వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2017)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2017 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

సుబ్రహ్మణ్య భారతి

చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి (11 డిసెంబర్ 1882 – 11 సెప్టెంబర్ 1921) తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. ఆయన అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి. అప్పటి తిరునల్వేలి జిల్లా(ప్రస్తుతం తూత్తుకుడిలో ఉంది)లోని ఎట్టాయపురంలో 1882లో జన్మించారు. ఆయన తొలుత తిరునల్వేలిలోనూ, తర్వాత వారణాసిలోనూ విద్యాభ్యాసం చేసి, పాత్రికేయ రంగంలో స్వదేశమిత్రన్, ఇండియా వంటి పలు పత్రికలకు పనిచేశారు. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యునిగా జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. 1908లో భారతి విప్లవాత్మక కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీచేసింది, ఈ స్థితిగతులు ఆయన పాండిచ్చేరికి వలసపోయి జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరిచాయి. ఆయన అక్కడే 1918 వరకూ జీవించారు. భారతి రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగివున్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు. ఆయన రచనల్లో హిందూ దేవతలైన శక్తి, కాళి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడు, కృష్ణుడు వంటివారినే కాక ఇతర మతదేవతలైన అల్లా, ఏసు వంటివారిని కూడా ప్రస్తుతించారు.

(ఇంకా…)

2వ వారం

గంగిరెద్దులాటలు

గంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం.ఇది ప్రాచీనమైనది. తెలుగు సంప్రదాయాలకు గుర్తు సన్నాయి అప్పన్న, విశాఖ పట్నంలో జరిగే విశాఖ ఉత్సవ చిహ్నం కూడా సన్నాయి అప్పన్నే. కానీ సన్నాయి అప్పన్నల జీవితాలలో విషాదమైన సంగీతము మారుమ్రోగుతోంది. ఇతరులకు సన్నాయి పాటలను వినిపించి డోలు కొట్టి, శిక్షణ నిచ్చిన గంగిరెద్దును పట్టుకొని తిరిగే గందిరెద్దులోళ్ళు జీవితాలు చీకటి మయమయ్యాయి. స్థిర నివాసాలు లేనివారు, భూములు లేని వీరికి విద్యా, ఉద్యోగం, మొదలగు వాటిలో వున్న రిజర్వేషన్లు వీరికి తెలియవు. "గంగిరెద్దుల వాడు కావర మణచి - ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు" అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి అతి ప్రాచీన కాలం నుంచీ ఈ గంగి రెద్దాటలు ప్రచారంలో వున్నాయని తెలుస్తుంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట.

(ఇంకా…)

3వ వారం

బొబ్బిలి యుద్ధం

బొబ్బిలి యుద్ధం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. 1758 జనవరి 24 న బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి, విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది. బొబ్బిలి కోట విశాఖపట్నానికి ఈశాన్యంగా 140 మైళ్ళ దూరంలో ఉంది. 18 వశతాబ్ది మధ్య కాలంలో బొబ్బిలి జమీందారుగా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావుకు, విజయనగర సంస్థానం ప్రభువు పూసపాటి పెద విజయరామరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. రెండు రాజ్యాల సరిహద్దుల వద్ద ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తిసుకు వెళ్ళేవారు. తన బలం చాలనందున విజయరామరాజు ఈ దోపిడీని ఎదుర్కొనలేకపోయేవాడు. ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్ బుస్సీ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, పక్కలో బల్లెంలా ఉన్న తన పొరుగు రాజును ఇక్కడి నుండి తరిమికొట్టాలని పెద విజయరామరాజు భావించాడు. బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందార్ల లాగా ఫ్రెంచి వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోక, తమ చర్యల ద్వారా ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్, మార్క్ దీ బుస్సీతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఈ చర్యలన్నిటి పర్యవసానమే బొబ్బిలి యుద్ధం. భారత దేశ చరిత్రలో మున్నెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం ఇది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.యుద్ధాన్ని నివారించేందుకు బొబ్బిలి సంస్థానం ప్రయత్నాలు చేసింది.

(ఇంకా…)

4వ వారం
ఎ.ఎన్.ఆర్

మూగ మనసులు

మూగమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నిర్మించిన 1964 నాటి తెలుగు చిత్రం. అంతస్తుల కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం కథాంశం. సినిమాని చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బాబూ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఆదుర్తి తాను చదివిన చిన్న కథను అనుసరించి తయారుచేసిన లైన్ కి, ఆదుర్తి కోరికపై ముళ్ళపూడి వెంకటరమణ మూగమనసులు పేరిట ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. సాధారణంగా అప్పటి సినిమాలు మద్రాసులోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకునేవి, అయితే సినిమా మాత్రం చాలాభాగం భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి పరిసరప్రాంతాల్లోనూ, గోదావరి మీదా అవుట్ డోర్ లో చిత్రీకరణ జరుపుకుంది. సినిమా పాటలు ఆత్రేయ, కొసరాజు, దాశరథి రాయగా, కె.వి.మహదేవన్ స్వరపరిచారు. విడుదలకు ముందే సినిమా బాగోలేదన్న పుకార్లను, గోదావరిపై జరిగిన పడవ ప్రమాదాలను తట్టుకుని 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం పొందింది. ప్రేక్షకాదరణ, విమర్శల ప్రశంసలు పొందిన ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఈ సినిమాని తారాచంద్ బర్జాత్యా, ఎల్.వి.ప్రసాద్ ల నిర్మాణంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, నూతన్, సునీల్ దత్ ప్రధాన పాత్రలలో హిందీలో మిలన్ గా తీశారు. అక్కడా సినిమా విజయవంతమైంది.

(ఇంకా…)

5వ వారం

ప్రొపేన్

ప్రోపేన్ అనునది ఆల్కేన్ సమూహానికి చెందిన ఒక హైడ్రోకార్బను సమ్మేళనం.ఇది స్వాభావికంగా వాయు రూపంలో లభ్యమైనప్పటికి, దీనిని సంకోచింపచేసిన ద్రవరూపంలోనికి మారును.అందుచే దీనిని ఎల్.పి.జి (ద్రవీకరించిన పెట్రోలియం వాయువు) అనికూడా కొన్నిదేశాలలో వ్యవహరిస్తుంటారు. దీని అణుఫార్ములా C3H8.ప్రోపేన్ అణువులో ద్విబంధాలు లేవు. ఇది ఒక సంతృప్త హైడ్రోకార్బను. ప్రోపేన్ ను సహజవాయువు నుండి మరియు ఇతర పెట్రోలియం ఉత్పతులనుండికూడా తయారు చేయుదురు. ప్రోపేన్ వాయువును క్రీ.శ.1910 లో మొదటగా డా. వాల్టరు స్నెల్లింగ్ వాహనంలలో ఇంధనంగా వాడు గాసొలిన్ లో గుర్తించాడు. వాహనంలో నింపిన గాసొలిన్ త్వరగా ఆవిరై పోవడంపై పరిశోధించినప్పుడు గాసొలిన్ లోని ఒక వాయువు అందుకు కారణంగా గుర్తించారు. వాయు అణువులో మూడు కార్బనులు వుండటం వలన, ఏకబంధాలు కలిగి యున్నందున దానికి ప్రోపేన్ అని పేరు రూఢి అయ్యింది. తరువాత క్రమంలో ఫ్రాంకు పి.పిటరుసన్, చెస్టరుకెర్ర్, మరియు అర్థర్ కెర్ర్ లతోకలిసి స్నెల్లింగు, గాసొలిన్ ను శుద్ధి చేయునప్పుడు వెలువడు ప్రోపేన్‌ను ద్రవీకరించి, సిలెండరులలో నింపడం కనుగొన్నాడు. దీనిని ద్రవీకరించిన పెట్రొలియం వాయువుగా మొదటి సారిగా అమ్మకం ప్రారంభించారు. క్రీ.శ.1911 నాటికి శుద్ధమైన ప్రోపేన్ వాయువును ఉత్పత్తి చెయ్యడం మొదలుపెట్టాడు. క్రీ.శ.1913, మార్చి 25 న తన అవిష్కరణకు పేటెంటు పొందాడు.

(ఇంకా…)

6వ వారం

మీజాన్

మీజాన్ 1944 నుండి 1948 వరకు హైదరాబాదు నుండి వెలువడిన దినపత్రిక. బొంబాయికి చెందిన వ్యాపారవేత్త గులాం మహమ్మద్ కలకత్తావాలా ఈ పత్రికకు యజమాని. మధ్య మధ్యలో కొన్ని అంతరాయాలతో ఈ 1944 నుండి 1948 వరకు నైజాం ప్రాంతంలో వెలువడినది. ఏకకాలంలో ఆంగ్లం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో వెలువడిన ఏకైక పత్రిక మీజాన్ మూడు సంచికలకు యాజమాన్యం ఒకటే అయినా మూడూ వేరు వేరు పంథాలలో నడిచేవి. ఆంగ్ల మీజాన్ ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలితమైన పత్రిక. ఇది నిజాం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికింది. ఉర్దూ సంచిక రజాకార్లకు మద్దతునిచ్చింది. తెలుగు సంచిక నిజాం వ్యతిరేక శక్తులకు అనుకూలమైన వార్తలను ప్రచురించేది. మీజాన్ ఆంగ్ల సంచికకు మిర్జా అబీద్ అలీ బేగ్ సంపాదకుడు కాగా ఉర్దూ సంచికకు హబీబుల్లా ఔజ్ సంపాదకుడు. అడవి బాపిరాజు మీజాన్ తెలుగు సంచికకు సంపాదకునిగా పనిచేశాడు. పత్రికా యాజమాన్యం యొక్క ప్రధానోద్దేశ్యం మీజాన్‌ ద్వారా నిజాం కీర్తి ప్రతిష్ఠల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం. అయితే తెలుగు సంచిక సంపాదకుడు అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, కాంగ్రెస్‌ వారు నిర్వహించిన ఆంధ్రమహాసభలకు, భారతదేశంలో హైదరాబాదు విలీనోద్యమాలకు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు.

(ఇంకా…)

7వ వారం

గెలీలియో గెలీలి

గెలీలియో గెలీలి ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను కనుగొన్నాడు. గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు. గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు.

(ఇంకా…)

8వ వారం

బమియాన్ బుద్ధ విగ్రహాలు

బమియాన్ బుద్ధ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్ లోని ఆరవ శతాబ్దానికి చెందిన పెద్ద బుద్ధ విగ్రహాలు. ఈ విగ్రహాలు మధ్య ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హజరాజత్ అనే ప్రాంతంలో బమియాన్ లోయ దగ్గర ఇసుకరాతి కొండల్లో చెక్కబడ్డాయి. ఈ ప్రదేశం కాబూల్ కు 213 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిల్పాలు గాంధార శిల్పకళ పద్ధతిలో చెక్కారు. శిథిలమైన బమియాన్ బుద్ధ విగ్రహం బమియాన్‌ అనేది హిందుకుష్ పర్వత ప్రాంతంలో ఓ అందమైన లోయ. ఇక్కడ ఎన్నో బుద్ధవిగ్రహాలున్నాయి. అందమైన గుహలున్నాయి. ఈ శిల్పాలు కుషాణుల కాలం నాటివి. ఇక్కడి శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై పాడయ్యాయి. బమియాన్‌లోని రెండు పెద్ద విగ్రహాలను 2011 లో తాలిబన్లు, తమ నాయకుడు ముల్లా ఒమర్ ఆదేశానుసారం ధ్వంసం చేసారు. బమియాన్ హిందూకుష్ పర్వతాల గుండా సాగిపోయే సిల్కు రోడ్డులో ఉంది. చారిత్రికంగా సిల్కు రోడ్డు చైనాను పాశ్చాత్య దేశాలతో కలిపే బిడారు వర్తకుల మార్గం. బమియాన్ అనేక బౌద్ధారామాలు వెలసిన ప్రదేశం. ఆధ్యాత్మికత, తాత్వికత, కళలూ విలసిల్లిన స్థలం. బమియాన్ కొండల్లో తొలిచిన గుహల్లో బౌద్ధ సన్యాసులు నివసించేవారు. సన్యాసులు ఈ గుహలను విగ్రహాలతో రంగురంగుల కుడ్య చిత్రాలతో అలంకరించేవారు. రెండవ శతాబ్ది నుండి 7 వ శతాబ్దిలో ఇస్లామిక దండయాత్రల వరకూ అది బౌద్ధ ఆధ్యాత్మిక స్థలంగా ఉండేది. 9 వ శతాబ్దిలో పూర్తిగా ముస్లిముల ఆక్రమణలోకి వెళ్ళేవరకూ బమియాన్‌లో గాంధార సంస్కృతి విలసిల్లింది.

(ఇంకా…)

9వ వారం

భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం

భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం, క్షిపణి దాడుల నుండి దేశాన్ని రక్షించే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ. పాకిస్తాన్ నుండి ఎదురౌతున్న క్షిపణి ముప్పును ఎదుర్కొనేందుకు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలో రెండు నిరోధక క్షిపణులు ఉన్నాయి. అవి, అధిక ఎత్తులలో అడ్డుకునేందుకు పనిచేసే పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD) క్షిపణి, తక్కువ ఎత్తులలో పనిచేసే అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) క్షిపణి. 5,000 కి.మీ. దూరం నుండి ప్రయోగించిన ఏ క్షిపణినైనా నిలువరించగల సామర్థ్యం ఈ రెండంచెల వ్యవస్థకు కలదు. 2006 నవంబరులో PAD ని పరీక్షించారు. 2007 డిసెంబరులో AAD ని పరీక్షించారు. PAD ని పరీక్షించడంతో, బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్లు మిగిలిన మూడు దేశాలు. ఈ వ్యవస్థ చాలా పరీక్షలకు లోనయ్యింది. దీన్ని అధికారికంగా ప్రారంభించవలసి ఉంది. 1990 ల తొలినాళ్ళ నుండి భారత్, పాకిస్తాన్ నుండి క్షిపణి దాడి ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు తోడు, పాకిస్తాన్ చైనానుండి కొన్న ఎమ్-11 క్షిపణులను మోహరించడంతో భారత్ 1995 ఆగస్టులో రష్యా నుండి 6 బ్యాటరీల S-300 భూమి-నుండి-గాలిలోకి పేల్చగలిగే క్షిపణులను కొనుగోలు చేసింది. ఢిల్లీ, ఇతర నగరాల రక్షణకు ఈ క్షిపణులను మోహరించింది. 1998 మేలో భారత్ తన రెండవ అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది.

(ఇంకా…)

10వ వారం

మచిలీపట్నం ముట్టడి

బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మచిలీపట్నం పట్నాన్ని ముట్టడించి ఆక్రమించుకోవడాన్ని మచిలీపట్నం ముట్టడి అంటారు. 1759 మార్చి 6 న మొదలైన ముట్టడి ఏప్రిల్ 7 న బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విజయంతో ముగిసింది. దీంతో ఉత్తర సర్కారుల నుండి ఫ్రెంచి వారి నిష్క్రమణ సంపూర్ణమైంది. బ్రిటిషు సైన్యానికి కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డు నాయకత్వం వహించగా, ఫ్రెంచి వారి తరపున కాన్‌ఫ్లాన్స్ వారిని ఎదుర్కొన్నాడు. మచిలీపట్నం ముట్టడి నాటికి బ్రిటిషు సైన్యాలు విజయోత్సాహంలో ఉన్నాయి. క్లైవు ఆదేశాలతో ఉత్తర సర్కారులపై దండయాత్ర చేసి ఫ్రెంచి వారి ప్రాబల్యానికి గండి కొట్టేందుకు కలకత్తా నుండి కలనల్ ఫోర్డు వచ్చాడు. విజయనగర రాజు ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో ఒప్పందం కుదుర్చుకుని ఫోర్డు, ఫ్రెంచి వారిపై దాడి చేసాడు. చెందుర్తి యుద్ధంలో ఫోర్డు ఫ్రెంచి వారిని ఓడించాక, ఫ్రెంచి సైన్యం పారిపోయి, రాజమండ్రి చేరుకుంది. బ్రిటిషు సైన్యం వారిని అక్కడినుండి కూడా పారద్రోలింది. కాన్‌ఫ్లాన్స్ తన సైన్యాన్ని తీసుకుని మచిలీపట్నంలోని తమ స్థావరానికి పారిపోయాడు. ఈలోగా బ్రిటిషువారికీ, ఆనందరాజుకూ మధ్య అంతంత మాత్రంగా ఉన్న మైత్రి మరింత చెడింది. బ్రిటిషు వారి తరపున ఆండ్రూస్ కలగజేసుకుని తిరిగి మైత్రిని నెలకొల్పాక, ఇరు సైన్యాలూ మచిలీపట్నం ముట్టడికి సిద్ధమయ్యాయి. ఫ్రెంచి వారు మచిలీపట్నంలోని తమ స్థావరాన్ని బలోపేతం చేసుకుని, యుద్ధ నష్టాల నుండి కొంత తేరుకున్నారు.

(ఇంకా…)

11వ వారం

గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి

గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలోనే, కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోవే ఉంది. ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఈ ఆలయం గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాధల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరదిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకుని, శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. మూల విరాట్టు గోవిందరాజ స్వామితో బాటు, అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాళ మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామా సహితుడైన పార్ధ సారధి మందిరం ఉంది. వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

(ఇంకా…)

12వ వారం
నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం

నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలో అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ రిజర్వ్ 5 జిల్లాలలో (నల్గొండ జిల్లా,మహబూబ్ నగర్ జిల్లా,కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లా) విస్తరించి ఉంది. అభయారణ్యం వైశాల్యం 3,568 చ.కి.మీ. అభయారణ్యం ప్రధానకేంద్రం వైశాల్యం 1200 చ.కి.మీ.రిజర్వాయర్లు మరియు శ్రీశైలం ఆలయం పలువురు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. అభయారణ్యం 78-30 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 79-28 డిగ్రీల తూర్పు రేఖాంశం మద్య ఉంది. సముద్రమట్టం నుండి ఎత్తు 100 మీ నుండి 917 మీ వ్యత్యాసంలో ఉంటుంది. వార్షిక వర్షపాతం 1000 మి.మీ ఉంటుంది. ఈ అభయారణ్యంలో బహుళప్రయోజన రిజర్వార్లు శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.అభయారణ్యం నల్లమల అరణ్యంలో పీఠభూమి మరియు కొండశిఖరాలు మిశ్రితమైన ప్రాంతంలో ఉంది. ఇందులో 80% కంటే అధికంగా కొండప్రాంతం ఉంది. కొండల వరుసలలో ఎత్తైనకొండలు మరియు లోయలు ఉన్నాయి. పర్వతమయ ప్రాంతంలో శ్రీశైలం, అంరాబాద్, పెద్దచెరువు, శివపురం మరియు నెక్కెంటి వంటి గుర్తించతగిన పీఠభూమి ఉంది. నాగార్జునసాగర్ నైరుతీ ఋతుపవనాల నుండి వర్షపాతం అందుకుంటున్నది. జూన్ మూడవవారం నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఒకనెల విరామం తరువాత అక్టోబర్ మాసంలో ఈశాన్య ఋతుపవనాలు ఆరంభం ఔతాయి.

(ఇంకా…)

13వ వారం

పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు. పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.

(ఇంకా…)

14వ వారం
భారతీయ జనతా పార్టీ

భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు మరియు దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ యొక్క వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. దాని సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగాను, లాల్ కిషన్ అద్వానీ ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది.

(ఇంకా…)

15వ వారం

కలిబంగాన్

కలిబంగాన్ రాజస్థాన్, హనుమాన్‌గఢ్ జిల్లా పిలిబంగాన్ తెహసీల్ లోని ఒక పట్నం. ఇది ఘగ్గర్ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ నదినే సరస్వతీ నదిగా కొందరు పండితులు భావిస్తారు. ఈ పట్నం బికనీర్ నుండి 205 కి.మీ. దూరంలో ఉంది. దృషద్వతి, సరస్వతి నదుల సంగమ స్థలంలోని త్రికోణాకార ప్రదేశంలో ఈ పట్నం నెలకొని ఉంది. సింధు లోయ నాగరికత యొక్క ప్రాక్చారిత్రిక లక్షణాలను ఈ స్థలంలోనే మొదటగా, లుయిగీ టెస్సిటోరి గుర్తించాడు. 2003 లో, ఇక్కడ తవ్వకాలు పూర్తైన 34 ఏళ్ళ తరువాత, భారత పురాతత్వ సర్వే సంస్థ తవ్వకాల నివేదికను ప్రచురించింది. సింధు లోయ నాగరికతలో కలిబంగాన్ ఒక పెద్ద ప్రాంతానికి రాజధానిగా ఉండేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. కలిబంగాన్, ఇక్కడి హోమగుండాలకు, ప్రపంచపు మొట్టమొదటి దున్నిన పొలానికీ ప్రసిద్ధమైంది. కలిబంగాన్ ప్రాక్చరిత్రకు చెందిన స్థలమని గుర్తించినది, ఇటలీకి చెందిన ఇండాలజిస్టు లుయిగీ పియో టెస్సిటోరి (1887–1919). భారతీయ శాసనాలపై అతడు పరిశోధన చేస్తూండగా, అక్కడి శిథిలాల లక్షణాలను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటి భారత పురాతత్వ సర్వే సంస్థకు సర్ జాన్ మార్షల్‌ సాయం కోరాడు. ఆ సంస్థ అప్పటికే హరప్పాలో కొన్ని తవ్వకాలు జరిపి ఉంది. కానీ వాళ్ళకు ఈ శిథిలాల లక్షణాల గురించి అవగాహనేమీ లేదు. నిజానికి, ఈ శిథిలాలు ప్రాక్చరిత్రకు, మౌర్యులకు పూర్వ కాలానికి చెందినవనీ కనుగొన్నది టెస్సిటోరియే.

(ఇంకా…)

16వ వారం

హరిద్వార్

హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ. క్రీ.శ.1888 డిసెంబర్ 28 హరిద్వార్‌కు జిల్లా స్థాయి ఇవ్వబడింది. క్రీ.శ.2000 సెప్టెంబర్ 9 హరిద్వార్ ఉత్తరఖాండ్ లో ఒక భాగమైంది. ఉత్తరాఖండ్ ఇండియన్ రిపబ్లిక్‌లో 27వ రాష్ట్రం. ఆధ్యాత్మిక క్షేత్రం నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి పథంలో ఉంది. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహాబాద్ లోని ప్రయాగ, ఉజ్జయిని మరియు గోదావరి జన్మ స్థలమైన నాసిక్. సాగరమథనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. 12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ.ఈ సమయంలో భక్తులు గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.

(ఇంకా…)

17వ వారం

టెలిస్కోపు

టెలిస్కోపు 'విద్యుదయస్కాంత రేడియేషన్' సేకరించుటద్వారా సుదూర ప్రాంతాలలో వున్న వస్తువులను పరిశీలించుటకు ఉపయోగించు ఒక దృక్ సాధనం. 'టెలిస్కోపు' పదానికి మూలం 'గ్రీకుభాష', టెలి అనగా 'సుదూరం', స్కోపు అనగా 'వీక్షణం' లేక 'దర్శనం', క్లుప్తంగా "దూరవీక్షణి" లేదా "దూరదర్శిని". టెలిస్కోపు అనేది చాలా దూరములో ఉన్న వస్తువులను చుసేందుకు ఉపయొగించు ఉపకరణం. మొట్టమొదటి టెలిస్కోపు నెదర్లాలెండ్స్ లో 17వ శతాబ్దము మొదటలో కనుగొన్నారు. దీనిని గాజు కటకాలను ఉపయోగించి రూపొందించారు. దీనిని భూమి నుండి దూరపు ప్రాంతాలను చుసేందుకు వాడేరు. ఇటలీకి చెందిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలి తొలి దూరదర్శినిని 1609 లో నిర్మించటమే కాకుండా కొన్ని నమ్మజాలని నిజాలను ప్రకటించాడు. చంద్రుడి యొక్క ఉపరితలం నునుపుగా కాకుండా పర్వతాలను, లోయలను కలిగి ఉందనీ, పాలపుంత అనేక నక్షత్రాల సముదాయమనీ, బృహస్పతి గ్రహం చుట్టూ నాలుగు ఉపగ్రహాలు కనిపించాయనీ అతడు ప్రతిపాదించాడు. విశ్వం యొక్క మూల స్వరూపం ఎలా ఉంటుందో ఊహించి చెప్పాడు కూడా. అయితే ఈ కొత్త అభిప్రాయాలన్నీ చర్చి అధికారులకు నచ్చలేదు. అతన్ని రోమ్ నగరానికి రప్పించి, మత నియమాలను భంగపరిచాడన్న ఆరోపణ మోపి, అతను ప్రకటించిన అభిప్రాయాలను అతనిచేతనే ఉపసంహరింపజేసి, శేష జీవితంలో నోరు మెదపరాదన్న ఆంక్ష విధించారు.

(ఇంకా…)

18వ వారం

ఆత్రేయ

ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. 1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు.

(ఇంకా…)

19వ వారం

బెంజీన్

బెంజీన్ ఒక ముఖ్యమైన సేంద్రియ రసాయన సంయోగ పదార్థం. ఇది ఆరోమాటిక్ వర్గానికి చెందిన హైడ్రోకార్బన్. బెంజీన్ యొక్క రసాయన సంకేత పదంC6H6.ఒక అణువు బెంజీన్ లో ఆరు కార్బను మరియు ఆరు హైడ్రోజన్ పరమాణువులు ఆరుభుజాలతోఒక వలయంలా ఏర్పడి ఉండును. ముడి పెట్రోలియంలో స్వాభావికంగా ఉండు పదార్థం బెంజీన్. బెంజీన్ అణువులోని కార్బన్ పరమాణువుల మధ్య ఉన్న చక్రీయ అనియత "పై బంధం" కారణంగా బెంజీన్‌ను ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ గా వర్గీకరించడమైనది.బెంజీన్ రంగులేని, అత్యంత వేగంగా మండుస్వాభావమున్న ద్రవం మరియు ద్రావణి. బెంజీన్ తియ్యని వాసన వెలువరించును. ఇథైల్ బెంజీన్, మరియు కుమేన్ వంటి సంక్లిష్ట అణునిర్మాణమున్న రసాయన పదార్థాల ఉత్పత్తికి బెంజీన్ ను పూర్వగామిగా గా ఉపయోగిస్తారు.బెంజీన్ అధికస్థాయి ఆక్టేన్ సంఖ్య కల్గిఉన్నందున, గాసోలిన్/పెట్రోలు లోని బెంజీన్ అంశీభూతాలలోముఖ్యమైనది.బెంజీన్ క్యాన్సర్ కారణం కనుక పారిశ్రామికేతర వినిమయం పరిమితం. బెంజీన్ రంగులేని, పారదర్శకంగా ఉన్నద్రవం. పెట్రోల్ వంటి వాసన కల్గిఉన్నది.బెంజీన్ అణుభారం 78.11184గ్రాములు/మోల్−1. పలురకాల రసాయన సంయోగ పదార్థాలను తయారు చేయుటలో బెంజీన్‌ను మధ్యస్థాయి రసాయనపదార్థంగా విరివిగా ఉపయోగిస్తారు.

(ఇంకా…)

20వ వారం

ఆర్థర్ కాటన్

కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు. మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక జిల్లా లను అత్యంత అభివృద్ధి, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి.

(ఇంకా…)

21వ వారం

సుందరవనాలు

సుందరవనాలు అనేవి ప్రపంచంలోని ఏకైక అతి పెద్ద ఏకదళ వృక్ష ప్రాంతం క్షారప్రియ నీటిమొక్కల మడ అరణ్య ప్రాంతం. సుందర్బన్ అనే పేరుకు సాహిత్యపరమైన అర్ధం "అందమైన అడవి" లేదా "అందమైన అరణ్యం", బెంగాలీ భాషలో (సుందర్ అనగా "అందమైన" మరియు బన్ అనగా "అరణ్యం" లేదా "అడవి"). సుందర్బన్స్ లో పెద్ద సంఖ్యలో లభ్యమయ్యే సుందరి చెట్ల వలన ఈ పేరు వచ్చి ఉండవచ్చు. ఈ అడవి గంగానది పాదాల వద్ద ఉండి బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలు మరియు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో విస్తరించి, డెల్టా యొక్క సముద్రపు అంచుని ఏర్పరుస్తుంది. కాలానుగుణంగా-వరదలకు గురయ్యే సుందర్బన్ మంచినీటి తంపర అడవులు మడ అడవుల లోపలిభాగంలో ఉంటాయి. ఈ అడవి 10,000 కిమీ2 వ్యాపించి ఉండగా, దీనిలో సుమారు 6,000 బంగ్లాదేశ్ లో ఉంది. ఇది 1997లో యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా ప్రకటించ బడింది, బంగ్లాదేశీ మరియు భారత భాగాలు ఒకే విధమైన పర్యావరణ ప్రాంతాలు ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో సుందర్బన్స్ మరియు సుందర్బన్స్ నేషనల్ పార్క్‌ ప్రాంతాలు ఉన్నాయి. సుందర్బన్స్ సంక్లిష్టమైన వేలా జలమార్గాలు, బురద మైదానాలు మరియు లవణ స్వభావాన్ని తట్టుకోగలిగిన మడ అడవుల యొక్క ద్వీపాలతో నిండి ఉంది. ఈ ప్రాంతం, దీని నుండే తన పేరు పొందిన రాయల్ బెంగాల్ పులి (పాన్థేరా టైగ్రిస్ టైగ్రిస్ ) తో పాటు, పక్షి యొక్క జాతులు, మచ్చల లేడి, మొసళ్ళు మరియు పాము వంటి అనేక జంతు జీవజాలాలకు ప్రసిద్ధి చెందింది.

(ఇంకా…)

22వ వారం

సౌర తుఫాను

సోలార్ సునామి అనేది సూర్యుని వల్ల వచ్చే తుఫాను. సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు సోలార్‌ సునామి. యిది 2010 ఆగష్టు 3వ తేదీన భూమిని తాకింది. ఇది రష్యా, అమెరికా, న్యూజీలాండ్ తదితర దేశాల్లో కనిపించింది, కనువిందు చేసింది. పేరుకు తగ్గట్టు భయపెట్టలేదు, భీతిల్ల చేయలేదు. పైగా కమనీయంగా, రమణీయంగా అగుపించి రంజింపచేసింది. ఎర్రటి, ఆకుపచ్చటి రంగుల్లో అత్యద్భుతమైన వర్ణచిత్రాన్ని తలపించింది. సోలార్ సునామీ సూర్య మంటలు ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. వాటిని "మోరిటన్ తరంగాలు" అనికూడా అందురు. ఈ తరంగాలకు అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన "గైల్ మారిటన్" పేరును పెట్టారు. ఆయన 1959 లో బర్బాంక్, కాలిఫోర్నియా లోని "లాక్‌హీడ్ మార్టిన్ సోలార్ అండ్ అస్ట్రోఫిజిక్స్ లాబొరేటరీ" నుండి సూర్యుడిని పరిశీలించి తరంగాల ఉనికినికనుగొన్నాడు. ఆయన సూర్యుని లోని బల్మర్ శ్రేణిలోని క్రోమోస్ఫోర్ ను టైమ్‌లాప్స్ ఫొటోగ్రఫీ సహాయంతో కనుగొన్నాడు. ఈ మారిటన్ తరంగాలు 500 - 1500 కి.మీ /సెకను వేగంతో కదులుతాయి. "యుతక యుచిడా" అనే శాస్త్రవేత్త ఈ మారిటన్ తరంగాలు సూర్యుని యొక్క కరోనాలో అధిక శక్తి షాక్ తరంగాలుగా ప్రయాణిస్తుంటాయని విశదీకరించాడు.

(ఇంకా…)

23వ వారం

సియాటెల్

సియాటెల్ అమెరికాలోని పశ్చిమతీర నౌకాశ్రయ నగరాలలో ఒకటి మరియు కింగ్ కౌటీ కౌంటీ స్థానంగా ఉంది. 2015 గణాకాల ఆధారంగా నగర జనసంఖ్య 6,84,451. ఉత్తర అమెరికా పసిఫిక్ వాయవ్య ప్రాంతంలోను, యు.ఎస్.స్టేట్ వాషింగ్టన్‌లలోనూ సియాటెల్ అతిపెద్ద నగరం. 2013 జూలైలో యునైటెడ్ స్టేట్స్‌లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా సియాటెల్ గుర్తింపు పొందింది. అలాగే 2015 మే గణాంకాలను అనుసరించి 2.1% అభివృద్ధితో సియాటెల్ యునైటెడ్ స్టేట్స్‌లోని టాప్ 5 నగరాలలో ఒకటిగా గుర్తించబడింది. యునైటెడ్ స్టేట్స్ లోని (మహానగర ప్రాంతం) మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 3.7 మిలియన్ల జనసంఖ్య కలిగిన సియాటెల్ 15వ స్థానంలో ఉంది. సియాటెల్ నగరం పుగెట్ సౌండ్ మరియు వాషింగ్టన్ సరోవరం మద్య ఉంది. నగరం కెనడా దేశ నైరుతీ సరిహద్దు ప్రాంతం, యునైటెడ్ స్టేట్స్ వాయవ్య సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఉత్తర అమెరికా నౌకాశ్రయాలలో మూడవస్థానంలో ఉన్న సియాటెల్, ఆసియా ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటి. సియాటెల్ ప్రాంతానికి యురోపియన్లు ప్రవేశించక ముందు ఈ ప్రాంతంలో 4,000 సంవత్సరాల ముందుగానే స్థానిక అమెరికన్లు నివసించారు.

(ఇంకా…)

24వ వారం

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కృష్ణా జిల్లా లోని అవనిగడ్డలో ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఈ క్షేత్రం ఎంతో విఖ్యాతి గాంచింది. పంచ భావన్నారాయణ క్షేత్రాలు, పంచభూత లింగాలు, పంచారామాలు, పంచలక్ష్మీ నారాయణ క్షేత్రాలు తెలుగునాట ప్రసిద్ధి పొందాయి. స్కాందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో బ్రహ్మ వైవర్తంలో వ్యాసుడు పంచలక్ష్మీనారాయణ క్షేత్రాలను గూర్చి వర్ణించారు. శ్రీరాముని కుల గురువైన వశిష్టుని ఆశ్రమంగా ఈ అవనిగడ్డ ప్రాంతం అలరాలేది. ఈ ఆశ్రమంలో సీతాదేవి వశిష్టుని ద్వారా ధర్మ శ్రవణం చేసేదని ప్రతీతి. అందుకే ఈ ప్రదేశం దీన్ని అవనిజపుర౦ అని సీతాదేవి పేరుతో పిలుస్తారు. సీతాదేవి వనవాసం ఉన్నది సీతలంక అనీ, వశిష్టాశ్రమాన్ని వశిష్టమెట్టగా పిలిచేవారు. కాలక్రమేణ ఈ ప్రాంతం అవనిగడ్డగా స్థిరపడింది. నడకుదురు, అవనిగడ్డ, నల్లూరు, రాచూరు, పెదముత్తేవిలలో ఉన్న లక్ష్మీనారాయణ క్షేత్రాన్ని పంచలక్ష్మీనారాయణ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు. అవనిగడ్డ ప్రాంతం శాతవాహనుల కాలంలో సుప్రసిద్ధ రేవు పట్టణం. దివిసీమకే ప్రత్యేకతను ఆపాదించే ఈ ప్రాంతం అనాదిగా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయాన్ని 1824 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసారు.

(ఇంకా…)

25వ వారం

గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 - అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది. 1902 వ సం.లో కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య - బాపమ్మ లకు కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు. రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు.

(ఇంకా…)

26వ వారం
కొలకలూరి ఇనాక్

కొలకలూరి ఇనాక్ తెలుగు రచయిత మరియు సాహితీకారుడు. ఆయన అనేక వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఈయన చేసిన కృషికి తగ్గ ఫలితంగా 2014 లో భారత ప్రభుత్వం "'పద్మశ్రీ"' పురస్కారం ప్రకటించి గౌరవించినది. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతని "అనంత జీవనం" అనే రచనకు లభించింది. ఈయన వేజెండ్ల గ్రామంలో నిరుపేద కుటుంబీకులైన రామయ్య, విశ్రాంతమ్మ దంపతుల సంతానంగా, 1939, జులై-1న జన్మించాడు. గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుపతి వంటి ప్రదేశాలలో తెలుగు ఆచార్యుడుగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదుగుతూ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి అందుకున్నాడు. మరోవైపు తెలుగు సాహితీ ప్రక్రియలో, తనదైన శైలికి వన్నెలద్దుతూ, తన కలం బలం చాటాడు. 1954లో లోకంపోకడ, ఉత్తరం అనే కథానికలతో తెలుగు సాహితీ లోకంలో చేరినాడు. 1958లో "దృష్టి" అను నాటికను వ్రాసి, కేంద్రప్రభుత్వ బహుమతిని అందుకున్నాడు. 1965లో "జైహింద్" అను నాటికకు రాష్ట్రప్రభుత్వ బహుమతిని దక్కించుకున్నాడు. 1986లో వ్రాసిన "ఊరబావి" కథాసంపుటి, రచయితగా ఆయన స్థానాన్ని చాటిచెప్పినది. 1988లో "మునివాహనుడు" కథాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినది. ఈ రకంగా రెండు సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న అరుదైన రచయితగా ప్రసిద్ధిచెందినాడు. నవలా రచయితగా, నాటక స్రష్టగా, విమర్శకునిగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితుడైన ఈయన, పర్యవేక్షకునిగా 20 మంది శిష్యులకు పి.హెచ్.డి. పరిశోధనలో మార్గదర్శకులైనాడు.

(ఇంకా…)

27వ వారం
పి.వేణుగోపాల్

డాక్టర్ పి.వేణుగోపాల్ ప్రముఖ హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు. 49 సంవత్సరాల సేవ తరువాత 3, జులై 2008న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసారు. కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రామదాసుతో అల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నిర్వహణపరమైన విధానాలతో విభేదించి, కుట్ర పూరితమయిన చట్టం ద్వారా తొలగింపబడి తిరిగి సుప్రీం కోర్టు ద్వారా నియమింపబడి, సంస్థ లోని డాక్టర్లు, ఇతర సిబ్బంది, పలువురు రాజకీయ నాయకులు, మీడియా వారి మద్దతు పొంది విజయం సాధించిన అరుదయిన వ్యక్తి. భారత దేశములో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు. అనేక అంతర్జాతీయ హృద్రోగ సంస్థలకు సలహాదారుడిగా మరియు సభ్యుడిగా ఉన్న వేణుగోపాల్ తెలుగుజాతికి గర్వకారణం. వైద్యంలో ముఖ్యంగా హృద్రోగాల నిదానంలో ఈయన ఒక అసాధారణ నిపుణులు. మౌలిక ప్రతిభ ఉన్న పరిశోధకులు. మన దేశంలో మొట్టమొదటి గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసింది ఈయనే. 1994 లో దేవీరాం (ఓక మోటార్ మెకానిక్) కు అరుదైన శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దేశంలో తొలిసారిగా ఈ అసాధారన వైద్య విజయాన్ని సాధించారు. ఆనాటి నుండి 50వేల మందికి పైగా హృద్రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. 1970లో ఎయిమ్స్ లో చేరినప్పటి నుండి ఏ ఆపరేషన్ థియేటర్ లో, ఏ టేబుల్ మీదనయితే వేలాది మంది హృద్రోగులకు ఈయన శస్త్ర చికిత్స చేసారో, అదే టేబుల్ మీద ఈయనకు కూడా బైపాస్ సర్జరీ జరిగింది.

(ఇంకా…)

28వ వారం
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి - 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు.

(ఇంకా…)

29వ వారం
బోయి భీమన్న

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు. భీమన్న 1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టాడు. నాగమ్మ మరియు పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు మరియు ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టాడు. భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబరు 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

(ఇంకా…)

30వ వారం

కొబ్బరి పాలు

కొబ్బరి పాలు అనేది కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన ద్రవ పదార్థం. ఇది ఒక పరిపక్వమైన కొబ్బరికాయ యొక్క కొబ్బరి నుండి తయారయ్యే తీయని, పాలవంటి వంటలో ఉపయోగించే పదార్థం. ఈ పాల రంగు మరియు కమ్మని రుచికి కారణం, అందులోని అధికమైన నూనె పదార్థం మరియు చక్కెరలు. కొబ్బరి పాలు అనే పదం మరియు కొబ్బరి నీరు (కొబ్బరి పానీయం) ఒకటి కాదు, కొబ్బరి నీరు అనేది కొబ్బరికాయ లోపలివైపు సహజంగా ఉత్పన్నమయ్యే ద్రవం. కొబ్బరి పాలు చాలా రుచిగా ఉండటమే కాక, చాలా ఎక్కువ నూనె శాతం ఉంటుంది. ఈ పాలల్లో ఉండే కొవ్వు ఎక్కువగా సంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది. దక్షిణ తూర్పు ఆసియాలోను, దక్షిణ ఆసియాలోనూ, దక్షిణ చైనాలోను, కరేబియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లోనూ ఎక్కువగా వంటల్లో ఈ పాలను వాడుతుంటారు. రెండు రకాల కొబ్బరి పాలు ఉంటాయి: చిక్కటివి మరియు పలుచనివి . తురిమిన కొబ్బరిని చీజ్‍క్లాత్ (వడపోత బట్ట) ను ఉపయోగించి నేరుగా పిండడం ద్వారా చిక్కటి పాలు లభిస్తాయి. పిండిన కొబ్బరిని అటుపై వెచ్చని నీటిలో నానబెట్టి, రెండు లేదా మూడు సార్లు పిండినప్పుడు పలుచని కొబ్బరి పాలు లభిస్తాయి. చిక్కటి పాలు ముఖ్యంగా డెస్సర్ట్ (భోజనంలో ఆఖరి అంశం) లు మరియు ఘనమైన, పొడి సాస్‍ల తయారీలో ఉపయోగిస్తారు. పలుచని పాలు సూప్‍ల తయారీ మరియు సాధారణమైన వంటలో ఉపయోగిస్తారు.

(ఇంకా…)

31వ వారం
ఆశావాది ప్రకాశరావు

డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథరచయితగా, అవధానిగా, కవిగా పేరు గడించాడు. తారణ నామ సంవత్సరం, శ్రావణమాసం, త్రయోదశి, బుధవారం 1944వ సంవత్సరం ఆగష్టు 2 వ తేదీ ఆశావాది ప్రకాశరావు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు కొరివిపల్లి గ్రామంలో మాతామహుల ఇంటిలో జన్మించాడు. ఇతని అసలు పేరు ఆసాది ప్రకాశం. ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య ఇతని పేరును ఆశావాది ప్రకాశరావుగా మార్చాడు. దళిత కుటుంబంలో జన్మించిన ఇతని బాల్యం బెళుగుప్ప, శీరిపి గ్రామాలలో గడిచింది. ఆ గ్రామాలలోని సోషియల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అవధాన విద్యలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధానిని గురువుగా స్వీకరించి అతని ఆశీస్సులతో ఆశుకవిత అలవరచుకున్నాడు. 1963లో తన 19వయేట మొదటి అవధానం చేశాడు. అప్పటి నుండి ఆంధ్రసాహితీ చరిత్రలో దళితులలో ఏకైక అవధానిగా ముద్రవేసికొని అసాధారణ ధారణాశక్తితో, అనిర్వచనీయమైన మహేంద్రజాలశక్తితో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. ఇతడు ఆంధ్రదేశంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతాలైన తరుత్తణి, అరక్కోణం, పళ్ళిపట్టు, హోసూరు,బెంగళూరు, బళ్లారి, తుంగభద్రడ్యామ్‌, దోణిమలై, ఢిల్లీ మొదలైన పలుప్రాంతాలలో 171 అష్టావధానాలు, ఒక ద్విగుణిత అష్టావధానం చేశాడు. ఇతని అవధానాలు దూరదర్శన్, ఆకాశవాణిలలో కూడా ప్రసారం అయ్యాయి. కొన్ని ఆశుకవితా ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.

(ఇంకా…)

32వ వారం

మాలపిల్ల

మాలపల్లి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో "సారధి ఫిలిమ్స్" నిర్మాణంలో గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, గాలి వెంకటేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటించిన 1938 నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం. గుడిపాటి వెంకటచలం రాసిన అముద్రిత నవల మాలపిల్ల సినిమాకు ఆధారం. మాటలు, కొన్ని పాటలు తాపీ ధర్మారావు నాయుడు రాయగా, మిగిలిన పాటలు అప్పటికే ప్రచారంలో ఉన్న బసవరాజు అప్పారావు గేయాలు, జయదేవుని అష్టపదుల నుంచి తీసుకున్నారు. భీమవరపు నరసింహారావు సంగీతాన్ని అందించారు. చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ప్రోత్సాహం, ఆర్థిక సహకారంతో గూడవల్లి రామబ్రహ్మం ఎండీగా ప్రారంభమైన సారధి ఫిలిమ్స్ తొలి చిత్రంగా మాలపిల్ల నిర్మించారు. రంగస్థలంలో ప్రఖ్యాతుడైన గోవిందరాజులు సుబ్బారావుకూ, సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తున్న గూడవల్లి రామబ్రహ్మానికి కూడా ఇదే తొలి చిత్రం. కళ్యాణపురం అన్న గ్రామంలో హరిజన యువతి, బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడమూ, హరిజనులు పోరాటం ద్వారానూ, తమ సహృదయత ద్వారానూ ఛాందస బ్రాహ్మణుడైన ధర్మకర్త సుందరరామశాస్త్రి మనసు మార్చి దేవాలయ ప్రవేశం పొందడం సినిమా కథాంశం. అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి సినిమా తీశారు.

(ఇంకా…)

33వ వారం

పరమ వీర చక్ర

పరమ వీర చక్ర అనేది భారతదేశంలో అత్యున్నత త్రివిధ దళాల పురస్కారం. ఈ పురస్కారం యుధ్ద సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అందచేయబడును. పేరుకు అర్థం "అత్యున్నత ధైర్య చక్రం". ఈ పురస్కారం అమెరికాకు చెందిన "మెడల్ అఫ్ హానర్" మరియు బ్రిటన్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానం. అశోక్‌చక్ర అనే మరో పురస్కారం దేశ శాంతి సమయాలలో పరమ వీరచక్ర కు సమానం. పరమ వీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పని చేసే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది, కానీ అశోక్ చక్ర మాత్రం ఏ భారతీయనికైనా పురస్కరించవచ్చు. పరమ వీర చక్రకు మాదిరి గానే అశోక్ చక్ర కూడా చనిపోయిన తరువాత కూడా పురస్కరించవచ్చు. పురస్కార గ్రహీతల కు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక భత్యాలు అందచేయబడతాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి భత్యాలు అందిస్తున్నాయి. పరమ వీర చక్ర 26 జనవరి 1950 (గణతంత్ర దినోత్సవం)న భారత రాష్ట్రపతి చే స్థాపించబడింది. కానీ ఈ పురస్కారం 15 ఆగస్ట్ 1947 (స్వతంత్ర దినోత్సవం) నుండి పరిగణనలో ఉన్నటు చట్టం స్థాపించబడింది. ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా మరియు సైన్య అధికారుడికైనా అందించవచ్చు. ఒక సైనికుడికి రెండోసారి ఈ పురస్కారం అందచేయబడితే పరమ వీర చక్ర రిబ్బన్ కు ఒక గీత జమ చేయబడుతుంది.

(ఇంకా…)

34వ వారం
దేవులపల్లి రామానుజరావు

దేవులపల్లి రామానుజరావు తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అలుపెరగని పోరాటం చేసిన సాహితీకారుడు. తెలంగాణలో శోభ, ‘గోల్కొండ’ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు ఆయన. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు. ఆయన ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, మంచి పాండిత్యం కలవాడు. తెలుగులో మంచి రచయిత. అనేక విషయాలు తెలిసిన దిట్ట మంచి వక్త మరియు పరిశోధకుడు. తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు. వారు ఓరుగల్లు మీద వ్రాసిన ఖండకావ్యం తెలుగు సాహిత్యంలోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ పులకిస్తూ ఉంటారు.

(ఇంకా…)

35వ వారం

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ. ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించింది. అయితే నాడు మొత్తం సమాజమంతా ఈ కన్యాశుల్కం దురాచారానికి బలి అయ్యినదంటే నేడు నమ్మసఖ్యంగా ఉండకపోవచ్చు. పూర్ణమ్మ అనే బాలిక బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరు, ఆ విషాదకర మరణానికి మూల కారణం ఏమిటి. ఇటువంటి రుగ్మతకు కారణం కులమా, సమాజమా అని ప్రశ్నిస్తే, ఈ జాడ్యం కేవలం ఒక కులానికే పరిమితమైనదా లేదా మొత్తం నాటి సమాజానికంతటికి చీడలా వ్యాపించినదా అని తర్కిస్తే చర్చ శాస్రీయ ధోరిణి వైపు, వాస్తవాల వైపు మళ్ళాల్సివుంటుంది. ఈ కన్యాశుల్కం దురాచారానికి ముగింపుగా బలవన్మరణం పొందడం లేదా విధవాపునర్వివాహం లేకుండా కన్య గానే మిగిలిపోవడం అనేది నాడు అన్ని కులాలలో కనిపించినదా లేదా కేవలం సనాతన బ్రాహ్మణ కులాలలోనే కనిపించినదా అన్న కోణం నుంచి కూడా పరిశీలించాల్సివుంటుంది.


(ఇంకా…)

36వ వారం

బ్రహ్మపరివర్తన వేడుక

పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి 'బ్రహ్మం' మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది, ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సాధారణంగా అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరంలో పూరీలో కొయ్యతో చేసిన మూలవిగ్రహాలను ఖననం చేసేసి, కొత్తగా ఎంపిక చేసిన చెట్ల దారువుతో మూలవిరాట్టులను తయారుచేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబర అంటారు. పాత విగ్రహాలను ఖననంచేసే ముందు ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని, చేతికి వస్త్రం చుట్టుకుని జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు, ఇది ఇన్నేళ్లకోసారి జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. సాధారణంగా 8, 11, 19 సంవత్సరాలకోసారి వస్తుంది. క్రీ.శ.1039లో 27 సంవత్సరాల వ్యవధి తీసుకుంది. 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996...తర్వాత మళ్లీ 2015 జూలై 15 న జరిగింది. ఈ శతాబ్దిలో ఇదే మొదటి యాత్ర. నవకళేబరయాత్రలో ప్రధాన ఘట్టం వనయాగయాత్ర. దేవతా విగ్రహాల తయారీకి కలపను అన్వేషించడమే యాత్ర లక్ష్యం. జగన్నాథ రథయాత్రకు 65 రోజుల ముందు, చైత్ర శుద్ధ దశమినాడు వనయాగయాత్ర మొదలవుతుంది.


(ఇంకా…)

37వ వారం

భాగ్యరెడ్డివర్మ

దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రి మండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశారు. మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన రెండవ సంతానంగా జన్మించిన భాగయ్య, ఆ తర్వాత కాలంలో తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. 1888 నవంబరులో వారి కుటుంబ గురువు వారిని సందర్శించడానికి వచ్చి పిల్లవానికి భాగయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామకరణం చేశాడు. భాగ్యరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి ఐదుగురు సంతానాన్ని ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ పోషించింది. 18 ఏళ్ళ వయసులో భాగ్యరెడ్డికి లక్ష్మీదేవితో వివాహం జరిగింది. ఈయనకు ఒక శిక్షకుడు ఉండేవాడు కానీ సాంప్రదాయక విద్యాభ్యాసం లేదు. తెలుగు చదవటం, వ్రాయటం మాత్రం వచ్చేది. గోవాకు చెందిన బారిస్టరు దోసా శాంటోస్ ఈయనకు ఆశ్రయమిచ్చి, తిండి పెట్టి తన ఇంటి యొక్క మొత్తం యాజమాన్యాన్ని మరియు ఆరుగురు సేవకుల అజమాయిషీని భాగ్యరెడ్డి చేతుల్లో పెట్టాడు.

(ఇంకా…)

38వ వారం
Enugula Veeraswamayya 2.jpg

ఏనుగుల వీరాస్వామయ్య

ఏనుగుల వీరాస్వామయ్య (1780 - 1836) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి. ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో ఉండేది. 12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు నేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరు గానే చేరి, తమ శక్త్యానుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించు కోవాలని పోటీ పడేవారట. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలలో కూడా అతను మంచి ప్రతిభ సాధించి ఉండవచ్చును.

(ఇంకా…)

39వ వారం

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె ఆలివ్ పళ్ళగుజ్జు నుండి తీయుదురు. ఆలివ్ చెట్టు యొక్క వృక్ష శాస్త్రపేరు ఒలియ యురోపా. ఇది ఒలిఎసియా కుటుంబానికి చెందిన మొక్క. ఆలివ్ నూనెను వంటలలో, సౌందర్య ద్రవ్యాలలో, సబ్బుల తయారిలో, మందుల తయారీలో వాడెదరు.ఇది మధ్యధరా ప్రాంతానికి చెందిన చెట్టు. ఆలివ్ యొక్క మూలస్థానం మధ్యధరాసముద్ర ప్రాంతం. క్రీ.పూ.8000 సంవత్సరాల నాటికే నియోలిథిక్ మానవులు అడవి ఆలివ్ పండ్లను సేకరించినట్లు తెలియుచున్నది. అడవి ఆలివ్ చెట్టు గ్రీసు లేదా ఆసియా మైనర్‌లో మొదటగా పుట్టినట్లు తెలుస్తున్నది. అయితే ఎప్పుడు ఎక్కడ వీటిని పెంచడం మొదలైనది ఇదిమిద్దంగా తెలియకున్నది. వీటిని మొదట సినాయ్ ద్వీపకల్పం, ఇజ్రాయిల్, అర్మేనియా, మరియు మేసోపోటామియా సారవంతమైన నేలలో పెంచడం మొదలైనది.పురాతన త్రవ్వక ఆధారాల ప్రకారం క్రీ.పూ.6000 సంవత్సరాలనాటికి ఆలివ్ నూనెను తీయడం తెలుసు. క్రీ.పూ. 4500 నాటికి ప్రస్తుతపు ఇజ్రాయిల్ ప్రాంతంలో ఆలివ్ నూనెను తీసి వాడినట్లు తెలియుచున్నది. మధ్యధరా ప్రాంతంలో తూర్పు తీరప్రాంతంలో ఆలివ్ పంటను ఎక్కువ మొత్తంలో/విస్తృతంగా సాగుచేసినట్లు తెలియుచున్నది. లభించిన ఆధారాలను బట్టి క్రెట్ లో క్రీ.పూ. 2500 నాటికి అక్కడ ఆలివ్ చెట్లను పెంచినట్లుగా తెలియుచున్నది.

(ఇంకా…)

40వ వారం

హుద్‌హుద్ తుఫాను

హుధుద్ తుఫాను అనేది దక్షిణ హిందూ మహాసముద్రంలో యేర్పడిన తుఫాను. ఇది అక్టోబరులో బెంగాల్, ఒడిషా మరియు ఆంధ్ర ప్రదేశ్ తీరాలను తాకనుంది. దీనికి ఒక పక్షి పేరుతో (ఓమన్ భాషలో) నామకరణం చేశారు.[4][5][6] తూర్పు మధ్య బంగాళాఖాతంలో హుధుద్ పెనుతుపాన్‌గా మారింది. గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో తుపాను అక్టోబరు 9 2014 నాటికి కేంద్రీకృతమైంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ఈ తుఫాను 24 గంటల్లో తుపానుగా మారి 36 గంటల్లో తీవ్ర పెనుతుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 12 2014 న మధ్యాహ్నం విశాఖ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. 11 నుంచి ఒడిశా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నాయి. సాధారణంగా అరేబియా సముద్రంలో సంభవించే తుఫానుకు పేరును నిర్ణయించే అధికారం భారత్, పాకిస్థాన్,ఓమన్,బంగ్లాదేశ్, మాయన్మార్,శ్రీలంక,మాలదీవులు, థాయ్‌లాండ్ దేశాలకు ఉంది. 2014 అక్టోబర్ మాసం రెండవవారంలో సంభవించిన తుఫానుకు పేరు నిర్ణయించే అవకాశం ఓమన్ దేశానికి ఇవ్వబడింది. ఆదేశం ఈ తుఫానుకు హుధ్‌హుద్ (ఓమన్ భాష) అని నిర్ణయించింది. ఈ పక్షి ఇజ్రాయేల్ దేశానికి జాతీయ పక్షి. ఇది ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాలలో కనిపిస్తుంది.

(ఇంకా…)

41వ వారం
సూరి భగవంతం

సూరి భగవంతం (అక్టోబరు 14, 1909 - ఫిబ్రవరి 6, 1989) ప్రముఖ శాస్త్రవేత్త. దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. ఈయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో అక్టోబరు 14, 1909 న జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హైదరాబాదు నిజాం కళాశాలలో డిగ్రీ (బి.ఎస్సీ) చదువు పూర్తిచేసి, మద్రాసు యూనివర్సిటీ నుండి బి.ఎస్.సి (భౌతిక శాస్త్రము) డిగ్రీని ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా అనేక పతకాలను అందుకున్న విద్యార్థిగా కలకత్తాలో సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు. ఈయన తన మేథో సంపత్తితో, శాస్గ్త్రీయ దృక్పథంతో, ఆలోచనా సరళితో, ప్రయోగ శీలతతో సి.వి.రామన్ అభిమానాన్ని చూరగొని ప్రియ శిష్యుడయ్యాడు. అక్కడే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. పట్టాను సంపాదించాడు. ఈయన 1932లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో అధ్యాపకుడుగా చేరాడు. 1938లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందాడు. బోధనా విధానంలో వీరిది చాలా సులభశైలి. స్పష్టమైన వ్యక్తీకరణ, విశేషమైన ఆలోచన, కచ్చితమైన అనువర్తన, సమగ్రమైన దృష్టి, అద్భుతమైన ప్రతిభ లన్నీ కలగలిపి వీరి బోధనా విధానాన్ని ఇతర శాఖల అధ్యాపకులు కూడా నేర్చుకునేవారని చెబుతారు. తన 28 వ యేటనే యింతటి ఉన్నత పదవిని అదిష్టించటం విశేషం. దీనికి కొద్ది కాలం ముందే యూనివర్సిటీ ఈయనకు డి.ఎన్‌సి డిగ్రీ ప్రదానం చేసింది.

(ఇంకా…)

42వ వారం

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (అక్టోబర్ 19, 1910—ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు (విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్ తో పంచుకున్నాడు). ఈ ఫౌలర్ చంద్రశేఖర్ పి.ఎచ్.డి పట్టా కొరకు చేసిన ప్రయత్నానికి దిశానిర్దేశకుడు కాదు. ఆయన ఆర్.ఎచ్.ఫౌలర్. ఇతని పినతండ్రి ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ ను భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది. పదిహేను సంవత్సరాల పిన్న వయస్సులోనే, ఇంకా విద్యార్థిగా ఉండగానే, తన మొట్టమొదటి పరిశోధనా పత్రం 1929 లోప్రచురించేడు. ఈ పత్రం యొక్క ప్రత్యేకత అవాగాహన అవాలంటే ఆనాటి విద్వత్ వాతావరణం అర్థం కావాలి. కాంప్టన్ ప్రభావం అనే దృగ్విషయం 1923 లో ఆవిష్కరించబడింది. అందుకని కాంప్టన్ కి 1927 లో నోబెల్ బహుమానం వచ్చింది. ఒక “కొత్త గణాంక పద్ధతి” అంటూ 1926 లో ఫెర్మీ, డిరాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక పత్రం ప్రచురించేరు. ఈ కొత్త గణాంక పద్ధతిని (ఇప్పుడు దీనిని ఫెర్మీ- డిరాక్ గణాంకాలు అంటున్నారు) వెనువెంటనే ఉపయోగించి, ఆర్. ఎచ్. ఫౌలర్ అనే ఆసామీ ఒక నక్షత్రం కూలిపోయి, శ్వేత కుబ్జ తార గా ఎలా మారుతుందో 1926 లో భాష్యం చెప్పేడు.

(ఇంకా…)

43వ వారం

కుతుబ్ షాహీ సమాధులు

కుతుబ్ షాహి సమాధులు హైదరాబాద్ లోని ప్రసిద్ధమైన గోల్కొండకోట సమీపంలో ఇబ్రహీం బాఘ్ వద్ద ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహి రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు మరియు మసీదులు ఉన్నాయి. చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్థులో ఉండగా పెద్ద సమాధులు రెండు అంతస్థులలో ఉన్నాయి. ఒక్కొక్క సమాధి మద్యభాగంలో శవపేటిక దానికింద నేలమాళిగ ఉంటాయి. సమాధిపై గోపురం మీద నీలి మరియు ఆకుపచ్చని టైల్స్ అలంకరించబడి ఉంటాయి. ఇప్పుడు కొన్ని ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సమాధుల సమూహం విశాలమైన ఎత్తైన వేదిక మీద నిర్మించబడ్డాయి. సమాధులు గోపురాలు చదరమైన వేదికమీద ఆర్చీల మద్య అమర్చబడ్డాయి. సమాధులు విభిన్నమైన శైలిలో పర్షియన్, పాష్టన్ మరియు హిందూ సంప్రదాయాల మిశ్రితంగా నిర్మించబడ్డాయి. సమాధుల మీద నిర్మించిన నిర్మాణం జటిలమైన రాతిచెక్కడాలతో అలంకరించబడ్డాయి. సమాధుల చుట్టూ అందమైన పూదోటలు ఏర్పాటుచేయబడ్డాయి. సమాధులు ఒకప్పుడు కార్పెట్లు, షాండ్లియర్లు మరియు వెండిజలతారుతో అలంకరించిన వెల్వెట్ తెరలతో అలంకరించబడ్డాయి. ఖురాన్ లోని భాగాలు చెక్కడిన ఫలకాలతో అలకంరించబడిన గోడలను పర్యాటకులు చదువుతూ ముందుకు కదులుతూ ఉంటారు.

(ఇంకా…)

44వ వారం
నరేంద్ర దభోల్కర్

నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ (1 నవంబర్ 1945 – 20 ఆగస్టు 2013) ఒక భారతీయ హేతువాది మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పి వాటి నిర్మూలనకు "మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలనా సమితి " (MANS) స్థాపించాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాడు. దభోల్కర్ 1 నవంబర్ 1945 లో అచ్యుత్ మరియు తారాబాయి దంపతులకు జన్మించాడు. వీరికి 10 మంది సంతానం. కనిష్ఠ కుమారుడు నరేంద్ర దభోల్కర్. జ్యేష్ఠ కుమారుడైన దేవదత్త దభోల్కర్ ప్రముఖ గాంధేయవాది, సామజిక వేత్త మరియు విద్యావేత్త. సతారా మరియు సాంగ్లీలలో విద్యాభ్యాసం జరిగింది. వైద్యపట్టా 'మీరజ్' మెడికల్ కాలేజినుండి పొందాడు. ఇతను షైలాను వివాహమాడాడు, వీరికి ఇద్దరు సంతానం, కొడుకు హమీద్, కుమార్తె ముక్తా దభోల్కర్. శివాజీ విశ్వవిద్యాలయంలో కబడ్డీ కేప్టన్ గా ఉన్నాడు. ఇతడు భారత్ తరపున బంగ్లాదేశ్లో కబడ్డీ టోర్నమెంటులో పాల్గొన్నాడు. ఇతడికి మహారాష్ట్ర ప్రభుత్వంచే " శివ ఛత్రపతి యువ పురస్కారం " లభించింది. వైద్యుడిగా 12 సం.లు పనిచేసిన తరువాత దభోల్కర్ సామిజిక రంగంలో 1980 లో ఉద్యమించాడు. బాబా అధవ ఉద్యమమైన వన్ విలేజ్ - వన్ వెల్ లాంటి సామాజిక న్యాయ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఆ తరువాయి దభోల్కర్ అంధవిశ్వాసాలను రూపుమాపాలనో దృష్టితో అఖిలభారతీయ అంధశ్రద్ధా నిర్మూలనా సమితిలో చేరాడు.

(ఇంకా…)

45వ వారం

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిమీ పైబడిన పరిధితో, అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి. అలాగే, సాంప్రదాయిక, రసాయనిక, జీవ రసాయనిక ఆయుధాలను కూడా ఇవి మోసుకెళ్లగలవు. కానీ ఈ ఆయుధాలను ఖండాంతర క్షిపణులపై మోహరించిన దాఖలాలు లేవు. ఆధునిక క్షిపణులు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీయెంట్రీ వెహికిల్ (ఎం.ఐ.ఆర్.వి) కు అనుకూలంగా ఉంటాయి. ఒకే క్షిపణి అనేక వార్‌హెడ్‌లను మోసుకుపోగలిగి, ఒక్కొక్కటీ ఒక్కొక్క లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని మిర్వ్ (ఎం.ఐ.ఆర్.వి) అంటారు. తొలినాళ్ళలో, ఖండాంతర క్షిపణుల కచ్చితత్వం పరిమితంగా ఉండేది (వర్తుల దోష పరిధి ఎక్కువగా ఉండేది). వాటిని నగరాల వంటి చాలా పెద్ద లక్ష్యాల పైకి మాత్రమే ప్రయోగించే వీలుండేది. సైనిక లక్ష్యాలపై దాడి చెయ్యాలంటే మరింత కచ్చితత్వంతో కూడిన బాంబరు విమానాన్ని వాడాల్సిందే. రెండవ, మూడవ తరం డిజైన్ల (ఉదా: LGM-118 పీస్‌కీపర్) ద్వారా కచ్చితత్వాన్ని బాగా మెరుగుపరచారు. చిన్న చుక్క లాంటి లక్ష్యాలను కూడా ఈ క్షిపణులు విజయవంతంగా ఛేదించగలవు.

(ఇంకా…)

46వ వారం

సానియా మీర్జా

సానియా మీర్జా (జననం:15 నవంబరు 1986) భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెం.1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు. సానియా కెరీర్ మొదట్నుంచే అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. ఎక్కువ పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె సింగిల్స్ కెరీర్ లో స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించిన మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి క్రీడాకారిణులపై గుర్తించదగిన విజయాలు నమోదు చేసుకున్నారు. 2007లో సింగిల్స్ లో ప్రపంచవ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచారు. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా క్రీడాకారిణిగా ప్రసిద్ధి చెందారామె. మణికట్టు కు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల సింగిల్స్ కు దూరమయ్యరు. కానీ డబుల్స్ లో ప్రప్రంచ నెం.1 ర్యాంకు సాధించారు. తన కెరీర్ లో 1 మిలియన్ డాలర్ల(ఇప్పుడు 5 మిలియన్ డాలర్లు) సంపాదించడంతో పాటు, ఆరు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టైటిళ్ళను సంపాదించి స్వంత దేశానికి మంచి పేరు తెచ్చారామె. మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లోను ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు.

(ఇంకా…)

47వ వారం

ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాదుకు 30 కి.మీ. దూరములో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఇక్కడి శిల్పాలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తాయి. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు. (ఇంకా…)

48వ వారం

రొమిల్లా థాపర్

రొమిల్లా థాపర్ చరిత్ర పరిశోధకురాలు, లౌకిక చరిత్ర నిర్మాత. ఈమె 1931 లో లాహోర్ లో జన్మించారు. ఈమె తొలి నామకరణం రమోలా అయితే ఈ పేరు ప్రసిద్ధ ఆంగ్ల నవల ఒకదానిలో విషాదాంత పాత్రకు ఉంది. అందువల్ల ఈమె తల్లి ఆ పేరును రొమిలా గా మార్చివేసారు. తండ్రి భారతీయ సైన్యానికి చెందినవారు కావడం చేత దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్యాభ్యాసం జరిగింది. ఈమె తొలుత పంజాబ్ విశ్వవిద్యాలయం లో సాహిత్యంలో డిగ్రీ చేసారు. లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికక్ స్టడిస్ లో అడ్మిషన్ కు ప్రయత్నించినప్పుడు బి.ఏ లో హిస్టరీ తీసుకోమన్నారు. దీనితో ఈమె "చరిత్ర" ను విషయాంశంగా ఎంచుకున్నారు. ఆ సమయంలో ఈమె వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడంతోపార్ట్ టైం ఉద్యోగం చేసారు. అదీ ఏమంత వెసులుబాటుగా ఉండేది కాదు. ఈమెకు ట్యూటర్ గా ఉన్న ప్రొఫెసర్ ఎ.ఎస్. భాషం ఒక సలహా ఇచ్చారు. పి.హెచ్.డి కోసం లండన్ యూనివర్శిటీ సహాయం కోరమన్నారు. దీనితో ఈమె అనుకోని పరిస్థితులలో "స్కాలర్" గా మారారు. పంజాబ్, లండన్ విశ్వవిద్యాలయాల్లో చదివి బి.ఏ (ఆనర్స్) డిగ్రీ సంపాదించిన ఈమె 1958 లో లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టం పొందారు. అశోక చక్రవర్తి గూర్చి ఎ.ఎల్.భాషం పర్యవేక్షణలో ఈమె చేసిన పరిశోధన ఫలితంగా ఈ డాక్టరేట్ లభించింది. లండన్ లో పరిశోధక విధ్యార్థిగా ఎంటో ఉత్సాహంగా పరిశోధనలు, గాడాధ్యయనం చేసారు. అయితే ప్రొఫెసర్ భాషం మాత్రం ఎప్పుడూ ఈమె మీద కోపాన్ని ప్రదర్శిస్తూండేవారు.

(ఇంకా…)

49వ వారం

తుత్తునాగము

తుత్తునాగం లేక జింకు అనునది ఒక రసాయనిక మూలకం. ఇది ఒక లోహం. మూలకాల ఆవర్తన పట్టికలో 12వ గ్రూపుకు చెందిన మొదటి మూలకం. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 30. మూలకంయొక్క సంకేత అక్షరము Zn. జింకును ఇంకను యశదము, తుత్తునాగము అనియు పిలిచెదరు. శతాబ్దానికి ముందే తుత్తునాగమును ఒకమూలకంగా గుర్తించుటకు పూర్వమే దీనియొక్కఖనిజాన్ని ఇత్తడి తయారుచెయ్యడంలో ఉపయోగెంచేవారు. క్రీ.పూ.1400-1000 సంవత్సరాలకు చెందిన ఇత్తడిని పాలస్తీనా కనుగొన్నారు. ఐతిహాసికయుగమునకు చెందిన 87% జింకును కలిగిన ధాతువును ట్రాన్సిల్వానియ గుర్తించారు. క్రీ.పూ.శతాబ్ది నాటికే జూదియ లో, క్రీ.పూ.7వ శతాబ్దినాటికి పురాతన గ్రీసు రాగి మరియు జింకు మిశ్రణం వలన రూపొందించిన ఇత్తడి అనే మిశ్రమ ధాతువు వాడేవారు. అనగా అప్పటికే జింకు లోహంతో మానవునికి పరిచయం ఉంది. క్రీ.శ. 12 వ శతాబ్ది వరకు భారతదేశంలో తక్కువ పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి అయ్యెడిది. ఇక యూరోపు ఖండంలో 16 వ శతాబ్ది చివరకు జింకు గురించి తెలియదు. భారతదేశంలో, రాజస్థాన్ రాష్టంలో గుర్తించిన జింకుగనులు క్రీ.పూ. 6వ శతాబ్దికి చెందినవి. అనగా ఇక్కడి జనులకు అప్పటికే జింకు లోహం గురించిన మంచి అవగాహన ఉంది. క్రీ.శ.1347నాటికి భారతదేశంలో జింకును ప్రత్యేక లోహంగా గుర్తించారు. అప్పటికి జింకు మానవుడు గుర్తించిన 8 వలోహం.

(ఇంకా…)

50వ వారం

వియత్నాం

వియత్నాం దక్షిణాసియాలో ఒక దేశం. 2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15 వ స్థానంలో, ఆసియా లో 9వ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన చైనా, వాయువ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, పిలిప్ఫీన్స్, ఇండోనేషియా సరిహద్దులుగా ఉన్నాయి. 1976 లో ఉత్తర, దక్షిణ వియత్నాం లు కలిసిపోయినప్పటి నుంచి హనోయ్ నగరం రాజధానిగా ఉంది. హోచిమిన్ నగరం అత్యధిక జనాభా గల నగరం. క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూమతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి. పురాతత్వ పరిశోధకులు నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన పాలియోలిథిక్ కాలం నాటి మానవ అవశేషాలు ప్రస్తుత వియత్నాం ప్రాంతంలో పాలియోలిథిక్ కాలం నుండి మానవులు నివసించారని భావిస్తున్నారు. ఉత్తర వియత్నాంలో ఉన్న "లాంగ్ సొన్ ప్రొవింస్" మరియు "న్ఘే ఏన్ ప్రొవింస్" గుహలలో లభించిన "హోమో ఎరెడస్" శిలాజాలు క్రీ.పూ 5,00,000 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. వియత్నాంలోని "మిడిల్ ప్లెయిస్టోసిన్ ప్రొవింస్"లో లభించిన హోమోసాపైన్ శిలాజాలు మరియు తాం ఓం మరియు హాంగ్ హం ప్రాంతాలలో లభించిన దంతాల భాగాలు ఈశాన్య ఆసియాలో లభించిన అతిపురాతన శిలాజాలుగా భావిస్తున్నారు. లాటే ప్లెస్యిస్టోసెనె కాలం నాటి హోమోసాపైంస్ దంతాలు డాంగ్ కేన్, కౌంగ్ (1986), వద్ద లభించాయి. ఆరంభకాల హొలోసెనె శిలాజాలు మై డా డియూ, లాంగ్ గావో, కొలానీ (1927) మరియు లాంగ్ కుయోం వద్ద లభించాయి. క్రీ.పూ. 1000లో మా నది మరియు రెడ్ నది ప్రాంతాలలో వరిపంట అభివృద్ధి మరియు ఇత్తడి పోత పోయడం ఆరంభం అయింది. నదీమైదానాలు డాంగ్ సన్ సంస్కృతి విలసిల్లడానికి సహకారం అందించింది.

(ఇంకా…)

51వ వారం

తెలుగు

ఆంధ్రప్రదేశ్ మర్రియు తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో  ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది. వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి ) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌ గా వ్యవహరించారు. భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు. అనగా తెలుగు- హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది.


(ఇంకా…)

52వ వారం

నౌషాద్

నౌషాద్ అలీ (డిసెంబరు 25 1919 – మే 5 2006) భారతీయ సినిమా సంగీతకారుడు. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు. ఆయన స్వతంత్రంగా సంగీత దర్శకునిగా ప్రేమనగర్ (1940) మొట్టమొదటి సినిమా.  ఆయన సంగీత దర్శకునిగా విజయం సాధించిన సినిమా "రత్తన్ (1944)". దానితర్వాత 35 గోల్డెన్ జూబ్లీ హిట్స్, 12 గోల్డెన్ జూబ్లీ మరియు 3 డైమండ్ జూబ్లీ విజయం సాధించాయి. ఆయనకు 1982లో దాదాసాహెబ్ ఫ్లాల్కే పురస్కారం మరియు 1992 లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆయన లక్నో నగరంలో పెరిగాడు. ఈ నగరం సంప్రదాయాలకు, ఉత్తరభారత సంగీతానికి సాహిత్యానికి ప్రముఖ కేంద్రం. ఇతడి తండ్రి వాహిద్ అలీ ఒక మున్షి (క్లర్కు). కార్యక్రమాలకు వెళుతూ వుండేవాడు. అక్కడ ప్రముఖ 'ఖవ్వాల్' (ఖవ్వాలీ పాడేవారు) లు ప్రదర్శనలు ఇచ్చేవారు. నౌషాద్ వీరిని వింటూ సంగీతం పట్ల ఉత్సుకత పెంచుకున్నాడు. నౌషాద్ క్లాసికల్ హిందుస్తానీ సంగీతం "ఉస్తాద్ గుర్బత్ ఖాన్", "ఉస్తాద్ యూసుఫ్ అలీ", "ఉస్తాద్ బబ్బన్ సాహెబ్" మరియు ఇతరుల వద్ద నేర్చుకున్నాడు. తరచూ హార్మోనియం లను మరమ్మత్తు చేసేవాడు. నౌషాద్ 2006 మే 5 న ముంబాయిలో మరణించాడు. ఇతనికి ఆరుగురు కుమార్తెలు జుబేదా, ఫహమీదా, ఫరీదా, సయీదా, రషీదా, వహీదా, మరియు ముగ్గురు కుమారులు రహమాన్ నౌషాద్, రాజు నౌషాద్ మరియు ఇక్బాల్ నౌషాద్.


(ఇంకా…)

ఇవి కూడా చూడండి[మార్చు]