తెలుగు పదాలు

వికీపీడియా నుండి

పదము (Word) నిశ్చితమైన అర్ధాన్నిచ్చే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అక్షరముల సముదాయము. ఇలాంటి కొన్ని పదముల సముదాయము వాక్యము.

విషయ సూచిక

[మార్చు] పదాలలో రకాలు

తెలుగు భాషలో పదములు ఐదు రకములు అవి:

  • 1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అందురు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అందురు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
  • 2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అందురు. వీనినే వికృతి అందురు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
  • 3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అందురు. ఉదాహరణ: పీట, చెట్టు
  • 4. గ్రామ్యము : వ్యాకరణ విరుద్ధములైన పదములను గ్రామ్యములు అందురు. ఉదాహరణ: వస్తాడు, పోతాడు
  • 5. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అందురు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.

[మార్చు] భాషాభాగములు

తెలుగు భాషలోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -

  • నామవాచకము: మానవుల యొక్క పేర్లు, జంతువుల యొక్క పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈ నామవాచకములు మరళ నాలుగు విధములు. అవి -
    • సంజ్ఞావాచకము: రాముడు, గోదావరి.
    • జాతి నామవాచకము: చెట్టు, పర్వతాలు, గోడ.
    • గుణ నామవాచకము: తీపి, నలుపు, తెలుపు.
    • క్రియా నామవాచకము: వంట, నడక, చేత.
  • సర్వనామము: నామవాచకమునకు బదులుగా వాడబడేది. ఉదా: నీవు, ఆమె, అతడు.
  • విశేషణములు: నామవాచకము, సర్వనామముల యొక్క గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
  • అవ్యయములు: లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
  • క్రియలు: పనులను తెలిపే వానిని క్రియలు అందురు. ఉదా: చదువుట, తినుట, ఆడుట.
    • సకర్మక క్రియలు: కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అందురు. ఉదా: మధు బడికి వెళ్ళెను.
    • అకర్మక క్రియలు: కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.
    • సమాపక క్రియలు: పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు. ఉదా: తినెను, నడచెను.
    • అసమాపక క్రియలు: పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు. ఉదా: వ్రాసి, తిని.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
పేజీకి సంభందించిన లింకులు