Jump to content

గిడుగు వెంకట రామమూర్తి

వికీపీడియా నుండి
(గిడుగు రామమూర్తి నుండి దారిమార్పు చెందింది)
గిడుగు వెంకట రామమూర్తి
గిడుగు రామమూర్తి
జననంగిడుగు వెంకట రామమూర్తి.
(1863-08-29)1863 ఆగస్టు 29
శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో
ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామం
మరణం1940 జనవరి 22(1940-01-22) (వయసు 76)
నివాస ప్రాంతంపర్వతాలపేట
ఇతర పేర్లురావ్ సాహెబ్, కళాప్రపూర్ణ
వృత్తిరచయిత
ప్రసిద్ధిఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
బహుభాషా శాస్త్రవేత్త,
చరిత్రకారుడు,
సంఘసంస్కర్త,
హేతువాది
పిల్లలుగిడుగు సీతాపతి
బంధువులుగిడుగు రాజేశ్వరరావు (మనుమడు)
స్నేహలత మురళి (ముని మనవరాలు)
తండ్రివీర్రాజు
తల్లివెంకమ్మ
Notes
గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని
తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాం

గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. [1][2][3][4][5]

తొలి జీవితం

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29 వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. 1875 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరం బదిలీ అయ్యి అక్కడే విష జ్వరంతో 1875 లోనే చనిపోయాడు.

విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపాడు. 1879 లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లి అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి బళ్ళో ఫస్టుఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తి పై బడింది. ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్‌.ఏ., 1894 లో బి.ఏ. మొదటి రెండు భాగాలు (చరిత్ర తప్ప) ఉత్తీర్ణుడయ్యాడు. 1896 లో మూడోభాగంలో ఉత్తీర్ణుడై పట్టం పుచ్చుకున్నాడు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండోర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి ఉన్నత పాఠశాల తరువాత కళాశాల అయింది. అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.

సవర భాష పాండిత్యం

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు వ్రాసి, సొంతడబ్బుతో బళ్ళు పెట్టి, అధ్యాపకుల జీతాలు చెల్లించి, సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్‌" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931 లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938 లోను అచ్చువేశారు. 1934 లో ప్రభుత్వం అతనికి 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది.

"సవర" దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని "శబరు"లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు. సవర భాషకు వ్యాకరణం తయారుచేసే సందర్భంలో తరచూ సవరాలు నివసించే అరణ్య పర్యంతలలో సంచరించడంవల్ల మలేరియా జ్వరం వచ్చి క్వినయిన్ వాడడంవల్ల బధిరత్వం వచ్చింది.

శాసనాల అధ్యయనం

ఉన్నత పాఠశాల లో చరిత్ర పాఠాలు చెప్పే రోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయుల గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు వ్రాసి Indian Antiquary లోనూ, Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించాడు. 1911 లో గిడుగు 30 ఏళ్ళ పదవీకాలం పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్ర భాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.

వ్యక్తిత్వం

రామమూర్తికి చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు. సవరలు, హరిజనులూ అంటరాని జనాలని అప్పటి సంఘం అంటుండే ఆ కాలంలోనే, అతను సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి, భోజనం పెట్టేవాడు. 1930 లో ఒడిషా ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒడిషా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిషాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ అతడు 1936 లో ఒడిషా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం. గిడుగుకు తెలుగు భాషకు మేలు జరగాలన్నదే తప్ప వ్యక్తిగతంగా తనకు పేరు రావాలన్న ఆలోచన, పట్టింపు ఉండేవి కాదు. ఒక వ్యాకరణంలో గిడుగును ప్రస్తావించకుండా అతని రచనలోని భాగాలు వాడుకున్నారని భావరాజు వెంకట కృష్ణారావు బాధపడితే "అక్షరాలు కనిపెట్టినవాడి పేరెవరికైనా తెలుసునా? అట్లాగే నా పేరు తెలిస్తే నేం, తెలియకపోతేనేం?" అని గిడుగు రామ్మూర్తి ఓదారుస్తూ జవాబిచ్చాడు.[6]

వచనభాష సంస్కరణోద్యమం

1907లో జె.ఏ.ఏట్స్ అనే ఇంగ్లీషుదొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు . చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలు ఉన్నాయి అన్నది అతని ముఖ్య సమస్య. అంతకు ముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో ఎ.వి.ఎన్ ప్రధానాధ్యాపకులుగా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి యేడూ జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యత గురించి ఉపన్యాసాలిచ్చాడు.

1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. వీరేశలింగం పంతులు ఊతం కూడా ఇతనికి లభించింది. 1919-20 ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు' అనే మాసపత్రిక నడిపాడు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు "గిడుగు". సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.

1912-13 లో పాఠశాల సంవత్సరాంత పరిక్షల్లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని వ్రాయవచ్చునని స్కూలు ఫైనల్‌ బోర్డు కార్యదర్శి ఒక జీ.ఓ. ఇచ్చాడు. ఆధునికభాషకు లక్ష్యంగా బ్రౌన్‌ తెలుగు రీడర్‌ ను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రను ఉదహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.

విద్యావిధానాల్లో, పాఠ్యపుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగం ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా వ్రాయలేడని నిరూపించాడు. 1919 లో గిడుగు "తెలుగు" అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28 న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడుగా, గిడుగు కార్యదర్శిగా "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం" స్థాపించాడు. 1933 లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవాన్ని ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో "Miscellany of Essays" (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. 1924 లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936 లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే "ప్రతిభ" అనే సాహిత్యపత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావు సంపాదకుడుగా "జనవాణి" అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు వ్రాయటం మొదలుపెట్టింది.

గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -

దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు, వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.

గిడుగు రామమూర్తి 1940 జనవరి 22 న కన్ను మూశాడు.

పంతులుగారి పుట్టిన రోజు 'తెలుగు భాషా దినోత్సవము' గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది.

తండ్రికి తగ్గ తనయుడిగా గిడుగు సీతాపతి కీర్తి గడించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ' కళాప్రపూర్ణ ' బిరుదు పొందిన తండ్రీ కొడుకులు వీళ్ళిద్దరే!

సాహితీ సేవలు

  • ‘కళింగ (ఒరిస్సా) చరిత్ర’
  • 'సవర' ప్రజల (ముండా తెగ)[7] కోసం భాషా లిపిని అభివృద్ధి చేసి, నిఘంటువులను సిద్ధం చేశారు.
  • సోరా-ఇంగ్లీష్ నిఘంటువు[8][9]
  • సవర పాటలు[10]

ప్రశంసలు, పురస్కారాలు

  • 1913 లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది.[11]
  • అతని సేవలకు గాను బ్రిటీష్ ప్రభుత్వం 1933 సంవత్సరంలో అతనికి "కైసర్-ఇ-హింద్ మెడల్" బిరుదును ప్రదానం చేసింది.
  • ఆయన జన్మదినమైన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు.[12]
  • 1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది.

రామ్మూర్తి పంతులు గురించి కొందరు ప్రసిద్ధులు ఇలా చెప్పారు:

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి

"ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే"

విశ్వనాథ సత్యనారాయణ
  • "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట"
  • "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు"
పులిదిండి మహేశ్వర్
  • "గ్రాంథికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు,
    తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు"]

గిడుగు సేవలపై పరిశోధన

అనేకమంది పండితులు, భాషావేత్తలు, ఉపాధ్యాయులు గిడుగు యొక్క కృషిని చర్చించి, అతని విజయాన్ని గురించి పుస్తకాలు వ్రాసారు. వాటిలో ముఖ్యమైనవి

  • తెలుగు భాషా చరిత్ర ప్రొఫెసర్ బి. కృష్ణ మూర్తి
  • డా.బూదరాజు రాధాకృష్ణ రచించిన వ్యవహారిక భాషా వికాసం
  • మరోసారి గిడుగు రామమూర్తి, సంపాదకత్వం ప్రొఫెసర్ సి. రామారావు.
  • భారతీ తీర్థ గా గుర్తింపు పొందిన దివంగత బుర్రా శేషగిరిరావు, డేవిడ్‌ స్టాంప్‌, జె.ఎ.యేట్స్‌ వంటి పలువురు గిడుగు కృషిని మెచ్చుకున్నారు.
  • సుప్రసిద్ధ భాషావేత్త, హవాయి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ స్టాన్లీ స్ట్రారోస్టా, తన పి.హెచ్.డి ని గిడుగు వెంకట రామమూర్తి పై చేసి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయానికి థీసిస్ సమర్పించారు.
  • ప్రొఫెసర్ డాక్టర్ దాశరథుల నర్సయ్య గారిచే గిడుగు రామ్మూర్తి జీవితం రచనలు.

చిత్రమాలిక

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం (29 August 2019). "తెలుగు.. భవితకు వెలుగు!". www.andhrajyothy.com. Archived from the original on 19 సెప్టెంబరు 2019. Retrieved 19 September 2019.
  2. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1 January 1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. pp. 307–. ISBN 978-0-313-28778-7. Retrieved 25 August 2013.
  3. M. Chalapathi Rau (1976). Gurazada Commemorative Volume. South Delhi Andhra Association. p. 47. Retrieved 25 August 2013.
  4. Amaresh Datta; Sahitya Akademi (1994). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. Sahitya Akademi. p. 4113. ISBN 9780836422832. Retrieved 25 August 2013.
  5. Srihari, Gudipoodi (7 September 2012). "Scripting a change". The Hindu. Chennai, India.
  6. సి., మృణాళిని (1998). తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 5.
  7. Giḍugu Veṅkaṭarāmamūrti (1931). A Manual of the So:ra: (or Savara) Language ... Superintendent, Government Press. Retrieved 25 August 2013.
  8. Giḍugu Veṅkaṭarāmamūrti (1986). Sora-English Dictionary. Mittal Publications. pp. 1–. GGKEY:GGSNPA3C56U. Retrieved 25 August 2013.
  9. "Sora". Archived from the original on 1 October 2006. Retrieved 25 August 2013.
  10. "Telugu comes to aid of tribal language". The Hindu. Chennai, India. 9 July 2009. Archived from the original on 12 July 2009.
  11. Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot, edited by Mohan Lal; published 1992 by Sahitya Akademi]; "the son of Rao Saheb Gidugu Venkata Ramamurthy, a pioneer of the movement for Vyahavarika bhasha', colloquial language'
  12. "Telugu Language Day on August 29". The Hindu. Chennai, India. 26 August 2010. Retrieved 27 June 2013.

వనరులు

  • From the Report submitted by the Telugu Language Committee to Andhra University, 1973: 99.
  • పుటలు: 660-661, కీ.శే. గిడుగు వెంకట సీతాపతి, విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి, రెండవ సంపుటి, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-మార్చి-1985

బయటి లింకులు

  1. ఈమాట - గిడుగు వెంకట రామమూర్తి రేఖాచిత్రం (1863 - 1940)
  2. సవరజాతి ‘అక్షరం’ గిడుగు!(సాక్షి పత్రికలో వ్యాసం)
  3. డి.ఎల్.ఐలో ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము గ్రంధప్రతి


  1. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు. "గిడుగు సీతాపతి జీవితం - రచనలు". p. 140.