సరోజినీ నాయుడు

వికీపీడియా నుండి

సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

[మార్చు] జీవిత విశేషాలు

సరోజినీ దేవి చటోపాధ్యాయ హైదరాబాదులో ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబములో జన్మించినది. ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ స్థాపకుడు, శాస్త్రవేత్త మరియు తత్వవేత్త. తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి. సరోజినీ ఉర్దూ, తెలుగు, ఆంగ్లము, పర్షియన్ మరియు బెంగాలీ భాషలు మాట్లాడేది. ఈమెకు పీ.బీ.షెల్లీ కవిత్వము అంటే చాలా ఇష్టము.

1930లో ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీతో పాటు పాల్గొన్న సరోజినీదేవి

నిజాము పాలనలో అప్పటి హైదరాబాదులో స్త్రీల చదువుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వలన ఆమె మద్రాసులో చదువుకున్నది. 15 సంవత్సరాల వయసులో ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడు ను కలిసి ప్రేమించింది. చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో ఆయనను కులాంతర వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో సరోజిని గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టము (1872) ప్రకారము 1898 డిసెంబర్ 2న మద్రాసులో పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించాడు. నాయుడు దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు: జయసూర్య, పద్మజ, రణధీర మరియు లీలామణి.

ఆమె ఇంగ్లీషులో కవిత్వం రాసింది. ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్, పాలంక్వైన్ బేరర్స్ ఆమె కవితల్లో కొన్ని.

హైదరాబాదు లోని గోల్డెన్ త్రెషోల్డ్ అనేపేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు.

[మార్చు] సరోజినీ నాయుడు కవితలపై మంథా భానుమతి విశ్లేషణ[ఆధారం కోరబడినది]

పదకొండు సంవత్సరాల పసిడి బాల.. ఆల్జీబ్రాతో కుస్తీ పడుతోంది. ఆ ఆమ్మాయి బాల మేధావి.. కానీ ఆల్జీబ్రా లెక్కల్లో అందమైన అక్షరాలు కనిపించ సాగాయి. వెంటనే అసంకల్పితంగా కవిత వచ్చేసింది. అప్పటినుండే ఆ పాప కవితా ప్రస్థానం మొదలయింది. పన్నెండో ఏట మద్రాసు యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రధము రాలిగా నిలిచి పలువురి ప్రశంసలందుకుంది. పదమూడో సంవత్సరంలో, ఆరు రోజులలో పదమూడు వందల పాదాల కవితని వ్రాసింది. ఆ బాల మేధావే భారతకోకిల శ్రీమతి సరోజినీ నాయుడు.

అఖిల భారత కాంగ్రెస్ ప్రధమ అధ్యక్షురాలు.. ప్రధమ మహిళా గవర్నర్.. బెంగాలీయుల ఆడపడుచు, తెలుగు వారి కోడలు.. శ్రీమతి సరోజినీ నాయుడు. శాస్త్రవేత్త, వేదాంతి.. నిజాం కాలేజ్ వ్యవస్థాపకుడు అయిన అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, వరద సుందరీ దంపతులకు ఫిబ్రవరి ౧౩, ౧౯౭౯ లో వారి ప్రధమ సంతానం గా జన్మించారు. భారదేశానికి దేముడిచ్చిన వరం మన కవికోకిల.

తల్లి వరద సుందరి కవయిత్రి, బెంగాలీలో చక్కని కవితలల్లేవారు. తండ్రి శాస్త్రవేత్త. పన్నెండేళ్ళ ప్రాయంలోనే మద్రాస్ విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రధమురాలిగా నిలిచిన, ప్రతిభావంతురాలైన కూతుర్ని గణిత శాస్త్రంలో దిట్టని చేసి, శాస్త్రజ్ఞురాలిగా తన వారసురాలిగా చూడాలనుకున్నారు, అఘోరనాథ్. కానీ సరోజిని, తల్లి వారసత్వాన్ని ఎంచుకుని తన పదకొండో ఏటే కవితలల్లడం మొదలు పెట్టింది.

సరోజిని కవితలని చదివి, మెట్రిక్యులేషన్లో మొదటి స్థానాన్ని తెచ్చుకున్న ఆమె ప్రతిభని గుర్తించిన హైద్రాబాద్ నిజామ్ ప్రభువు విదేశాల్లో చదువుకి ఉపకార వేతనం ఇచ్చారు.

కానీ అనారోగ్య కారణంగా రెండు సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఆ రెండు సంవత్సరాలు పుస్తక పఠనంలోనే గడిపి అపారమైన జ్ఞ్నానాన్ని సముపార్జించారు.

ఆ కాలంలోనే పదహారేళ్ళ వయసులో సరోజినీ ఛటోపాద్యాయ పై చదువులకు లండన్ ప్రయాణమై వెళ్ళారు.

లండన్లోనే ప్రముఖ కవులైన ఎడ్మండ్ గాస్, ఆర్థర్ సైమన్ల పరిచయం కలిగింది. వారి పరిచయం సరోజిని భావ వ్యక్తీకరణ మీద అమిత ప్రభావాని చూపింది. అప్పుడే తనలో వెల్లివిరిసే భావాలకి రూపం ఇచ్చారు సరోజిని. ఆ కవితలన్నీ ఐరోపా దేశపు వాతావరణానికీ, అక్కడి ప్రకృతికీ, మనుషులకీ సంబంధించినవే!

సరోజిని వ్రాసిన "ది బర్డ్ ఆఫ్ టైమ్" కవితా సంకలం పరిచయ వాక్యాలలో ఎడ్మండ్ గాస్ వెలిబుచ్చిన భావాలు, ఆయన మాటల్లోనే..

"సరోజినీ ఛటోపాధ్యాయ లండన్ రాగానే మిత్రుల ద్వారా మా ఇంటికి వచ్చింది. అతి త్వరలోనే ఇంట్లో అందరికీ అభిమాన పాత్రురాలైన అతిథిగా మారిపోయింది. ఒక రోజు, యాదృఛ్ఛికంగా సరోజిని రాసిన కవితలు దొరికాయి. అవి చదివిన నాకు ఒకటే తోచింది. ఆ కవితలన్నీ షెల్లీ, టెన్నిసన్ వంటి ఆంగ్ల కవులు వ్రాసే పశ్చిమ, ఆంగ్ల కవితల్లాగ ఉన్నాయి కానీ సహజత్వం లేదు. వాటిని చదివిన నాకు ఎంతో బాధ కలిగింది. మంచి వ్యాకరణం, ధార, భావం ఉన్న కవయిత్రి ఇటువంటి అనుకరణ పద్యాలు అల్లడమా? సరోజినినే పిలిచి వాటన్నిటినీ చెత్తబుట్టలో పడెయ్యమని చెప్పాను. నీ కవితలు, భారతీయ సంస్కృతినీ, ఆలోచనలనూ. అక్కడి జీవన విధానాన్నీ, ప్రకృతినీ ప్రతిబింబించాలి. ఇటువంటి పాశ్చాత్య అనుకరణ ఎన్నటికీ పనికిరాదు. మీ దేశాన్ని నీ కవితల్లో ప్రపంచానికి చూపించు అని గట్టిగా చెప్పాను."

సరోజిని, గాస్ విమర్శని సహృదయంతో స్వీకరించి అప్పటివరకూ తను వ్రాసిన కవితల్ని పక్కన పెట్టేశారు. సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందడానికి ఇది నాంది అని చెప్పచ్చు.

ఎడ్మండ్ గాస్ సలహాని పాటించి అద్భుతమైన కవితలల్లారు సరోజిని. మొదటి కవితా సంకలనం, "ది గోల్డెన్ త్రెష్ హోల్డ్" ౧౯౦౫ లో ప్రచురించారు. తనకి మార్గదర్శి అయిన ఎడ్మండ్ గాస్కి ఆ సంకలనాన్ని అంకితమిచ్చారు సరోజిని. దానికి పరిచయ వాక్యాలు ఆర్థర్ సైమన్ రాశారు.

తెలుగింటి కోడలనే కాదు ఆవిడ బాల్యమంతా హైద్రాబాద్ లోనే గడిచింది. మన దేశానికే గర్వకారణమైన సరోజిని నాయుడు తన కవితలతో భారతీయ సంస్కృతిని.. ముఖ్యంగా మన రాజధాని వైభవాన్ని, పల్లెల అందాలని, సంధ్యా కాంతులనీ, ఉషోదయాలనీ వర్ణించి ప్రపంచానికి పరిచయం చేశారు.

నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పాశ్చాత్య కవులచే ప్రశంసలందుకున్న సరోజినీ నాయుడు కవితలలో కొన్నింటిని.. విశ్లేషించే సాహసం చేస్తున్నాను.

కవికోకిల కవితలలో గేయాలు, గీతాలు, పద్యాలు ఉన్నాయి. ఆవిడ ప్రధమ కవితా సంకలనం "గోల్డెన్ త్రెష్ హోల్డ్"లో మూడు ప్రక్రియలూ ఉన్నాయి. ఆ సంకలనం రూపొందడానికి ఆర్థర్ సైమన్ ముఖ్య కారకులు. సరోజినికి అనేక లేఖల్లో తన అభిప్రాయాన్ని చెప్పారు.

"నా పాటలు కవితల్లాగ ఉన్నాయా? నేను అంత సాహసం చెయ్యగలనా.. మీకు అంత బాగా అనిపించాయా.." సరోజినికి సంకోచం..

ఆర్థర్ సైమన్ ప్రోత్సాహంతో మొదటి కవితా సంకలనం వెలువడింది.

జానపద గేయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన "పాలంకీన్ బియరర్స్" ఉంది.

ఇందులో పల్లకీ బోయీలు తమ మనో భావాల్ని అతి సున్నితంగా వ్యక్త పరుస్తారు.. చక్కని లయ, అంతకన్నా చక్కని భావంతో అలరిస్తుంది. పల్లకీకే ఒక రూపం ఇచ్చి, ఒక అపురూపమైన భావనతో.. వర్ణించారు.

ఉదాహరణకి ఆ పల్లకీ.. "అత్తవారింటికి వెళ్తున్న నవవధువు కంటి నుంచి జారిన కన్నీటి చుక్కలా కిందికి జారుతుందిట..

కలలో పెదవులపై విరిసిన దరహాసంలా తేలిపోతుందిట..

ఆ పల్లకీని దారం మీద జాలువారే ముత్యంలా బోయీలు తీసుకెళ్తున్నారుట..

చల్లని గాలికి ఆహ్లాదంగా కదులుతున్న పువ్వులా ఊగుతూ ఉందిట."

ఈ గీతం ఒక్కటి చాలు కవి కోకిల సున్నిత భావ ప్రకటనకి. మన కళ్ళముందు బోయీలు పల్లకీని నడుపుతున్న అనుభూతి, ఒహోం.. ఒహోహోం.. ఒహొం ఒహొహోం.. అని ఆ వరసలో పాడేస్తాం, అతి సహజంగా.

ఆవిడే చెప్పుకున్నారు నేను కవిత్వం రాయలేదూ, కోకిలలా పాడానూ అని. (ఐ సాంగ్ లైక్ ఎ బర్డ్.") అది నిజంగా నిజం అనిపిస్తుంది ఆ కవితలని చదివినా గానం చేసినా.

ఇంతటి ప్రాచుర్యాన్నీ పొందింది.. "ది బర్డ్ ఆఫ్ టైమ్" కవితా సంకలనంలో ఉన్న బాంగిల్ సెల్లెర్స్ లో గాజులవాళ్ళ వర్ణన.

మిరుమిట్లు గొలిపే ఇంద్రధనస్సు రంగుల్ని వెదజల్లే కాంతి వృత్తాలు గాజులు..

అవి.. "లస్ట్రస్ టొకెన్స్ ఆఫ్ రేడియంట్ లైవ్స్"

ఎవరికీ..

"ఫర్ హాపీ డాటర్స్ అండ్ హాపీ వైవ్స్." ఎంత అద్భుతమైన భావన?

పెళ్ళికాని అమ్మాయి చేతికి.. నీలి, వెడి రంగుల కలయికలో పర్వతాన్ని చుట్టిన పొగమంచువంటివి ఉన్నాయి.

పెళ్ళికూతురి చేతికి..

కొన్ని ఎండలో మెరిసే మొక్కజొన్న చేల అందాలతో, కొన్ని పెళ్ళిలో వెలిగించే అగ్ని కాంతులతో, ఆమె గుండెలోని కోరికని చెప్తూ ఉంటాయి

మరి కొన్ని గాజులు వంగపండు రంగులో ప్రేమతో నిండిన మాతృ మూర్తి చేతులకి నిండుగా ఒదిగాయి.

ఒక స్త్రీ జీవితంలో ప్రతీ దశనీ ఈ కవితలో రంగురంగుల గాజుల వర్ణనలతో మిళితం చేసి చెప్పారు. ఒక కన్య, ఒక వధువు, ఒక తల్లి మన కళ్ళముందు నిలుస్తారు.

పంథొమ్మిదో శతాబ్దపు చివర్లో.. సంధ్యా సమయంలో హైద్రాబాద్ నగరం ఏ విధంగా ఉండేది? కవికోకిల కవిత, "నైట్ఫాల్ ఇన్ ది సిటీ ఆఫ్ హైద్రాబాద్" చదివితే చాలు.. కళ్ళ ముందు నిలుస్తుంది.

ఈ కవితలో..

"చిన్ని చిన్ని తునుకలుగా విడిపోయిన ఆకాశం, పావురాయి మెడలా మండుతుంది. ఆకాశం తునుకలవడమా! అర్ధం కాలే.. సంధ్యావేళ వరకూ వేచి చూశాను.. నిజంగానే, ఎర్రని సంధ్య కాంతులు నీలి ఆకాశాన్ని తునుకలు చేశాయి.

తెల్లని నది మెరుపులు చిందిస్తూ, పొడుచుకొచ్చిన దంతపు కొమ్ములా నగర గవాక్షాల్లోంచి వంపు తిరుగుతుంది. అప్పటి రోజుల్లో మూసీ నది నురగలతో నిండుగా ప్రవహిస్తూ గేట్లలోనుంచి వంపులు తిరిగేదని ఊహించవచ్చు.

మసీదుల పైనున్న స్థూపాల్లోనుంచి ముసల్మానుల ప్రార్ధనలు యుద్ధ పతాకంలా రెపరెపలాడుతూ ఈదుతాయి.

ఏనుగులు మందగమనంతో వంపులు తిరిగిన వీధుల వెంట వెండి గొలుసుతో కట్టిన వెండి గంటలు మ్రోగించుకుంటూ సాగుతుంటాయి.

ఎత్తైన చార్మినార్ని ఉత్సాహంగా చుట్టి వెళ్ళే కవాతు చేస్తున్న అశ్వబృందం శబ్దాలు, వారి పతకాల, వీధి నాట్యాల ధ్వనులతో కలిసి పోతున్నాయి.

నగరవంతెన మీదినుండి ఠీవిగా రాణిలా వస్తోంది రాత్రి.."

ఒక్కసారి ఆకాలానికి వెళ్ళి నగర వీధుల్లో సంచారం చేసినట్లు లేదూ!

ఇంక హైద్రాబాద్ బజార్లలో సందడి ఎలా ఉండేది?

"ఇన్ ది బజార్ ఆఫ్ హైద్రాబాద్ చదివామంటే చాలు.. ఆ బజార్లోకి వెళ్ళిపోవలసిందే..

వ్యాపారస్థులు ఏం అమ్ముతారు? పచ్చల పిడి బాకు, వెండి జలతారుతో ఎర్రని తలపాగాలు..

షావుకార్లు కుంకుమపువ్వు, బియ్యం, పప్పులు తూస్తూ ఉంటారు. అమ్మాయిలు గంధం, గోరింటాకు, మసాలాలు నూరుతూ ఉంటారు.

ఇంకా.. బంగారు వడ్డాణాలు.. గర్డిల్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ ది డాన్సర్స్, స్కాబర్డ్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ ది కింగ్..ఉంటాయి. నేతగాళ్ళు, పండ్ల వాళ్ళు, పూల వాళ్ళు అందరూ తీరిక లేకుండా కనిపిస్తారు.

"హుస్సేన్సాగర్ లేక్" కవితలో.. సరస్సుని,

ఉదయించే సూర్యుడు ఠీవిగా సరసం సాగిస్తాడు, సాగిపోయే సంధ్యా మేఘాలు ఆగి పైనుంచి చూస్తాయి..

అంతెందుకు.. ఆ సరస్సుని.."లేక్, లివింగ్ ఇమేజ్ ఆఫ్ మై సోల్" అనేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

గోల్కొండ నవాబుల సమాధుల మధ్య,

డ్రీమింగ్ స్పిరిట్కి రాచ వధువుల నవ్వులు వినిపిస్తాయి.

రాణీల సమాధుల్లో వారి సుకుమారత్వం, సౌందర్యం కనిపించాయి..

నిజంగా మరణం రాణుల వసివాడని వికసించే సౌందర్యమే!

భారత చేనేతకారులు ఎటువంటి వస్త్రాలు, ఎవరికి నేస్తారు?

పగలు ఆ నేత గాళ్ళు అప్పుడేపుట్టిన పాపాయికి ప్రశాంతమైన నీలి నీలి బట్టలు..

సంధ్యా సమయంలో ఆకర్షణీయమైన నెమలి కంఠం రంగు వస్త్రాలు ఎవరికి? రాణీగారి పెళ్ళి వేడుకలఓ మేలి ముసుగుకి..

చంద్రుని కాంతిలో నెమ్మదిగా మౌనంగా నేసే తెల్లని ఈకలాంటి వస్త్రం మరణించిన మానవుని ఆఖరి ప్రయాణానికి.

పాముల వాళ్ళు, వీధి భాగవతులు, నేతగాళ్ళు, బంజారాలు, జాలరులు, ధాన్యం దంపుళ్ళ వాళ్ళు, లాలి పాటలు, లల్లాయి పదాలు, గోరింటాకు, కోతకొచ్చిన పైరు.. భారతదేశంలోని అన్ని రకాల మనుషులూ, వస్తువులూ సరోజినినాయుడుకి కవితా వస్తువులే.

అందంలో, సహజత్వంలో, స్వఛ్ఛతలో భారతకోకిల కవితలు వేనికవే సాటి. ప్రతీ కవితా ఒక తేనె పలుకుల సోన.

ఘంటసాలగారు పాడినట్లు..

"భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి తీయగా పాడిన కోయిలమ్మకు" నివాళులర్పిస్తూ.. సెలవు.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు