ఎన్రికో ఫెర్మి
కేంద్రక భౌతిక శాస్త్రం (నూక్లియర్ ఫిజిక్స్) కు పితృ తుల్యుడు ఎన్ రికో ఫెర్మి అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఈ మాటలు అక్షర సత్యాలు. శృంఖల రసాయన చర్యల గురించి మొదటిసారిగా చెప్పినవాడు ఫెర్మియే అని అంగీకరింపక తప్పదు. ఎన్ రికో ఫెర్మి (29 సెప్టెంబరు 1901 - 1954 నవంబరు 28) ఇటాలియన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ప్రయోగాత్మక భౌతిక శాస్త్రవేత్త. ఈయన "చికాగో పైల్-1", "మొదటి నూక్లియర్ రియాక్టర్" వంటి వాటిని అభివృద్ధికి కృషిచేశారు. ఈయన తన సేవలను "క్వాంటం సిద్ధాంతం", సాంఖ్యక గతిశాస్త్రం లలో వినియోగించాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త రాబర్ట్ ఓప్పెంహైమర్తో కలసి ఈయన "ఆటం బాంబు" పితామహుడుగా పిలువబడ్డాడు. అణుశక్తికి సంబంధించిన అనేక పేటెంట్లు పొందాడు. ఈయన 1938 లో ప్రేరిత రేడియోధార్మికత, ట్రాన్సురేనిక్ మూలకాలు కనుగొన్నందుకు గాను భౌతిక శాస్త్రమందు నోబెల్ బహుమతి పొందాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఈ భౌతిక శాస్త్రవేత్త జన్మస్థలం రోమ్ మహా నగరం. విద్యార్థి దశ నుంచీ ఈయన చాలా చురుకైన వాడు. 21 యేండ్ల వయస్సులోనే పీసా యూనివర్శిటీ నుంచి ఎక్స్-కిరణాల విభాగం నుంచి ఈయన పి.హెచ్.డి పట్టా పొందడం ఎంతయినా ఆశ్చర్యకరం. 1927 లో రోమ్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో ఉపన్యాసకునిగా ఫెర్మి సరికొత్త జీవితం ప్రారంభమైనది. 1929 నాటికే ఆయన తెలివితేటల కారణంగా ఇటాలియన్ అకాడమీకి సభ్యుడు కాగలిగాడు. ఇది చాల అరుదైన గౌరవ ప్రథమైన విషయమని చెప్పాలి. 1934 లో దాదాపు పదేళ్ళ పరిశోధనల తరువాత - భౌతి శాస్త్రాన్ని మలుపు తిప్పే అంశాలను ఫెర్మి వెల్లడించాడు.
న్యూట్రినో ఆవిష్కరణ
[మార్చు]ఒక మూలకం నెమ్మదిగా ప్రయాణిస్తున్న న్యూట్రాన్ చేత తాడనం చెందినప్పుడు ఆ మూలకం రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది. ఈ ప్రక్రియలో ఈ మూలకం మరో మూలకంగా కూడా పరివర్తన చెందుతుంది. ఈ ఆవిష్కరణ నూక్లియర్ ఫిజిక్స్ కు బీజాల వంటివని ఎవరైనా ఆమోదిస్తారు. అంతే కాదు, 1933 లో ఫెర్మి "న్యూట్రినో" అనే కీలక పరమాణు కణాన్ని కనుగొన్నాడు. న్యూట్రాన్ల చేత పరమాణువులను తాడనాలకు గురిచేసి ఈయన 80 దాకా కృత్రిమ పరమాణు కేంద్రకాలను ఉత్పత్తి చేయగలిగాడు.
అమెరికా పౌరసత్వం
[మార్చు]ఆ కాలంనాటికి ఇటలీ బాగా సంక్షోభంలో ఉంది. ముస్సోలిని నియంతృత్వం విజృంభిస్తూ ఉండేది. ఈ కారణంగా ఫెర్మి అమెరికా వెళ్లిపోయాడు. 1938 లో ఈయనకు నోబెల్ బహుమతి లభ్యమైనది. కాగా 1939 లో కొలంబియా యూనివర్శిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ గా నియమించబడ్డాడు. 1944 లో అమెరికా పౌరునిగా నమోదయ్యాడు.
ఆసక్తి, అంకిత మనస్తత్వం
[మార్చు]ఎన్ రికో ఫెర్మికి తన పరిశోధనలే లోకం. ఆయన ప్రయోగాలు చేసేటప్పుడు ఎంతగానో అంకితమైపోయేవాడు. ఒకసారి ప్రయోగం కోసం ఒక పరికరాన్ని ఫెర్మి తన గదిలోకి తీసుకుని వస్తున్నాడు. ఇంతలో ఎవరో కొత్త వ్యక్తి ఆయనకు ఎదురయ్యాడు. ప్రొఫెసర్ ఫెర్మిని కలుసుకోవటం కోసం వచ్చానని చెప్పాడు. "అలాగే! కాస్సేపు ఇక్కడే కూర్చోండి కొంచెం సేపట్లో ప్రొఫెసర్ ఫెర్మిని మీదగ్గరికి పంపుతాను" అని చెప్పి గదిలోకి వెళ్ళీపోయాడు ఫెర్మి. ప్రయోగం విజయవంతంగా పూర్తి చేశాక ఫెర్మి ఆ కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళీ "నేనే ఫెర్మిని. మీకేం కావాలి?" అని అడిగాడు. పరిశోధనల పట్ల ఫెర్మికి ఉన్న ఆసక్తి, అంకిత మనస్తత్వం చూసి, ఆ కొత్త వ్యక్తి పులకరించిపోయి ఉంటాడు.
ప్రశంశలు
[మార్చు]కొలంబియా యూనివర్శిటీలో ఫెర్మి కేంద్రక శృంఖల రసాయనిక చర్యలపై పరిశోధనలు చేశాడు. యురేనియం కేంద్రకాలను న్యూట్రాన్ ల తాడింపుల ద్వారా ఈయన విడగొట్టగలిగాడు. 1942 లో చికాగోలో మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ను ఫెర్మి రూపొందించాడు. కేంద్రక విచ్ఛిత్తి (నూక్లియర్ ఫిషన్) ద్వారా శక్తిని విడుదల చేయవచ్చని ఫెర్మి స్పష్టం చేశాడు. కొత్త ప్రపంచానికి బాటలు వేస్తున్న ఇటాలియన్ శాస్త్రజ్ఞుడు ఎన్ రికో ఫెర్మి అని ఎంతో మంది కొనియాడటం మొదలు పెట్టారు.
ఆటంబాంబు రూపకల్పన
[మార్చు]మొట్టమొదట ఆటంబాంబును రూపొందించిన వాడు ఫెర్మియే అనుకోవాలి. అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్డ్ అందించిన భారీ నిధి, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ సూచనలు ఇందుకు ఎంతగానో దోహద పడ్డాయి. మన్ హాట్టన్ ప్రాజెక్టును సంతృప్తి కరంగా పూర్తి చేసిన పిదప 1945 జూలై ప్రాంతంలో ఆటం బాంబును రూపొందించటం జరిగింది. ప్రయోగాత్మక పరిశీలన కూడా జూలై 16 న జరిగింది. ఈ ఆటం బాంబుల్లో రెండింటిని రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు జపాన్ నగరాలైన హీరోషిమా, నాగసాకి లపై వేయటం జరిగింది. భారీ జన నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ ఆ తాలూకు జ్ఞాపకాలు భయాన్ని గొలుపుతూనే ఉన్నాయి.
అస్తమయం
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎన్ రికో ఫెర్మి చికాగో యూనివర్శిటీ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నూక్లియర్ స్టడీస్ లో చేరాడు. ఎన్నో ప్రమాణాలతో ఉన్నత శ్రేణి పరిశోధనా గ్రంథాలను వెలువరించాడు. భౌతిక శాస్త్రాన్ని మధించి, కొత్త పుంతలు తొక్కించాడు. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అందించిన మెడల్ ఆఫ్ మెరిట్ ఈయనకు చాల చిన్నదై పోయింది. ఇంతటి మేధావి కేవలం 53 యేండ్ల వయస్సులోనే మరణించటం విచారాన్ని కలిగించే విషయం.
గౌరవం
[మార్చు]ఈ శాస్త్రవేత్త మీద గౌరవం కొద్దీ ఒక కొత్త మూలకానికి "ఫెర్మియం" అనే పేరు పెట్టడం జరిగింది. ఈయన పేరిట ఒక అవార్డు కూడా అమెరికాలో నెలకొల్పడం జరిగింది. ఈ వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రియాక్టర్ లన్నీ ఫెర్మి ఫార్ములాల మీద ఆధారపడ్డవే. ఐసోటోప్ ల ఉత్పత్తికి, విద్యుత్ ఉత్పత్తికి ఈ నూక్లియర్ రియాక్టర్ లు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
మూలాలు
[మార్చు]- ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- శాస్త్రవేత్తలు
- AC with 17 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- ఇటలీ శాస్త్రవేత్తలు
- అమెరికా శాస్త్రవేత్తలు
- 1901 జననాలు
- 1954 మరణాలు