కొలకలూరి ఇనాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచార్య కొలకలూరి ఇనాక్
జననం1939 జూలై 1
గుంటూరు జిల్లా వేజెండ్ల
నివాస ప్రాంతంగుంటూరు జిల్లా వేజెండ్ల
ఇతర పేర్లుకొలకలూరి ఇనాక్
వృత్తిరచయిత
కవి
సాహితీకారుడు
పదవి పేరుపద్మశ్రీ
మతంహిందూ

కొలకలూరి ఇనాక్ తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి. అతను తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఈయన చేసిన కృషికి తగ్గ ఫలితంగా 2014 లో భారత ప్రభుత్వం, "'పద్మశ్రీ"' పురస్కారం ఇచ్చింది.[1]. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతని "అనంత జీవనం" అనే రచనకు లభించింది.

నేపథ్యము[మార్చు]

ఈయన వేజెండ్ల గ్రామంలో నిరుపేద కుటుంబీకులైన రామయ్య, విశ్రాంతమ్మ దంపతుల సంతానంగా, 1939, జూలై 1 న జన్మించారు.[2][3]. గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుపతి వంటి ప్రదేశాలలో తెలుగు ఆచార్యుడుగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదుగుతూ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి అందుకున్నారు[4]. మరోవైపు తెలుగు సాహితీ ప్రక్రియలో, తనదైన శైలికి వన్నెలద్దుతూ, తన కలం బలం చాటారు. 1954లో లోకంపోకడ, ఉత్తరం అనే కథానికలతో తెలుగు సాహితీ లోకంలో చేరినారు. 1958లో "దృష్టి" అను నాటికను వ్రాసి, కేంద్రప్రభుత్వ బహుమతిని అందుకున్నారు. 1965లో "జైహింద్" అను నాటికకు రాష్ట్రప్రభుత్వ బహుమతిని దక్కించుకున్నారు. 1986లో వ్రాసిన "ఊరబావి" కథాసంపుటి, రచయితగా ఆయన స్థానాన్ని చాటిచెప్పినది. 1988లో "మునివాహనుడు" కథాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ రకంగా రెండు సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న అరుదైన రచయితగా ప్రసిద్ధిచెందినారు. నవలా రచయితగా, నాటక స్రష్టగా, విమర్శకునిగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితుడైన ఈయన, పర్యవేక్షకునిగా 20 మంది శిష్యులకు పి.హెచ్.డి. పరిశోధనలో మార్గదర్శకులైనారు. పొన్నూరులో, 2014, జనవరి-5న అజో-విభో-కందాళం ఫౌండేషను వారు నిర్వహించిన జాతీయ నాటికల పోటీలలో వేదికపై, రు. లక్ష నగదుతో ఈయనను సత్కరించారు. 2014, జనవరి-18న గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషను వారు, రు. 2 లక్షల నగదు పురస్కారం అందజేశారు. 2011లో గుర్రం జాషువా సాహిత్య పురస్కారం అందుకున్నారు. దుగ్గిరాలకు చెందిన జాషువా కళాపరిషత్తు వారు, వెండి కిరీటం బహుకరించారు.

గుర్రం జాషువా ప్రభావము[మార్చు]

గుర్రం జాషువా ప్రభావము ఈయనపై విపరీతంగా ఉంది. ఆయనను గురుతుల్యుడుగా భావిస్తారు. జాషువా పై ఈయన అభిప్రాయం ఈయన మాటలలోనే...

జాషువా పుణ్యాత్ముడు. మహానుభావుడు, మహాకవి. మా పల్లెల్లో ఆయనొక సజీవ చైతన్య దైవం. ఆయన్ని చూడటం, తాకటం గొప్ప అనుభవం. ఆయన నివసించే ఇంటిని చూడటం ఒక ఆరాధన. కవి అంటే మా జనంలో గొప్ప గౌరవం. జాషువాను చూసే నాలో కవి కావాలన్న బీజం పడింది. మా పల్లెల ప్రజలు ఆయన పట్ల చూపే భక్తి ప్రేరణ నన్ను రచయితను చేసింది. ఆయన సాహిత్యమంతా నా 18 ఏళ్లకు చదివేశాను. నేనేమయినా రాస్తే కరుణశ్రీ చూచేవారు. సవరించేవారు. ప్రోత్సహించేవారు. నేను అప్పట్లో పద్యాలు రాసేవాణ్ణి. నా పద్యాలు చదివిన విజ్ఞులు జాషువా రచనలాగో, కరుణశ్రీ రచనలాగో ఉందనేవాళ్లు. అట్లా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా పద్యాలు నావిగా ఉండాలి. ఆ ప్రభావాల నుంచి తప్పించుకోవటానికి పద్యం రాయటం మానేశాను. వచనం నన్ను ఆదరించింది. నా పద్యం నేను రాసినట్లే ఉంటుందని ఇప్పుడెవరైనా 'ఆది ఆంధ్రుడు' చదివితే గుర్తిస్తారు.

రచనా వ్యాసాంగము పై తొలి అడుగులు[మార్చు]

వీరి తాతను మునసబు కొట్టి చంపాడు. అట్లా చంపి ఉండకూడదని వీరి పసి మనస్సు ఏడ్చింది. ఆ సంఘటనే వీరి మొదటి కథ- ఉత్తరం రాయడానికి ప్రేరణ. వీరికి అప్పటికి 15 ఏళ్లు. కానీ అంబేద్కరును ఎరుగరు. నా ఆకలి, వీరి అస్పృశ్యతా వ్యధ, వీరి చుట్టూ జీవితాలు చూచి దుఃఖంతో ఆక్రోశించటానికి వీరి సాహిత్యం అండయింది. వీరి సాంఘిక జీవితాన్ని, వీరిని పీడించిన సమాజ ధోరణిని గూర్చి రాశారు . వీరు రాసింది పుస్తకాలు చదివి కాదు, సంఘాన్ని చదివి -

వీరి రచనల విశ్లేషణ[మార్చు]

వసుచరిత్ర వైశిష్ట్యం[మార్చు]

ప్రబంధ సాహిత్యం మీద ఈయన చాలా చక్కటి విశ్లేషణలు చేశారు. వసుచరిత్ర వ్రాసిన రామరాజభూషణుడు శూద్రకవి, శుభమూర్తి అని వీరు రాసిన చేసిన పరిశోధన అపురూపమైంది. విమర్శకులు ఆ గ్రంథాన్ని తిరస్కరించలేకపోయారు. అకడమిక్ రంగంలో ఆధిపత్య వర్గాలను ధిక్కరించి ఈయన ఆ పరిశోధన చేశారు. అసలు ఆ రచన చేయాలని ఎందుకనిపించిందని ఆయన మాటలలోనే...

పీడింపబడేవాడు నాకు తల్లి తండ్రి దైవం సోదరుడు బిడ్డ. శుభమూర్తి నాకు గురువు. నా గురువు బట్రాజుగా పిలవబడి, పీడింపబడి అవమానింపబడి, తృణీకరింపబడ్డాడు. సాహిత్య గురువు సాంఘికంగా సోదరుడు. ఆ మహాకవిని వసుచరిత్రను భక్తితో చదివాను. తెలుగు సాహిత్యంలో అది మహోత్కృష్ట ప్రబంధం. మహా కావ్యం. గొప్ప సాహిత్య సృష్టి. అంత గొప్ప రచన అవతరించటానికి అది పీడన నుంచి పుట్టటం శూద్రుడి గుండె నుంచి ప్రవహించటం కారణమని నాకు అనిపించింది. నేను దళితుణ్ణి పీడితుణ్ణి కావటాన శుభమూర్తి దుఃఖం నాకు వినిపించింది. ఆయన కన్నీటి తడి నా గుండెను తాకింది. వసుచరిత్ర స్రష్ట పేరు శుభమూర్తి. భట్టుమూర్తి అని కులం పేరుతో రామరాజభూషణుడని చేరదీసిన రాజు పేరుతో పిలిచారు. నా పేరు శుభమూర్తి అని ఆయన కంఠోక్తిగా చెప్పుకొన్నా ఇప్పటికీ ఎవరూ అలా పిలవటం లేదు, తలవటం లేదు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పండితులు ఒక దృష్టి నుంచే చూస్తున్నారు. ఇంకో దృష్టి నుంచి చూడవచ్చునని నా అభిప్రాయం. అదే వసుచరిత్ర వైశిష్ట్యం.

ఆది ఆంధ్రుడు[మార్చు]

ఈయన 'ఆది ఆంధ్రుడు' కావ్యానికి వ్రాసిన ముందుమాటలో అమరావతీ స్తూపానికి పూర్ణకలశం బహుమతిగా ఇచ్చిన ఒక మాదిగ గురించి వివరంగా తెలిపారు. ఈయన సమాజాన్ని, కావ్యవస్తువునీ ఒక చారిత్రక దృక్పథం నుంచి చూస్తుంటారు. ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించిన ఈ దళితుల చరిత్రను, ఆర్యుల దురాక్రమణను ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ చారిత్రక దృక్పథం వీరికెలా ఏర్పడిందో వీరి మాటలలోనే ...

నేను సాహిత్యాన్ని సామాజిక నేపథ్యం నుంచి చూస్తాను. రాస్తాను. సంఘాన్ని సాహిత్యంలో ప్రతిబింబింపచేయాలని ఇష్టపడతాను. సాహిత్యం సంఘానికి దశ దిశ నిర్దేశం చేయాలని ఆలోచిస్తాను. ఆలోచన కార్యరూపం దాల్చటానికి, చర్యోన్ముఖం కావటానికి ఇష్టపడతాను. ఈ ఉన్నతి; స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్న ప్రజాస్వామిక విలువలతో కలిసి ఉండాలని వాంఛిస్తాను; ఈ వాంఛ పరిపూర్ణమయితే రేపటి సమాజపు అస్తిత్వం అవగతమవుతుంది. ఇది భవిష్యద్దృష్టి. ఈ సమాజం వర్తమానంలో ఇలా ఉందంటే ఎటువంటి గతాన్ని వారసత్వంగా ఇవ్వగలిగిందో గుర్తిస్తాము. అటువంటి గతాన్ని వెదుకుతూ పోవటం నాకు అనివార్యం. అట్లాంటి అన్వేషణలో కనిపించినవాడు భుజంగరాయుడు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి చేత అంటరానితనం నిర్మూలన శాసనం వేయించిన కార్యదక్షుడు. దళితుడు. దళితుల ప్రాచీనతా శైవభం నాకు ఆరాధ్యం. ఎందుకు స్మశానాలు తవ్వుకోవటమంటే ఆ ఎముకలు చెప్పే ఔన్నత్యం తెలుసుకోవటానికి. తెలుసుకొని ఏం చేస్తాను? గుండెల నిండా బలంగా గాలి పీల్చుకొని, ఛాతీ ఎగదట్టి నిర్భయంగా, ఆత్మగౌరవంతో, తలెత్తుకు తిరిగే దళితుల్ని చూస్తాను.

కన్నీటి గొంతు[మార్చు]

వీరి మరో గొప్ప కావ్యం 'కన్నీటి గొంతు'. అందులో శూర్పణఖ హృదయాన్ని ఆవిష్కరించారు. రామాయణం పట్ల వీరి విమర్శనాత్మక పరిశీలన చాలా ఆసక్తిగా ఉంది. రాముడిని ప్రతినాయకుడిగా చేస్తూ, రావణుడిని ధీరోదాత్త నాయకునిగా స్థాపించారు. అందుకు కారణం వీరి మాటలలోనే ...

ఇంతమంది స్త్రీవాదులు సీతకు, అహల్యకు, మంధరకు, కైకకు, శబరికి జరిగిన న్యాయాన్యాయాల గూర్చి ఆవేదనాత్మక రచనలు చేశారు కదా, శూర్పణఖను గూర్చి ఏమీ రాయరేం? ఆమెకు అన్యాయం జరగలేదా? ద్రావిడ చక్రవర్తి అయిన రావణుడిని దశకంఠుడని వికారుడుగా, క్రూరుడుగా, రాక్షసుడుగా చిత్రించడం ఏం సబబు? వాల్మీకి పుట్టలోంచి పుట్టలేదు. ఆర్యుల బుర్రల్లోంచి పుట్టాడు. రామాయణం ఆర్యులు దక్షిణా పథానికి వ్యాపించటానికి పన్నిన రాజకీయ వ్యూహంలో భాగం. మీరు రామాయణాన్ని ప్రచార గ్రంథంగా, ఆర్యులు ద్రావిడుల్ని జయించే యుద్ధ వ్యూహంలో భాగంగా చూస్తే చాలా జీవన సత్యాలు కనిపిస్తాయి.

మునివాహనుడు[మార్చు]

మునివాహనుడు నాటకంలో తాత్వికత, తర్కం, కళా సౌందర్యం తొణికిసలాడే ఎన్నో సంభాషణలు వ్రాశారు. ఇందులో మునివాహనుడు చారిత్రక పాత్ర. పాణ్ కులస్థుడు. నాటి దళితుడు. దేవాలయ ప్రవేశం తిరస్కరింపబడ్డవాడు. పన్నెండుమంది ఆళ్వారుల్లో ప్రసిద్ధుడు. పది పాశురాలు పది పరిశోధన గ్రంథాల పెట్టు. తిరుప్పాణ్ ఆళ్వారు అని పిలువబడే దళితుడు మునివాహనుడు అయ్యాడు. అది అద్భుత కథా సందర్భం. దీన్ని గూర్చి వ్యాసం వ్రాశారు కానీ తృప్తి చెంద లేదు. నాటకం వ్రాయదగ్గ అంశం అనిపించి వ్రాశారు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.

కంచికచర్ల కోటేశు హత్య[మార్చు]

కంచికచర్ల కోటేశు హత్య మీద ఈయన ఒక నాటిక వ్రాశారు. అందులో ఇంకా ఎన్నో హత్యాకాండలు జరుగనున్నాయనే సంకేతాన్నిచ్చారు. ఆ తర్వాత కారంచేడు, చుండూరు జరిగాయి.

ఇతర కథలు[మార్చు]

ఊరబావి, తలలేనోడు, కాకి వంటి అద్భుతమైన కథలు వ్రాశారు. ఎన్నో కథాసంపుటాలు వెలువరించారు. ఏ ఒక్క కథకూ మరో కథతో పోలిక ఉండదు. సంఘం, మహారాజా సంఘం. సంఘంలో ఇంత వైవిధ్యమంటే, సంఘాన్ని ఆరాధించే రచయితకు అనంతమైన వైవిధ్యం లభిస్తుంది. గీతకు దిగువనున్న అందరిని గురించీ వ్రాయాలనుకున్నారు. పాత్రలనేకం. వస్తువులనేకం. ఇతివృత్తాలనేకం. సంఘ జీవన వైవిధ్యమే సాహిత్య జీవన వైవిధ్యం. అందువలన అంత వైవిధ్యాన్ని చూపడం సాధ్యమైనది.

జానపద సాహిత్య విమర్శ[మార్చు]

జానపద సాహిత్య విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియను ఈయనే మొట్టమొదటగా ప్రతిపాదించారు. ప్రపంచంలో ఎక్కడా అలాంటి ప్రయత్నం జరిగినట్టు లేదు. జానపద సాహిత్య విమర్శకు శాస్త్రప్రతిపత్తి చేకూరింది. 'జానపదుల సాహిత్య విమర్శ' బలమైన ప్రతిపాదన. ప్రపంచంలో ఎక్కడా జానపదుల విమర్శ ఉందని పరిశోధకులు గుర్తించలేదు. వీరి పరిశోధన గ్రంథాన్ని గొప్ప గ్రంథంగా పేర్కొన్నారు కానీ తర్కించలేదు. నిగ్గు తేల్చలేదు.విస్కాన్‌సిన్‌ విశ్వవిద్యాలయంలో ఇది గొప్ప గ్రంథంగా నిలిచింది. ఇంతకుముందు ఇటువంటి దృక్పథం లేదు. ఇది మొదటి గ్రంథం. తెలుగు జానపదుల్ని సజీవంగా చూపిన పరిశోధన అని నిగ్గు తేలిస్తే ఉస్మానియాలో గుర్తింపు వస్తుంది. ఇల విశాలం. కాలం అనంతం. 'జానపదుల సాహిత్య విమర్శ' ఆద్య గ్రంథం. అది అలా శాశ్వతం.

సన్మానాలు[మార్చు]

2014 అక్టోబరు 26 న అనంతపురంలో సన్మానము[మార్చు]

మార్చి 31, 2014న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ కి పద్మశ్రీ అవార్డును అందజేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

ఆధునిక సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సామాజిక సాహితీయోధుడు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అని ప్రభుత్వవిప్ యామినీబాల అన్నారు. ఆదివారం నగరంలోని ఎన్జీఓ హోమ్‌లో విమలాశాంతి సాహిత్య సేవాసంస్థ, శ్రీమతి జెన్నే మాణిక్యమ్మ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో కథారచయిత శాంతి నారాయణ అధ్యక్షతన ఇనాక్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అగ్రవర్గాల ఆధిపత్య సాహితీ భావజాలానికి ప్రత్యామ్నాయ సాహితీశక్తిగా ఇనాక్ ఎదిగారని అందువల్లే వాస్తవాలు వెలుగులోకి తెచ్చారని ప్రశంసించారు. సాహిత్యసేవలో ఇనాక్ చేసిన సేవలను గుర్తించి ప్రభుత్యం అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందన్నారు. సన్మానగ్రహీత పద్మశ్రీ ఇనాక్ మాట్లాడుతూ తనకు దక్కిన పురస్కారం జిల్లా సాహిత్యాభివృద్ధికి చెందినదిగా భావిస్తున్నట్లు తెలిపారు[5].

పురస్కారాలు[మార్చు]

కొలకలూరి పురస్కారాలు - 2022[మార్చు]

2022 ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నందమూరి తారకరామారావు కళామందిరంలో కొలకలూరి పురస్కారాలు–2022 ప్రదానోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయము ఉపాధ్యక్షుడు ఆచార్య టి.కిషన్‌రావు హాజరయ్యారు.[6] పురస్కారాల వివరాలు -

విజయ భండారు (కథానిక సంపుటి - గణిక) - కొలకలూరి భగీరథీ కథానిక - 2022

మథని శంకర్‌ (నవల - జక్కులు) - కొలకలూరి విశ్రాంతమ్మ నవల - 2022

అశోక్‌కుమార్‌ (తెలుగు నవల - ప్రయోగ వైవిధ్యం) - కొలకలూరి రామయ్య విమర్శన - 2022

మూలాలు[మార్చు]

  1. "Padma Awards Announced". Circular. Press Information Bureau, Government of India. 25 January 2014. Archived from the original on 8 ఫిబ్రవరి 2014. Retrieved 14 సెప్టెంబరు 2019.
  2. "New Indian Express". New Indian Express. 26 January 2014. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 30 September 2014.
  3. Thummapudi Bharathi (2008). A History of Telugu Dalit Literature. Gyan Publishing House. pp. 112 and 113 of 282 pages. ISBN 9788178356884.
  4. "'Padmashri' Kolakaluri felicitated". The Hindu. 3 April 2014. Retrieved 28 June 2018.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-27. Retrieved 2014-10-27.
  6. "కొలకలూరి పురస్కారాలు ప్రదానం". Sakshi. 2022-02-27. Retrieved 2022-02-27.
  • ఈనాడు గుంటూరు రూరల్; 2014, జనవరి-26; 1, 19 పేజీలు.