భాగ్యరెడ్డివర్మ
భాగ్యరెడ్డివర్మ | |
---|---|
జననం | మే 22, 1888 |
మరణం | ఫిబ్రవరి 18, 1939 |
మరణ కారణం | క్షయవ్యాధి |
వృత్తి | ఆది ఆంధ్ర సభ స్థాపకుడు సంఘ సంస్కర్త |
తల్లిదండ్రులు |
|
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన రెండవ సంతానంగా జన్మించిన భాగయ్య, ఆ తర్వాత కాలంలో తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. 1888 నవంబరులో వారి కుటుంబ గురువు వారిని సందర్శించడానికి వచ్చి పిల్లవానికి భాగయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామకరణం చేశాడు. భాగ్యరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి ఐదుగురు సంతానాన్ని ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ పోషించింది.[1]
18 ఏళ్ళ వయసులో భాగ్యరెడ్డికి లక్ష్మీదేవితో వివాహం జరిగింది. ఈయనకు ఒక శిక్షకుడు ఉండేవాడు కానీ సాంప్రదాయక విద్యాభ్యాసం లేదు. తెలుగు చదవటం, వ్రాయటం మాత్రం వచ్చేది. గోవాకు చెందిన బారిస్టరు దోసా శాంటోస్ ఈయనకు ఆశ్రయమిచ్చి, తిండి పెట్టి తన ఇంటి యొక్క మొత్తం యాజమాన్యాన్ని, ఆరుగురు సేవకుల అజమాయిషీని భాగ్యరెడ్డి చేతుల్లో పెట్టాడు. ఈ విధంగా 1912 మే వరకు కొనసాగాడు. ఆ తరువాత విద్యుచ్ఛక్తి శాఖలో వైర్‌మ్యాన్ గా పనిచేశాడు. ఆ తరువాత జీవన్ రక్షా మండలికి చెందిన లాల్జీ మేఘాజీ, భాగ్యరెడ్డిని ప్రచారకునిగా నియమించి, నెలకు అరవై రూపాయల జీతం, తిరగటానికి మోటరుసైకిలు ఏర్పాటు చేశాడు.[2]
దళిత సమాజోద్ధరణ
[మార్చు]భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదు లోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడు. హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.
భాగ్య రెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై 1911లో మన్యసంఘాన్ని ఏర్పాటుచేశాడు. అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్యసంఘం ద్వారా కొనసాగించాడు.[3] మన్యసంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారు. మన్యసంఘం ఆధ్వర్యంలో ఈ భజన మండళ్లు రీడింగ్ రూములు ఏర్పరచి అందులో ఆంధ్రప్రత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచాయి.[4] ఈ సంస్థ బాల్య వివాహాలను నిర్మూలించడం, దేవదాసి, జోగిని వంటి దురాచారాలు నిర్మూలించడం కోసం పనిచేసింది. ఈ సంస్థ కృషివల్ల నిజాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడు.[5] ఒక దశాబ్దం తర్వాత 1921లో మన్యసంఘం యొక్క పేరును మార్చి ఆది-హిందూ సోషల్ సర్వీసు లీగు అని నామకరణం చేశారు.
1917లో విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజనసభ, తొలి ఆది ఆంధ్ర మహాజనసభగా రూపాంతరం చెందింది. అధ్యక్ష ప్రసంగం చేస్తూ భాగ్యరెడ్డి వర్మ, ఏ హిందూ పురాణేతిహాసాల్లోనూ పంచములనే పదం లేదని, ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి, ఇప్పటి నుండి ఆది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించాడు. 1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్రమహాసభలు దాదాపు ప్రతిసంవత్సరం జరిగాయి. అంటరానివారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండు చేశారు. ఈ ఆది ఆంధ్ర మహాజనసభల ప్రభావంతో 1931 జనాభా లెక్కలలో మాల, మాదిగ, ధేర్, చమర్ లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆదిహిందువులుగా పేర్కొన్నది.
1933 కల్లా ఆది-హిందూ సోషల్ సర్వీసు లీగు ఆధ్వర్యంలో 26 పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో దాదాపు 2600 మంది విద్యార్థులకు చదువు చెప్పేవారు. ఈయన స్మారకంగా 1943లో ఆయన కొడుకు మాదరి భాగ్య గౌతమ్ ప్రారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తరువాత మనవడు అజయ్ గౌతమ్ నడిపిస్తున్నాడు.[6]
దళితత్రయం
[మార్చు]హైదరాబాదు సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బి.ఎస్.వెంకట్రావులను ముగ్గురినీ దళితత్రయంగా పరిగణిస్తారు. అయితే వీరిలో భాగ్యరెడ్డి వర్మకు అగ్రస్థానం ఉండేది. మాల మాదిగ సమాన గౌరవం, సమాన భాగం చెందాలని ఆశించిన అరిగే రామస్వామి వంటి మాల నాయకులు, ఇతర నాయకులు భాగ్యరెడ్డి వర్మను మాల పక్షపాతిగా గర్హించి, 1931లో మాదిగ సంక్షేమం కొరకు అరిగే రామస్వామి అరుంధతియార్ మహాసభ అనే కొత్త సంస్థను ఏర్పాటుచేశారు.[7] భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి ఇద్దరూ మాల కులస్థులే అయినా, అరిగే రామస్వామి మాల-మాదిగ కులాంతర వివాహాలను ప్రొత్సహించాడు, కానీ భాగ్యరెడ్డి వర్మ అందుకు సమ్మతించలేదు. ఇరువురూ 1920వ దశకం తొలినాళ్ల నుండి అనేక విషయాలపై విభేదించారు. వీరి ఘర్షణకు సైద్ధాంతిక విభేదాలకంటే, వ్యక్తిగత కారణాలే ప్రధానమైనవని, హైదరాబాదు సంస్థానంలో దళితోద్యమాన్ని గ్రంథస్థం చేసిన పి.ఆర్.వెంకటస్వామి అభిప్రాయపడ్డాడు.[8]
మత విశ్వాసాలు
[మార్చు]భాగ్యరెడ్డివర్మకు హిందూమతంపై విశ్వాసం ఉండేది కాదు. మొదట్లో అర్య సమాజం, బ్రహ్మసమాజం బోధనలను పాటించేవాడు. బ్రహ్మసమాజం వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించడం, యజ్ఞోపవితాన్ని త్యజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గుచూపాడు అయితే అర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్రకులాల నుండి ఆర్యసమాజంలో చేరిన వారితో సమానంగా గౌరవం లభించడంలేదని గమనించాడు.[9] అర్య సమాజం, బ్రహ్మసమాజం ఏవీ దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు.[10] గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ మొదలైన అంశాలపట్ల ఆకర్షితుడయ్యాడు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకొనేవాడు.[4] తన ఏకైక కుమారునికి గౌతమ్ అని పేరు పెట్టుకున్నాడు.
గుర్తింపు
[మార్చు]బాగయ్య చిన్నప్పటి నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవాడు. వీరి ఇంటికి శైవమత గురువు తరుచూ వచ్చి బోధనలు చేసేవారు. ‘ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు. వీరు రాక ముందు నేడు అంటరానివారుగా చూడబడుతున్న దళితులు పాలకులుగా వుండేవారు. ‘ రెడ్డి’ అన్న పదం రేడు నుండి వచ్చింది. దీనికి అర్ధం పాలకులు’ అని ఆయన చెప్పేవాడట. ఇది బాగయ్య మనసులో ఎంతగా నాటుకు పోయిందంటే, ‘మా పూర్వీకులు పాలకులే కదా! నేను పాలకుడిని ఎందుకు కాకూడదు’ అని ఆయన తన పేరు చివరన రెడ్డిని చేర్చుకున్నాడు. అట్లా బాగయ్య భాగ్యరెడ్డిగా మారాడు. ఆ తరువాత 1913లో ‘ఆర్య సమాజ్’ వార్షిక సదస్సులో ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘వర్మ’ అన్న బిరుదును ప్రధానం చేశారు. దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు.
బాగయ్య యుక్త వయసులోనే ఉద్యమాలను, సంస్థలను స్థాపించిన దీర్ఘదర్శి. 1906లో జగన్ మిత్రమండలి, 1911లో మన్యసంఘం, 1922లో ఆది జన జాతియోన్నతి సభ (దీనినే "ఆది హిందూ జాతియోన్నతి సభ" అని కూడా పిలుచుకునేవారు.), 1932లో "స్వస్తదళ్"ను ఏర్పాటు చేశారు. వీటికి ఆయన కార్యనిర్వాహకులుగా ఉన్నప్పటికీ తనతో పాటు అరిగె రామస్వామి, వాల్తాటి శేషయ్య, వెంకటరామ్, జే.హెచ్.సుబ్బయ్య, ముదిగొండ లక్ష్మయ్య, ముత్తయ్య, శివరామ్, పులి నర్శింలు లాంటి ప్రముఖులు చురుగ్గా పాల్గొనేవారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో వీరు చేపట్టే కార్యక్రమాలు కూడా ఎన్నో విధాలా ఆసక్తి రేకెత్తించేవి.
ఆధిపత్య కులాల వారు నిర్వహించే కార్యక్రమాలకు మాల, మాదిగ లను ఆ కాలంలో రానిచ్చేవారు కాదు. అందుకే భాగ్యరెడ్డి వర్మ సభలు, సమావేశాల సందర్భంలో హరికథలను నిర్వహించేవారట. అస్పృశ్యతను పాటించే వైదిక ధర్మానికి, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన బౌద్ధ ధర్మాన్ని పాటించేవారు. వీరు వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించేవారు. హరికథా కార్యక్రమాల ప్రారంభంలోను, ముగింపు సమయంలోను భాగ్యరెడ్డి వర్మ దళితుల నుద్దేశించి అనర్గళంగా ప్రసంగించేవారు. "దళితులే ఈ దేశపు మూలవాసులు. అంటరానితనంను పాటించే ఆదిపత్య కులాలవారు పొట్ట చేతవట్టుకొని మధ్యఆసియా నుండి వలస వచ్చినవారు. అవిద్య, అజ్ఞానం వల్ల మాత్రమే దళితులు వెనకబడి ఉన్నారు" అని ఆయన బోధించేవారట. దక్కన్‌లో భాగ్యరెడ్డి వర్మ తరం నిర్మించిన ఆదిజన ఉద్యమం దేశవ్యాపితంగా నడిచిన ఆదిజన మూలవాసీ ఉద్యమానికి అనుసంధాన కర్తగానూ పనిచేసింది. ఇందులో భాగంగానే 1917లో నిర్వహించిన ‘ఆది ఆంధ్ర సభ’లో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షోపన్యాసం చేయడం చారిత్రాత్మకం. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్యనగర్ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టి మాదిగ సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించాడు. వర్మ రాసిన ఆ నవల గురించి ప్రజలకు అంతగా తెలియదు.
మరణం
[మార్చు]భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో హైదరాబాదులో మరణించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Bhagyodayam - Madari Bhagya Reddy Varma Life-sketch and Mission - M.B.Gautam
- ↑ Dalit Movement in India and Its Leaders, 1857-1956 By Rāmacandra Kshīrasāgara
- ↑ Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India edited by Sabyasachi Bhattacharya
- ↑ 4.0 4.1 A History of Telugu Dalit Literature By Thummapudi Bharathi
- ↑ తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 216
- ↑ 6.0 6.1 "భాగ్యోదయం - నమస్తే తెలంగాణా". Archived from the original on 2016-03-05. Retrieved 2014-01-17.
- ↑ STEEL NIBS ARE SPROUTING: New Dalit Writing From South India edited by Susie Tharu/ K. Satyanarayana
- ↑ The Untouchables: Subordination, Poverty and the State in Modern India By Oliver Mendelsohn, Marika Vicziany
- ↑ Encyclopaedia of Dalits in India, Volume 7 edited by Sanjay Paswan
- ↑ "దళితోద్యమ వేగుచుక్క - సంగిశెట్టి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ". Archived from the original on 2016-03-05. Retrieved 2014-02-12.