శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం (పొనుగుపాడు)
శ్రీ గంగా అన్నపూర్ణసమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E |
పేరు | |
ప్రధాన పేరు : | జంపనివారి గుడి |
దేవనాగరి : | जंपनि वारि मंदिर |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | గుంటూరు |
ప్రదేశం: | ఫిరంగిపురం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | కాశీవిశ్వేశ్వరుడు (శివుడు) |
ప్రధాన దేవత: | శ్రీమాతా అన్నపూర్ణాదేవి (పార్వతి) |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.. 1917 |
సృష్టికర్త: | "జంపనివారు" |
శ్రీ గంగా అన్నపూర్ణసమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామంలో నెలకొన్న శైవాలయం. ఈ ఆలయానికి "జంపనోరి గుడి" అనే మరో పేరు వాడుకలో ఉంది.
ఆలయ చరిత్ర
[మార్చు]పొనుగుపాడు గ్రామంలో పూర్వం జంపని వంశానికి చెందిన పెద్దయ్య, కోటమ్మ అనేదంపతుల ఉండేవారు. ఆ దంపతులకు ఒక కుమారుడు వెంకటేశం, కుమార్తె వెంకటరమణమ్మ. కోటమ్మ ఇదే గ్రామానికి చెందిన వంకాయలపాటి వారి వంశానికి చెందిన వెంకట్రాయుడు తోబుట్టువు. వెంకట్రాయుడు జంపనివారి ఆడపడుచు మహాలక్ష్మమ్మను మొదటి భార్యగా వివాహమాడాడు. ఇదే గ్రామానికి చెందిన మానుకొండవారి ఆడపడుచు రుక్మిణమ్మను రెండవ భార్యగా వివాహమాడాడు. రెండవ భార్య మహాలక్ష్మమ్మ ద్వితీయ సంతానంగా జన్మించిన రామలక్ష్మమ్మ వివాహం వెంకట్రాయుడు అక్క కోటమ్మ కుమారుడు వెంకటేశంతో జరిగింది.
అయితే ఈ దంపతులకు సంతతి లేదు. అప్పట్లో జంపని, వంకాయలపాటి రెండు కుటుంబాలు ఉమ్మడి కుటుంబంగా ఉండేవి. ఈ రెండు కుటుంబాలకు ఉమ్మడిగా గ్రామంలో, పలుచోట్ల మూడొందల ఎకరాలకు పైగా భూమి ఉండేది. రామలక్ష్మమ్మకు సంతానం లేనందున ఆమె ఆస్థిపాస్థులకు వారసుడుగా తన తరుపున తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆడబిడ్డ కుమారుడు మర్రి రామలింగయ్యకు తిరిగి తన స్వంత చెల్లెలు ఆదెమ్మ (ఈ గ్రామానికి చెందిన కొరిటాల శేషయ్య భార్య) ప్రథమ కుమార్తె రత్తమ్మతో వివాహం జరిపించి ఆ దంపతులను పొనుగుపాడు గ్రామంలో తన ఇంటికి తీసుకు వచ్చింది.
వంకాయలపాటి వెంకట్రాయుడు, మహాలక్ష్మమ్మ (మొదటి భార్య) దంపతుల నాలుగవ సంతతిగా జన్మించిన కుమారుడు వెంకయ్య ఇదే గ్రామానికి చెందిన మాచవరపు వంశానికి చెందిన ఆడపడుచు మహాలక్ష్మమ్మను వివాహమాడాడు. ఈ దంపతులకు ఒక్కతే కుమార్తె బొజ్జమ్మ. వెంకయ్య పెద్ద సోదరి ఆదెమ్మ, రాయంకుల బుచ్చయ్య దంపతుల ప్రథమ కుమారుడు రాయంకుల తాతయ్యతో బొజ్జమ్మ వివాహం జరిపించి, వంకాయలపాటి,జంపని ఉమ్మడి కుటుంబంలోని అప్పటి వారసులు మైనర్లు అయినందున జంపని, వంకాయలపాటి ఉమ్మడి ఆస్థిపాస్థులు పరిరక్షణకు, తన ఆస్ధులకు వారసుడుగా పలుదేవర్లపాడు నుండి రాయంకుల తాతయ్య, బొజ్జమ్మ దంపతులిద్దరిని పొనుగుపాడు తీసుకు వచ్చారు.
జంపనివారి ఆస్థులకు మర్రి, వంకాయలపాటి, రాయంకుల వంశాలకు చెందిన వంశస్థులు వారసులుగా వచ్చినందున ఈ మూడు కుటుంబాల వారసులను "జంపనివారు" అని పిలుస్తారు.జంపని ఆస్థులకు వారసులుగా వచ్చిన మర్రి, రాయంకుల, వంకాయలపాటి వంశస్థులు, జంపని కుటుంబానికి చెందిన రామలక్ష్మమ్మ ఈ దేవాలయానికి శంకుస్థాపన చేసి నిర్మించినందున "జంపనివారి గుడి" అని వాడుకలోకి వచ్చింది.
అసలు పేరు వెనుక చరిత్ర
[మార్చు]దేవాలయం అసలు పేరు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం. ఇప్పటి వాడుకలో శివాలయం అని చెప్పుకుంటుంటారు. దేవాలయంలో ప్రతిష్ఠించిన సాలగ్రామం (శివలింగం) వారణాసి (కాశీ) నుండి తీసుకు వచ్చి ప్రతిష్ఠించారు. అప్పటినుండి "శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం"గా ఆలయ ఉత్సవ కార్యక్రమాలలో వ్యవహరిస్తారు. పూర్వకాలంలో విగ్రహాలు తీసుకు రావటానికి అందరూ తొందరగా సుముఖత చూపించరు. ఆలయంలో ప్రతిష్ఠించిన సాలగ్రామాన్ని వారణాసి నుండి జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి వెంకయ్య కాలినడకన వ్యయప్రయాసల కోర్చి నేరుగా తీసుకు వచ్చారు. ఆ కార్యక్రమం జంపని వారసులలో ఒకరైన రాయంకుల తాతయ్య నేతృత్వంలో తదితర వంకాయలపాటి, మర్రి వారసులు కుటుంబ సభ్యులు పాలు పంచుకున్నారు.
శంకుస్థాపన, నిర్మాణం
[మార్చు]జంపని వారసులు ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు, 1913వ సంవత్సరంలో గ్రామంలోని డి.నెం.516ఎలో ఒక ఎకరం విస్తీర్ణంలో వంకాయలపాటి వెంకట్రాయుడు, రుక్మిణమ్మ (రెండవ భార్య) దంపతుల కుమారుడు రామయ్య దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు.అతను శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తరువాత వారసులతో నేను ఎక్కువ కాలం జీవించననే అభిప్రాయంతో, తలపెట్టిన ఈ కార్యక్రమం ఆగకుండా పూర్తి చేయాలని తన మనసులో దాగి ఉన్న మాటను వారసులు, గ్రామస్థులతో వెలిబుచ్చాడు. అతను వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం కొద్దికాలానికి రామయ్య స్వర్గస్థులయ్యాడు. ఆశంకుస్థాపన కార్యక్రమంలో రామయ్య తోబుట్టువు జంపనివారసులలో చివరి వ్యక్తి రామలక్ష్మమ్మ, జంపని వారసులైన రాయంకుల, వంకాయలపాటి, మర్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ తరువాత దేవాలయ నిర్మాణ కార్యక్రమం రాయంకుల తాతయ్య, వంకాయలపాటి పెద్దయ్య, వెంకయ్య, మర్రి రామలింగయ్య పర్వేక్షణలో రామలక్ష్మమ్మ, మాధవరాయుడు, రత్తయ్య, కోట్లింగంల సహకారంతో 1917 ఫిబ్రవరి నాటికి దేవాలయ నిర్మాణం పూర్తి అయింది.
విగ్రహ ప్రతిష్ఠ
[మార్చు]1917 వ సంవత్సరం (నలనామ సంవత్సరం) ఫిబ్రవరి మాసంలో ఆలయంలో సాలగ్రామాలు (విగ్రహాలు) ప్రతిష్ఠించారు.ఆలయానికి అభిముఖంగా ఆదేరోజు ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించబడింది. శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి విగ్రహంతో పాటు ఆలయంలో శ్రీమాతా అన్నపూర్ణాదేవి అమ్మ వారి విగ్రహం, విఘ్నేశ్వరుడు, నంది, ఆంజనేయస్వామి విగ్రహలు ప్రతిష్ఠించారు.
అలయ రాజగోపురం
[మార్చు]ముందు చూపుతో ఎప్పటికైనా రాజగోపురం నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణంతోపాటు 22 అ.ల పొడవు,18.అ.ల వెడల్పుతో మొదట రాతి దిమ్మె కట్టుబడి నిర్మించబడింది. అటు పిమ్మట ఐదు అంతస్తులుతో ఎనభైఐదు అడుగుల ఎత్తు కలిగిన రాజగోపురం నిర్మాణం 1937 సంవత్సరంలో మొదలుపెట్టి 1939 సంవత్సరం నాటికి పూర్తి చేయబడింది. గుంటూరు జిల్లాలో మంగళగిరి ఆలయ రాజగోపురం తరువాత ఈ ఆలయరాజగోపురం రెండవదిగా చెప్పుకోవచ్చు.
కీర్తి స్తంభం
[మార్చు]ఆలయం ముఖద్వారానికి, రాజగోపురానికి ఎదురుగా బయట సుమారు 50 అడుగుల ఎత్తుతో స్థాపించిన కీర్తిధ్వజం ఏకశిలతో తయారు చేయబడింది.ఈ కీర్తి ధ్వజాన్ని చాలా వ్యయప్రయాసలతో పొనుగుపాడు గ్రామానికి సుమారు 50 కి.మీ.దూరంపైబడిన పిడుగురాళ్ళ మండలం, పిన్నెల్లి గ్రామం నుండి తీసుకు వచ్చారు. గ్రామస్థుల సహకారంతో ఇరువై జతల ఎద్దులుతో, ఆరు జతల చక్రాల బండిపై, పన్నెండు రోజులకు గ్రామానికి తీసుకు వచ్చారు.కీర్తి స్తంభం చేర్చే సమయంలో అనుకోకుండా పిన్నెల్లి గ్రామంలో ఒక ఇల్లు అడ్డం వచ్చి బండి తిరగటానికి కుదరలేదు. ఆ ఇంటి యజమానిని ఆ గ్రామ పెద్దలుతో ఒప్పించి అప్పటికప్పుడు నష్టపరిహారంగా కొంత డబ్బు ముట్టజెప్పి ఇంటిని కూలగొట్టి తీసుకువచ్చారు.[1] కీర్తిధ్వజాన్ని, జీవధ్వజం, శక్తిధ్వజం అను పేర్లుతోకూడా అంటారు.
ఆలయంలో కళ్యాణ మండపాలు
[మార్చు]- స్వామి వారి కళ్యాణం భక్తులు కనులారా చూచుటకు ప్రత్యేకంగా ఆలయ ఆవరణలో ఈశాన్యం వైపు కళ్యాణ మండపం ఆలయ నిర్మాణంతోపాటు నిర్మించబడింది.
- ప్రస్తుత జంపని వారసులలో పెద్దాయనగా పిలువబడే ఒకరైన మర్రి గోపాలకృష్ణయ్య గ్రామంలో ప్రజల సౌకర్యార్ధం వివాహాది శుభకార్యాలు జరుపుకోవటానికి తన స్వంత నిధులతో కళ్యాణ మండపం నిర్మించి 1999 నవంబరు 24న స్వామివార్కి కైంకర్యం చేసారు.
యజ్ఞశాల, నవగ్రహాల మండపం
[మార్చు]యజ్ఞశాల: దేవస్థానం నిర్మాణంతో పాటు ఆవరణలో లోగడ ఆగ్నేయాన నిర్మించిన యజ్ఞశాల శిథిలమయింది. జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి బలరామకృష్ణయ్యచే 1994వ సం.ములో తిరిగి నిర్మింబడింది.
నవగ్రహాలు మండపం: జంపని వారసులలో రాయంకుల వంశానికి చెందిన తాతయ్య కుమార్తె ఆరే లక్ష్మీప్రసన్న, శ్రీనివాసరావు దంపతులచే ఆలయ ఆవరణలో ప్రధాన గర్బగుడికి ఉత్తరపు వైపు నవగ్రహా మండపం నిర్మించబడింది. కొంతమంది దాతలు సహకారంతో నహగ్రహ విగ్రహాలు, కాలబైరవస్వామి, నందీశ్వరుడు, నాగేంధ్రస్వామి విగ్రహాలు మరి కొంతమంది దాతలు అందించిన ఆర్థిక సహాయంతో అదే సంవత్సరంలో ప్రతిష్ఠంచబడ్డాయి.
శ్రీ విశ్వేశ్వర స్వామి తొలి కళ్యాణం
[మార్చు]1917వ సంవత్సరం మార్చి (నలనామ సంవత్సరం) 8 వ తేది గురువారం తెల్లవారు జామున (తెల్లవారితే పౌర్ణమి రోజు) మొదటి కళ్యాణం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు (2017 వరకు) నూటొక్క కళ్యాణాలు జరిగినవి. 102 వ కళ్యాణం తిరిగి 2018 మార్చి 1వ తేదీన జరిగింది. వంకాయలపాటి, రాయంకుల,మర్రి కుటుంబాలకు చెందిన వారసులు మాత్రమే కూర్చునే సంప్రదాయం స్వామివారి మొదటి కళ్యాణం నుండి ఇప్పటి వరకు పరంపరంగా జరుగుతుంది.ప్రతి సంవత్సరం స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగిన తరువాత గ్రామంలో స్వామి వారి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది.
లోగడ జరిగిన కళ్యాణ మహోత్సవాల విశేషాలు
[మార్చు]ప్రవచనాలు:పూర్వం స్వామివారి కళ్యాణమహోత్సవంల సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు ప్రముఖులు జంధ్యాల పాపయ్య శాస్త్రి , మైలవరపు శ్రీనివాసరావు, జమ్ములమడక మాధవరామశర్మ, యల్లాప్రగడ శ్రీరంగారావు, ప్రసాదరాయ కులపతి, యేలూరిపాటి అనంతరామయ్య, కామరాజ్ అనిల్ కుమార్ మొదలగు ప్రముఖులు అద్యాత్మిక ప్రసంగాలు చేసారు.
హరికథాగానం: హరికథాగానంలో ప్రముఖులైన కూచిబొట్ల కోటేశ్వరరావు, బుర్రా శివరామకృష్ణ, దూళిపాళ్ళ శివరామకృష్ణయ్య, ములుకుట్ల సదాశివశాస్త్రి, రాజశేఖరుని లక్ష్మీపతి, కాజన విశ్వరూపాచారి మొదలగువారు స్వామివారి కళ్యాణ వార్షికోత్సవాలకు హరికథాగానం భక్తులకు కనువిందు చేసారు.
మేజువాణి: స్వామివారి కళ్యాణ వార్షికోత్సవాలకు గతంలో గుడివాడకు చెందిన కనకం బృందం (కళావంతులు) చే మేజువాణి కార్యక్రమాలు జరిగాయి.
దేనస్థానం నిర్వహణ విధానం
[మార్చు]జంపని వారసులు ఉమ్మడి ఆస్థిని 1918లో భాగ పంపిణీలు చేసుకునే సమయంలో ఆరు భాగాలుగా విభజించి, వంకాయలపాటి కుటుంబ సభ్యులు మూడు భాగాలు, మర్రి, రాయంకుల కుటుంబ సభ్యులు చెరొక భాగం తీసుకున్నారు. ఆరవ భాగం ఆస్థిని దేవాలయ నిర్వహణకు తీసారు.
ఆలయ అర్చకులు
[మార్చు]గుంటూరు జిల్లా, కాకుమాను గ్రామానికి చెందిన కాకుమాను శేషయ్య ఆలయ మొదటి పూజారిగా నియమించబడ్డారు. ఆ తరువాత అప్పటినుండి ప్రస్తుతం ఇప్పటివరకు శేషయ్య వారసులుకు చెందిన మనవడు కళాధరశర్మ, కుమారుడు ఆంజనేయులు అలాగే రెండవ కుమారుడు సోమసుందరరావు ఆధ్వర్యంలో మనవళ్లు కృష్ణచైతన్యశర్మ, సాయికృష్ణశర్మ వంతులు వారిగా చెరొక సంవత్సరం పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు.
పూజారులకు వసతి గృహాలు
[మార్చు]దేవాలయానికి అనుబంధంగా దేవస్థానం వెలుపల ఉత్తరపు వైపు సత్రం ఆలయం నిర్మాణం తరువాత నిర్మించారు. సత్రం కొంత భాగంలో మొదటి పూజారి కాకుమాను శేషయ్యకు నివాస వసతి గృహంగా కేటాయించగా,కొంత భాగంలో జంపని వాలసులలో ఒకరైన రాయంకుల తాతయ్య పాఠశాలను స్థాపించి స్వంతగా నడిపారు. పడిపోయేస్థితికి చేరినందున పడగొట్టి ఆస్ధలం కొంత భాగంలో ప్రస్తుత పూజారులకు పక్కా నివాస గృహాలు రెండు నిర్మించబడ్టాయి. కళాధరశర్మకు నిర్మించిన వసతి గృహం రాయంకుల శేషతల్పశాయి విరాళంగా అందించిన ఐదు లక్షల రుపాయలకు తోడు మరి కొంత మంది దాతల ఇచ్చిన సొమ్ముతో నిర్మించబడింది. రెండవ నివాసగృహం ఆలయం తరుపున పాలకవర్గం వారిచే నిర్మించబడింది. మిగిలిన స్ధలాన్ని గ్రామంలో జరిగే సాంస్ర్కతిక కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలుగా “శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఓపెన్ ఎయిర్ ధియేటరు”గా ఉపయోగించుకునేలాగున మార్చారు.
శతజయంతి వార్షిక బ్రహ్మోత్సం విశేషాలు
[మార్చు]శతజయంతి ఉత్సవాలు ది.19-03-2016న ఉదయం గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతిపూజ, అంకురారోపణ, ధ్వజారోహణ, అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠాపన, హోమములు, ఇతర ప్రత్యేక పూజలతో మొదలయి, ది.26-03-2016 వరకు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.[2]
ఆలయపూజారి ఆంజనేయులు పర్వేక్షణలో, గురుకుల బ్రహ్మ కారంచేటి దక్షిణామూర్తి ఆద్వర్యంలో ఇరవైఐదు మందితో కూడిన వేదపండిత బృందం సప్తాహ్నిక దీక్షతో శాస్త్రబద్దంగా జరిపారు.ఎనిమిది రోజులు జరిగిన మహాయజ్ఞ, యాగాది కార్యక్రమాలకు యాగ కర్తలుగా రాయంకుల కుటుంబానికి చెందిన శ్యామసుందరరావు, ఆదిలక్ష్మి దంపతులు రక్షాబంధనం, దీక్షస్వీకరణతో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఎనిమిది రోజులు నిత్యం గణపతిపూజ, నిత్యార్చన, గోపూజ, బిందెతీర్థం, రుద్రాభిషేకం, బలిహరణ, చండీశప్త శత పారాయణ, తదితర పూజలు జరిగాయి.
జరిగిన ఆధ్మాత్మిక కార్యక్రమాలు
[మార్చు]- స్వామివారి వందవ కళ్యాణం:ఆలయ పాలకమండలి వారి ఆధ్వర్యంలో 2016 మార్చి 23న పౌర్ణమి రోజు ఉదయం మర్రి,రాయంకుల,వంకాయలపాటి కుటుంబాలకు చెందిన వారసుల దంపతులు పీటలమీద కూర్చోని అంత్యత భక్తి ప్రపత్తలతో స్వామివారి కళ్యాణం జరిపారు.అన్నపూర్ణదేవి అమ్మవారిని రాయంకుల కుటుంబానికి చెందిన వధువుగా భావిస్తే, శ్రీకాశీవిశ్వేశ్వరుని వంకాయలపాటి,మర్రి కుటుంబాలకు చెందిన వరుడుగా పరిగణిస్తారు. కళ్యాణమహోత్సవంలో వ్యాఖ్యాతలుగా నారాయణపు ప్రసాదాచార్యులు,కారంచేటి దక్షిణామూర్తి పాల్గొన్నారు.సాయంత్రం గ్రామంలో రథంపై స్వామివారి ఊరేగింపు జరిగింది.
- సువాసిని పూజ: 2016 మార్చి 23 సాయంత్రం రెండువందల మందికిపైగా పుణ్యస్త్రీలు సువాసిని పూజలో పాల్గొన్నారు.ఆలయ పాలకమండలి వారు పూజలో పాల్గొనిన సౌభాగ్యతులకు శాస్త్రప్రకారంనూతన వస్త్రంలతో తొమ్మిది వస్తువులు కలిగిన దక్షిణ తాంబూలం అందించారు.
- శాంతి కళ్యాణం: 2016మార్చి 26న సాయంత్రం కుమార్తెలు లేని దంపతులు కన్యాదానానికి అవకాశం లేనందున శాస్త్ర ప్రకారం వారు మోక్షమార్గం పొందుటకు శాంతి కళ్యాణం జరిగింది.ఆ కళ్యాణంలో పాల్గొనిన రెండువందల పైగా దంపతులచే స్వామి వార్కి తలంబ్రాలు పోయించి,నూతన వస్త్రాలు బహుకరించారు.
- పత్యేక విశేష పూజా కార్యక్రమాలుతో పాటు ప్రతి రోజు లలితా,విష్ణు సహస్ర నామ పారాయణం,హనుమాన్ చాలీసా 108 సార్లు,సామూహిక భజన, భక్తిగీతాల కార్యక్రమాలు పారాయణ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమలు తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ, నిత్యాన్నదానం జరిగాయి.
మహాకుంభాభిషేక మహోత్సవం విశేషాలు
[మార్చు]జరిగిన ఆధ్మాత్మిక కార్యక్రమాలు
[మార్చు]- కుంభాభిషేక కలశాలు ఉరేగింపు: 2016 మార్చి 25న ఉదయం పుణ్యనదుల నుండి తెచ్చిన నీటితో శాస్త్ర ప్రకారం పూజించి నింపిన 108 కలశాలతో గ్రామంలోని భక్తులు సాంప్రదాయ దుస్తులుతో శిరస్సుపై పెట్టుకొని వేద పండితులు, పూజారులు, ఆలయ ధర్మకర్తలు,మహిళలు వెంటరాగా మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం జరిగింది.
- శతచండీయాగం:ప్రతిరోజు జరిగిన చండీయాగంగాక 2016 మార్చి 25న భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ కన్వీనరు బొల్లేపల్లి సత్యనారాయణ,లలింతాంబ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక శతచండీయాగం సాగి ఆంజనేయులు, గూడా అంజనేయ శర్మ జరిపారు.
- మహాకుంభాభిషేకం:ఆలయం నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తైనందున 2016 మార్చి 26న ఉదయం భక్తులు 108 కలశాలను ఆలయం శిఖరం వద్దకు చేర్చి వేద పండితులకు, పూజారులకు అందించగా మంత్రోచ్చరణలతో మహాకుంభిబిషేకం కార్యక్రమం జరిగింది.
- ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం:మహ కుంభాభిషేకం అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమాన్నిభక్తులు ప్రాణ ప్రతిష్ఠ తరువాత స్వామి వారిని మెదటిసారిగా ఎవరికి వారు వీక్షించి భక్తితో పరవసులయ్యారు.
- ఈ ఉత్సవాలలో కర్నాటక రాష్ట్రంలోని హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి విచ్చేసి ముందుగా శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారిని దర్శించుకొని, అనంతరం ఆలయశిఖరానికి కలశంతో అభిషేకాలు నిర్వహించారు.తదనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమాలలో ఇంకా ఉత్తరాఖండ్ కైలాసగిరి ఆశ్రమం రిషికేష్ పీఠాధిపతులు స్వామి మేధానంద పూరీ తదితర ముఖ్యులు పాల్గొన్నారు.
- మణిదీప వైభవం (సాహిత్య రూపకం): 2016 మార్చి 26న జగన్మాత పార్వతీదేవి మణిదీపంలో శ్రీత్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహాలక్ష్మీదేవి) అవతారంగా నిలయమై ఉన్న మణిదీప వైభవం సాహిత్య రూపకం కొగంటి రంగనాయకి (తిరుప్పాయై అమృతవర్షిణి), మంచికంటి వెంకట సత్వవతి (ఉపన్యాస భారతి) ఆధ్వర్యంలో వైష్ణవి దుర్గ శ్రీ త్రిభువనేశ్వరీదేవి పాత్ర పోషించగా, లక్ష్మికుమారి,శివకుమారి తదితరులు జరిపిన కార్యక్రమం భక్తులను పరవశింపచేసింది.
ఇతర కార్యక్రమాలు
[మార్చు]- ప్రవచనాలు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానకవి ప్రొఫెసరు మేడసాని మోహన్, నంది అవార్డు గ్రహీత మీగడ రామలింగస్వామి, ప్రముఖ ఆధ్యాత్మిక వక్త నారాయణం ప్రసాదాచార్యులు, శ్రీనివాసం అయ్యంగార్ ఇంకా తదితర ముఖ్యులు ప్రసంగించారు
- వృద్దులకు సన్మాన కార్యక్రమం:వంద సంవత్సరాల పండగ సందర్భంగా ఆలయ పాలకవర్గంవారు 2016మార్చి 24న ఉదయం కుల మతాలకు అతీతంగా గ్రామంలో ఎనుబై సవంత్సరాలు దాటిన వృద్దులకు నూతన వస్త్రాలు బహుకరించి పూలతో వారిని సత్కరించారు..
- ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి రాక: కోడెల శివప్రసాదరావుకు 2016 మార్చి 20న గ్రామ పొలిమేరలో ఘనంగా స్వాగతం పలికి మేళతాళాలుతో ఆలయానికి తీసుకు వచ్చారు.వేద పండితులు ఆలయం తరుపున పూర్ణకుంభంతో స్వాగతించి ముందుగా దైవదర్శనం చేయించి ప్రత్యేక పూజలు జరిపారు.ఆ తరువాత వేదిక మీద యర్రా రామారావు సంకలనం, కూర్పు చేసిన "జంపని వారసుల చరిత్ర" ఆవిష్కరించుట జరిగింది.కీర్తికోసం కాకుండా ప్రజల సంరక్షణార్థం,లోక కళ్యాణం కోసం జరిగే ఈ వందేళ్ల పండగలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని, దేవుడు లేకుంటే ప్రజల జీవితాలు బ్రేకులు లేని వావానాలుగా ప్రజల జీవితాలుంటాయని,ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు అరాచకాలు చేస్తారని,క్రమమైన జీవితం, తగిన భయం ఉండాలంటే ప్రజలు దేవునిపై నమ్మకం ఉండాలని చెప్పారు.[3]
- పుణ్యం చేసుకున్న పొనుగుపాడు: 2016 మార్చి 25న సాయంత్రం సువాసిని పూజ జరుగుటకు ముందు ఆలయం ప్రధాన గోపురాల పైన ఆకాశంలో సుమారు 10 ని.లకు పైగా ఐదు పడగలతో ఆదిశేషుని దర్శన విన్యాసాన్ని భక్తులందరూ మనసారా దర్శించి జన్మ ధన్యం అయిందని చేతులెత్తి నమస్కరించారు.
- ప్రముఖులకు పురస్కారం:ఈ సందర్భంగా జంపని వారసులు వంకాయలపాటి బలరామకృష్ణయ్య, మర్రి పెద్దయ్య, రాయంకుల శేషతల్పశాయి ఆలయ పాలకవర్గం తరుపున ప్రముఖులను, అధికారులను, కళాకారులను,ఇతర ముఖ్యులను దుశ్సాలువ, మెమెంటోతో సత్కరించారు.
- సాంస్ర్కతిక కార్యక్రమాలు: ఈ మహోత్సవంలో ఆలయ ఆవరణలో జరిగిన కూచిపూడి నృత్యాలు, భరతనాట్యం, పౌరాణిక పద్యనాటకాలు, భక్తి గీతాలాపనలుతో పాటు నూతనంగా ఏర్పాటైన శ్రీ విశ్వేశ్వరస్వామి ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో అభినయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభినయ నాటక పరిషత్ తరుపున ఆధ్యాత్మిక, పౌరాణిక పద్యనాటకాలు, సాంఘిక నాటికలు జరిగాయి.
- మహాన్నదానం:చివరి రోజు 2016మార్చి 26న మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అన్నదానం జరిగింది.
పూజలు కార్యక్రమం
[మార్చు]ప్రతి రోజు ఆలయంలో ఉదయం గం.07.00ల నుండి గం.10.00ల వరకు స్వామివారికి అభిషేకంలు,ప్రత్యేక పూజలు జరుగుతాయి.సాయంత్రం గం.05.00ల నుండి గం.07.00ల వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.కార్తీక పౌర్ణమి రోజు విశేష భక్తులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు.
వీరభద్రుడు పూజలకు ప్రసిద్ది
[మార్చు]వీరభద్రుడు శివుని ప్రమద గణాలకు అధిపతి.అలాంటి వీరభద్రుడు ఈ అలయంలో ప్రత్యేకంగా కొలువై ఉన్నాడు.ఇతర జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి వారి నమ్మకాలనుబట్టి వీరభద్రుడుకు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.
ప్రయాణ సౌకర్యం
[మార్చు]ఇది గుంటూరు నుండి నరసరావుపేటవైపు పోవు రోడ్డు రవాణా సంస్థ బస్సులలో 30 కి.మీ. ప్రయాణించి మెరికపూడి గ్రామం దాటిన తరువాత పొనుగుపాడు కాలువకట్ట స్టేజి వద్ద దిగి, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి వచ్చు ఆటోలలో, రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ఈ గ్రామానికి చేరుకొనవచ్చు.
సాలగ్రాముల గ్యాలరీ
[మార్చు]-
శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి
-
శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి
-
వినాయకుడు
-
శ్రీ ఆంజనేయస్వామి
-
వీరభద్రుడు
-
ఉత్సవ విగ్రహాలు
ఇవి కూడా చూడండి
[మార్చు]- శతజయంతి ఉత్సవాలపై ప్రముఖుల అభిప్రాయాలు
- శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంపై 2019 మార్చి 11న ETV ఆంధ్రప్రదేశ్ 'తీర్థయాత్ర' కార్యక్రమంలో ప్రసారం చేయబడిన కార్యక్రమం
మూలాలు
[మార్చు]- ↑ తూము వెంకటేశ్వర్లు 2002 సం.ములో రచించిన పొనుగుపాడు గ్రామ చరిత్ర గ్రంధం
- ↑ శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి శతజయంతి వార్షిక బ్రహ్మోత్సవం, కుంభాబిషేక ఆహ్వాన పత్రిక
- ↑ ఆంధ్రజ్వోతి గుంటూరు జిల్లా ఎడిషన్ పేజి నెం.15,తేది.21.03.2017 (ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు జంపని వారసుల చరిత్ర ఆవిష్కరించిన వార్త క్లిపింగ్)