ణి తన కుమారుడు మిరాన్‌కు అప్పగించాడు. మిరాన్ సిరాజ్‌ను ఆ అర్ధరాత్రి హత్య చేయించాడు. అతడి దేహాన్ని ముర్షిదాబాదు వీధుల్లో ఊరేగించి, మరుసటి ఉదయాన ఆలివర్ది ఖాన్ సమాధి వద్ద సమాధి చేయించారు.[89][90][91]

బ్రిటిషు వారికి మీర్ జాఫరుకూ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, మరాఠా కందకం వరకు, ఆ పైన 550 మీ తరువాత వరకూ ఉన్న భూభాగాన్ని వారు పొందారు. కలకత్తాకు, సముద్రానికీ మధ్య ఉన్న భూభాగంపై కూడా జమీందారీ హక్కులు పొందారు. 1717 ఫర్మానాను ధ్రువీకరించడమే కాకుండా, బ్రిటిషు వారికి జరిగిన నష్టానికి గాను 2 కోట్ల 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. అయితే సిరాజ్ సంపద ఈ పరిహారం కంటే బాగా తక్కువని తేలడంతో, సేఠ్‌లు, రాయ్ దుర్లభ్‌లతో ఒక సమావేశం జరిగింది. అందులో సగం - రెండొంతులు నాణేలుగాను, ఒక వంతు నగల రూపంలోనూ -వెంటనే ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశం ముగిసేసరికి, ఒప్పందం ప్రకారం తనకు వచ్చేది ఏమీ లేదని తెలిసిన ఓమిచంద్‌కు మతి చలించింది.[92][93]

ప్రభావాలు

రాజకీయంగా

ప్లాసీ యుద్ధం తరువాత ఫ్రెంచి వారు బెంగాల్లో అనామకులైపోయారు. 1759 లో బ్రిటిషు వారు మచిలీపట్నంలో ఫ్రెంచి వారిని ఓడించి, ఉత్తర సర్కారులను స్వాధీనపరచుకున్నారు. 1759 నాటికి, బ్రిటిషు వారికి సామంతుడిగా ఉండడం తానిక సహించలేనని మీర్ జాఫరు భావించాడు. బెంగాలు నుండి బ్రిటిషు వారిని వెళ్ళగొట్టమని డచ్చి వారిని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. 1759 చివర్లో, డచ్చి వారు బ్రిటిషు వారితో వైరమేమీ లేనప్పటికీ, 7 పెద్ద ఓడల్లో, 1400 మంది సైన్యాన్ని జావా నుండి బెంగాలుకు పంపించారు. బెంగాల్లోని తమ చిన్సురా స్థావరాన్ని బలోపేతం చెయ్యడం పైకి చెప్పిన కారణం. కానీ క్లైవు వెంటనే ముందస్తు చర్యలు తీసుకుని తానే వారిపై దాడికి వెళ్ళి, 1759 నవంబరు 25 న చిన్సురా యుద్ధంలో డచ్చి వారిని ఓడించాడు. ఆ తరువాత మీర్ జాఫరును తొలగించి మీర్ ఖాసిమ్‌ను బెంగాలు నవాబుగా నియమించారు. ఇక బెంగాల్లో బ్రిటిషు వారే తిరుగులేని ఐరోపా శక్తి. క్లైవు ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళాక, అతడిని లార్డ్ బిరుదుతో, బారన్ ఆఫ్ ప్లాసీ అని గౌరవించి, హౌస్ ఆఫ్ కామన్స్ లో సభ్యత్వం కూడా ఇచ్చారు..[94][95]

దక్కను హైదరాబాదుల్లోని ఆర్కాటు, వండివాష్, తంజావూరు, కడలూరు వంటి సంస్థానాల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. 1761 లో పాండిచ్చేరిలో కలనల్ ఐరీ కూట్ నేతృత్వంలో బ్రిటిషు వారు ఫ్రెంచి కోటను స్వాధీనపరచుకున్నారు. 1763 లో పారిస్ ఒడంబడిక తరువాత ఫ్రెంచి వారు పాండిచ్చేరి తిరిగి వచ్చినప్పటికీ, వారు భారత్‌లో తమ పూర్వవైభవాన్ని పొందలేకపోయారు. తరువాతి కాలంలో బ్రిటిషువారు భారత ఉపఖండ పాలకులుగా ఉద్భవించారు.[96][97]

ఆర్థికంగా

ప్లాసీ యుద్ధం తరువాత భారత్‌లో అనేక ప్రాంతాల్లో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వారి కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇది పన్ను వసూళ్ళ పేరిట కంపెనీ వారి అకృత్యాలకు, దౌర్జన్యాలకు దారితీసింది.[98]

ఇది భారత్ ఆర్థిక వ్యవస్థపై బ్రిటిషు వారి విచ్చలవిడి దోపిడీకి దారితీసింది. 1985 లో సిమ్మన్స్, క్లింగింగ్‌స్మిత్, విలియమ్‌సన్ చేసిన పరిశోధనలో ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 1750 లో 24.5%గా ఉన్న భారత వాటా 1880 నాటికి కేవలం 2.8% కి పడిపోయిందని తేలింది. అది 1913 లో 1.4% కి, 1938 నాటికి 2.4%కి పడిపోయింది.[99]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Robins, Nick.
  2. Naravane, M.S. (2014).
  3. 3.0 3.1 3.2 Harrington, p. 9
  4. Mahon, p. 304
  5. 5.0 5.1 Mahon, pp. 307–311
  6. Mahon, pp. 317–326
  7. Harrington, pp. 11–16
  8. Bengal, v.1, pp. cxxiii–cxxiv
  9. Bengal, v.1, pp. cxxxi–cxxxii
  10. Harrington, p. 23
  11. Mahon, pp. 333–334
  12. Malleson, pp. 45–46
  13. Bengal, v.1, p. cxliv
  14. Orme, pp. 126–128
  15. Harrington, p. 24
  16. Malleson, p. 46
  17. Mahon, p. 334
  18. Bengal, v.1, pp. cxlvi–cxlvii
  19. Mahon, pp. 334–336
  20. 20.0 20.1 Harrington, p. 25
  21. Malleson, pp. 46–47
  22. Orme, pp. 131–136
  23. Mahon, p. 337
  24. Orme, p. 145
  25. Malleson, pp. 48–49
  26. Bengal, v.1, p. clxxxi
  27. Bengal, v.1, pp. clxxxiii–clxxxiv
  28. Malleson, pp. 49–51
  29. Harrington, pp. 25–29
  30. Mahon, pp. 338–339
  31. Orme, pp. 147–149
  32. Bengal, v.1, pp. clxxxvi–clxxxix
  33. Orme, pp. 150–161
  34. Harrington, p. 29
  35. Mahon, pp. 339–341
  36. Bengal, v.1, pp. cxcii–cxciii
  37. Cobbett, William; Hansard, Thomas Curson; Parliament, Great Britain; Parliament, Scotland (1813). The Parliamentary history of England from the earliest period to the year 1803, Volume 17. p. 876.
  38. The gentleman's magazine, and historical chronicle, Volume 43. 1773. pp. 630–631.
  39. 39.0 39.1 Encyclopaedia of Dalits in India: Movements
  40. "Full text of "Moving millions [microform], the pageant of modern India"". archive.org.
  41. Bengal, v.1, p. cxciii
  42. Malleson, pp. 51–52
  43. Orme, pp. 163–169
  44. 44.0 44.1 Harrington, p. 52
  45. Mahon, p. 341
  46. Orme, p. 168
  47. Bengal, v.1, p. cxcvi
  48. Malleson, p. 54
  49. Harrington, p. 53
  50. Orme, p. 170
  51. Mahon, pp. 342–343
  52. Bengal, v.1, pp. cxcvii–cxcviii
  53. Orme, pp. 172–173
  54. Harrington, pp. 54–55
  55. Malleson, pp. 57–59
  56. Mahon, p. 343
  57. Orme, p. 173
  58. Malleson, p. 59
  59. Harrington, pp. 56–58
  60. Orme, p. 174
  61. Malleson, p. 60
  62. Harrington, pp. 58–61
  63. Orme, pp. 174–175
  64. Harrington, pp. 61–65
  65. Malleson, pp. 60–61
  66. Orme, p. 175
  67. Malleson, pp. 61–62
  68. Harrington, pp. 66–68
  69. Mahon, pp. 343–344
  70. Orme, pp. 175–177
  71. Harrington, pp. 68–69
  72. Malleson, pp. 62–63
  73. 73.0 73.1 Mahon, p. 344
  74. Harrington, p. 70
  75. Malleson, pp. 63–65
  76. Orme, pp. 175–176
  77. Orme, p. 176
  78. Malleson, p. 65
  79. Harrington, p. 75
  80. Harrington, pp. 75–76
  81. Orme, pp. 176–177
  82. Malleson, pp. 66–67
  83. Harrington, p. 77
  84. Malleson, p. 67
  85. Orme, pp. 177–178
  86. Harrington, pp. 81–82
  87. Harrington, pp. 83–4
  88. Orme, pp. 178–81
  89. Harrington, p. 84.
  90. Orme, pp. 183–84
  91. Mahon, pp. 346–47
  92. Orme, pp. 180–82
  93. Mahon, pp. 347–48
  94. Mahon, pp. 349–352
  95. Harrington, p. 85
  96. Harrington, pp. 85–88
  97. Mahon, pp. 353–363
  98. Simmons, Collin (1987).
  99. Clingingsmith, David; Williamson, Jeffrey (2005).

ఇతర వనరులు