బురఖా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టర్కీలోని కాల్కన్ ప్రాంతంలో 'దుపట్టా' (స్కాఫ్) ధరించిన ఓ మహిళ.
ఆప్ఘనిస్తాన్లో 'బుర్ఖా' ధరించిన ఓ మహిళ.
యెమన్లో నిఖాబ్ లేదా నఖాబ్ ధరించిన ఒక స్త్రీ.

బురఖా అనేది కొందరు స్త్రీలు తమ వస్త్రాలపైన ధరించే ముసుగు. దీనికి "హిజాబ్" అనే అరబిక్ పదం "కప్పుకొనుట" అనే అర్ధం కలిగి ఉంది. బురఖాను అధికంగా తమ మత సంప్రదాయానుసారం ముస్లిం స్త్రీలు ధరిస్తారు. ముస్లింలలోనే గాక, గౌరవం, సాంప్రదాయం, సిగ్గు, మొదలగు వాటిని ఆచరించే వారు, ఈ సంప్రదాయాన్ని, దేశం, మతం, భాష, ప్రదేశం అనే తారతమ్యాలు లేకుండా ఆచరించే వారు కోకొల్లలుగా కనిపిస్తారు. వారు ఈ పరదా పద్ధతిని అనుసరించి తల, భుజాలపైనుండి ధరించే వస్త్రాలను, దుపట్టా, డుపట్టా, ఓణీ, ఓఢ్‌నీ, ఓణ్ణీ, చున్నీ, చునరీ, చాదర్, చద్దర్, స్కాఫ్, ఖిమార్ మొదలగు పేర్లతో పిలుస్తారు.

స్త్రీలు హిజాబ్ ధరించడం

[మార్చు]
హిజాబ్కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, టర్కీ; దుబాయి యు.ఎ.ఇ.; టెహరాన్ ఇరాన్;, జైపూర్, రాజస్థాన్, భారతదేశం.

హిజాబ్ లేదా పరదా (అరబ్బీ : حجاب )

ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, సద్-నీతి.[1] ఈ పదము ఖురాన్ లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడింది. దీనినే ఉర్దూలో పరదా లేదా నఖాబ్, అరబ్బీలో 'ఖిమార్' خمار.

ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. బురఖా భారతీయ, అఫ్ఘానీ, ఇరాకీ, ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడవున్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.

బురఖా నిర్బంధమని ఇస్లాం చెప్పలేదు కానీ పవిత్ర ఖురాన్‌లో ఈ ప్రస్తావన ఉంది. దీనిని హిజాబ్ (అడ్డుతెర) అనికూడా అంటారు. ముస్లిం మహిళ పర పురుషుల చెడు చూపుల నుంచి తనను తాను రక్షించుకొనేందుకు బురఖాను ధరించమని ప్రవక్త సూచించారు. (ఖురాన్ 33:59. 24:30, 31). ముస్లిం మహిళలు బురఖా ధరించడం వల్ల వారి పట్ల చెడు తలంపుతో చూడ్డానికి వీల్లేని విధంగా పురుషులను కూడా కట్టడి చేసింది.

బురఖా గురించి ఖురాన్ వాక్యాలు

[మార్చు]
  • ప్రవక్తా నీ భార్యలకూ కుమార్తెలకూ ఇతర ముస్లిం మహిళలకూ వారు తమ పైటలను తమ ముఖాలపై కప్పుకోవాలని చెప్పు.ఇదే సరైన పద్ధతి.దీనివల్ల ఎవరైనా గుర్తించి వేధిస్తారనే భయం ఉండదు.. (ఖురాన్ 33:59.)
  • ఇతరులముందు స్త్రీలు తమ అందచందాలను అలంకరణలను బహిర్గతం చేయకూడదు. (ఖురాన్ 24:31).

బురఖా గురించిన హదీసులు

[మార్చు]
  • ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఓ సారి "సౌదా" బిన్తె జమాను పరదా లేకుండా చూసి ఇలా అంటాడు "ఓ సౌదా!, నేను నిన్ను గుర్తించాను", ఆమె ఇలా పరదా లేకుండా ఉండడం ఉమర్ ను మధనపడేలా చేసింది. ఈ విషయం జరిగిన తక్షణమే అల్లాహ్ "పరదా ఆయత్" (అల్-హిజాబ్, కనులను తప్పించి, శరీరాన్నంతటినీ కప్పుకునే విధానం) లను అవతరింపజేశాడు. (సహీ బుఖారీ - 1:148, 8:257)
  • ఓ విశ్వాసులారా! ప్రవక్త గారి ఇంట్లో, భోజనం అనుమతి లభించే వరకూ ప్రవేశించకండి, భోజనం తయారయ్యే వరకూ వేచి యుండండి, ఈ విషయమై పరదా వెనుకనుండే విచారించండి... (ఖురాన్ : 33.53), పరదా అలాగే వుండినది, ప్రజలు వెళ్ళిపోయారు. (ఖురాన్ - 6:315)
  • యౌవనంలో ప్రవేశించిన ప్రతి స్త్రీ తప్పక పరదా పద్ధతి పాటించవలెను, లేని యెడల, అల్లాహ్ ఆమె ప్రార్థనలను ఆలకించడు. (అబూ దావూద్ : 251)
  • ఇహ్రామ్ (హజ్ సమయంలో ధరించే వస్త్రాలు) ధరించిన సమయంలో స్త్రీ, హిజాబ్ గాని చేతి తొడుగులు (గ్లవ్స్) గాని ధరించరాదు. (అల్ మువత్తా 20:15)

బురఖా గురించి కొందరు స్త్రీల ప్రకటనలు

[మార్చు]
  • ఇవాన్‌రీడ్లీ అనే బీబీసీ రిపోర్టరు తాలిబన్ల చెర నుంచి విడుదలై స్వదేశానికి వచ్చినపుడు వివిధ మీడియా విలేకరుల ఎదుట ఆమె బురఖా ధరించింది. బురఖా ధారణపై వారంతా ప్రశ్నించడాన్ని ఆమె తప్పు పట్టారు.బురఖా స్త్రీలను 'మగ పిశాచాల దృగ్బాణాల' నుండి కాపాడి వారి శీలాన్ని పరిరక్షిస్తుంది 'బురఖా స్త్రీ, పురుషులు పరస్పరం ఆకర్షితులవకుండా తద్వారా పశుతుల్యులుగా మారకుండా కాపాడుతుంది.ఏ వ్యక్తులనైతే మీరు పరమ కిరాతకులుగా చిత్రీకరించారో... చెరలో వున్న తనపట్ల ఆ వ్యక్తులు చూపిన ప్రేమాభి మానాలకంటే మీ కరకు చూపులే కఠినంగా ఉన్నాయని... అందుకే బురఖా ధరించా'నని దానివల్ల మహిళలకు రక్షణ ఉందని చెప్పింది.

బురఖా వ్యతిరేక వాదనలు

[మార్చు]
ప్రపంచ వ్యాప్తంగా హిజాబ్ (బురఖా) ధరించేవారిని సూచించే మ్యాపు.[ఆధారం చూపాలి]
  • ఫాత్‌మా మెర్నిస్సి, రిప్ఫత్ హసన్, రాణా హుస్సేని, అమీనా వదూద్ లు "ఇస్లామిక్ ఫెమినిజం" కోసం పోరాడుతున్నారు.
  • బురఖాను టర్కీ ప్రజాస్వామ్య నేత కమాల్ పాషా నిరసించాడు.
  • యస్. యమ్. అక్బర్ రాసిన విధవ ఘోషా కథ స్త్రీల పత్రిక అయిన 'గృహలక్ష్మి'లో 1939 జనవరి సంచికలో ప్రచురితమైంది. ఒక ముస్లిం పురుషుడు రచించిన 'తొలి' తెలుగు ముస్లిం 'స్త్రీ వాద' కథ ఇది. బురఖా అనే కట్టుబాటు ఏడవ శతాబ్ది అరేబియాలో అవసరమయ్యింది. 20వ శతాబ్దంలో దాని అవసరం లేదు. స్వార్ధపరులైన మగవారు కట్టుబాట్లన్నింటినీ స్త్రీలకు ఏర్పరచి 'తాము మాత్రం ' బజారుల వెంట బయలుదేరుతున్నారు. ఘోషావల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. బురఖా ఒక అలంకారం కూడా కాదు. దేవుడిచ్చిన గాలి, సూర్యరశ్మి లేక పాలిపోయి, తెల్లబడి, ఇంట్లోనే ఉండి దుర్గంధవాయువునే పీలుస్తోంటే నానా జబ్బులకు గురి కావలసి వస్తుంది. నీడలో పెరిగిన మొక్కకూ, ప్రకృతిలో పెరిగిన మొక్కకూ తేడా లేదా? స్వార్ధపరులైన పురుషులు స్త్రీల హక్కుల్ని కాలరాచి వేస్తున్నారు. ఈ బురఖా ముక్కునీ, కళ్ళనీ కప్పుతూ పలుచటి తెరను కలిగిన 'నఖాబ్' ఉన్న ఫుల్ బురఖాలా ఉంటుంది. బురఖా కారణంగా కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. బురఖా (నఖాబ్‌తో కూడినది) వేసుకుంటే భర్త భార్యనీ, భార్య భర్తనీ గుర్తించలేనంతగా చీకటి ఏర్పడుతుంది.
  • "పుట్టుమచ్చ" "ఖబడ్దార్" లాంటి రచనలు బురఖా, నఖాబ్, "ఘోషా", పరదా లను నిరసిస్తున్నాయి.
  • ఈనాటి స్త్రీలు కేవలం సంఘానికి భయపడే గోషా పాటిస్తున్నారు. బురఖాతో సినిమాలకు వెళుతున్నారని విమర్శిస్తున్నాయి.
  • ప్రవక్త పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ హక్కులనిచ్చాడు. చాందస హిందువుల బారినుండి బాల్య వివాహాలను నిషేధించి, స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలను సాధించినట్లే ముస్లిం స్త్రీలకు ఈ గోషా బెడద పోవాలని ఘోషిస్తున్నారు. -- డాక్టర్ మహబూబ్ భాషా, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో చరిత్ర ఉపన్యాసకులు.
  • బుర్ఖాను నిషేధించాల్సిందేనని ఫ్రాన్స్ ముస్లిం మహిళా మంత్రి ఫడెలా అమర తెలిపారు. బుర్ఖా స్త్రీ గృహహింస, బానిసత్వానికి ప్రతీక అని ముస్లిం ఛాందసవాదులు అర్థంలేని చట్టాలతో మహిళలను హింసిస్తున్నారన్నారు.అందుకే మెజారిటీ ముస్లిం మహిళలు బుర్ఖాను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ బుర్ఖాను బానిసత్వానికి గుర్తుగా పేర్కొన్నారు (ఈనాడు 16.8.2009). బురఖా ధరించాలని భార్యపై ఒత్తిడి తెస్తే, తన భార్య తప్పనిసరిగా బురఖా ధరించాలని బలవంతం చేసే వ్యక్తి ఫ్రెంచి పౌరసత్వాన్ని తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేస్తానని ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ ఫిలన్‌ తెలిపారు (ఈనాడు4.2.2010).
  • బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు ముఖాన్ని కూడా కప్పి ఉంచేలా బురఖాలు ధరించడాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం నిషేధించింది (ఈనాడు13.4.2011).

బురఖాను సమర్దించే వాదనలు

[మార్చు]
టర్కీ లోని అదానా నగరంలో నఖాబ్ ధరించిన స్త్రీలు.
  • ఆమీనా వదూద్, ముస్తఫా కమాల్ పాషా, తుర్కీ లాంటివారిని ముస్లిం సమాజంలోనుంచి ఎప్పుడో వెలి వేయటం జరిగింది.-ముఫ్తీ గయాసుద్దీన్ రహ్మానీ ఖాస్మీ, జమీఅతుల్ ఉలమా, ఆంధ్రపదేశ్
  • 'నలుపు నెలవంక' అంటే నల్లని రంగులో ఉండే బురఖాలో 'నెలవంక' లాంటి 'తన అందాలతో మెరిసిపోయే మహిళ నల్లని మబ్బుల చాటున దాగే నెలవంకలా నల్లని బురఖా చాటున మరుగున ఉంది.అందమైన స్త్రీ తన అందాలను యదేచ్ఛగా ప్రదర్శించకుండా నల్లని బురఖాలో దాగి ఉంటే ఆమె సౌందర్యాన్ని వీక్షించే భాగ్యానికి నోచుకునేదెలా? పరస్త్రీ సౌందర్యాన్ని వీక్షించలేకపోతున్నానే... అనే ఆక్రోశం వ్యక్తమవుతోంది. అసలు తన భార్యను మాత్రమే కాకుండా పరస్త్రీల సౌందర్యాన్ని సైతం కనులారా వీక్షించాలనే కాంక్ష ఉన్న వ్యక్తే 'నలుపు నెలవంక' అనే పదబంధం ద్వారా తన ఆక్రోశాన్ని వెల్లడిస్తాడు.
  • బురఖా లేదా పరదా వ్యవస్థ నిజమైన ముస్లిం స్త్రీలకు ఒక సమస్య ఎంతమాత్రమూ కాదు. పర పురుషుల చూపుల తాకిడి నుంచి, వ్యాఖ్యల బాణాల నుంచి రక్షణ పొందేందుకై బురఖా ధరించాలి. నిజంగానే బురఖా ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలే తలెత్తే పక్షంలో ఇన్ని శతాబ్దాలుగా బురఖాను ధరిస్తూ వస్తున్న ముస్లిం స్త్రీలు బురఖా ధరించడం వల్ల పలు వ్యాధులకు గురయినట్లుగా చరిత్రలో దృష్టాంతాలేమీ లేవేమిటి? ఆ విధంగా వారు వ్యాధిగ్రస్తులయినట్లుగా ఏ వైద్యుడూ చరిత్రలో ఇంతవరకూ నిర్ధారించలేదేమిటి?
  • బురఖా వేసుకున్నంత మాత్రాన భార్య భర్తనీ, భర్త భార్యనీ గుర్తించలేని పరిస్థితుల్లో నేటి ముస్లిం భార్యాభర్తలు లేరు.
  • "వ ఖర్‌న ఫీ బుయూతికున్న వలా తబర్రజ్‌న తబర్రుజల్ జాహిలియ్యతిల్ ఊలా' ('మీ ఇళ్లల్లో నిలిచి ఉండండి. పూర్వపు అజ్ఞానకాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి') (ఖుర్ఆన్, అహ్‌జాబ్ : 33) ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా స్త్రీ కార్యక్షేత్రం ఇల్లేనని, ఆమె అందులోనే ఉండి ప్రశాంతంగా తన విధులను నిర్వర్తిస్తూ ఉండాలని, అవసరం ఏర్పడినప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని తెలుస్తుంది.
  • అజ్ఞానకాలంలో స్త్రీలు తమ ముఖ సౌందర్యాన్నీ, శారీరక సౌందర్యాన్ని, వస్త్రాలను, ఆభరణాల వైభవాన్ని ప్రదర్శిస్తూ వయ్యారంగా నడుస్తూ తమను తాము అపరిచితుల ముందు, పర పురుషుల ముందు ప్రదర్శించేవారని, ఆ విధంగా విశ్వసించిన ముస్లిం స్త్రీలు వ్యవహరించరాదని పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ వాక్యంలో సూచించబడింది.
  • ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా స్త్రీలు తమ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ఇళ్ల నుంచి బయటకు రావడాన్ని అల్లాహ్ వారించినట్లుగా బోధపడుతుంది. 'యా అయ్యుహన్నబియ్యు ఖుల్ లిఅజ్‌వాజిక వ బనాతిక వ నిసాఇల్ ముఅ్‌మినీన యుద్‌నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్న జాలిక అద్‌నా అఁయుఅ్‌రఫ్‌న ఫలా యుఅ్‌జైన వ కానల్లాహు గఫూరర్రహీమా' ('ప్రవక్తా! నీ భార్యలకూ, నీ కూతుళ్లకూ, విశ్వాసుల యొక్క స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోమని చెప్పు; వారు గుర్తించబడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకూ ఇది ఎంతో సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు') (ఖుర్ఆన్, అహ్‌జాబ్ : 59) ఈ ఖుర్ఆన్ వాక్యంలో 'యుద్‌నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్న' అని పేర్కొనబడింది.
  • పెద్ద దుప్పటిని అరబీ భాషలో 'జిల్‌బాబ్' అని పిలుస్తారు.
  • 'ఇద్‌నా' అంటే 'కప్పుకోవడం' అని అర్థం. కనుక ఈ ఖుర్ఆన్ వాక్యానికి స్పష్టమైన అర్థమేమిటంటే స్త్రీలు తమ దుప్పట్లను సరైయైన రీతిలో కప్పుకొని దానికి చెందిన ఒక భాగం లేదా వాటి కొంగును తమ ముఖాల మీద వేలాడదీసుకోవాలి.
  • విశ్వాసులయిన స్త్రీలు పర పురుషులకు తమ ముఖాలను, శరీరాలను చూపించకూడదని ఆదేశించబడ్డారు. ఇంటి నుంచి అవసరార్థం బయటికి వెళ్లే సమయంలో విశ్వసించిన స్త్రీలు పెద్ద దుప్పటిని శరీరం నిండా కప్పుకొని దానికి చెందిన ఒక భాగాన్ని తమ ముఖాల మీద వేలాడదీసుకోవాలి. తద్వారా దుష్ట స్వభావం గల ఏ వ్యక్తీ వారిని వేధించే సాహసం చేయలేడు.
  • అలాగే ఆ స్త్రీలు ఉత్తమ స్త్రీలుగా గుర్తించబడతారు.పరదా వ్యవస్థ లేదా బురఖా విధానాన్ని ఛాందసులయిన ముస్లిం పురుషులు స్త్రీలపై బలవంతంగా రుద్దడం జరగలేదు.
  • ఖుర్ఆన్‌లో స్పష్టంగా అందుకు సంబంధించిన ఆదేశాలు పేర్కొనబడి ఉన్న కారణంగానే ముస్లిం స్త్రీలు నిర్బంధపూర్వకంగా కాకుండా ఐచ్ఛికంగా బురఖా ధరించడం జరుగుతోంది.
  • ఇస్లాం ధర్మం ఎన్నటికీ మార్పులూ చేర్పులకు, కాలానుగుణ పునర్‌వ్యాఖ్యానాలకు అతీతమైన ఘనీభవించిన ధర్మం. అది ఎన్నటికీ ఘనీభవించిన స్థితిలోనే ఉంటుంది. ఆ ఘనీభవన స్థితిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. --అఫ్రోజ్ అహ్మద్

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Esposito, John (2003). The Oxford Dictionary of Islam. Oxford University Press. ISBN 0-19-512558-4., p.112
"https://te.wikipedia.org/w/index.php?title=బురఖా&oldid=3261245" నుండి వెలికితీశారు