పి.లీల
| పొరయత్తు లీల | |
పి.లీల |
|
| జన్మ నామం | పి.లీల |
|---|---|
| జననం | మే 19 1934 కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూర్ |
| మరణం | అక్టోబరు 31, 2005 (వయసు 71) చెన్నై, ఇండియా |
| ప్రాముఖ్యత | సోలో సింగర్ |
| వృత్తి | గాయని |
| తండ్రి | వి.కె.కన్‌జన్‌మీనన్ |
| తల్లి | పొరయాత్ మీనాక్షీ అమ్మ |
పొరయత్తు లీల ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1]
లీల 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూర్ లో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణం తో సినీరంగప్రవేశం చేసినది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మళయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మన దేశం.
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
లీల అక్టోబర్ 31 2005 న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యుకు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వళ్ల పరిస్థితి విషమించింది.[2]
ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింది.
మూలాలు [మార్చు]
- ↑ http://www.tlca.com/adults/p_leela.html
- ↑ P. Leela's death mourned - ది హిందూ, నవంబర్ 1, 2005