మల్లి మస్తాన్ బాబు

వికీపీడియా నుండి
(మల్లి మస్తాన్‌ బాబు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మల్లి మస్తాన్‌ బాబు
జననం1974,సెప్టెంబరు 3
మరణం2015 మార్చి 24(2015-03-24) (వయసు 40)[1]
జాతీయతభారతీయత
పౌరసత్వంభారతీయుడు
విద్యB.Tech, M.Tech, MBA
విద్యాసంస్థNIT Jamshedpur, IIT Kharagpur, IIM Calcutta
వృత్తిAdventurer and Motivational Speaker
వెబ్‌సైటు1stindian7summits.com
దస్త్రం:Mastan babu 035.JPG
మస్తాన్ బాబుకో ప్రేమలేఖ

మల్లి మస్తాన్‌బాబు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకుడు. పర్వతారోహణలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించిన సాహసికుడు. మస్తాన్ బాబు 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులలోకి ఎక్కాడు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు బిడ్డడు మస్తాన్‌బాబు.[2]

బాల్యము - విద్యాభ్యాసము

[మార్చు]

మస్తాన్‌బాబు జన్మస్థలం గాంధీజనసంఘం.[3] ఈ గ్రామం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సంగం మండలానికి చెందిన ఒక చిన్న కుగ్రామం. తల్లిదండ్రులు సుబ్బమ్మ, మస్తానయ్యలు మత్స్యకార కుటుంబానికి చెందినవారు.[4] మస్తాన్‌బాబు ఈ దంపతులకు 5 వ సంతానంగా 1974 సెప్టెంబరు 3 న జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కలు.[5] ఒకటో తరగతి నుండి మూడో తరగతి వరకు స్వగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. 4, 5 తరగతులను సంగంలోని ఒక ప్రెవేటు పాఠశాలలో చదివాడు. ఆతరువాత 1985 లో కోరుకొండ సైనిక పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు (1985-92) విజయనగరం జిల్లాలోని కొరుకొండ సైనిక పాఠశాలలో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. తరువాత తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగు చదువును జంషెడ్‌పూర్ లోని నిట్‌లో (1992-96) లో పూర్తి చేసాడు.[6] తరువాత ఐఐటి ఖరగ్పూర్‌లో ఎంటెక్‌ చేసాడు. 1998 నుండి 2001 వరకు సత్యం కంప్యూటర్సులో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసాడు. 2002-2004 వరక్ కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఎం కోర్సు చేసాడు.

ఇతని సోదరి దొరసానమ్మ తిరుపతిలో వైద్యురాలిగా ఉన్నారు.[7] ఇతని పెద్ద సోదరుడు పెద్ద మస్తానయ్య, తెలంగాణ రాష్ట్రంలో ఉపాద్యాయుడుగా పనిచేస్తున్నాడు.[6]

ఉద్యోగం-ఇతర వ్యాపకాలు

[మార్చు]

పిమ్మట మస్తాన్‌బాబు తన ఎంటెక్‌ విద్యాభాసాన్ని ఖరగ్‌పూర్‌లోని ఐఐటిలో చేసాడు.1998 నుండి 2001 వరకు సత్యం కంప్యూటర్సులో ఉద్యోగం చేసాడు. కోల్‌కత లోని ఐఐఎంలో 2002-2004 వరకు ఉన్నాడు.

ఇండియా, కెన్యా, దుబాయి, అమెరికా దేశాలలోని పలు మేనెజిమేంట్ కోర్సు కళాశాలలోను, సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థలలోను, వృతిపరమైన సంస్థలలో, వ్యాపారసంస్థలలో, నాయకత్వం-నిర్వహణ వంటి విషయాలలో ప్రేరణ, మార్గదర్శక ఉపన్యాసాలు ఇచ్చాడు.[8]

పర్వతారోహణ

[మార్చు]

6వ తరగతి చదవడానికి కోరుకొండ సైనిక పాఠశాలలో చేరినప్పటినుండి కొండలను ఎక్కడంపై అతనికి అభిరుచి పెరిగింది. ఎవరెస్టు శిఖరాన్నిఅధిరోహించే పయత్నంలో 1985లో ప్రాణం కోల్పోయిన పూర్వ విద్యార్థి ఉదయకుమార్ విగ్రహం పాఠశాల ఆవరణలో ఉండేది. మల్లి మస్తాన్‌ బాబుకు ఎత్తైన కొండలను ఎక్కి రికార్డులు సాధించాలనే కోరికను, ప్రేరణను ఆ విగ్రహమే కలిగించింది.[5][9] సెలవుల్లో తన స్వగ్రామం వెళ్లినప్పుడు ఎన్నోసార్లు కాళ్ళు, చేతులు కట్టుకుని కనిగిరి రిజర్వాయరులో ఈదేవాడు.

2006 లో ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఏడు ఎతైన, దుర్గమమైన పర్వతశిఖరాలను 172 రోజుల అతితక్కువ కాలంలో అధిరోహించిన భారతీయ పర్వతారోహకుడు[1]. అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌మానిఫ్‌ (Mt Vinson Massif) పర్వతాన్ని ఎక్కిన మొదటి భారతీయుడు, మల్లి మసాన్‌బాబు.[6]

172 రోజుల్లో 7 పర్వతాలు అధిరోహించిన వివరాలు

పర్వతం పేరు పర్వతారోహణ చేసినరోజు శిఖరం ఎత్తు, మీటర్లలో రోజు
విన్సన్‌మానిఫ్‌ (అంటార్కిటికా) 2006 జనవరి 19 4897 గురువారం
అకోన్‌కగువా (దక్షిణ అమెరికా) 2006 ఫిబ్రవరి 17 6962 శుక్రవారం
కిలీమంజరో (ఆఫ్రికా) 2006 మార్చి 15 5895 బుధవారం
కోస్‌కుయిజ్‌కో (ఆస్ట్రేలియా) 2006 ఏప్రిల్ 1 2228 శనివారం
ఎవరెస్టు (ఆసియా) 2006 మే 21 8850 ఆదివారం
ఎల్‌బ్రస్‌ (ఐరోపా) జూన్‌13,2006 5642 మంగళ వారం
డెనాలి (ఉత్తర అమెరికా) 2006 జూలై 10 6194 సోమవారం

అనగా రోజుకొక శిఖరం చొప్పున ఏడురోజులలో ఏడు శిఖరాలను అధిరోహించాడు.

చిలీ, అర్జెంటీనా దేశ సరిహద్దుల్లో ఉన్న ఓజోస్‌డెల్‌సాలాడో అనే 6893 మీటర్ల ఎత్తువున్న అగ్నిపర్వతాన్ని అధిరోహించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఎనిమిది సార్లు అదిరోహించాడు. రష్యా లోని ఎల్‌బ్రస్ పర్వతాన్ని మూడు సార్లు ఎక్కాడు.[10] అర్జెంటీనా లోని పర్వతశ్రేణుల్లో 6000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న 14 పర్వత శిఖరాలను అధిరోహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.[8]

పర్వతారోహణ-ప్రత్యేకతలు

[మార్చు]
  • పర్వతారోహణలో 12 ఏళ్లుగా మల్లిబాబు ఎన్నో సాహసాలు చేశాడు. 14 రోజుల్లో 14 రాష్ట్రాల్లో మారథాన్‌ చేసి రికార్డు సొంతం చేసుకున్నారు[11]
  • ఏడు పర్వతాలను అతి తక్కువ సమయంలో అధిరోయించిన మొదటి భారతీయుడు.
  • ఒసియానాలోని కార్సుటెంజ్ పిరమిడ్‌ను ఎక్కిన మొదటి భారతీయుడు.

పురస్కారాలు

[మార్చు]
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మానేజిమెంట్, కలకత్తా వారు 2011లో 'Distinguished Alumnus (ఉత్తమ పూర్వ విద్యార్థి ఆవార్డ్) పురస్కారం ఇచ్చారు.[12]

ఆండీస్ పర్వతారోహణ- మరణం

[మార్చు]
మస్తాన్ బాబు మరణ వార్త తెలిసి, ఇండియా వచ్చి, కడచూపుకై నెలరోజులుగా అతని ఇంటివద్ద వేచిఉన్న విదేశి స్నేహితురాలు, సహపర్వతారోహిణి నాన్సి[13]

మల్లి మస్తాన్‌ బాబు 2015 మార్చి 24న పర్వాతారోహణ చేసే సమయంలో జరిగిన దుర్ఘటనలో మరణించాడు.[1] ప్రపంచం లోనే అత్యంత క్లిష్టమైన పర్వతాలను అధిరోహించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన మస్తాన్‌, మరో రికార్డు నెలకొల్పేందుకు వెళ్లి ప్రాణాలనే వదులుకున్నాడు.

తన స్నేహితులతో కలసి అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వాతాలను ఎక్కటానికి భారతదేశం నుండి 2014 డిసెంబరు 16 న వెళ్ళాడు. 2015 మార్చి 24న పర్వతారోహణ ప్రాంరంభించాడు. అదేరోజున ఆయన జీపీఎస్ నెట్ వర్క్‌ పనిచెయ్యడం మానేసింది. చిలీ, అర్జెంటినా ప్రభుత్వాలలో ఏరొయల్ సర్వేలో బేసిక్యాంపునకు 500 మీటర్ల ఎత్తున అతని మృతదేహాన్ని గుర్తించారు. అర్జెంటీనాలోని ‘సెర్రో ట్రెస్‌ క్రూసెస్‌ సుర్‌’ మంచు పర్వత ప్రదేశంలో 5900 అడుగుల ఎత్తున మృతదేహాన్ని గుర్తించినట్టు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్‌ 2015 ఏప్రిల్ 4 న వెల్ల్లడించారు.[14]

మస్తాన్‌ మార్చి 22వ తేదీన ఆండీస్‌ పర్వతశ్రేణి ఎక్కేందుకు నలుగురు సభ్యుల బృందంతో కలిసి వెళ్లాడు. చిలీలో రెండో అత్యంత పెద్దదైన సెర్రో ట్రెస్‌ (6749 మీటర్లు) ను ఒంటరిగా అధిరోహించేందుకు బేస్‌ క్యాంప్‌ నుంచి బయల్దేరాడు. చివరగా మార్చి 24న మస్తాన్‌ తన స్నేహితుడితో మాట్లాడాడు. వాతావరణం ప్రమాదకరంగా మారడంతో అదే రోజు సాయంత్రానికల్లా బేస్‌ క్యాంప్‌నకు వస్తానని వారితో చెప్పాడు. అతను రాకపోవడంతో మస్తాన్‌ స్నేహితులు 25 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23 వ తేదీ నుంచి మస్తాన్‌ ఫోన్‌ రాకపోవడంతో బంధువుల్లో ఆందోళన నెలకొంది. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ జానకి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి మస్తాన్‌ ఆచూకీ కోసం విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చొరవతో మార్చి 26 న అన్వేషణ ప్రారంభమైంది. 31 వ తేదీ నుంచి హెలికాప్టర్‌ ద్వారా అన్వేషణ ప్రారంభించడంతో పాటు చిలీ, అర్జెంటీనా వైపుల నుంచి గాలింపు మొదలెట్టారు. ప్రతికూల వాతావరణంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగింది. భారత కాలమానం ప్రకారం 2015 ఏప్రిల్ 4 తెల్లవారు జామున మంచులో చిక్కుకుపోయిన మస్తాన్‌ మృతదేహాన్ని గుర్తించారు.[14]

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి మస్తాన్‌ బాబు మృతిపట్ల ఆయన కుటుంబసభులకు తన సంతాపాన్ని తెలిపాడు.[15] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మస్తాన్‌బాబు అకస్మిక మృతికి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపాడు.[16]

అల్పోష్ణస్థితి వలన మల్లి మస్తాన్ బాబు మృతి చెందాడు

[మార్చు]

మల్లి మసాన్ బాబు స్నేహితుడు, పర్వతారోహకుడు హెర్నాన్, ఆండీస్‌ పర్వతంపై ఏర్పడిన అల్పోష్ణస్థితి వలన మల్లి మస్తాన్ బాబుకు శ్వాస అందక పోవటం వలన మరణించాడని ఫెస్ బుక్ లోవెల్లడించాడు.ఆండిస్ పర్వతాల్లో బాబు మృతదేహాన్ని గుర్తించింది మొదలు కొని మసాన్ బాబు పార్థవ శరీరాన్ని భారతదేశానికి పంపేవరకు జరిగిన అన్ని విషయాలను ఆయన ఫెస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందు పరిచాడు. ఈ విషయంలో హెర్నన్ తోపాటు మస్తాన్ బాబు సాటి పర్వతారోహకులు అయిన మారియానో గాల్వమ్, మార్సెలో సోరియా, లిసా సేబుల్ లు కూడా తమ పూర్తి సహకారాన్ని అందించారు. మస్తాన్ బాబు మృతదేహం 5950 కి.మీ ఎత్తులో ఉండటం వలన హెలికాప్టరు కూడా ఉపయోగ పడలేదు. మంచుతో కూడిన తుఫాను వలన హెలికాప్టరు పర్వతం పై చక్కర్లు కొట్టుటకు అవరోధం వచ్చింది. మస్తాన్ బాబు అనుకున్న ప్రకారం 24 మార్చి సాయంత్రం అనుకున్న సమయానికి కొద్దిగా ఆలస్యంగా పర్వతశిఖరాన్ని అదిరోహించాడు. అక్కడినుండి క్రిందకు వచ్చే క్రమంలో ఏర్పడిన అల్పోష్ణవాతావరణం దిగటానికి ఆటంకం కలిగించింది. పర్వతం కుడి ప్రక్కన ఏర్పడిన మంచుతుపాను వలన ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అప్పటికే పూర్తిగా బలహీన పడిన మస్తాన్ బాబు, శిఖరానికి 800 మీటర్ల ఎత్తులో తాను ఏర్పాటు చేసుకున్న తన గుడారంలో శ్వాస ఆడక, గుండె పనిచేయక అంతిమ శ్వాస వదిలాడు.[17]

అర్జెంటీనాలో మస్తాన్‌బాబుకు ఘననివాళి

[మార్చు]

మస్తాన్ బాబు మృతదేహాన్ని అర్జెంటీనా నుండి భారతదేశానికి తరలించడనికి ముందు, అర్జెంటినాలోని భారత దౌత్యకార్యాయాలనికి చెందిన అధికారులు 22-04-2015 ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశపు మువ్వన్నల జండా ప్రక్కన, మస్తాన్ బాబు చిత్రాలనుంచి అంజలి ఘటించారు.[18]

అంత్యక్రియలు

[మార్చు]
మస్తాన్ బాబు అంతిమ సంస్కరణకు హాజరైన అభిమానులు

మల్లిమస్తాన్ బాబు మృతదేహం భారతదేశం లోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి 24.4.2015 (శుక్రవారం), మస్తాన్ బాబు మరణించిన సరిగ్గా నెలరోజుల తరువాత చేరింది. మృతదేహంతో పాటు ఆయన సోదరి మస్తానమ్మ ఉంది. తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో మస్తాన్‌ పార్థివ శరీరాన్ని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పట్టణం సూళ్ళూరు పేట వరకు తీసుకువచ్చి, అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించడం జరిగింది. సూళ్ళూరుపేట నుండి మస్తాన్‌బాబు స్వగ్రామం గాంధీజనసంఘం వరకు మార్గమధ్యంలో ఆయన పార్థివ దేహమున్న వాహనాన్ని నాయుడుపేట, నెల్లూరు, తదితర చోట్ల అభిమానులు, రాజకీయ నాయకులు, విద్యార్థిని విద్యార్థులు ఆపి, శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మృతదేహం స్వంత ఇంటికి చేరింది. అక్కడ గ్రామస్థులు, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, మంత్రులు తదితరులు వెళ్ళి దర్శించారు.[19]

25-4-2015 (శనివారం) ఉదయం ఆయన మృతదేహాన్ని, ఇంటికి అరకిలోమీటరు దూరంలో ఉన్న ఆయన పొలంలోని ఖనన ప్రాంతానికి చేర్చి,12 గంటలవరకు అభిమానుల సందర్శనార్ధం ఉంచారు, వేలసంఖ్యలో మస్తాన్ బాబు అభిమానులు వచ్చి తుది చూపు చూసుకున్నారు. మధ్యాన్నం 12 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధికార లాంఛనాలలతో మృతదేహాన్ని ఖననం చేసారు. భౌతిక కాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, రాష్ట్రమంత్రులు నారాయణ, కిశోర్‌బాబు, పల్లెరఘునాధరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మేల్యేలు మేకపాటి గౌతమరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలిబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌, కిలివేటి సంజీవయ్యలు తమ శ్రద్ధాంజలి ఘటించారు.[20]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Ace Indian mountaineer Malli Mastan Babu found dead". economictimes.indiatimes.com. 4 Apr 2015. Retrieved 2015-04-05.[permanent dead link]
  2. "Malli Mastan Babu". www.ndtv.com. April 4, 2015. Retrieved 2015-04-05.
  3. "మల్లి మస్తాన్ బాబు తాజా ఫొటో ఇదే". namastheandhra.com. April 4, 2015. Archived from the original on 2015-04-05. Retrieved 2015-04-05.
  4. "Malli Mastan Babu". nytimes.com. ఏప్రిల్ 9, 2015. Retrieved 2015-04-23.
  5. 5.0 5.1 "Malli Mastan Babu, Who Scaled the World's Tallest Mountains, Dies at 40". nytimes.com. ఏప్రిల్ 9, 2015. Retrieved 2015-04-10.
  6. 6.0 6.1 6.2 "Missing Indian mountaineer Malli Mastan found dead". deccanherald.com. 5 April 2015. Retrieved 2015-04-05.
  7. "mountaineer-malli-mastan-found-dead-in-argentina". indianexpress.com. ఏప్రిల్ 5, 2015. Retrieved 2015-04-05.
  8. 8.0 8.1 "Malli Mastan Babu, the Indian on top of the Andean peaks". in.news.yahoo.com. 1 Jun 2012. Retrieved 2015-04-13.
  9. "Telegraph India | Latest News, Top Stories, Opinion, News Analysis and Comments". www.telegraphindia.com. Retrieved 2023-03-18.
  10. Enadu daily paper.Nelluru edition|date=2015-04-10|page=3
  11. "తెలుగోడి సత్తా జగతికి చాటిన మల్లి మస్తాన్..!". apherald.com/Politics. April 5, 2015. Retrieved 2015-04-05.
  12. "Distinguished Alumnus award 2011". IIM Calcutta. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 5 April 2015.
  13. "సాహస శిఖరమా..వీడ్కోలు". epaper.sakshi.com. సాక్షి. Archived from the original on 2015-04-26. Retrieved 2015-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. 14.0 14.1 "సాహస శిఖరం ఒరిగింది". andhrajyothy.com. April 5, 2015. Retrieved 2015-04-05.[permanent dead link]
  15. AK (5 April 2015). "PM pays homage to Mountaineer Malli Mastan Babu". New Delhi. Prime Minister's Office. Retrieved 5 April 2015.
  16. V, Rishi Kumar (4 April 2015). "AP CM condoles death of mountaineer Malli Mastan Babu". Hyderabad. The Hindu Businessline. Retrieved 5 April 2015.
  17. "అల్పోష్ణస్థితితోనే మస్తాన్‌బాబు మృతి". sakshi.com. సాక్షి. Archived from the original on 2015-04-23. Retrieved 2015-04-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  18. "అర్జెంటీనాలో మస్తాన్‌బాబుకు ఘననివాళి". epaper.sakshi.com. సాక్షి. Archived from the original on 2015-04-24. Retrieved 2015-04-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  19. "స్వగ్రామానికి మస్తాన్‌బాబు భౌతికకాయం". epaper.sakshi.com. సాక్షి. Archived from the original on 2015-04-26. Retrieved 2015-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  20. "మస్తాన్‌బాబు మళ్ళీ పుడతాడు". epaper.sakshi.com. సాక్షి. Archived from the original on 2015-04-26. Retrieved 2015-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)