సాలగ్రామం
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సాలగ్రామము విష్ణుప్రతీకమైన , విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీభాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.
సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి.
విషయ సూచిక |
పంచాయతనం [మార్చు]
పంచాయతనం లో ఉండే ఐదు మూర్తులు:
- ఆదిత్యం - స్ఫటికం
- అంబికాం - లోహం
- విష్ణుం - సాలగ్రామం
- గణనాథం - ఎర్రరాయి
- మహేశ్వరం - బాణం
ఈ ఐదింటికీ పూజ చేయడాన్ని పంచాయతన పూజ అంటారు. వీటిలో ఏది మధ్యలో ఉంటే ఆ పంచాయతనం అంటారు. సాలగ్రామాన్ని మధ్యలో ఉంచితే 'ఆదివిష్ణు పంచాయతనం' అంటారు.
సతీ తులసి కథ [మార్చు]
పూర్వం జలంధరుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. మునులు, దేవతలు తమను రక్షించమని విష్ణువుతో మొరపెట్టుకున్నారు. జలంధరుడి భార్య వృందాదేవి చేసే పూజల ఫలం రక్షణ మూలంగా జలంధరున్ని చంపడం శివుడి వల్ల కూడా కాలేదు. దాంతో విష్ణుమూర్తి మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. వెంటనే శివుడు జలంధరున్ని సంహరించాడు. అసలు విషయం తెలుసుకున్న వృందాదేవి కఠినశిలవైపొమ్మంటూ విష్ణువును శపించింది. విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి అనుగ్రహించగా తులసి మొక్కగా మారింది. విష్ణువు సాలగ్రామ రూపు ధరించాడు.
గండకీనదిలో లభించే సాలగ్రామాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి లక్ష్మీనారాయణుడు, లక్ష్మీజనార్ధనము, రఘునాధము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రారాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీనృసింహము. ప్రతిరోజూ సాలగ్రామము, తులసి, శంఖాలను పూజించేవారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని పురాణకధనం.
మరికొన్ని విశేషాలు [మార్చు]
- సాలగ్రామాల రంగు, వాటిమీద ఉండే ముద్రలను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. అలాంటి 12 రకాల సాలగ్రామాలు ఉండి పూజింపబడే ఇల్లు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలతో సమానం అని అంటారు.
- సాలగ్రామాలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాటికి నిత్యం అభిషేకం, నైవేద్యం చేయాలి. అలా చేయలేనివారు వాటిని వేరెవరికైనా దానమివ్వడం మంచిది. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్ళల్లో మునిగేలా ఉంచుతారు. దానిని జలవాసం అంటారు. ఏదైనా ఆలయంలో దానిని ఉంచవచ్చును.
- సాలగ్రామాలను కొనరాదు. ఇవి వంశపారంపర్యంగా రావాల్సిందే. అందుకే సాలగ్రామ దానం మహాదానం అని పెద్దలు అన్నారు.
మూలాలు [మార్చు]
- మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఈనాడు వ్యాసం ఆధారంగా...