విక్రమార్క చరిత్ర
తెలుగుసాహిత్యంలో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాలలో క్రీ. శ. 15 వ శతాబ్దానికి చెందిన విక్రమార్క చరిత్ర ఒకటి. దీనిని జక్కన కవి (క్రీ. శ. 1380-1440) రచించాడు. 8 అశ్వాసాలు గల ఈ తెలుగు కథాకావ్యంలో విక్రమార్కుడనే పౌరాణిక రాజు చేసిన అద్భుత సాహస కృత్యాలను వర్ణించే కథలున్నాయి.[1]
విక్రమార్క చరిత్ర-కావ్య విశేషాలు
[మార్చు]- విక్రమార్కుని కథలపై తెలుగులో మొట్ట మొదటిసారిగా వెలువడిన గ్రంథం జక్కన 'విక్రమార్క చరిత్ర'
- ఇది 15 వ శతాబ్దంలో రాయబడిన కథాకావ్యం. కృతికర్త జక్కన. కృతిపతి వెన్నెలకంటి సిద్దనమంత్రి.
- ఇది 8 ఆశ్వాసాలతో, 1519 పద్య గద్యాలతో, చంపూ మార్గంలో, కావ్య శైలిలో రాయబడింది.
- కల్పిత ఇతివృత్తంతో కూడి వున్నఈ కథాకావ్యంలో కథా నాయకుడు విక్రమార్కుడనే పౌరాణిక రాజు. దేవీ అనుగ్రహంతో పాటు అధ్బుత శక్తులను పొందిన విక్రమార్కుడు, వాటి సాయంతో చేసిన సాహస కృత్యాలను, అతని ఔదార్యతను ప్రతిబింబించే చిత్ర విచిత్ర కథలను ఇది వివరిస్తుంది. దీనిలో వీర, అద్భుత రసాలు పోషించబడ్డాయి.
- జనరంజకమైన సరళ కథలను ఈ కథాకావ్యంలో రమణీయమైన కావ్యశైలిలో ప్రౌఢంగా చెప్పడం జరిగింది. కథాకావ్యమైనప్పటికి దీనిలో ప్రబంద లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రబందాలలో కనిపించే విశేష వర్ణనలు, అష్టాదశ వర్ణనలు దీనిలో కనిపిస్తాయి.
- విక్రమార్క చరిత్రలోని కొన్ని పద్యాలు శ్రీనాథుని భీమఖండం, శృంగార నైషధం లలోని పద్యాలతో స్పష్టమైన పోలికలు కలిగి వుండటం విశేషం.
- మాదయ్యగారి మల్లన రచించిన 'రాజశేఖర చరిత్ర' కథకు మూలం జక్కన 'విక్రమార్క చరిత్ర' లోని రాజశేఖర కథే నని ప్రముఖ సాహిత్య పరిశోధకులు పల్లా దుర్గయ్య తెలియచేసారు.
కృతికర్త విశేషాలు
[మార్చు]విక్రమార్క చరిత్ర కథాకావ్యాన్ని రాసిన జక్కన క్రీ. శ. 1380-1440 మధ్య కాలంలో జీవించిన కవిగా అత్యధికులు అంగీకరిస్తున్నారు. ఇతను కవి సార్వభౌముడైన శ్రీనాథుని సమకాలికుడు. ఇతని తల్లి అక్కమాంబ. తండ్రి అన్నయమాత్యుడు. ఉద్దండ పండితుడు అయిన జక్కన కవి విక్రమార్క చరిత్ర కావ్యాన్ని మాత్రమే రాసినట్లు తెలుస్తుంది. ఈ కథాకావ్యం వెన్నెలకంటి సిద్దనమంత్రికి అంకితం ఇవ్వబడింది.
కావ్య మూలం
[మార్చు]విక్రమార్కుడు ఉజ్జయినిని పాలించిన ఒక పౌరాణిక రాజు. ఇతను క్రీ. శ. 58 లో పాలించినట్లు, శకరాజుని ఓడించి విక్రమ శకాన్ని ప్రారంభించినట్లు, అనేక అధ్బుత సాహస కార్యాలు చేసినట్లు అనుశ్రుతిగా చెప్పబడుతున్నప్పటికీ దానికి ఏ విధమైన చారిత్రిక ఆధారాలు లేవు.[2] ఈ పౌరాణిక రాజు విక్రమార్కుని పేరిట అనేక సాహస కథలు, భట్టి విక్రమార్క కథలు, 32 సాలభంజికలు చెప్పిన కథలు, భేతాళ విక్రమార్క కథలు – ఇలాంటివి ఎన్నో జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. జక్కన కవి తన 15 వ శతాబ్దకాలం నాటికి తెలుగులో విశేష ప్రచారంలో వున్న ఇటువంటి విక్రమార్క కథలను ఒకచోట చేర్చి, వాటిని క్రమరీతిలో అల్లుతూ విక్రమార్క చరిత్ర పేరిట ఒక చక్కని కథలా చెప్పాడు. ఆ విధంగా ఒక కల్పిత ఇతివృత్తంతో, కథలో కథను పొదిగి, ఆ కథను కావ్యంగా చెప్పిన విక్రమార్క చరిత్ర తెలుగులో ఒక చక్కని కథాకావ్యంగా నిలిచింది.
తెలుగులో రాయబడిన విక్రమార్క చరిత్ర కథాకావ్యానికి మూలం ఇది అని స్పష్టంగా చెప్పదగిన కావ్యం ఏదీలేదు. ఈ కావ్య అవతారికలో కూడా ఇది అనువాదం అని కాని, స్వతంత్ర రచన అని కాని చెప్పబడలేదు.[3] విక్రమార్కుని పేరిట అప్పటికే ప్రచారంలో వున్న కొన్ని ప్రసిద్ధ కథలను ఎన్నుకొని జక్కన బహుశా దీనిని స్వతంత్రంగా రాసి ఉండవచ్చు.
కావ్య ఇతివృత్తం
[మార్చు]ఇది 8 ఆశ్వాశాలు (Chapters) గల కథాకావ్యంలో నాయకుడు ఉజ్జయిని రాజైన విక్రమార్కుడు. అధ్బుత శక్తులను పొందిన విక్రమార్కుడు, వాటి సాయంతో చేసిన సాహస కృత్యాలను, అతని ఔదార్యతను చిత్ర విచిత్ర కథలను ఇది వివరిస్తుంది.
మొదటి ఆశ్వాసం
[మార్చు]ఇది విక్రమార్కుని జన్మవృత్తాంతం తెలుపుతుంది. మధురానగరంలో చంద్రగుప్తుడనే బ్రాహ్మణ పండితుడు చాతుర్వర్ణాలకు చెందిన నలుగురు భార్యలను వివాహం చేసుకొన్నాడని, తద్వారా బ్రాహ్మణ భామకు ‘వరరుచి’, క్షత్రియ కాంతకు ‘విక్రమార్కుడు’, వైశ్య వనితకు ‘భట్టు’, శూద్ర స్త్రీకి ‘భర్తృహరి’ జన్మించారని తెలుపుతుంది. యుక్తవయస్సు రాగానే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడై భట్టిని మంత్రిగా చేసుకొని రాజ్యపాలన చేస్తాడు.
రెండవ ఆశ్వాసం
[మార్చు]దీనిలో విక్రమార్క విజయాలు వర్ణించబడ్డాయి. అద్భుత శక్తులు గల మంత్రం దండం, కోరిన ధనరాశులను ఇచ్చే కంథ (బొంత), అడిగినంతనే పంచభక్ష పరమాన్నాలు ఇచ్చే ముంత (పాత్ర), తలచిన చోటుకు తీసుకోనిపోయే పావుకోళ్లు (చెప్పులు) ను రాక్షసులనుండి తెలివిగా సంగ్రహించిన విక్రమార్కుడు వాటి సాయంతో వింధ్యకు దక్షిణాన్న చంద్రపురం నిర్మించి అటు ఉజ్జయినిని, ఇటు చంద్రపురాన్ని జనరంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు. తరుచుగా బ్రహ్మలోకం, ఇంద్రలోకం, సూర్యలోకం, పాతాళలోకం సందర్శిస్తూ, వెళ్లినచోటల్లా తన ఔదార్యంతో వరాలు పొందుతూ, చక్కగా ఉదాత్తంగా రాజ్యపాలన చేస్తాడు.
మూడవ ఆశ్వాసం
[మార్చు]ఇది విక్రమార్కుని తమ్ముడు భర్తృహరి గురించి తెలుపుతుంది. అన్నను కలుసుకోవడానికి వచ్చిన భర్తృహరికి దుశ్శీలయైన తన భార్య యొక్క పరపురుష వ్యామోహం గురించి తెలియవస్తుంది. దానితో ఖిన్నుడై, వైరాగ్యంతో తపస్సుకు పోతూ విక్రమార్కునికి సమర్ధుడైన మంత్రి చెప్పినట్లు రాజ్యపాలన చేయమని ఉపదేశించి అందుకు నిదర్శనంగా ‘ససేమిరా’ అనే కథను అన్నకు చెప్పడం జరుగుతుంది.
నాలుగవ ఆశ్వాసం
[మార్చు]దీనిలో విక్రమార్కుని వివాహ వృత్తాంతం ఉంది. రాజ్యభ్రష్టుడైన విదర్భ రాజుకు సాయంగా విక్రమార్కుడు యుద్ధం చేయడం, యుద్ధంలో శకరాజును జయించడం, విదర్భ రాజును సింహాసనంపై పునః ప్రతిష్ఠించడం, తత్ఫలితంగా విదర్భ రాకుమారి అనంగవతిని విక్రమార్కుడు వివాహం చేసుకోవడం జరుగుతుంది.
ఐదవ ఆశ్వాసం
[మార్చు]దీనిలో విక్రమార్కుడు చేసిన అశ్వమేధయాగంతో పాటు, అతని ఔదార్యాన్ని, పరోపకారత్వాన్ని ప్రతిబింబించే కథలు వివరించబడ్డాయి. విక్రమార్కుడు తనకు ద్రోహం చేసిన పురోహితుడిని మన్నించడం, కంచిలో క్రూర రాక్షసుని సంహరించడం, బకాసురుని పోలినటువంటి రాక్షసునిలో పరివర్తన కలిగించడం గురించిన కథలున్నాయి.
ఆరు, ఏడు, ఎనిమిది అశ్వాసాలు
[మార్చు]విక్రమార్కునికి కళావతి అనే రాచకన్నెతో వివాహానికి దారితీసిన పరిణామాలను తెలియచేస్తాయి. తనతో ముమ్మారు మాట్లాడించగల వాడినే వివాహమాడడానికి సిద్ధపడిన రాకుమారిని విక్రమార్కుడు తెలివిగా ఓడిస్తాడు. మాట్లాడటానికి అసలు అవకాశమీయకుండా ప్రతి రాత్రి ముసుగు తన్ని పడుకొంటున్న ఆమెకు ఒక కథను వినిపించి, ఆ కథాక్రమం చివరలో సంధించిన ప్రశ్నకు ఆమెచేతనే అప్రయత్నంగా బదులిచ్చేటట్లు చేస్తాడు. ఈ విధంగా విక్రమార్కుడు రాకుమార్తె స్వయంగా పెట్టుకొన్న మౌనవ్రత నియమాన్ని ఆమె చేతనే మూడు సార్లు మాట్లాడించడం ద్వారా భంగం కలిగించి, ఆ విధంగా ఓడిన రాకుమార్తెను పరిణయం మాడతాడు. ఈ మూడు కథలు చివరి మూడు ఆశ్వాసాలలో వివరించబడ్డాయి.
ఆరవ ఆశ్వాసం
[మార్చు]ప్రష్టపుర రాకుమారి కళావతి తనతో మూడుసార్లు మాట్లాడించగల సాహసినే పెళ్ళి చేసుకొంటానని నియమం పెట్టుకొంటుంది. దీనికి సిద్ధపడిన విక్రమార్కుడు ఆమెను మాట్లాడించడానికి కథామార్గాన్ని ఎన్నుకొంటాడు. మొదటి రాత్రి ముసుగు తన్ని పడుకొంటున్న ఆమెను మేల్కొలపడానికి గదిలో ఒక దీపం చిమ్మెకు ప్రాణం పోసి దానిని ఒక కథ చెప్పమంటాడు. ఆ కథానంతరం ‘ఆ కథలో నిజమైన సాహసికులు ఎవరో చెప్ప’మని సంధించిన ప్రశ్నకు విక్రమార్కుడు ఒక సమాధానం ఇవ్వడం, అయితే ఆ సమాధానం నచ్చని రాకుమారి దిగ్గున లేచి తానే అప్రయత్నంగా బదులివ్వడం జరుగుతుంది. తద్వారా విక్రమార్కుడు మొదటిసారి ఆమెకు మౌన భంగం కలిగిస్తాడు.
ఏడవ ఆశ్వాసం
[మార్చు]రెండవ రాత్రి ముసుగు తన్ని పడుకొంటున్న రాకుమారిని మాట్లాడించడానికి విక్రమార్కుడు కర్పూర పేటికకు ప్రాణం పోసి దానిచేత ఒక కథను చెప్పిస్తాడు. చిలక-గోరువంకల నేపధ్యంతో వున్న కర్పూరమంజరి-రాజశేఖరుల ప్రేమ కథ చెప్పబడుతుంది. ఆ కథ చివరలో ‘ఆ కథలో దుష్టులు ఆడవాళ్ళా, మగవాళ్ళా ఎవరో చెప్ప’మని అడిగిన ప్రశ్నకు విక్రమార్కుడు మగవాళ్ళని సమాధానం ఇవ్వడం, ఆ సమాధానం నచ్చని రాకుమారి లేచి ఆడవాళ్లే దుష్టులని తగువిధంగా బదులిస్తుంది. దానితో ఆమెకు రెండవ సారి మౌనభంగం కలుగుతుంది.
ఎనిమిదవ ఆశ్వాసం
[మార్చు]మూడవ రాత్రి కూడా యదావిధిగా ముసుగు తన్ని పడుకొంటున్న రాకుమారిని మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా విక్రమార్కుడు సువర్ణ కలశానికి ప్రాణం పోసి దానిని ఒక కథను చెప్పమంటాడు. ఒకరిని మించిన ఒకరుగా వర్తించిన ముగ్గురు జాణల కథ చెప్పబడుతుంది. ఆ కథానంతరం ‘ఆ కథలో నిజమైన జాణ ఎవరు అని’ అడిగిన ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానం ఇవ్వడం, కథలో లీనమై పోయిన రాకుమారికి ఆ సమాధానం నచ్చక తెలివైన జాణ ఎవరో తానే దిగ్గున లేచి మరీ బదులిస్తుంది. దానితో ఆమెకు మూడవ సారి కూడా మౌనభంగం కలుగుతుంది. ఈ విధంగా ప్రతీ సారి విక్రమార్కుడు రాకుమారిని కథలో లీనమయ్యేటట్లు చేసి, ఆ కథానంతరం సంధించిన ప్రశ్నలకు ఒప్పని సమాధానాలను తాను చెప్పడం ద్వారా, తగు సమాధానాలను అసంకల్పితంగా ఆమె నోటివెంటే నేర్పుగా చెప్పిస్తాడు. చివరకు షరతు ప్రకారం ఓడిన రాకుమారిని విక్రమార్కుడు వివాహం చేసుకొంటాడు.
విక్రమార్క చరిత్ర-శైలి
[మార్చు]విక్రమార్కుని పేరిట ప్రచారంలో వున్న పౌరాణిక కథలను ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఒక పెద్ద కథగా రూపొందించి, చక్కని కథా కథన సంవిధానంతో జక్కన విక్రమార్క చరిత్రను రాసాడు. వీర, అద్భుత రసాత్మకమైన ఈ కావ్యంలో జక్కన కల్పనా శక్తి, కథానైపుణ్యము, పునరుక్తి లేని వర్ణనా విన్యాసము కనిపిస్తాయి.
తెలుగుతనం ఉట్టిపడే సామెతలు, సంస్కృత లోకోక్తులు బాగా దొర్లుతాయి. ఉదాహరణకు తూచ తప్పకుండ, పూస గ్రుచ్చినగతి, నెయ్యివోసిన యగ్గియట్లు, పులిమీసల నుయ్యల లూగావచ్చునే, సింహము మెడగంటవోలె, తామరపాకున నీటిక్రియ తల్లడము, పలికిన పగడంబులు రాలునట్లు, చల్లకు వచ్చి ముంతదాపగన్ లాంటి ఎన్నో తెలుగు సామెతలు అలవోకగా సందర్భానుసారం ఈ కథాకావ్యంలో వాడబడ్డాయి.[4]
చంపూ మార్గంలో రాయబడిన ఈ కథాకావ్యం ప్రౌఢశైలిలో, కొంతవరకు ప్రబంద ధోరణిలో ఉంది. సాధారణంగా ప్రబందాలలో కనిపించే అష్టాదశ వర్ణనలలో కొన్ని ఈ కథాకావ్యంలో కనిపిస్తాయి. కావ్య ప్రారంభంలోని మధురానగర వర్ణన 44 పద్యాలలో ఉంది. ఋతువర్ణనలతో పాటు తీర్థయాత్రల ప్రశక్తి, పుణ్యక్షేత్రాల ప్రశంస విరివిరిగా ఉంది.[5] కాశీ, శ్రీశైలం, అహోబిలం, కాళహస్తి, తిరుపతి, కంచి, శ్రీరంగం, కుంభకోణం, రామేశ్వరం, సేతుబంధం, అనంతశయనం మొదలగు పుణ్యక్షేత్రాల వర్ణన కనిపిస్తుంది.
విక్రమార్క చరిత్రలోని కొన్ని పద్యాలు శ్రీనాథుని భీమఖండం, శృంగార నైషధం లలోని పద్యాలతో స్పష్టమైన పోలికలు కలిగి ఉన్నాయి. దీనికి కారణం జక్కన, శ్రీనాథుడు ఇరువురూ సమకాలికులు కావటమే. అయితే ఎవరు ఎవరిని అనుకరించారు అన్నది చిక్కుప్రశ్నగా ఉంది.[6]
కావ్య ప్రభావం
[మార్చు]తెలుగులో కథా వాజ్మయం వృద్ధి చెందడానికి జక్కన 'విక్రమార్క చరిత్ర' కథాకావ్యం తోడ్పడింది. విక్రమార్క చరిత్రలో కనిపించే పుర, ఋతు, క్షేత్ర స్థల వర్ణనలను, భావ ప్రకటనలను తరువాతి కాలంలోని అల్లసాని పెద్దన వంటి దిగ్గజ కవులు తమ ప్రబంద కావ్యాలలో అనుకరించారు.[7] ప్రముఖ సాహిత్య పరిశోధకులు పల్లా దుర్గయ్య అభిప్రాయం ప్రకారం అష్టదిగ్గజాలలో ఒకడైన మాదయ్యగారి మల్లన రచించిన రాజశేఖర చరిత్ర కథకు మూలం జక్కన విక్రమార్క చరిత్రలోని రాజశేఖర కథయే.
కావ్య పరామర్శ
[మార్చు]అనేక చిత్ర విచిత్రమైన కథలను కలిపి కుట్టి ఒకే కథగా మలిచిన విక్రమార్క చరిత్రలో చక్కని కథా కథన సంవిధానం (narrative structure) కనపరచడం వల్ల వస్త్వైక్యం సాధించబడినదనే చెప్పాలి. సాధారణంగా కథాకావ్యాలు గద్యంలో ఉంటూ, సరళ సుభోదక శైలిలో కొనసాగడం ప్రధాన లక్షణం. అయితే మిగిలిన అన్ని తెలుగు కథాకావ్యాల వలె విక్రమార్క చరిత్ర కూడా చంపూ మార్గంలోనే (పద్య గద్య మిళితం) రాయబడింది. అందువలన ఇందులోని కథలు సరళ సులభ శైలిలో వుండవు.
విక్రమార్క చరిత్ర నీతి బోదకమైన కథాకావ్యం కాదు. విక్రమార్కుని సాహసాద్భుతాలు ఇతివృత్తాంతంగా గల కథాకావ్యం. ఉల్లాసం కొరకు అద్భుత, వీర రసానందం కొరకు [2]చదివే కాలక్షేప కథల సమాహారం ఇది. ప్రౌఢ కావ్యత్వసిద్ధికి తగని ఇటువంటి కథలను కవి ప్రౌఢ ప్రబందంగా రచించడంలో విజయం సాధించాడు. చక్కని కథలను కవి ప్రయత్నపూర్వకంగా చిక్కని కావ్యశైలిలో చెప్పడంతో, దీనిలోని జనరంజక కథలు ప్రబంద వర్ణనలతో కూడి ప్రౌఢంగా మారాయి. ప్రభంద ధోరణిలో కొంతమేరకు కొనసాగిన ఈ కథాకావ్యంలో కనిపించే పుర వర్ణనలు, తీర్ధ ప్రశంసలు వంటివి కథా గమనాన్ని కొద్దిగా మందగింపచేస్తాయి. ప్రబంద శయ్యాగతికి తోడు భావ ప్రకటనలో ప్రౌఢిమ కనిపించడం వల్ల ఈ కథాకావ్యం సామాన్య పాఠకులకు పఠన యోగ్యంగా వుండదు.
తెలుగులో తొలిసారిగా విక్రమార్కుని కథలను ఒక కథాకావ్యంగా లిఖిత బద్దం చేసిన విక్రమార్క చరిత్రకు తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్య స్థానం ఉంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]రిఫరెన్సులు
[మార్చు]- పింగళి లక్ష్మీకాంతం. ఆంధ్ర సాహిత్య చరిత్ర (తొలి ముద్రణ 1974, 1998 మే ed.). హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
- ఖండవల్లి లక్ష్మీరంజనం. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము (2001 ed.). హైదరాబాద్: టాగూరు పబ్లిషింగ్ హౌస్.
- ఆరుద్ర. సమగ్ర ఆంద్ర సాహిత్యం - సంపుటి V (గజపతుల యుగం) (1965, ఆగష్టు ed.). మద్రాస్: యం. శేషాచలం అండ్ కంపెనీ.
- ముదిగంటి సుజాతారెడ్డి. ఆంధ్రుల సంస్కృతి సాహిత్య చరిత్ర (తొలి ముద్రణ 1989, 2009 ed.). హైదరాబాద్: తెలుగు అకాడమి.
మూలాలు
[మార్చు]- ↑ ఆర్కివు.కాంలో విక్రమార్క చరిత్రము (1913) పుస్తక ప్రతి.
- ↑ 2.0 2.1 ముదిగంటి సుజాతారెడ్డి 2009, p. 59.
- ↑ ఆంధ్ర సాహిత్య చరిత్ర & పింగళి లక్ష్మీకాంతం 1998, p. 330.
- ↑ ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 81.
- ↑ ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 70.
- ↑ ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 77.
- ↑ ముదిగంటి సుజాతారెడ్డి 2009, p. 60.