ఉద్యోగ పర్వము చతుర్థాశ్వాసము
చతుర్ధాధ్యాయము
[మార్చు]శ్రీకృష్ణుడు కురు సభనుండి వెలుపలికి వచ్చాడు. అతడిని కురు ప్రముఖులు వెంబడించారు. వెలుపల దారుకుడు రథంతో సహా వెలుపల ఉన్నాడు. శ్రీకృష్ణుడు మిగిలిన వారిని చూసి " మీరంతా ఉండండి ఇక నేను వెళతాను " అన్నాడు. ధృతరాష్ట్రుడు " కృష్ణా ! కౌరవ పాండవులు కలసి జీవించ డానికి నేను చేయ వలసిన ప్రయత్నం చేసాను ఇందులో నా తప్పు ఏమీ లేదు అది నీవు తెలుసుకుంటే నాకు చాలు " అన్నాడు. శ్రీకృష్ణుడు " భీష్మ , ద్రోణ, కృప, బాహ్లికులను చూసి " సభలో జరిగినది అంతా మీరు కనులార చూసారు, చెవులార విన్నారు ధృతరాష్ట్రుడు తన తప్పు ఏమి లేదు అంటున్నాడు. కనుక నాకు ఇక్కడ ఉండ వలసిన పని లేదు. నేను పోయి వచ్చెదను ధర్మ పుత్రునకు జరిగినది వివరించ వలెను కదా ! " అన్నాడు. అయినా కౌరవ ప్రముఖులు అతడిని వెంబడించారు.
శ్రీకృష్ణుడు కుంతీదేవి మందిరానికి వెళ్ళుట
[మార్చు]అంతా కుంతీదేవి మందిరానికి వెళ్ళారు. కుంతీదేవిని చూసి శ్రీకృష్ణుడు జరిగినది అంతా చెప్పాడు. కుంతీదేవి " కృష్ణా! కౌరవులు ఇన్నాళ్ళు బాగా తిని పొగరు పట్టి జరగబోయేది తెలియక ఉన్నారు. అర్జునిని గాండీవం నుండి వెలువడే బాణాగ్ని దహించేది చూసిన కాని వారికి బుద్ధి రాదు " అన్నాది. శ్రీకృష్ణుడు " అత్తా ! నేను పాండవుల వద్దకు వెళుతున్నాను వారికి చెప్ప వలసినది ఏదైనా ఉందా ! " అని అడిగాడు. కుంతీ దేవి " క్షత్రియులు పరాక్రమము నమ్మి జీవించ వలెను కాని ఇతర మార్గములు నిషిద్ధము అని చెప్పు. ఉత్తమ క్షత్రియ వంశజులు క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయిస్తారు. బుద్ధి హీనులు దీనంగా జీవిస్తారు. నీ బావ మరుదులు సంధి ప్రయత్నాలు చేసారు. అది విఫలం కావడం మంచికే. క్షత్రియులకు వీరత్వమే ధర్మము తన పరాక్రమం చూపకున్న అర్జునుడు పలుచన కాడా! భీమునికి ఈ సంధి తగునా ! వారి మాటలు విని ఈ సంధికి నీవు రాతగునా ! పరమాత్ముడు ఈ సంధి విఫలం చేసి మంచి చేసాడు. ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానం పాండవులు ఎలా మరచారు. ధర్మానికి తల ఒగ్గి అడవులకు వెళ్ళిన వారు ఈ అధర్మాన్ని సహించ తగునా! న్యాయంగా తమకు రావలసిన రాజ్యాన్ని యుద్ధం చేసి తీసుకోవద్దా ! అధర్మ వర్తనులైన కౌరవులకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత వారికి లేదా ! ఇది వారికి ఒకరు చెప్పవలసిన పని లేదు. నీకు యాచన నిషిద్దం, వ్యవసాయం కుదరదు.నీవు క్షత్రియుడవు. ఇతరులను రక్షింపవలసినవాడవు. బాహుబలంతో జీవించ వలససిన వాడవు. శత్రువుల చెంత వున్న నీ పైత్ర్హుక మైన రాజ్యాన్నిసంపాదించు. నేను నిన్ను గన్నది పరులు పెట్టే అన్నం కోసం ఎదురు చూసేందుకు కాదు. ఇది వారికి ఒకరు చెప్పవలసిన పని లేదు " అని పాండవులకు నా మాటగా చెప్పు. కృష్ణా నేను ఇక్కడ బాగా ఉన్నాను. పాండవులకు వీరులుగా బ్రతకమని చెప్పానని చెప్పు ఇక నీవు పోయి రా కృషా ! " అన్నది.
శ్రీ కృష్ణుడు కర్ణుని జన్మ గురించి వివరించుట
[మార్చు]శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారిని ఇక ఉండమని చెప్పి కర్ణుని చూసి " కర్ణా ! రావయ్యా పొలిమేర వరకు నన్ను సాగనంపవా ! " అని తన చేతిని అందించి రథం ఎక్క మన్నాడు. శ్రీకృష్ణుని చేయి పట్టి రథం ఎక్కిన కర్ణుడు కృష్ణుని రథాన్ని అనుగమించాడు. ధృతరాష్ట్రుడు తిరిగి తన కొలువు కూటముకు వెళ్ళాడు. అందరూ జరిగిన విషయములు చర్చిస్తూ భీష్ముడు, ద్రోణుడు " అదేమిటి కుంతీ అలా మాట్లాడింది. ఆమె మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. శ్రీకృష్ణుడు అలాగే మాట్లాడాడు. ఇక ధర్మరాజును పట్టడం మన తరం కాదు " అని సుయోధనుని చూసి " సుయోధనా ! ఇప్పటికీ మించినది ఏమి లేదు. నీవు వెంటనే వెళ్ళి ధర్మ పుత్రుని కలుసుకో . మార్గమధ్యంలో శ్రీకృష్ణుని కలుసుకో సమస్యను శాంతి యుతంగా పరిష్కరించు, సంధి వయసులో ఉన్న మాకు ఈ యుద్ధం ఏల తెచ్చెదవు . మేము చెప్పేది చెప్పాము ఇక నీ ఇష్టం " అని సభ విడిచి వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఒక నిర్జన ప్రదేశంలో రథం ఆపి తమ మాటలు ఎవరూ విన లేదని ధ్రువ పరచుకుని " కర్ణా ! నీకు పెద్దల ఎడల గౌరవ మున్నది. నేను చెప్పేది సావధానంగా విను కుంతీ దేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుని మంత్ర మహిమ చేత నిన్ను కన్నది. నీవు కుంతీ పుత్రుడివి పాండవులలో అగ్రగణ్యుడివి ధర్మరాజుకు ఈ విషయం తెలిసిన నీకు సాష్టాంగ పడి నిన్ను కురు సామ్రాజ్యానికి పట్ట బధ్రుడిని చేస్తాడు. నీవు చక్రవర్తిగా రథంలో వస్తుంటే ధర్మరాజు నీకు వింజామర వీస్తాడు, వాయు పుత్రుడు నీకు ఛత్రం పడతాడు, సవ్యసాచి అర్జునుడు నీ రధానికి సారధ్యం వహిస్తాడు. పాంచాల యాదవ రాజులు నీ వెంట ఉంటారు. అభిమన్యుడు మొదలైన వారు నీ వెంట వస్తారు. దేవేంద్ర వైభవం పొందుతూ రాజ్యాన్ని పాలించు. మరొక విషయం ద్రౌపది తన ఐదుగురు భర్తలతో నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుంది " అన్నాడు. ఇది విని కర్ణుడు " కృష్ణా ! ఈ మాట నేను ఇది వరకే విన్నాను. కుంతీ దేవి దయా విహీన అయి నదిలో వదిలి వేసిన నన్ను ఒక సూతుడు దయతో పెంచి పెద్ద చేసాడు. అతని భార్య కూడా నన్ను ప్రేమతో చూసింది వారు తమ కుమారుల కన్నా మిన్నగా నన్ను చూసుకున్నారు. సూత కులాచార కర్మలన్నీ నాకు జరిపించారు. నీవే కదా ! నాకు పెద్దలంటే గౌరవం అని చెప్పావు. నా తల్లి తండ్రులకు నేను చేయ వలసిన విద్యుక్త కర్మలన్నీ నేను నిర్వహించాలి కదా ! అది విడిచి ఇప్పుడిలా రాజకుమారుడిని అని పాండవుల వద్దకు రావడం ధర్మమా ! ఒక సూతునిగా నాకు బంధు మిత్రులు ఉన్నారు. వారిని విడుచుట ధర్మమా ! సూతుడని చూడక చక్రవర్తి అయిన రారాజు నన్ను తన తమ్ముల కంటే అధికంగా చూసుకుని రాజుని చేసాడు. యుద్ధం ముంచుకొస్తున్న వేళ అతడిని ఎలా విడువ గలను. అర్జునినికి ధీటుగా నన్ను రారాజు తలస్తున్నాడు. అర్జునినితో తలపడక పాండవ పక్షాన చేరిన లోకులు నిందించరా ! కృష్ణా ఈ విషయం ఎవరికి చెప్పక నీ మనసులో దాచుకో ధర్మ పుత్రునికి ఈ విషయం తెలిసిన రాజ్యాధికారానికి ససేమిరా ఒప్పుకోడు. అంతటి ధర్మాత్ముడు రాజ్యం చేయాలి కాని నేను కాదు. ధర్మరాజు యుద్ధమనే యజ్ఞం చేస్తున్నాడు. మిగిలిన పాండవులు ఋత్విక్కులు నీవు ఉపద్రష్టవు. ఆ యజ్ఞంలో కౌరవులనే పశువులను సంహరించి హోమం చేస్తారు. ఆ ధర్మ యజ్ఞంలో పుణ్య భూమి అయిన కురుక్షేత్రంలో మేంమతా సద్గతులు పొందుతాము " అన్నాడు.
కుంతీదేవి కర్ణుని కలుసు కొనుట
[మార్చు]విదురుడు కుంతీ మందిరానికి వెళ్ళి ఆమెతో " అమ్మా కుంతీ దేవి ! కురు వంశం అంతరించే విధంగా కురు పాండవ యుద్ధం దాపురించింది. ఎవరూ శ్రీకృష్ణుని మాట మన్నించ లేదు. పాండవుల బలపరాక్రమాలు తెలిసీ అందునా అర్జునుని గాండీవ మహిమ తెలిసీ కౌరవులు ఈ యుద్ధానికి సిద్ధ పడ్డారు. ఏమి జరుగు తుందో ఏమో " అని ఆందోళన పడ్డాడు. కుంతీదేవి బదులు చెప్పలేదు విదురుడు తన మందిరానికి వెళ్ళాడు. కుంతీ దేవి మనసులో ఎంతో మధన పడింది. ఆమె " కేవలం రాజ్యం కోసం , సంపదల కోసం తమ వారిని చంపు కోవడం ధర్మమా? యుద్ధం చేయడం అంటే క్లేశం కొని తెచ్చుకోవడమే కాని దుఃఖ రాహిత్యం కాదు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహావీరుల వీరావేశం చల్లార్చడం సామాన్యమా ! మిగిలిన వారికి యుద్ధంలో అంత ఉత్సాహం లేక పోయినా కర్ణుని మనసు యుద్ధోత్సాహం , పగలతో రగిలి పోతుంది. కర్ణునికి తన జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పై ప్రేమ కలిగిస్తే కర్ణుడు యుద్ధం మానుకోవచ్చు " అనుకుంది. ఆ సమయంలో కర్ణుడు అనుష్టానం కొరకు గంగా తీరానికి వెళతాడని ఊహించి అతని కొరకు అక్కడకు వెళ్ళింది. కర్ణుడు అనుష్టానం పూర్తి చేసి అక్కడ కుంతీ దేవి కూర్చుని ఉండటం చూసి ఆమెకు తన గోత్రనామాలు చెప్పుకుని అభివాదం చేసాడు " అమ్మా కుంతీదేవి ! తమరు వచ్చిన కార్యం తెలుసుకొన వచ్చునా ! " అన్నాడు. కుంతీ దేవి " కుమారా ! అందరూ అనుకున్నట్లు నీవు సూత పుత్రుడివి కాదు. నేను కన్యగా కుంతి భోజుని ఇంట ఉండగా దుర్వాసుడిచ్చిన వర ప్రభావాన్ని పరిశీలించా లన్న నా చాపల్యం వలన మంత్ర ప్రభావంతో సూర్యుడు నాకు ప్రసాదించిన పుత్రుడివి . కనుక నేటి ధర్మం ప్రకారం నీవు పాండు పుత్రుడివి. క్షత్రియుడివి అయిన నీవు మరొకరికి సేవ చేయవలసిన అవసరం లేదు కౌరవ , పాండవులలో ప్రధముడివి నువ్వే చక్రవర్తివి. ఇక రాధేయుడిగా ఉండవలసిన అవసరం నీకు లేదు. చక్రవర్తివై ఈ లోకాన్ని పాలిస్తూ వైభవాన్ని అనుభవించు " అన్నాది. ఆ సమయంలో సూర్య బింబం నుండి " ఇది నిజం ఆమె చెప్పినట్లు నడుచుకో " అన్న వాణి వినిపించింది. కర్ణుడు " అమ్మా ! నీవు చెప్పినది నీవు చెప్పింది నిజమే కాని క్షత్రియో చితమైన సంస్కారములకు నన్ను దూరం చేసి ఇప్పుడు నన్ను క్షత్రియునిగా నీ కుమారుని చేసి రమ్మనడం భావ్యమా ! నా జన్మ నిందించ తగినది కాదు నేను సూర్య పుత్రుడను ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన విషయం ఇప్పుడు లోకానికి తెలియ చేసి నేను సూర్య పుత్రుడిని కుంతీదేవికి జన్మించానని చెప్పుకుంటూ పాండవ పక్షం చేరితే ఏమి బాగుంటుంది. పరాక్రమంతో వెలుగుతున్న అర్జునినికి భయపడి పాండవ పక్షంలో చేరానని నలుగురూ నన్నూ నా పరాక్రమాన్ని శంకించి నిందించరా ! అమ్మా ! నేను సుయోధనుని వలన రాజుని అయ్యాను, అతని వలన పేరు ప్రతిష్టలు గడించాను అతడు నన్ను నమ్ముకుని ఈ యుద్ధానికి సిద్ధం అయ్యాడు. అతని ఉప్పు తింటున్న నేను అతడిని విడవటం న్యాయమా ! సుయోధనునికి ద్రోహం చేస్తే సాటి రాజులు నన్ను నిందించరా ! అమ్మా! నేను సుయోధనిని తరఫున నీ కుమారులను ఎదుర్కోవడం నిశ్చయం. అయినా నీవు అడిగినందుకు ఒక మాట ఇస్తున్నాను. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఎదురుపడినా వారిని నేను చంపను అర్జునిని మాత్రం చంపక వదలను అర్జునిని చేతిలో చచ్చినా లేక అతడిని చంపినా కీర్తి నిశ్చయం. సుయోధనుడు నన్ను అర్జునిని కొరకు మాత్రమే చేరదీసాడు. అతడిని నమ్మకాన్ని నేను వమ్ము చేయ లేను . అర్జునుడు లేకున్న నాతో అయిదుగురు లేక నేను లేకున్న అర్జునినితో అయిదుగురు ఎలా అయినా నీకు పుత్రులు అయిదుగురే " అన్నాడు. కుంతీ దేవి " విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీవు అర్జునుని మాత్రం చంపడానికి నేను అంగీకరిస్తున్నాను. మిగిలిన వారిని విడిచి పెట్టు " అన్నది. అందుకు కర్ణుడు అంగీకరించాడు.
కృష్ణుడు ఉపప్లావ్యం చేరుట
[మార్చు]ఉపప్లావ్యం చేరిన శ్రీకృష్ణుని పాండవులు ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! దుర్యోధనాదులకు కళ్ళు మూసుకు పోయాయి. వారు నా మాట విన లేదు యుద్ధం తప్పదు " అని అక్కడ జరిగిన విషయములు అన్నీ చెప్పి తన మందిరానికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి పాండవుల వద్దకు చేరిన శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! నేను స్నేహపూర్వకంగా ఎన్నో మాటలు చెప్పాను. కాని నా మాటలు సుయోధనుడు పెడచెవిన పెట్టాడు. ఎవేవో చెప్పి నన్ను హేళన చేసాడు. అవన్ని చెప్పి ప్రయోజనం లేదు " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! సుయోధనుడు నిన్ను హేళన చేస్తుంటే భీష్ముడు, ద్రోణుడు వారించ లేదా? " అన్నాడు. శ్రీకృష్ణుడు " ధృతరాష్ట్రుడు తన శయశక్తులా ప్రయత్నించాడు. గాంధారిని పిలిపించి చెప్పించాడు. దుర్యోధనుడు పెడచెవిన పెట్టాడు. నేను కూడా కురు వంశం , శంతన మహారాజు ఖ్యాతి గురించి వివరించాను. మీ తండ్రి, ధృతరాష్ట్రుని పుట్టుక గురించి , మీ తండ్రి గారి రాజ్య విస్తరణ నీవు చేసిన రాజ్యసూయ యాగం , మాయా జూదం మిమ్ము అధర్మంగా అడవుల పాలు చెయ్యడం గురించి చెప్పాను. మీకు చేరవలసిన రాజ్యభాగం మీకు ఇవ్వకున్న యుద్ధం తప్పదని హెచ్చరించాను. సభకు విచ్చేసిన మునులు కౌరవ ప్రముఖులు కూడా అనేక విధముల చెప్పారు. అన్నీ పెడచెవిన పెట్టిన దుర్యోధనుడు సభా మర్యాదను లెక్క చేయక సభను వదలి వెళ్ళాడు. గాంధారి వచ్చి సుయోధనుని సభకు రప్పించి అనేక విధముల చెప్పింది కాని అన్నీ నిష్ఫలం అయ్యాయి. నేను కూడా కోపం తెచ్చుకున్నాను. కాని తిరిగి శాంతం వహించి పరి పరి విధముల బోధించాను. సుయోధనుడు నన్ను బంధించ చూసాడు. నేను నా మాయను ప్రదర్శించి దానిని నివారించాను. నా సంధి ప్రయత్నం విఫలం అయింది ఇక యుద్ధం అని వార్యం " అన్నాడు.
పాండవుల యుద్ధ సన్నాహ నిర్ణయం
[మార్చు]ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పినది తమ్ములకు వివరించి యుద్ధ సన్నాహాలకు దిగమని చెప్పాడు. కృష్ణుని చూసి " కృష్ణా ! మా గురించి పాండవుల గురించి తెలిసిన నీవే కర్తవ్యాన్ని బోధించు " అన్నాడు. శ్రీకృష్ణుడు " ప్రస్తుతం యుద్ధమే తక్షణ కర్తవ్యం. మీ తల్లి గారు మిమ్ము మీ పరాక్రమాలు ప్రదర్శించి రాజ్యాన్ని పొందమని ఆదేశించింది " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! బంధు, మిత్ర నాశనం అయిన యుద్ధానికి నా మనస్సింకా అంగీకరించుట లేదు వేరు మార్గం అన్వేషించుట మంచిది కదా! " అన్నాడు. అర్జునుడు " అన్నా! ఏది హితమో ఏది ధర్మమో మనకంటే కృష్ణుడే ఎరిగిన వాడు. మన తల్లి గారి ఆదేశం అదే ఇక మనకు సందేహం ఎందుకు " అన్నాడు. ధర్మరాజు " అన్నా ! అఖిల ధర్మజ్ఞాని శ్రీకృష్ణుడు చెప్పిన మాటకు తిరుగు లేదు యుద్ధ సన్నాహాలు చెయ్యక తప్పదు. మనకున్నది ఏడు అక్షౌహినుల సైన్యం. దానిని సమర్ధంగా నిర్వహించడానికి భీష్మునికి నిగరైన సైన్యాద్యక్ష్యుని నిర్ణయించి అభిషిక్తుని చెయ్యడం మన కర్తవ్యం. అటువంటి వీరుడెవరో నాకు చెప్పండి " అని తమ్ములను ఉద్దేశించి అన్నాడు. సహదేవుడు " అధిక బాహుబలం కలవాడు పుత్రులు, పౌత్రులు , సోదరులు కలవాడు అయిన మత్స్య దేశాధిపతి , విరాటుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు " అని సహదేవుడు అన్నాడు. ఆ తరువాత నకులుడు లేచి " అన్నయ్యా ! ఎక్కువ బలగము బాహుబలం కలిగిన ద్రుపద మహా రాజు మనకు తగిన సైన్యాధ్యక్షుడు. అర్జునుడు లేచి " అన్నయ్యా ! కేవలం ద్రోణుని చంపుటకు అగ్ని కుండములోనుండి పుట్టిన వాడు, ధనుర్భాణములతో పుట్టిన వాడు, అత్యధిక బాహుబలం పరాక్రమం కల వాడు అయిన దృష్టద్యుమ్నుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు . అతను తప్ప భీష్ముని అడ్డుకుని నిలబడ గలవాడు వేరొకడు లేడు. అతని తమ్ముడు శిఖండి పరాక్రమ వంతుడు. భీష్ముని చంపటానికి పుట్టిన వాడు కనుక దృష్టద్యుమ్నుడు మన సైన్యాధ్యక్షుడు " అని పలికాడు . ధర్మరాజు " కృష్ణా ! నీవే చెప్పు సకలము తెలిసిన నీవే తగిన సైన్యాధ్యక్షుని నిర్ణయించి మన ఏడు అక్షౌహినుల సైన్యానినికి ఒక్కొక్క అక్షౌహినికి ఒక నాయకుని నిర్ణయింపుము " కృష్ణుని వేడుకున్నాడు. కృష్ణుడు " ధర్మజా ! అర్జునుడు చెప్పిన విధముగా దుష్టద్యుమ్నుడే మన సైన్యానికి తగిన నాయకుడు. అతడిని సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకింపుము. అలాగే ద్రుపదుడిని, విరాటుని, సాత్యకి, జరాసంధుని కుమారుడైన సహదేవుడు, చేకితాసుడు, శిశుపాలుని కుమారుడు దుష్టకేతు, ద్రుపద కుమారుడైన శిఖండి మొదలైన ఏడుగురిని అక్షుహినీ నాయకులను చేద్దాము. ఇక నీ తమ్ములతో కలిసి యుద్ధానికి బయలు దేరుము " అన్నాడు.
పాండవులు యుద్ధానికి బయలు దేరుట
[మార్చు]కృష్ణుని మాట శిరసా వహించిన ధర్మరాజు మరునాడు సభలో యుద్ధ ప్రకటన చేసాడు. ముందుగా అనుకున్నట్లు సైన్యాధ్యక్షులను నియమించి యుద్ధ భేరీలను మ్రోగించమని ఆజ్ఞాపించాడు. ముందుగా పాండవులు ద్రౌపది దగ్గరకు వెళ్ళి ఆమె వద్ద వీడ్కోలు తీసుకున్నారు. బ్రాహ్మణులను అర్చించి వారి దీవెనలను తీసుకున్నారు. కృష్ణుడు రథం ఎక్కి సారధి స్థానంలో కూర్చున్నాడు. గాండీవం, అక్షయ తుణీరాలతో అర్జునుడు రథం అధిరోహించాడు. అర్జునుడు పాంచజన్యము శ్రీకృష్ణుడు దేవదత్తం అనే శంఖాలను పూరించారు. కురుక్షేత్రానికి అంతా పెళ్ళికి వెళుతున్నట్లు బయలు దేరారు. దృష్టధ్యుమ్నుడు ధర్మరాజుకు నమస్కరించి సైన్యాధ్యక్షుడుగా ముందుకు నడిచాడు. అతని వెంట ధర్మరాజు తమ్ములతో, యుద్ధమునకు వచ్చిన రాజులతో బయలు దేరాడు. వారి వెంట సమస్త సైన్యం , భటులు, పరిచారకులు నడిచారు. వారంతా కురుక్షేత్రానికి చేరి హిరణ్వతీ నదీ తీరాన ఒక చదునైన ప్రదేశంలో విడిది చేసారు.
కౌరవ యుద్ధ సన్నాహం
[మార్చు]వేగుల వారి వలన పాండవ సైన్యాల రాకను గురించి తెలుసుకున్న దుర్యోధనుడు ఏమీ తెలియని వాడి వలె ప్రవర్తిస్తూ కురుసభలో " కృష్ణుడు తనకు అనుకూలంగా ప్రవర్తించ లేదని మన మీద కోపంతో పాండవులను రెచ్చగొట్టి యుద్ధానికి సన్నద్ధం చేసి దండయాత్రకు తీసుకు వస్తాడు. కనుక మనం కూడా యుద్ధం ప్రకటిస్తాము. అన్నాడు. మన సైన్యాలతో కురుక్షేత్రంలో విడిది చేద్దాం" అన్నాడు. ఆ పై దుశ్శాసనుడిని చూసి " నీవు, కర్ణుడు, శకుని యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేయండి అని అజ్ఞాపించాడు. సుయోధనుని అజ్ఞాను సారం యుద్ధం ప్రకటించ బడింది. మరునాడు సుయోధనుడు సభలో భీష్ముని, కర్ణుని, అశ్వథామను, బాహ్లికుని, శల్యుని, కృపాచార్యుని, భూరి శ్రవుని, శకునిని, కృతవర్మను, కాంభోజి రాజును, సైంధవుని తన పదకొండు అక్షౌహినులకు నాయకులుగా అభిషేకించి వారితో భీష్ముని వద్దకు వెళ్ళాడు. భీష్మునితో " పితామహా ! వీరంతా మన పదకొండు అక్షౌహినిల అధ్యక్షులు వివిధ దేశములకు చెందిన వీరిని ఒక తాటి మీద నడిపించ వలసిన బాధత మీ మీద ఉన్నది కనుక మీరు మా సర్వ సైన్యాలకు అధ్యక్షత వహించండి " అని ప్రార్థించాడు. భీష్ముడు " సుయోధనా ! నాకు మీరు పాండవులు సమానమే నేను మీ వద్ద ఉన్నాను కనుక మీ తరపున యుద్ధం చేస్తాను. నేను నీవు కోరినట్లు సర్వసైన్యాధ్యక్ష పదవి వహిస్తాను . నన్ను ఎదిరించగల వీరుడు అర్జునుడు మాత్రమే. నేను శత్రువులను అందరినీ సంహరిస్తాను కాని పాండు కుమారులను ఏమీ చేయను. వారు కూడా నన్నేమి చేయరు. కాని విధి నిర్ణయం ఎలా ఉంటే అదే జరుగుతుంది. కాని ముందు నేను యుద్ధం చేయాలా కర్ణుడు యుద్ధం చేయాలో నిర్ణయించు. అది తేలితేనే నేను సకల సైన్యాధిపత్యం వహిస్తాను " అన్నాడు. కర్ణుడు " ఈ ప్రస్థావన మళ్ళీ ఎందుకు. భీష్ముడు ఎప్పుడు పడి పోతాడో అప్పుడు నేను యుద్ధానికి వస్తాను అని ముందే చెప్పాను కదా " అన్నాడు. భీష్ముడు " సుయోధనా! అలాగే జరుగుతుంది లే " అన్నాడు. ద్రోణ, కృపాచార్య తదితరుల వద్ద అనుమతి తీసుకుని భీష్ముని సర్వసైన్యాధ్యక్షుని చేసాడు. తల్లి తండ్రుల వద్ద అనుమతి తీసుకుని సుయోధనుడు యుద్ధానికి బయలుదేరి కురుక్షేత్రానికి చేరి రమణీయమైన ప్రదేశంలో విడిది చేసాడు.
బలరాముని వేదన
[మార్చు]కురువంశంలో అనివార్యమైన యుద్ధానికి బలరాముని మనసు క్లేశం చెందింది. అతడు చాలా దుఃఖించాడు. అతడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు సోదర సమేతంగా బలరాముని సాదరంగా ఆహ్వానించాడు. బలరాముడు " కౌరవ పాండవులు అత్యంత క్రూరులై ఈ భూమిలో ఉన్న రాజులకు కీడు కలిగే యుద్ధం చేయ సమకట్టడం తగునా ! యుద్ధం నాకు సమ్మతం కాదు. కృష్ణునితో సంధి కుదర్చమని చెప్పాను అతడు నా మాటను లెక్క చేయక యుద్ధాన్ని సమకూర్చాడు. మాట్లాడటం చేతగాని వారిని మంచి మాటలతో ఒప్పించాలి కాని వారిని రెచ్చగొట్టి సంధి చెడగొట్టడం మంచి పనా. కృష్ణునికి పాడవులు కౌరవులూ సమానమే కాని అతడు అర్జునుని పట్ల అభిమానం పెంచుకుని పాండవులను ఒక చోట నిలువ నీయక వెంట వేసుకుని తిప్పుతున్నాడు. అయినా పాండవులకు జయం కౌరవులకు అపజయం తప్పదు. నేను ఈ యుద్ధం చూడలేను నా శిష్యులైన సుయోధన , భీములు ఒకరిని ఒకరు కొట్టు కుంటుంటే నేను ఎలా చూడగలను. కనుక నేను సరస్వతీ తీరానికి వెడుతున్నాను " అని కృష్ణుడు ధర్మరాజు సాగనంపగా తీర్ధ యాత్రకు బయలు దేరాడు .ఆ తరువాత కృష్ణుని బావమరిది కుండిన నగరాధీశుడైన రుక్మి ధర్మరాజును చూడవచ్చాడు. రుక్మి అర్జునిని చూసి " అర్జునా ! నీకు యుద్ధం చేయ భయమైన నాకు చెప్పు నేను యుద్ధం చేస్తాను నన్ను గెలిచే వీరుడు ఈ భూలోకంలో లేరు " అన్నాడు. అతని ప్రగల్భాలకు అర్జునుడు నవ్వి " రుక్మీ ! నేను గంధర్వులతో యుద్ధం చేయునప్పుడు , గోగ్రహణంలో పోరు సల్పినప్పుడూ తమరు ఎక్కడ ఉన్నారు ! నాకు నీ సాయం అక్కర లేదు. నీ సాయం ఎవరికి అవసరమో వారికి సాయం చెయ్యి అన్నాడు. నాకు యుద్ధం అంటే భయం కలిగి నిన్ను పిలిచి నపుడు కదా నీవు రావలసింది అప్పుడు నాకు సాయపడటానికి వీరంతా ఉన్నారు " అన్నాడు. రుక్మి సుయోధనుని వద్దకు పోయి అలాగే ప్రగల్భాలు పలుకగా అతడు కూడా రుక్మి సాయాన్ని నిరాకరించాడు. బలరాముడు, రుక్మి తప్ప మిగిలిన రాజులంతా యుద్ధంలో పాల్గొన్నారు.
సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధాన్ని గురించి వివరించుట
[మార్చు]ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి " విధి ఎలా ఉంటే అదే జరుగుతుంది మార్చడం మన తరంకాదు కదా ! యుద్ధభూమిలో మరణించడం కంటే రాజులకు గౌరవం ఏమున్నది. యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో వివరించు " అన్నాడు. అందుకు సంజయుడు " మహారాజా ! నీ కుమారుడు సుయోధనుడు దుశ్శాసన, కర్ణ, శకునులతో యోచించి శకుని కుమారుడైన ఉలూకుని ధర్మరాజు వద్దకు రాయభారం పంపాడు. ధర్మరాజు శ్రీకృష్ణ, ద్రుపద, విరాటాదులతో సభ కూర్చి ఉన్న సమయంలో చెప్పమని ఇలా పలికాడు. ఉలూకుడు దర్మరాజు వద్దకు వెళ్ళి " ధర్మరాజా ! నా మీద కోపం తెచ్చుకొనక సుయోధనుని మాటగా నేను పలుకుతున్న మాటలను సావధానంగా వినండి " అన్నాడు. ధర్మరాజు " ఉలూకా ! నీవు ఆ బుద్ధిమంతుడు చెప్పిన తులువ మాటలు నిర్భయంగా చెప్పవచ్చు " అన్నాడు.
పాండవులకు సుయోధనుడు పంపిన హెచ్చరిక
[మార్చు]ఉలూకుడు " ధర్మరాజా ! యుద్ధం చేయడానికి చాలా రోజులు ఆలోచించి యుద్ధానికి వచ్చావు. సంజయినితో మీరు చాలా అధికంగా మాట్లాడారు. మీ రాజ్యమును పోగొట్టు కున్నందుకు, ద్రౌపదిని మేము అవమాన పరచినందుకు కోపించి నీ వారిని మొహరించుకుని యుద్ధానికి వచ్చావు. ఇక నీవు తప్పించుకోలేవు. ఇక మీకు భీష్మ, ద్రోణుల బాణధాటి తప్పదు. అర్జునుడు వారి బాణాల బారిన పడక తప్పదు. కృష్ణుడు మీ పక్కన ఉండగా మాకు భయ మెందుకులే. అతడే మీ పనులన్నీ చక్క బెట్టగలడులే . భీమ సేనా ! నీవు నూతిలో కప్పలా ఊహిస్తావు ఎదుటి వాడి బలం నీకు తెలియదు. దుశ్శాసనుడి రక్తం తాగుతానని శపథం చేసావుగా ఆలస్య మెందుకు రా ముందుకు ఎలా తాగుతావో నేను చూస్తాను. అర్జునా ! తాటి చెట్టంత విల్లు ఉందని కృష్ణుడు పక్కన ఉన్నాడని విర్రవీగకు నీకు భయపడి రాజ్యం ఇస్తానని అనుకోకు. ద్రౌపదిని దుశ్శాసనుడు సభకు ఈడ్చుకు వస్తున్నప్పుడు మీ ఆయుధాలు ఎక్కడకు పోయాయి. పేడి రూపంతో అర్జునుడు, వంటల వాడిగా భీముడు సిగ్గులేకుండా సామంతుని సేవించడం శూర లక్షణమా ! సిగ్గు లేక రాజ్యాన్ని పొందాలని యుద్ధానికి వచ్చారా ! మీరు ఎంత ప్రగల్భాలు పలికినా ఏభై వేల భీమార్జునులు కలసి వచ్చినా యుద్ధం చేస్తాను కాని రాజ్యం పంచి ఇవ్వను " అన్నాడు.
పాండవుల సమాధానం
[మార్చు]ఆ మాటకు నకుల, సహదేవులూ, భీమార్జునులు కోపంతో ఊగి పోయారు. కృష్ణుడు వారిని వారించి " ఉలూకా ! నువ్వు సుయోధనుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పు. సుయోధనా ! రేపే యుద్ధం వీరుడవైతే యుద్ధం చేసి మరణించు. నా సారథ్యంలో అర్జునుడు నిన్ను వెంట తరిమి నీ సైన్యాలను చీల్చి చెండాడినప్పుడు నీకు ఎవరు వీరులో తెలుస్తుందిలే. భీముడు దుశ్శాసనుని రక్తం తాగటం తప్పదు. మీ వీరుల పరాక్రమ మేమిటో రేపు యుద్ధంలో చూడగలవు. వృద్ధుడైన భీష్ముని బలాన్ని నమ్ముకుని యుద్ధానికి వచ్చిన నీ గర్వాన్ని అర్జునుడు వమ్ము చేయక మానడు. భీస్ముని ప్రతాపం అడ్డు పెట్టుకుని గెలవాలని అనుకుంటున్నావు మొదటి ముద్దగా అతడిని మింగక మానము. ఆ పై ద్రోణుడు, కర్ణుడు మడియక మానరు అప్పుడు కాని అతని ఆశ చావదు. సోదర, కుమారుల బంధువుల మరణానంతరం భీముని గదా ఘాతంతో నేలపై పొర్లుతున్నప్పుడైనా పశ్చాత్తాప పడతాడో లేదో ! నీవు వెంటనే వెళ్ళి సుయోధనుని యుద్ధానికి ధైర్యంగా సిద్ధం కమ్మని చెప్పు " అన్నాడు. ఆ పై ధర్మరాజు ఉలూకునికి తాంబూలాలు ఆభరణాలు ఇచ్చి పంపాడు.
సుయోధనుడు భీష్ముని అడిగి తన సైన్యంలోని బలాబలాలు తెలుసుకొనుట
[మార్చు]ఉలూకుడు ధర్మరాజు చెప్పినది యధాతధంగా సుయోధనునికి చెప్పాడు. ఉలూకుని మాటలువిని భీష్ముడు " సుయోధనా నేను ఉండగా నీకు భయం ఎందుకు నేను సేనలను సమర్ధవంతంగా నడిపి నీకు జయం చేకూరుస్తాను " అన్నాడు. సుయోధనుడు " తాతా మీరు, ద్రోణుడు తోడు ఉండగా నాకు భయం ఎందుకు. చిటికలో వారి మదం అణచగలను. గంధర్వ, కిన్నెర, దానవులకు భయపడని నేను అల్పులైన పాండవులకు భయపడతానా ! మన పక్షంలో శత్రు పక్షంలో ఉన్న వీరుల గురించి చెప్పండి " అన్నాడు. భీష్ముడు " సుయోధనా ! అతిరధుడవైన నీవు, సమరధులైన నీ తమ్ములు, నా గురించి నీకు చెప్పవలసిన పని లేదు, అతిరధులైన శల్యుడు, భూరిశ్రవుడు ఉన్నారు. సైంధవుడు మహారధుడు, కాంభోజరాజు, సుదక్షిణుడు సమరధులు, మహిష్మతి అధిపతి నీలుడు అర్ధరధుడు, అవంతీ దేశాధీశులు విందాను విందులు అర్ధరధులు, త్రిగర్తాధీపతులు ఐదుగురు మహారధులు, నీకుమారుడు లక్ష్మణకుమారుడు సమరధుడు, బృహద్బలుడు అర్ధరధుడు, దండధారుడు అర్ధరధుడు, శకుని సమరధుడు, కృపాచార్యుడు అతిరధ శ్రేష్టుడు, ద్రోణాచార్యుడు అతిరధ శ్రేష్టుడు, అశ్వథామ అర్జునినితో సమానంగా యుద్ధం చేయగల వాడు. బాహ్లికుడు, అతని కుమారుడు సోమదత్తుడు అతిరధులు, అలంబసుడు, భగదత్తుడు సమరధులు, కర్ణుడు అర్ధరధుడు అతడు జన్మతః లభించిన కవచ కుండలాలను కోల్పోయాడు, పరశురాముని శాపకారణంగా శక్తి హీనుడైయ్యాడు కనుక అర్జునిని గెలువలేడు " అన్నాడు భీష్ముడు. అప్పుడు ద్రోణుడు " అంతే కాదు అతడు ప్రగల్భములు చెప్పటంలో అతడు ముందు ఉంటాడు. పిరికితనంతో వెనుతిరగడంలో నేర్పరి. ఎల్లప్పుడూ పరాకుగా ఉంటాడు. కనుక భీష్ముడు చెప్పినట్లు అతడు అర్ధరధుడే " అన్నాడు ద్రోణుడు.
కర్ణుడి ఉద్రేకం
[మార్చు]కర్ణుడు ముఖం కోపంతో ఎర్రబడగా " పితామహా ! నా మీది ద్వేషంతో ఇలా పలుక తగునా ! నాడు సభలో ఇలాగే చెప్పావు సుయోధనుని ముఖం చూసి ఓర్చుకున్నాను. నా దృష్టిలో నీవూ అర్ధ రథుడివే " అని మిగిలిన వారిని ఉద్దేశించి ఇతడిని మనం హితుడని నమ్మ వచ్చునా ! ఒక్కొక్క రాజుని చూసి ఎక్కువ తక్కువలు చూపుతున్నాడు ఇది విన్న వారు ఏమి అనుకుంటారు " అని సుయోధనునితో " మిత్రమా ! కార్యం చెడింది. నీ సముఖంలో ఇలా జరగడం విచారకరం. అసలు భీష్ముని బలం ఏపాటిది పాండవ పక్షపాతి అయిన అతడిని నమ్మి ఎలా యుద్ధం చేయగలం. ఇతడిని వదిలించుకుంటే మనకు వచ్చే నష్టం ఏమి. మిగిలిన రాజుల మనసు కుదుట పడుతుందిగా. ఇతడి అధ్యక్షతలో మన రాజులు యుద్ధం ఎలా చేయగలరు. వయసులో పెద్ద వాడు కనుక ఇతడి మాటలు గౌరవించండి కాని మన్నించకండి ఇతడు యుద్ధ భూమిలో ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను అన్నాడు " అన్నాడు. భీష్ముడు కర్ణుని మాటలు విని " ఏమి కర్ణా! నేను ముసలి వాడినా ! నా అస్త్రబలం ఎలాంటిదో నా గురువు పరశురాముని అడిగి తెలుసుకో ! నన్ను ఎదిరించిన వారికి పట్టిన గతి లోకానికి తెలుసు. నీ పడచుదనం నా ముసలి తనం అర్జునుడు చూస్తాడులే సూతనందనా ! నీ వలన నా గురించి చెప్పుకోవలసి వచ్చింది. నీ కార్యాలోచనతో కౌరవులకు తెచ్చిన అనర్ధాన్ని తొలగించడానికి మా శక్తి చాలదు. యుద్ధం చేయభయపడి నా మీద నెపం పెట్టి తప్పించుకున్నా తరువాత యుద్ధం ఎదుర్కొనక తప్పదు. యుద్ధంలో నీ ప్రతాపం చూపించు. క్రమక్రమంగా యుద్ధంలో అర్జునుని చేత అతిరధ, మహారధులంతా చావగా మిగిలిన సైన్యాలతో యుద్ధం చేసే సమయంలో నీ యుద్ధ పటిమ సుయోధనుడు తెలుసు కుంటాడులే. సుయోధనుడు నా పై యుద్ధభారం పెట్టాడు కనుక నీ మాటలు సహించి నిన్ను ప్రాణంతో వదులు తున్నా ఇక ఊరుకో " అన్నాడు. సుయోధనుడు కలవరపడి " పితామహా ! మీరు ఇలా మాటాడ తగునా నా కొరకు ముందు ఉన్న కార్యసాధన కొరకు సహించండి " అని గాంగేయుని శాంతపరచి. కర్ణునితో " కర్ణా! నీవు పితామహుడు ఒకటై కార్య సాధన చేయాలి కాని ఇలా వాదులాడటం తగదు " అని కర్ణుని శాంతపరచి భీష్ముని చూసి " పితామహా ! పాండవపక్షంలో ఉన్న వీరులగురించి వివరించండి " అని కోరాడు . భీష్ముడు " సుయోధనా! నేను పాండవ పక్షంలో ఉన్న వీరుల గురించి చెపితే కర్ణుని మనసు నొచ్చు కుంటుంది నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. వారి గురించి చెప్పక పోవడమే మంచిది " అన్నాడు.
సుయోధనుడు భీష్ముని అడిగి పాండవ సైన్యంలోని బలాబలాలు తెలుసుకొనుట
[మార్చు]సుయోధనుని బలవంతం మీద భీష్ముడు పాండవ సైన్యంలోని వీరుల గురించి చెప్పసాగాడు " ధర్మరాజు అతిరధుడు, భీమసేనుడు అతిరధ శ్రేష్టుడే కాక మహా బలవంతుడు, నకుల, సహదేవులు సమరధులు, అర్జునుడు ఇలాంటి వాడని చెప్పడం నాకు శక్యం కాదు అతనికి సమాన వీరులు ఈ భూమి మీద ఇప్పటి లేరు ఇక పుట్టడు. అతడికి శ్రీకృష్ణుడు తోడు ఉన్నందున ఇక చెప్పవలసిన పని లేదు. అతడు ఒక్కడే తన సేనలను రక్షిస్తూ శత్రు సేనలను నాశనం చేయ గలడు. ఇక ద్రౌపదికి పుట్టిన ఉపపాండవులు మహారధులు, ఉత్తరుడు వారికి సమానుడు, అభిమన్యుడు అతిరధ శ్రేష్టుడు యుద్ధనైపుణ్యం తెలిసిన వాడు కృష్ణార్జునులకు సమానుడు. సాత్యకి అతిరధుడు, ద్రుపదుడు, విరాటుడు, శిఖండి మహారధులు, దృష్టద్యుమ్నుడు అతిరధుడు అతని కుమారుడు దృతవర్ముడు అర్ధరధుడు, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, క్షత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు మహారధులు. కేకయ రాజులు అయిదుగురు మహారధులు. కాశీశుడు, నీలుడు, సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంఖుడు, మహారధులు. చత్రాయునుడు, చేకితానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారధులు. కాశ్యుడు సమరధుడు, కుంతిభోజుడు అతిరధుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు అతిరధుడు రాక్షస నాయకుడు. వీరందరిని ఎలాగైనా నేను చంపగలను కాని శిఖండిని నేను చంపలేను " అన్నాడు.
శిఖండి పూర్వజన్మవృత్తాంతం
[మార్చు]సుయోధనుని కోరికపై భీష్ముడు శిఖండి గురించి చెప్పసాగాడు " సుయోధనా ! నేను రాజ్యాధికారం వహించనని వివాహం చేసుకోనని మా తండ్రి వివాహ సమయంలో ప్రతిజ్ఞ చేసాను. కనుక నా తండ్రి మరణానంతరం నా తమ్ముడు చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేసాను. దుందుడుకు స్వభావం కలిగిన చిత్రాంగధుడు గంధర్వునితో తలపడి అతడి చేతిలో మరణించాడు. ఆ తరువాత విచిత్రవీర్యునికి రాజ్యాభిషేకం చేసాను. అతడికి వివాహ వయసు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు నేను అతడి కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను రథంపై ఎక్కించుకుని బలవంతంగా హస్థినాపురానికి తీసుకువచ్చాను. వారిని ముగ్గురిని విచిత్రవీర్యుని వివాహం చేసుకొమ్మని చెప్పాను. వారిలో అంబ అప్పటికే సాళ్వుని ప్రేమించి ఉంది ఆ విషయం తెలియని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు, నాకూ ఆ విషయం తెలియకుండా ఆమెను హస్థినకు తీసుకు వెళ్ళాను. అంబ నాతో " మీరు ధర్మాత్ములు నేను మనసారా సాళ్వుని ప్రేమించాను కనుక మనసులేని మనువు చేసుకొనజాలను నన్ను సాళ్వుని వద్దకు పంపించు " అని అడిగింది. నేను నా తప్పు గ్రహించి ఆమెను సాళ్వుని వద్దకు పంపాను కాని అతడు " భీష్ముడు నిన్ను బలవంతంగా తీసుకు వెళ్ళాడు కనుక నేను నీ కన్యాత్వాన్ని నమ్మజాలను కనుక తిరిగి అతని వద్దకే వెళ్ళు " అన్నాడు. ఆమె జరిగినది అంతా వివరించి సాళ్వుని ఎంత వేడినా ఫలితం శూన్యం. ఆమె ఇదంతా భీష్ముని వలనే జరిగిందని చింతించి అతనిపై ఎలాగైనా పగతీర్చు కోవాలని నిర్ణయించుకుని మహా వీరుడైన భీష్ముని జయించడానికి తపస్సు తప్ప మరే మార్గం లేదని గ్రహించి తపోభూమికి చేరుకుంది. అక్కడ ఉన్న మునులకు తనగాధ వివరించింది. వారు ఆమెకు తపస్సు స్త్రీలకు కఠినమని తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పారు. ఆమె వారితో " అయ్యా ! నేను ఇక నా తండ్రి వద్దకు కాని, బంధువుల వద్దకు గాని వెళ్ళలేను. కనుక ఇక్కడ తపస్సు చేసుకోవడమే నా నిర్ణయం " ఆ సమయంలో అక్కడకు వచ్చిన హోత్రవాహనుడు అనే రాజర్షి అక్కడకు వచ్చి అంబను గురించి తెలుసుకుని " అంబా ! నీవు నాకు వరసకు మనవరాలివి. నిష్కారణంగా శిక్షింపబడిన నీవు తపస్సు చేయడమెందుకు ? ఇందుకు నేను ఒక మార్గం చెప్తాను నీకు అపకారం చేసిన భీష్ముని గురువైన పరశురాముని వద్దకు వెళ్ళి సహాయం అడిగావంటే అతడు తన శిష్యుడైన భీష్మునికి చెప్తాడు అతని మాటను భీష్ముడు మీరజాలడు " అన్నాడు.
అంబ పరశురాముని శరణు వేడుట
[మార్చు]శిష్యుడు చెప్పిన విధంగా పరశురాముడు హోత్రవాహనుడి ఇంటికి వచ్చాడు. హోత్రవాహనుడు పరశు రాముని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించిన పిదప అంబ వృత్తాంతం వివరించాడు. పరశురాముడు అంబను చూసి " అంబా ! నీకు భీష్ముడు, సాళ్వుడు ఇద్దరూ అపకారం చేసారు. నేను ఎవరిని శిక్షించాలో నీవే నిర్ణయించు " అన్నాడు. అంబ " మహాత్మా ! ఏది ఏమైనా సాళ్వుడు ఇక నన్ను స్వీకరించడు. కనుక భీష్ముని వద్దకు వెళ్ళి న్యాయం అడగాలి " అన్నది. పరశురాముడు అంబను వెంట పెట్టుకుని నా వద్దకు వచ్చాడు. అతడు ముందుగా సరస్వతీ తీరాన విడిది చేసి నాకు వర్తమానం పంపాడు. నేను గురువుగారిని దర్శించి అర్ఘ్యపాద్యములు సమర్పించి సత్కరించాను. నా వినయ విధేయతలకు సంతోషించిన పరశురాముడు " గాంగేయా ! ఈ కన్యను బలవంతంగా ఎందుకు తెచ్చావు. వచ్చిన తరువాత తిరస్కరించడం ధర్మమా ! " అని అడిగాడు. నేను ఆమె ప్రేమవృత్తాంతం విని ఆమెను సాదరంగా సాళ్వుని వద్దకు పంపాను ఇందు నా అపరాధం ఏమున్నది " అన్నాను. పరశురాముడు కోపించి అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చేయకున్న నిన్ను నీ బంధు మిత్రులను, పరి వారాన్ని నాశనం చేస్తాను " అన్నాడు. భీష్ముడు " నాకు విద్య నేర్పిన నీవే నా మీద కోపించడం తగునా ! " అన్నాను. పరశురాముడు " గాంగేయా ! నీవెన్ని చెప్పినా నీవు అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చేయనిదే నా కోపం తగ్గదు " అన్నాడు. నేను " గురువర్యా ! మీరు నన్ను అధర్మం చెయ్యడానికి పట్టుబడుతున్నారు. వేరొకరి మీద మనసు పడిన కన్యను నేను ఎలా నా తమ్మునికిచ్చి పరిణయం చేయగలను. ఇంతకన్నా మీ ఆగ్రహానికి గురి కావడమే మేలు. అధర్మానికి పురికొల్పే వాడు గురువైనా దండనార్హుడే అని పెద్దలు చెప్పారు కదా ! " అన్నాడు. పరశురాముడు ఆ మాటలకు కోపించి గాంగేయా ! యుద్ధానికి సిద్ధంగా ఉండు " అన్నాను నేను " గురువర్యా ! మీరు ఇదివరకే అహంకరించి క్షత్రియ వంశం నాశనం చేసారు. అప్పుడు భీష్ముడు లేడు ఇప్పుడు ఉన్నాడు. ఇక మీ ఆటలు సాగవు నేను యుద్ధం చేయ సిద్ధంగా ఉన్నాను " అన్నాను.
పరశురామునితో భీష్ముని యుద్ధం
[మార్చు]నేను నా తల్లి సత్యవతీదేవికి జరిగినది వివరించి ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యాను. నా తల్లి గంగాదేవి ఇది విని పరశురాముని చూసి నచ్చ చెప్పబోయింది ఆయన వినక పోవడంతో ప్రయోజనం లేదని ఆమె వెను తిరిగింది. అకృతవర్ణుని సారథ్యంలో పరశురాముడు యుద్ధభూమికి వచ్చాడు. నేను నా గురువుకు నమస్కరించి యుద్ధం ఆరంభించాను. పరశురాముడు నాపై శరవర్షం కురిపించాడు. నేను వాటిని అన్నిటినీ తుంచి పరశురాముని విల్లు విరిచాను అతడు మరో విల్లు తీసుకున్నాడు. నా బాణప్రయోగంతో అతని ఒళ్ళంతా తూట్లు చేసాను. అధిక రక్త స్రావం వలన పరశురాముడు మూర్చిల్లాడు. అతడిని చూసి నన్ను నేనే నిందించుకున్నాను. పరశురాముడు తేరుకుని నా పై అస్త్రం సంధించాడు. అది ఏమి అస్త్రమో నాకు తెలియదు అది నన్ను గాయపరిచింది సారథి నన్ను పక్కకు తీసుకు వెళ్ళాడు. ఇంతలో నేను తేరుకుని పరశురాముని బాణాలతో ముంచాను. ఈ విధంగా మేమిరువురము ఘోరంగా ఇరవై రెండు రోజులు యుద్ధం చేసాము. చివరకు నేను పరశురామునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను. దాని ప్రభావానికి పరశురాముడు మూర్చిల్లాడు. అక్కడి మునులంతా వ్యాకులపడ్డారు. మూర్ఛలో నుండి తేరుకుని అతడు నా సారథిని చంపి నన్ను బాణాలతో కొట్టాడు. ఆ ధాటికి నేను మూర్ఛిల్లాను. ఆ సమయంలో బ్రాహ్మణులు కొందరు నాకు సేవ చేసారు. నా తల్లి గంగాదేవి నా రథం నడిపింది. నేను మూర్ఛ నుండి తేరుకున్నతరు వాత నా తల్లి నాకు రథం అప్పగించి వెనుతిరిగింది. ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణులు కలలోకి వచ్చి భీష్మా మేము నీవు ఒక్కటే పరశురాముని జయించగల అస్త్రం ఇదొక్కటే అని నాకు మోహనాస్త్రం ఇచ్చారు. నేను దానిని ప్రయోగ ఉపసంహారాలతో అభ్యసించి యుద్ధానికి వెళ్ళాను. పరశురాముడు " నిన్న సగం చచ్చి వెళ్ళావు కదా ! ఈ రోజు నీ మదం అణచగలను రా అని నా పై అనేక బాణాలు సంధించాడు. నేను అతని పై శక్తి అస్త్రం ప్రయోగించాను. ఆ ప్రభావానికి అతడు మూర్ఛిల్లగా అకృతవర్ణుడు అతడిని మూర్ఛ నుండి తేరుకునేలా చేసాడు. ఆయన ఆగ్రహంతో నాపై బ్రహ్మాస్త ప్రయోగం చేసాడు. నేను ఆయన అస్త్రాన్ని అదే అస్త్రంతో నివారించాను. ఆ అస్త్రాలు లోకాల్లో విలయాన్ని సృష్టిస్తున్నాయి.
పరశురామ భీష్ముల యుద్ధ విరమణ
[మార్చు]నేను అతడిపై మోహనాస్త్రాన్ని ఆవాహన చేసాను. ఇంతలో నారదుడు వచ్చి " గాంగేయా ! మోహనాస్త్రప్రయోగం నీకు ఉచితం కాదు అన్నాడు " అని వారించాడు. అష్ట వసువులు కూడా నన్ను వారించారు నేను వారి మాట విని బాణాన్ని ఉపసంహారం చేసాను. పరశురాముని తండ్రి పితృ దేవతలతో వచ్చి " పరశురామా ! భీష్ముడు సామాన్యుడు కాదు అష్టవసువులలో అగ్రగణ్యుడు అతడిని గెలవడం ఎవరి తరం కాదు. నరనారాయణులలో ఒకరైన అర్జునుడు భీష్ముని సంహరించగల ధీరుడు . బ్రాహ్మణుడి వైన నీకు ఈ అనవసర యుద్ధం తగదు " అని జమదగ్ని చెప్పినా పరశురాముడు వినలేదు. నేను పట్టు వీడ లేదు. నా తల్లి గంగాదేవి కూడా అక్కడకు వచ్చింది ఆమె చెప్పినా నేను విన లేదు. పలువురు పరిపరి విధాల మా ఇద్దరికి నచ్చ చెప్పి యుద్ధం మాన్పించారు. బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి " గాంగేయా ! నీ గురువు అతి పరాక్రమ వంతుడు బ్రహ్మకోవిదుడు అయిన పరశురాముని వద్దకు వెళ్ళి నమస్కరించి క్షమాపణ అడిగి దీవెనలు అందుకో " అన్నారు. గంగాదేవి నారదునితో పరశురాముని వద్దకు వెళ్ళి " భార్గవరామా! దేవవ్రతుడు నీ శిష్యుడు అతడు ధర్మాన్ని విడువజాలక నీతో తలపడ్డాడు కాని నీపై విరోధం లేదు అతడిని దయతో మన్నించు " అని చెప్పారు. నేను పరశురామునికి నమస్కరించాను అతడు నన్ను మన్నించి నన్ను లేవనెత్తి వాత్సల్యంతో కౌగలించుకున్నాడు. అంబతో " అంబా ! చూసావు కదా ! నేను చేయగలిగినది చేసాను ఇక నీ దారి నువ్వు చూసుకో " అన్నాడు. అంబ " మహాత్మా ! మీకు వీలైనంత చేసారు. నేను తపమాచరించి నా పగ తీర్చుకుంటాను ఈ జన్మలో వీలు కాకున్న మరో జన్మలో తీర్చుకుంటాను " అని అక్కడ నుండి వెళ్ళి పోయింది.
శిఖండి జననం
[మార్చు]హస్థినకు చేరినా భీష్ముని మనసులో అంబను గురించిన చింత వదల లేదు. ఒక రోజు నారద మహర్షి భీష్ముని వద్దకు వచ్చి భీష్ముడు కోరగా అంబను గురించి ఈ విధంగా చెప్పాడు. " గాంగేయా ! అంబ శివుని గురించి తపస్సు ప్రారంభించింది అన్ని ముని ఆశ్రమాలను సందర్శించింది. ఒక రోజు గంగ అంబను చూసి ఆడుదానివి నీకు ఈ ఘోరతపము తగదు అని చెప్పింది. అంబ ఆమె మాటకు " నాకు భీష్ముని మీద కోపం ఉంది కనుక అతని చావు కోరి తపము చేస్తున్నాను అని బదులిచ్చింది. అందుకు గంగాదేవి కోపించి నదివై ప్రవహించు అని శపించింది. అంబ ఆమె మాటను లక్ష్యపెట్టక మత్స్య దేశముకు వెళ్ళి ఘోర తపమాచరించింది. ఆ తపో మహిమను సగం ధారపోసి అక్కడ నదిగా ప్రవహించి మిగిలిన తపో బలంతో శరీరాన్ని కాపాడుకుంది. తిరిగి శివుని గురించి ఘోర తపము ఆచరించింది. ఆమె తపసుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడిగాడు. అంబ శివుని వద్ద నుండి భీష్ముని చంపే వరం పొందింది. ఆమె శివుని తాను ఏవిధంగా సంహరించగలను అని అడిగింది. శివుడు " నీవు ఈ శరీరం విడిచి ద్రుపద మహారాజుకు కుమార్తెగా జన్మించి మరలా పురుష రూపం ధరిస్తావు. అత్యంత పరాక్రమం, విలువిద్యా నైపుణ్యం ప్రదర్శించి యుద్ధభూమిలో భీష్ముని ఎదిరించి సంహరించగలవు " అని వివరించాడు. వెంటనే అంబ అక్కడ చితి పేర్చి " నేను భీష్ముని సంహరిస్తాను " అని తిరిగి తిరిగి అంటూనే అగ్నిలో దూకి ప్రాణాలు విడిచింది. ద్రుపద మహారాజుకు భీష్ముని పై కోపం ఉంది . అతనికి సంతానం లేక రోజు రోజుకు కృశించి పోతున్నాడు. చివరికి అతడు భీష్ముని చంపగల కుమారుని ప్రసాదించమని శివుని గురించి తపస్సు చేసాడు. శివుడు అతడికి భీష్ముని చంప గలిగిన కుమారుడు కలుగుతాడని చెప్పి ముందుగా కుమార్తె జన్మిస్తుందని ఆమె తరువాత కుమారుడుగా మారి భీష్ముని సంహరిస్తాడని చెప్పాడు. ద్రుపదుడు అంతా భార్యకు వివరించాడు. వారికి ఒక కుమార్తె జన్మించింది వారు ఆమెకు శిఖండి అని నామకరణం చేసి కుమారునిగా పెంచారు. ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించారు. ఆమె యవ్వనవతి కాగానే శివుని వరం వృధా పోదు అని విశ్వసించి పురుషత్వం రాక మునుపే ఆమెకు వివాహం చేయా నిశ్చయించారు. వారు దశార్ణ దేశ రాజైన హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు. శిఖండి ప్రవర్తన ఆమె భార్యకు ఆశ్చర్యం కలిగంచగా శిఖండిని గురించిన రహస్యం తెలుకున్నా మౌనంగా ఉండి పోయింది. ఆమె చెలికత్తె ద్వారా ఈ విషయం తెలుసుకున్న దశార్ణ మహారాజు ద్రుపదుని వద్దకు దూతద్వారా యుద్ధానికి సిద్ధంకమ్మని వర్తమానం పంపాడు. ద్రుపదుడు దూతను నచ్చ చెప్పి పంపాడు. హేమవర్మ ఆగ్రహించి తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించాడు.
శిఖండి పురుషరూపం పొందుట
[మార్చు]శిఖండి తన పురుషత్వం గురించి రెండుదేశాలు యుద్ధం చేసుకోవడం చూసి సిగ్గుపడ్డాడు. అర్ధరాత్రి లేచి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో స్థూలకర్ణుడు అనే యక్షుడు నివసిస్తున్నాడు. అతనికి భయపడి మనుషు లెవరూ ఆ అరణ్యంలో ప్రవేశించరు. అది తెలిసే శిఖండి అడవిలో ప్రవేశించాడు. ఆ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి " కుమారీ నీ వెవరు ప్రాణముల మీద ఆశ వదలి ఇక్కడికి ఎందుకు వచ్చావు " అని అడిగాడు. శిఖండి జరిగినది అంతా అతనికి వివరించి నాకు ఇప్పుడు పురుషత్వం కావాలి కాని అది శివుని వలననే సాధ్యం కాగలదు అని చెప్పాడు. అది విన్న యక్షుడు " అదెంత పని నేను నీకు ఒక్క పది రోజుల కాలం నా పురుషత్వం నీకు ఇచ్చి నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను . ఈ లోపు నీవు హేమవర్మ వద్దకు వెళ్ళి నీ పురుషత్వం నిరూపించు కుని పరిస్థితిలు చక్కబడగానే ఇక్కడికి వచ్చి మరలా మనమిరువురం ఎవరి రూపం వారు పొందవచ్చు " అన్నాడు. శిఖండి అందుకు అంగీకరించి యక్షుని నుండి పురుషత్వం స్వీకరించి తల్లి తండ్రుల వద్దకు వద్దకు వెళ్ళాడు. జరిగినది వారికి వివరించగానే వారు సంతోషించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించిందని తెలుసుకుని హేమవర్మ వద్దకు దూతలను పంపి తన వద్దకు రప్పించి శిఖండి పురుషుడేనని నిరూపించాడు. హేమవర్మ తన తొందర పాటుకు చింతించి ద్రుపదునికి క్షమాపణ చెప్పాడు. ద్రుపదుడు వారికి విందులు వినోదాలు ఏర్పాటు చేసి వారిని సగౌరవంగా సాగనంపాడు. ఇలా రెండు రోజులు అయిన తరువాత కుబేరుడు తన విమానంపై అక్కడికి విహరించవచ్చి స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు. ఎంతకూ స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాక పోవడంతో కోపించి కిన్నెరులను కొంత మందిని లోపలకు పంపి స్థూలకర్ణుని విషయం కనుక్కుని రమ్మని కబురు పంపాడు. లోపలికి వెళ్ళిన కిన్నెరలు జరిగిన విషయం అంతా స్థూలకర్ణుని వలన తెలుసుకుని కుబేరునికి వద్దకు వచ్చి చెప్పారు. కుబేరుడు " పరావాలేదు అతడిని స్త్రీరూపంతోనే రమ్మనండి " అన్నాడు. తన వద్దకు వచ్చిన స్థూలకర్ణునితో " జరిగినదేదో జరిగింది. ఇది దైవ సంకల్పం నీవు ఇక ఇలాగే ఉండు " అన్నాడు. స్థూలకర్ణుడు కుబేరుని కాళ్ళపై బడి విమోచనన మార్గం చెప్పమని బ్రతిమాలాడు. కుబేరుడు " స్థూలకర్ణా ! దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగిన ఈ మార్పిడిని శిఖండిని జీవితాంతం పురుషునిగానే ఉండనివ్వు . జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే శిఖండి మరణిస్తాడు. ఆతరువాత నీ పురుష రూపం నీకు వస్తుంది " అని చెప్పి తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు. శిఖండి మాత్రం తిరిగి అథూలకర్ణుని కలుసుకుని తన పురుషత్వాన్ని స్వీకరించి స్త్రీత్వాన్ని తిరిగి ఇవ్వమని చెప్పాడు. స్థూలకర్ణుడు " జరిగినదంతా దైవ సంకల్పం కనుక నీవు ఇక పురుషుడుగానే సంచరించ వచ్చు " అని చెప్పాడు. శిఖండి పరమ సంతోషం చెంది తన తల్లి తండ్రులకు జరిగనది వివరించాడు. అతడు బ్రాహ్మణులను దేవతలను పూజించి ఎన్నో వ్రతాలను ఆచరించి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అతడి శిష్యునిగా చేరి ద్రోణాచార్యుని వలన విలువిద్యా ప్రావీణ్యాన్ని పొందాడు" . అని నాకు నారదుడు వివరించాడు .
సుయోధనుడు తన సైన్యంలోని వారి సామర్థ్యం తెలుసుకొనుట
[మార్చు]భీష్ముడు సుయోధనునికి శిఖండి గురించి వివరించి " సుయోధనా ! అంబ నా పై పగబూని శిఖండిగా అవతరించి నన్ను సంహరించాలని చూస్తుంది. ఆమె శిఖండిగా యుద్ధంలో నన్ను ఎదుర్కొంటే నేను అస్త్రసన్యాసం చేస్తాను. ఎందుకంటే నేను స్త్రీలతో కాని పురుషులుగా మారిన వారితో కాని యుద్ధం చేయనని నాకు నేనే విధించుకున్న నియమమం ఉంది. ఏ కారణంతోనైనా నేను నియమభంగం చేయనని నీకు తెలుసుకదా " అన్నాడు. అది విన్న సుయోధనుడు కొంత చింతించినా భీష్ముని ధీరత్వాన్ని మనసులోనే శ్లాఘించాడు. సుయోధనుడు " పితామహా ! పాండవ సైన్యాన్ని పూర్తిగా నశింప చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది. అలాగే ద్రోణుడు, అశ్వథామ, కృపాచార్యుడు, కర్ణుడు ఎంత సమయంలో చేయగలరు " అని భీష్ముని అడిగాడు. భీష్ముడు " సుయోధనా ! నీవు మా బలాబలాలు తెలుసు కోవడానికి ప్రయత్నించడం మంచిదే ! వారి వారి సామర్థ్యం గురించి వారే చెప్పగలరు. నేను నన్ను గురించి చెప్తున్నాను. ఒక రోజుకు వెయ్యిమంది రధికులను చంపగలను. అర్జునుని బాణాలు నా శరీరాన్ని ఛేదించే వరకూ నేను శత్రువులతో పోరాడుతుంటాను. మొత్తంగా ఒక రోజుకు పదివేలమంది సైన్యాన్ని చంపగలను కనుక పాండవ సైన్యాలను సంహరించడానికి నాకు ఒక నెల రోజుల సమయయం పడుతుంది " అన్నాడు. సుయోధనుడు ద్రోణుని చూసి తన బలం చెప్పమని అడిగాడు. ద్రూణుడు " సుయోధనా ! నేను వృద్ధుడను కనుక నా ఓపిక కొలది యుద్ధం చేస్తే పితామహునిలా నాకు ఒక నెల రోజుల సమయం పడుతుంది " అన్నాడు. అశ్వధ్ధామ వారిరువురిలానే ఒక నెల రోజుల కాలంలో పాండవ సైన్యాలను హతమార్చ గలనని చెప్పాడు . కర్ణుడు మాత్రం తాను అయిదు రోజులలో పాండవ సైన్యాలను హతమార్చగలనని చెప్పాడు. అది విన్న భీష్ముడు నవ్వి " సూతనందనా! సుయోధనుడు పక్కన ఉన్నంత వరకు నీవు ఏమి మాట్లాడినా చెల్లుతాయి. ఒట్టి మాటలు ఎవరైనా చెప్పవచ్చు. యుద్ధభూమిలో అర్జునిని గాండీవం యొక్క అల్లెత్రాటి శబ్దం నీ చెవులను బద్దలు చేసేదాకా నీవు ప్రగల్భాలు చెప్పడం ఆపవు కదా! " అని పలికాడు.
ధర్మ రాజు తన సైన్యంలోని బలాబలాలు తెలుసుకొనుట
[మార్చు]ధర్మరాజు చారుల ద్వారా సుయోధనుని విడిదిలో జరిగినది తెలుసుకున్నాడు. ధర్మరాజు తన తమ్ములను చూసి " మన చారుల ద్వారా సుయోధనుని విడిదిలో జరిగిన విషయాలు తెలిసాయి. భీష్ముడు మన సైన్యాలను ఒక నెల రోజులలో చంపగలడంట . ద్రోణుడు, అశ్వథామకూ అదే సమయం పడుతుందట, కృపాచార్యుడు రెండునెలలు పడుతుందని చెప్పాడు. కర్ణుడు అయిదు రోజులు చాలు అన్నాడు. అర్జునా నీకు కౌరవ సైన్యాలను హతమార్చడానికి ఎన్ని రోజులు పడుతుంది " అని అడిగాడు. అర్జునుడు " అన్నయ్యా ! భీష్ముడు, ద్రోణుడు విలువిద్యా పారంగతులు అవక్రపరాక్రమ వంతులు. కాని అన్న మాటలు నెరవేర్చుకోవాలి కదా! అన్నయ్యా నా శక్తీ , పరాక్రమమూ ఎంతటిదో నీకు తెలియనిది కాదు. శ్రీకృష్ణుని సాయంతో నేను ఒక్క నిమిషకాలంలో సర్వ సైన్యాలను సంహరించగలను. నేను ఈశ్వరుని మెప్పించి పొందిన పాశుపతాస్త్రాన్ని సంధిస్తే ఒక్క నిమిషంలో సకల భూమి భస్మీపటలం ఔతుంది అయినా నేను దానిని ప్రయోగించను. నా పరాక్రమాన్ని చూపి భుజ బలం చూపి శత్రువులతో పోరాడి విజయం సాధిస్తాను. జయాపజయాలు దైవాధీనాలు చింతించనేల . మన వైపు భీముడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు, ఘతోత్కచుడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖ్సండి, ఉత్తమౌజుడు, యుధామన్యుల వంటి అతిరధ మహారధులు ఉన్నారు. ఇక నీ శక్తి నీవు ఎరుగవు నీకు కోపం వస్తే కౌరవ సేన నీకు లెక్కలోనిది కాదు. కనుక మనకు విజయం తధ్యం మీరు నిశ్చింతగా ఉండండి " అన్నాడు.