ఎఫ్.బి.సి బాయిలరు ఆరంభించడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎఫ్.బి.సి బాయిలరు ఆరంభించడం మిగతా ఘన ఇంధన బాయిలరులకన్న భిన్నంగా, క్లిష్టంగా వుండును. ఘన ఇంధనాన్ని వాడు బాయిలరు లలో స్థిర గ్రేట్ లేదా పయనించే/కదిలే చైన్ గ్రేట్ వున్న వాటిలో మొదటగా ఇంధనం మండించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. స్థిర గ్రేట్ వున్నబాయిలరులలో (లాంకషైర్, కోర్నిష్, కొక్రేన్ ) మొదట కొంత పరిమాణంలో ఇంధన ముక్కలను/తునకలను పేర్చి, కొద్దిగా కిరోసిన్ను ఇంధనంమీద చల్లి లేదా కిరోసిన్ లేదా నూనెతో తరిపిన గొనె ముక్కలను, లేదా గుడ్డ పేలికలను ముంచి, ఇంధనం మీద వేసి వెలిగించెదరు.ఇంధనం మండటం మొదలవ్వగానే మళ్ళిఇంధనాన్ని అవసరానికి సరిపడా ఫర్నేసులో నింపుతుంటారు. ఇక కదిలే గ్రేట్ లో కూడా అంతే పైన పేర్కొన్న విధంగా చేసి ఇంధనం మండటం మొదలవగానే గ్రేట్ ను తిప్పడం మొదలెడతారు. కాని ఎఫ్.బి.సి.బాయిలరులో ఇంధనాన్ని మండించు పద్ధతి భిన్నంగా వుంటుంది.ఇందులో ఇంధనాన్ని నేరుగా బాయిల రును అరంభించిన వెంటనే మండించడం కుదరదు. ఎఫ్.బి.సి విధానంలో మొదట బెడ్‌లో వున్న ఇసుక లేదా రిఫ్రాక్టరి మెటీరియలును బలకృత గాలి (forced air) ద్వారా మరుగుతున్న నీటిలా పైకి కిందికి కదులుతున్న అస్థిర రూపంలో వుంచి, మెటీరియలును మొత్తాన్ని సమానంగా 600-700°C వరకు వేడి చేసిన పిమ్మట ఇంధనాన్ని పర్నేసులో బెడ్ మీదకు పంపి ఇంధనాన్ని మండించడం జరుగును.కావున బెడ్ మెటీరియలును 800-750°C (వరిపొట్టు/ఊక అయినచో బెడ్ ఉష్ణోగ్రత 600-700°C) వరకు వేడి చెయ్యుటకు కొద్దిగా అనుభవం అవసరం. కొత్తగా కట్టిన బాయిలరులో బెడ్ మెటీరియలును ద్రవ స్థితిలో వుంచుటకు 600-700°Cవరకు ఉష్ణోగ్రత పెంచుటకు రెండు మూడు సార్లు ప్రయత్నించ వలసి వుంటుంది.ఇక్కడ సాంప్రదాయ లేదా అట్మాసిఫియరిక్ ఎఫ్.బి.సి.బాయిలరును మొదటగా ప్రారంభించు విధానాన్ని వివరించడం జరిగింది.

ఎఫ్.బి.సి బాయిలరు ఆరంభించడం[1][2][మార్చు]

కర్రల బొగ్గు, కిరోసిన్ను ఉపయోగించి బెడ్ ను వేడిచేయు విధానాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. మొదట బెడ్ మెటీరియలును నాజిల్ పై అంచునుండి కనీసం 200 మిల్లీమీటర్ల ఎత్తు వుండేలా దహనగదిలో డిస్ట్రి బుసన్ ప్లెట్ పై సమానంగా నింపాలి. నాజిల్ కనీసం 100-115 మి.మీ వుండును. అనగా మొత్తం 300 మి.మీ ఎత్తు బెడ్ మెటీరియలు నింపాలి. బెడ్ మెటిరియలుగా బొగ్గు లేదా రిఫ్రాక్టరి ఇటుకల పొడిని ఉపయో గించ వచ్చును. తరువాత కొంతఎత్తు వరకు (కసీసం రెండు అంగుళాలు) పొడి కర్రబొగ్గును బెడ్ మీద సమానంగా వెయ్యాలి. పొడిబొగ్గుల మీద ఒక పొర కిరోసిన్ తో తడిపిన బొగ్గును (మరో రెండు అంగుళాలు) సమాన మందంతో పరచాలి.

కిరోసిన్ లేదా ఆయిలుతో తడిపిన గుడ్డ పేలికలు లేదా గోనెసంచి ముక్కలను అంటించి, బెడ్ మీద అక్కడక్కడ వెయ్యాలి.గుడ్డముక్కలను, మంట బొగ్గుల మీద అంతటా వ్యాపించేలా వెయ్యాలి.అలా అంతటా మంట వ్యాపించేలా చేసి నపుడు మాత్రమే పైపొర బొగ్గులు సమానంగా మండును. మంటను గమనించి ఎక్కడైనా బొగ్గులు మండనిచో అక్కడ అంటించిన పేలికలను వేసి సమానంగా బొగ్గు మండేలా చెయ్యాలి.పై పోర బొగ్గులు మండటం మొదల య్యాక క్రమంగా బెడ్‌లో పైమట్టంలో బిగించివున్న థెర్మోకపుల్ ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరుగుదలను చూపించడం మొదలగును.బెడ్ పైభాగంలో అమర్చిన థెర్మోకపుల్ బెడ్ పైభాగం ఉష్ణోగ్రతను చూపించునట్లు, కింద వున్న థెర్మోకపుల్ బెడ్ అడుగు భాగం ఉష్ణోగ్రతను చూపించులా వాటిని అమర్చాలి. కింది థెర్మోకపుల్ ను డి.పి (డిస్ట్రిబ్యూషన్ ప్లేట్) నుండి 100 మిల్లీమీటర్ల ఎత్తులో వుండేలా అమర్చాలి.అనగా ఎయిర్ నాజిల్ పైచివర వుండేలా వుంచాలి. ఎందుకనగా నాజిల్ పై చివర వరకు ఉండు బెడ్ మెటీరియలు స్థిరంగా వుండును.అలాగే పై థెర్మోకపుల్‌ను బెడ్ పైఅంచులను తాకేలా వుంచాలి.

బొగ్గులను అంటించుటకు ముందు ఎఫ్.డి ఫ్యాను తిప్పరాదు.కాని ఎఫ్.డి ఫ్యాను (forced draft fan) డ్యాంపరును కొద్దిగా తెరచి వుంచాలి.అలావుంచడం వలన బొగ్గులు మండటానికి అవసరమైన గాలి అందును. బొగ్గులు మండటం మొదలవ గానే డ్యాంపరును మరికాస్త తెరవాలి.ఉష్ణోగ్రత పెరగడం మొదలవగానే ఎఫ్, డి, ఐ.డి (induced draft) ఫ్యానులను ఆన్ చెయ్యాలి.ఇప్పుడు డ్యాంపరును ఇంకా మరికొద్దిగా మంట బాగా మండునట్లు, పైభాగం థెర్మో కపుల్ ఉష్ణోగ్రత 800°C -850°C.వనట్లు తెరచివుంచాలి.ఈ సమయంలో బెడ్ అడుగుభాగంలో అమర్చిన థెర్మోకపుల్ ఉష్ణోగ్రతలో ఎటువంటి పెరుగుదల కన్పించదు.

బెడ్ పైభాగం ఉష్ణోగ్రత 800°C - 850°C కు రాగానే ఇప్పుడు మండుతున్న నిప్పులను బెడ్ ను మిశ్రమం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది.బెడ్ లోకి ఎక్కువ గాలిని రెండింటిని పంపి మిశ్రమం చెయ్యాలి.అయితే మిశ్రమం చేయుటకు పంపు గాలి, బాయిలరు బెడ్ నార్మల్ రన్నింగులో ఎంత ఇస్తామో అంతకు మింది ఇవ్వరాదు.ట్రయల్ రన్‌లోనే బెడ్ నార్మల్ ఫ్యూయిడైజేసన్ లో వుంచి, డ్యాంపరు ప్లేటు ఎంతవరకు తెరచి వుంచాలో గుర్తించి, మార్కు చేసి వుంచాలి.నిప్పులను, బెడ్ మెటీరియలును మిక్సు చేయుటకు అవసరానికి మించి డ్యాంపరు తెరచి గాలిని పంపిన మంట ఆరిపోవును.

డ్యాంపరును తెరచి నిప్పులను బెడ్ ను కలుపు కాలవ్యవధి/సమయం 20-30 సెకన్లు మించరాదు. ఇలా20-30 సెకన్లు ఫ్లూయిడైస్డ్ గాలిని పంపగానే నిప్పులున్న బొగ్గులు బెడ్లోకి వెళ్ళును.బొగ్గులు బెడ్ ఉపరితలం మీదకు వచ్చి మండటం మొదలగును. ఇలా చేయు సమయంలో బెడ్ పై ఉష్ణోగ్రత తగ్గడం మొదలగును.అదే సమయంలో బెడ్ కింది ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభంఅవుతుంది.ఇలా మిక్సింగు చెయ్యడం వలన పైనున్న నిప్పులు బెడ్ ఉపరితలంకు, కాలని బొగ్గులు నిప్పుల పైభాగానికి రావాలి.అలా సరిగా కానిచో మరో సారి మిశ్రమం చెయ్యాలి.అనుకున్న విధంగా మిశ్రమం జరిగినవెంటనే ఎఫ్.డి. ఫ్యాను డ్యాంపరును మళ్ళి తగ్గించాలి.తరువాత క్రమంగా డ్యాం పరును కొద్ది కొద్దిగా తెరుస్తూ పోవాలి. బెడ్ ఉష్ణోగ్రత 650°C. చేరగానే ఇంధనాన్ని అందించడం ప్రారంభించాలి. ఇంధనం పంపే సమయంలోనే తగినంతగా డ్యాంపరు తెరచి బెడ్ ను ద్రవస్థితిని తలపిస్తు పైకి కిందికి కదిలే సందిగ్ద స్థితిలోకి తీసు కురావాలి.బెడ్ మెటీరియలు ఉష్ణోగ్రత 650°C చేరిన తరువాత ఇంధనాన్ని మొదట తక్కువ ప్రమాణంలో ఇవ్వాలి.ఇంధనం బెడ్ మెటీరియలో క్రమంగా మండటం మొదలయ్యిన తరువాత క్రమంగా ఇంధన పరిమాణాన్ని పెంచుతూ పోవాలి. ఇంధనాన్ని బెడ్ కు పంపే సమయానికి బెడ్ మీద ఇంకా నిప్పులు ఉన్నచో మంచిది.నిప్పుల ఉష్ణోగ్రత, ఇంధనం త్వరగా మండుటకు, బెడ్ ఉష్ణోగ్రత పెరుగుటకు సహాయ పడును.[3]

బెడ్ ఉష్ణోగ్రతను నియంత్రణలో వుంచుట[మార్చు]

బెడ్ ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది పంపే ఇంధనం పరిమాణాన్ని పెంచుతూ పోవాలి. బెడ్ ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతున్నచో ఎఫ్.డి ఫ్యాను ద్వారా ఎక్కువ గాలిని పంపి బెడ్ ఉష్ణోగ్రతను కావాల్సిన స్థాయికి తీసుకురా వచ్చును. బెడ్ ఉష్ణోగ్రతను 800 °C -900°C మధ్యలో ఉండిన ఇంధన దహనం బాగా జరుగును.ఇంధనం తగినంగా ఇస్తూ, బెడ్ ఉష్ణోగ్రత నార్మల్ గా వున్నప్పుడు ఫర్నేసులో 5-6 మీ.మీ నెగటివ్ పీడనం వుండేలా ఐ.డి ఫ్యాను డ్యాంపరును తెరచి వుంచాలి.వి.ఎఫ్. డి ఉపయోగించు బాయిలరులలో ఫర్నేసులో 5-6 మీ.మీ నెగటివ్ పీడనం వుండేలా వి.ఎఫ్. డి రెగ్యులేటరు సర్దుబాటు చెయ్యాలి.

బెడ్ మెటీరియలు భౌతిక రసాయన లక్షణాలు/ ప్రత్యేక లక్షణాలు[1][2][మార్చు]

ఉష్ణ తాపకపదార్ధంతో చేసిన బెడ్ మెటీరియలులోని రసాయన సమ్మేళనపదార్థాలు

రసాయన సమ్మేళనం/పదార్థం శాతం
అల్యూమిన (Al2O3 రూపంలో) 30% - 40%
సిలికా (SiO2 రూపంలో) 50-60% గరిష్ఠం
క్షారాలు (Na2O + K2O 1.0 < (కన్న తక్కువ)
టైటానియం ఆక్సైడ్ (TiO) 1.0< కన్నతక్కువ

ఉష్ణ తాపక పదార్ధంతో చేసిన బెడ్ మెటీరియలు భౌతిక గుణాలు

భౌతిక గుణం విలువ
పదార్థ సాధారణ సాంద్రత 2.00 గ్రాములు/సెం.మీ3
బల్క్ డెన్సిటి (స్థూలసాంద్రత) 1000-1100 కిలోలు//మీటరు3
గరిష్ఠ పరిమాణం 2.80 మిల్లీమీటర్లు
కనిష్ఠ పరిమాణం 0.85 మిల్లీమీటర్లు
ప్రాథమిక విరూపణ ఉష్ణోగ్రత >1300° C (కంటె ఎక్కువ)

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 "simplified starting". venus-boiler.com. Retrieved 22-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. 2.0 2.1 "Afbc Boiler Light Up Procedure". scribd.com. Retrieved 22-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "Survey on Start up Operation Procedure forIndian Fluidised Bed Combustion (FBC)" (PDF). ipasj.org. Retrieved 22-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)